శనగముద్దల శంకరయ్య - అచ్చంగా తెలుగు

 శనగముద్దల శంకరయ్య

(మా జొన్నవాడ కథలు)

- డా.టేకుమళ్ళ వెంకటప్పయ్య (9490400858)


సుబ్బవ్వ ఉదయాన్నే లేచి పెన్నలో స్నానం చేసి తడిగుడ్డలతోనే అమ్మ కామాక్షమ్మను దర్శనం చేసుకొని దేవళంలో నుంచీ బయటికి వస్తూ “నెట్టుకోని ఛస్తారు ముదనష్టపు జనం” అని శాపనార్ధాలు పెడుతూ గొణుక్కుంటూ "ఒరే గోపాలా..ఒక మంచి స్టాంగ్ టీ గొట్టు" అనిచెప్పి అక్కడున్న బల్లపై కూర్చుంది. "సుబ్బవ్వా..టీ ఇస్తాగానీ.. ఆ స్టూలంతా తడిచెయ్యబాక లే. వచ్చినోళ్ళు గూకోబళ్లా" అన్నాడు. 

అవ్వ చివక్కున లేచి "ఓరి నీ పాసుగాల కాసేపట్లా ఆరిపోదంటరా! ముసలిదాన్నని కనికరమనా చూపించబళ్లేదంట్రా" అనగానే అందుకొని  “అవునులే నువ్వట్టనే జెప్తావు. రోజూ తుడుచుకోలేక నేనే చస్తా ఉండా ఈడ. అవ్వా అంటే అన్నానంటావు.. నాలుక బీక్కుంటావ్.. ఈ 60 యేళ్ల వయసులో నీకీ స్నానాలేంది? ఆ శనగముద్దల యాపారమేంది? సైకిలుకేసుకొని బుచ్చికి పొయ్యి ఇచ్చిరావడమేంది? కుర్రదాన్ననుకుంటుంటున్నావా ఏంది? ఏడన్నా కాలు చెయ్యీ పట్టుకొన్నా, లేకపోతే నడీమద్దెలో సైకలు చెడిపొయినా ఎవడు దిక్కు? బయంబుట్టదా అసలు నీకు?"

"ఒరే గోపాలమా.. మీ అయ్య ఎన్నేళ్లదాకా చేశాడీ టీ అంగడి వ్యాపారం?"

"మా నాయిన 70 యేళ్లు చేసి నాకప్పజెప్పాడవ్వా?" అంటూ టీగ్లాసు అవ్వకిచ్చాడు

"మరి నాకింకా పదేళ్లుందిరా పైకి పోవడానికి టైము" అంటూ నవ్వుకుంటూ టీ తాగి బయటపడింది.

"ఈ అవ్వకు ఇంత ఓపికెక్కడితో 60 యేళ్ల వయసులో టింగురంగా మంటూ సైకలిక్కి ఊళ్ళు తిరుగుతోంది" అని గొణుక్కుంటూ వచ్చిన బేరాలు చూసుకోడం లో ముణిగిపోయాడు.

అవ్వ బాణలి పెట్టి బెల్లం పాకం తీయడానికి రెడీ అయింది. ఈలోపు ఇంకో బాండీ బెట్టి, ముందురోజు వలిచిన వేరుశనక్కాయల గింజలను వేపడానికి మొదలు పెట్టింది. కమ్మని వాసన రాంగానే దింపి పొట్టు వలిచి తయారుగా పెట్టుకుంది. ఇంకో బాణట్లో నీళ్ళు పోసి బెల్లం గడ్డలు చిదిమి అందులో పడేసి తిప్పడం మొదలెట్టింది. బాగా ఉండపాకం రాగానే, చేతికి నెయ్యి రాచుకొని ముద్దలు కట్టడానికి సిద్ధమైంది. అప్పటికి సమయం ఎనిమిది కావస్తున్నది. ఈరోజు బుచ్చికి బోయి 300 ఉండలివ్వాల. సచ్చినోళ్ళు బాకీలు బెట్టాడు. వసూలు జెయ్యాలివాళ ఎట్టైనా అని అనుకుంటూ ఉండగా గుండెలో ఎక్కడో కలుక్కుమంది. మండుతున్న పొయ్యి ఆపుదామని నీళ్ళకోసం లేవడానికి ప్రయత్నం చేసింది. వల్లగాలేదు. చేతికున్న నెయ్యి గుండెలపై రాచుకొంది. కానీ తగ్గలేదు. మందులంగడికి బొయ్యి మాత్రలు కొనుక్కుందామా?  అనుకుంటూ ఉండగా స్పృహతప్పి వెనక్కు వాలి పడిపోయింది. 

***

ఉదయం 6 గంటలయింది. ములుమూడి బస్టాండులో అరుగుమీద నిద్రలేచిన శంకరయ్యకు నిన్న జరిగిన సంఘటనకు కళ్ళనీళ్ళు వచ్చాయి. శెట్టి అకారణంగా తన్ను కొట్టి, తిట్టి పనిలోనుంచీ తీసేశాడు. వాళ్ళమ్మాయి చేసిన పిచ్చిపనులకు నేను బలిపశువునయిపొయినాను. ఆ అమ్మాయి అతి చనువు నా కొంప ముంచింది. అప్పటికీ చెప్తూనే వున్నా….వినిపించుకుంటేనా…. యెర్రిబాగుల్ది. అయినా మనజాతకం అట్టేడిసింది అనుకుంటూ జేబులో చూసుకున్నాడు. ఎప్పుడో దాచిపెట్టుకున్న 50 రూపాయలున్నాయి. ఇప్పుడు ఉండడానికి రూమూ పొయ్యింది. తిండీ పొయ్యింది అని బాధపడుతూ దగ్గరే ఉన్న పొల్లుకట్ట క్రింద ఉన్న కాలువలో స్నానం చేసి, బొగ్గుముక్కతో పండ్లు తోముకొని, బండి మీద అమ్ముతున్న 4 పులిబంగరాలు కొనుక్కుని తిన్నాడు. ఇంక 30 రూపాయలుంది. ఏమి చెయ్యాలా అని ఆలోచిస్తున్నాడు. మళ్ళీ ఎక్కడ దొరుకుతుంది నౌకరి అని అనుకుంటూ ఉండగా ఒక ఆటో ఆగి "జొన్నాడ..జొన్నాడ" అన్నాడు. వెంటనే ఎక్కి కూర్చొని అన్నీ అమ్మే చూసుకోవాలింక నా విషయం అన్న ధృఢనిశ్చయానికి వచ్చాడు. జొన్నవాడలో అందరూ దిగినతర్వాత డబ్బులిస్తుంటే మెల్లిగా ప్రక్కనే ఉన్న హోటల్లోకి దూరిపోయాడు శంకరయ్య. ఆటోవాడు అటూ ఇటూ చూస్తూ బుర్రగోక్కుంటూ వెళ్ళిపోయాడు.

కామాక్షమ్మ దర్శనం చేసుకుని బయటికి వచ్చేసరికి ఎనిమిదయింది. అలా నడుస్తూ ఉండగా కమ్మటి శనగ ఉండల వాసన వచ్చింది. ఇంత కమ్మటి వాసన జన్మలో రాలేదు. ఒక్కటన్నా తినాలని అంగట్లోకి తొంగి చూశాడు. "ఎవరూ!" అని పిల్చాడు లోనకు చూస్తూ. లోపల కట్టెల పొయ్యి పెద్దగా మండుతున్నాది. లోపలికివెళ్ళి చూసేసరికి ఒక అవ్వ స్పృహ తప్పి పడిపోయి ఉంది. వెంటనే తొట్లో ఉన్న నీళ్లతో కట్టెలపొయ్యి ఆర్పి బయటికి వచ్చి చూశాడు. అందరూ ఎవరి పన్లల్లో వాళ్ళున్నారు. "నెల్లూరు.. నెల్లూరు..అంటూ ఆటో వాడొకడు హారన్ కొడుతున్నాడు. ఇంకా ఎవరూ ఆటో ఎక్కలేదు. ఆటో వాణ్ణి పిలిచి "అవ్వను ఆసుపత్రికి తీసుకొని పోవాల" అన్నాడు. "ఇక్కడేమీ లేవు నెల్లూరు బోవాల" అన్నాడు. "సరే పదా..అని ఆటోలో అవ్వను అమాంతంగా ఎత్తి పడుకోబెట్టి, ఇంటి తలుపులు వేసి "పోనీ..." అన్నాడు. ఆటో ఆసుపత్రి ముందాగింది. జేబులో ఉన్న ముప్పై రూపాయలు వాడికిచ్చి దణ్ణం పెట్టాడు. వాడు మంచిబేరమే దగిలింది పొద్దుపొద్దన్నే అనుకుంటూ వెళ్ళిపోయాడు.

ఆసుపత్రి నర్సులు పెద్ద డాక్టరు రావాల అని అంటూ ఉండగానే, డాక్టరు వచ్చి పరీక్ష చేసి, ఇంజెక్షన్లువేసి, మాత్రలు మింగించాడు. "మీ అవ్వకు గుండెల్లో నొప్పి వచ్చింది. వెంటనే కాకపొయినా నిదానంగానైనా ఆపరేషన్ జెయ్యాల. వెంటనే తీసుకొచ్చావు కాబట్టి సరిపొయింది. లేకపోతే ముసల్ది పైకి పొయ్యేదే" అన్నాడు. రెండు రోజులుండాల ఇక్కడ అని ఇరవై వేలు కట్టించుకోమని నర్సుకు చెప్పి బయటికి వెళ్ళిపోయాడు. శంకరయ్యకు ఏం జెయ్యాలో తోచలేదు. జేబులో పైసా లేదు. అవ్వ ఒక గంటసేపటికి "అమ్మా!" అంటూ స్పృహలోకి వచ్చింది. "ఎక్కడున్నాను? నువ్వెరబ్బాయ్?" అని అడిగింది. అన్నీ తర్వాత చెప్తానని సైగచేసి "అవ్వా!  పెద్ద ఆసుపత్రిలో ఉన్నాం. ఇరవై వేలు కట్టాలంట! నాదగ్గర డబ్బుల్లేవు" అన్నాడు. అవ్వ వెంటనే తన చేతికున్న బంగారు గాజు ఒకటి తీసిచ్చి మార్వాడి కొట్లో అమ్మి డబ్బులు తీసుకొనిరా!" అనింది. "అవ్వా! నన్ను దొంగనుకుంటారేమో! అన్న మాటలు విన్న నర్సు  అక్కడికి వచ్చి ఒక కార్డు చేతికిచ్చి  "ఇది చూపించు అక్కడికిబొయ్యి ఫోన్ చెయ్ నాకు. నేను మాట్లాడతా వాళ్ళతో.." అనింది. హమ్మయ్య అనుకొని గాజుతీసుకొని వెళ్ళి చెప్పినట్టు చేశాడు. వాళ్ళు ముప్పై వేలిచ్చారు. అవి తీసుకొచ్చి డాక్టరుకు కట్టి మిగతా పది వేలు అవ్వకిచ్చాడు. అవ్వ నీదగ్గరే ఉంచమన్నట్టు సైగ చేసింది. బయట భోజనం చేసి డబ్బులు జాగ్రత్తగా ఉంచుకొని అవ్వదగ్గరే కూర్చున్నాడు.

***

డాక్టరు మూడోరోజు ఉదయం "అవ్వను సాయంత్రం ఇంటికి తీసుకొని బోవచ్చు..మూడువేలు కట్టాల…. సెలైన్ బాటిల్ తీసెయ్యమని నర్సుకు సైగచేస్తూ, ఈమందులు మూడుపూట్లా వెయ్యి. మందులాపితే ప్రమాదం. భోజనం చెయ్యొచ్చు. నెలరోజుల తర్వాత కనబడండి" అని చెప్పి వెళ్ళిపోయాడు.  "అవ్వా... అన్నం తింటావా?" అంటూ అవ్వ చెయ్యి పట్టుకున్నాడు శంకరయ్య. తలూపింది సుబ్బమ్మ. శంకరయ్య కుడిచేతి మణికట్టు మీద పెద్ద పుట్టుమచ్చ ఉండడం అప్పుడే గమనించింది. శంకరయ్య అన్నం పార్శిల్ కట్టించుకొని వచ్చి అవ్వకు కలిపి చిన్న చిన్న ముద్దలుగా చేసి  పెట్టాడు. సుబ్బమ్మకు తెలియకుండానే కళ్ళలోనుంచీ ధారాపాతంగా  నీళ్ళు కారడం మొదలైంది.  కళ్ళు తుడుచుకొని మెల్లగా అన్నం తిని, లేచి కూర్చుకొని "సాయంత్రం దాకా ఎందుకు? ఇప్పుడే పోదాంపదా!" అనింది. "అట్టొద్దులే అవ్వా.. వెళ్ళేటప్పుడు నర్సు బి.పి అవీ పరీక్షచేసి ఇంజెక్షను ఇవ్వాలని చెప్పింది" అన్నాడు.  శంకరయ్యవైపు చూస్తూ " నీపేరేంది? జొన్నవాడలో ఎక్కడా చూళ్ళేదే నిన్ను? నువ్వెవరు చెప్పు?" అంది ఆసక్తిగా.

"అవ్వా..నాకెవ్వరూ లేరు ఆనాధను. నన్ను శంకరయ్య అని పిలుస్తారు.  నన్ను ఎవరో ఒకాయన చిన్నప్పుడు ఆత్మకూరు బస్టాండులో విడిచిపెట్టి, “శంకరయ్యా! ఇక్కడే ఉండు మళ్ళీ వస్తా!”  అని చెప్పి వెళ్ళాడు. మళ్ళీ రాలేదు. లీలగా గుర్తుంది. నేను అరుగుల మీద అక్కడా ఇక్కడా పడుకునే వాణ్ణి. దయతలిచి చిన్నోడినని కొంత మంది ఇళ్ళవాళ్ళు అన్నం పెట్టేవారు. అక్కడా ఇక్కడా అంగళ్ళల్లో చాలా కాలం పని చేశాను. పదేళ్ళక్రితం ఒక శెట్టి దగ్గర చేరాను. ఆయనొక ఆడపిల్ల అప్పటికే. మొగ పిల్లవాడు కావాలని అనుకునే వాళ్ళు. చాలా కాలం పుట్టలేదు. నేనొచ్చాక శెట్టిభార్య గర్భవతై మొగపిల్లవాడిని ప్రసవించింది. నేను వచ్చిన వేళావిశేషం మంచిదని నన్ను చాలా కాలం బాగానే చూసుకున్నాడు. ఈ మధ్య వాళ్ళమ్మాయి పెద్దమనిషైన దగ్గరనుంచీ నాతో వింతగా ప్రవర్తించేది. చెప్పినా వినిపించుకునేది కాదు. మొన్నొకరోజు మేడ మీద నుంచీ అంగట్లోకి వచ్చి, శెట్టి లేడనుకుని నాకు ముద్దులు పెట్టింది.  శెట్టిబయట ఉన్నవాడు అప్పుడే లోనకొచ్చి చూశాడు. గబగబాపైకి వెళ్ళిపోయింది. రాగానే శెట్టి "ఎన్నాళ్ళనుంచీ సాగుతున్నాది ఈ యవ్వారం? కూటికి లేనోడివని దగ్గరికి తీస్తే ఇట్టాంటి పనులు చేస్తావా? అని నన్ను కాళ్ళతో తన్ని బయటికి నెట్టేశాడు. ఆ అమ్మాయి మిద్దెమీదనుంచీ తమాషా చూస్తాఉందే గానీ నా తప్పులేదని ఒక్క మాటగూడా చెప్పలేదు" అని చెప్పి కన్నీళ్ళు పెట్టుకున్నాడు.  అవ్వ "అట్టా అయిందాయ్యా..పాపం. మంచోళ్ళకు రోజులు కాదు" అంది.

***

అవ్వను ఇంట్లో దించి మిగిలిన ఆరువేలు చేతిలో పెట్టి, అవ్వకాళ్ళకు నమస్కారం చేసి "అవ్వా! నీదయవల్ల ఈ మూడురోజులు నీ డబ్బులతో హాయిగా అన్నం తిన్నాను. వస్తాను" అని నమస్కరించగానే అవ్వ ఏడుస్తూ శంకరయ్య చేతులు పట్టుకొని "మనవడా...ఈ అవ్వను ఒంటరిదాన్ని చేసి వెళ్ళిపోతావా?" అంటూ వలవల కన్నీరు పెట్టుకున్నది. "అవ్వా నేను ఏదో పని వెదుక్కోవాలి కదా! అప్పుడప్పుడూ వచ్చి చూస్తూ ఉంటాను సరేనా?" అన్నాడు. "నీకు వేరే పని ఎందుకు నాతో పాటే ఉండు. మణికట్టుమీద పుట్టుమచ్చ ఉంటే కోటీశ్వరులవుతారని చిన్నప్పుడు మా అమ్మ చెప్పేది. నువ్వూ అలాగే బాగా డబ్బు సంపాదిస్తావు. ఇలా రా!.. " అని లోనకు పిలుచుకుని వెళ్ళి లోపల ఒక ట్రంకు పెట్టె తాళం తీసింది. లోపల డబ్బుల కట్టలు, బంగారపు నగలు ఉన్నాయి. మతిపొయింది శంకరయ్యకు. "అవ్వా?.." అన్నాడు. అవున్రా..మా ఆయన పెళ్ళైన నెలకే పొలంలో పాముకాటుతో చనిపోయాడు. అప్పణ్ణించీ ఈ శనగముద్దల వ్యాపారం చేసుకుంటూ బతుకుతున్నాను. బుచ్చి, ఆత్మకూరు ఊళ్ళల్లో మన శనగముద్దలకు మంచి గిరాకీ. నెలకు ఇరవైవేల పైన లాభం వస్తుంది. డబ్బుల గురించి భయపడబాకు. మా పెనుబల్లి నుంచీ నీకు మంచి పిల్లను తెచ్చి పెళ్ళిజేస్తా. నీకు నేను. నాకు నువ్వూ. మనకు ఆ కామాక్షమ్మ దిక్కు అంతే! ఇంకేం మాట్లాడకు” అంది. అవ్వ కాళ్ళు పట్టుకుని "అవ్వా..నాకు కామాక్షమ్మే నీ రూపంలో సాక్షాత్కరించింది" అని కన్నీళ్ళు పెట్టుకున్నాడు.

***

చిన్న ఆటో ఒకటికొని అన్ని ఊళ్ళకు శనగముద్దలు వేయడమే కాకుండా, అచ్చులు తయారు చేసే మిషన్ ఒకటి కొని అచ్చులుపోసి “సుబ్బలక్ష్మి చిక్కీలు"  పేరుతో సలీసుగా అమ్మడంతో వ్యాపారం చుట్టుప్రక్కల అన్ని మండలాల్లో మూడుపువ్వులు ఆరుకాయలుగా సాగుతోంది. సుబ్బవ్వకు ఆపరేషన్ చేయించాక,  ఇద్దరూ ఒకరోజు పెనుబల్లికి వెళ్ళారు.  సుబ్బవ్వ అన్నలతో మాట్లాడి, తమ్ముడి కూతురైన కమలమ్మతో వివాహం జరిపించింది. శంకరయ్య అవ్వ సాయంతో జొన్నవాడలో ఉన్న పెంకుటిల్లు పడగొట్టించి ఒక మిద్దె కట్టాడు. కమలమ్మ అవ్వకు ఏలోటూ రాకుండా చూసుకుంటోంది.

ఒకరోజు కారు ఇంటిముందు ఆగింది. లోపల్నుంచీ ఒక పెద్దావిడ వచ్చి "అరే.. ఈ చిక్కీలు బాగోవు. శుభ్రంగా ఉండవు." అని ఆమె అంటుంటే "అమ్మమ్మా! ఇవే చిక్కీలు నెల్లూళ్ళో మనం కొనేది చూడు! సుబ్బలక్ష్మి చిక్కీలు" అని బోర్డు చూపించింది. వచ్చింది ఎవరా? అని కమల బయటకు రావడంతో శంకరయ్య కూడా బయటకు వచ్చి "ఏం కావాలండీ?" అన్నాడు. వచ్చినామె ఒక చిక్కీ పాకెట్ ఇవ్వు అంది డబ్బులు ఇస్తూ ఇస్తూ తీసుకుంటున్న శంకరయ్య మణికట్టుపై పుట్టుమచ్చ చూసి అవాక్కైంది. అక్కడే అలా చూస్తూ ఉండిపోయింది. అబ్బాయ్..నీ పేరు అంది. "నాపేరు శంకరయ్య.. ఎందుకు?" అన్నాడు. ఆ పెద్దావిడ, తలతిరిగి స్పృహతప్పి అక్కడ పడిపోబోతూ ఉండగా శంకరయ్య, కమల లోపలికి తీసుకొచ్చారు. సోడా తాగి కొంచెం సేపు విశ్రాంతి తీసుకుంది. ఇంతలో సుబ్బవ్వ ఏమయిందా అని లోపలుంచీ వచ్చి కూర్చీలో కూర్చున్నది. ఇద్దరు చిన్నపిల్లలు అమ్మమ్మా..వెళ్ళిపోదాం రా.." అని ఆపెద్దామె చుట్టూ మూగుతున్నారు. ఆమె కొంతసేపటికి తేరుకుని "అవ్వా...శంకర్ చిన్నప్పటినుంచీ ఇక్కడే ఉంటున్నాడా?" అని అడిగింది. "లేదమ్మా.." అంటూ జరిగినది చెప్పి "అసలు నీకు శంకరయ్య ఎలా తెలుసు?" అని అడిగింది. “నాపేరు శకుంతల. మాది చిన్నచెరుకూరు..”అంటూ వలవల ఏడ్చింది ఒక్కసారి. అందరూ నిశ్చేష్టులై చూస్తున్నారు. మళ్ళీ కాసేపటికి తేరుకుని “నేను కాలేజీ చదువుతున్న రోజుల్లో ఒకబ్బాయి మత్తుమందు కలిపిచ్చి నాకు అన్యాయం చేశాడు. మా అమ్మా నాన్నలకు తెలిసి కాలేజీ మాన్పించి, మాఊళ్ళో రహస్యంగా 9 నెలలు దాచి మంత్రసాని చేత ప్రసవం చేయించి నాకు మా బావతో ఏమీ చెప్పకుండా పెళ్ళిచేశారు. నాకు ఒక ఆడపిల్ల పుట్టిన తర్వాత మా ఆయన కార్ యాక్సిడెంట్లో పోయారు.  నాకు మొదట పుట్టిన అబ్బాయికి శంకర్ అని పేరుబెట్టి నాలుగేళ్ళ వరకూ మంత్రసాని వాళ్లమ్మ మాడబ్బులతోనే సాకింది. వాళ్ళు ఒకరోజు నన్ను బ్లాక్‌మెయిల్ చేసి, మాదగ్గర బాగా డబ్బులు తీసుకుని ఊరునుంచీ చెప్పకుండా ఉడాయించారు. ఆ తర్వాత ఏమయిందో తెలీదు.  శంకర్ మణికట్టుమీద పుట్టుమచ్చ చూసి గుర్తుపట్టాను”  అని పెద్దగా ఏడవసాగింది.

సుబ్బవ్వ ఆమెను సముదాయించింది. శకుంతల ఒక్కసారి శంకరయ్యతో మాట్లాడాలని మిద్దెపైకి తీసుకుని వెళ్ళింది. తర్వాత చాలాసేపటికి వాళ్ళు క్రిందికి వచ్చారు. శంకరయ్య సుబ్బవ్వతో "ఒక్కసారి అమ్మ దగ్గరికి వెళ్ళి వస్తాను" అని కామాక్షమ్మ దేవళానికి వెళ్ళి వచ్చాడు. శకుంతల ఆతృతతో ఎదురు చూస్తోంది. దేవాలయం నుంచి అరగంట తర్వాత వచ్చిన శంకరయ్య శకుంతలకు దణ్ణంపెట్టి, "అమ్మా..మీరెవరో నాకు తెలీదు. దయచేసి ఇక్కణ్ణుంచీ వెళ్ళిపోండి. మీరు కోటీశ్వరులయినా సరే! నాకు కోట్ల ఆస్తి ఇస్తానన్నా… నేను సుబ్బవ్వను వదిలి రాలేను. నాకు తల్లీ.. తండ్రీ.. దైవం ఆమే.. దయచేసి వెంటనే ఇక్కడనుండి వెళ్ళిపోండి" అని దణ్ణంపెట్టాడు. శకుంతల "ఇంకోసారి బాగా ఆలోచించుకో బాబూ.." ఏడుస్తూ అడిగింది. మీరు ఇక వెళ్ళొచ్చు అన్నట్లు బయటకు దారి చూపించాడు. శకుంతల వెళ్ళిపోగానే పెద్దగా ఏడు స్తూ గోడకానుకుని ఏడుస్తున్న మనవణ్ణి దగ్గరకు తీసుకుని ఓదార్చింది సుబ్బవ్వ. హాల్లో కామాక్షమ్మ తల్లి క్యాలండరు గాలికి ఊగుతూ అందరినీ దీవించింది.

0-0-0


No comments:

Post a Comment

Pages