తెలుగు పద్య మధురిమలు (పుస్తక పరిచయం ) - అచ్చంగా తెలుగు

తెలుగు పద్య మధురిమలు (పుస్తక పరిచయం )

Share This

తెలుగు పద్య మధురిమలు (పుస్తక పరిచయం )

భావరాజు పద్మిని 


'ఏదీ, చిన్నప్పుడు నేర్చుకున్న ఒక పాఠాన్నిగుర్తుచేసుకు చెప్పండి...' అంటే చాలామంది పెద్దలు, 'ఏమోనండి, ఈ మధ్యన ఏమీ గుర్తుండట్లేదు, అయినా అప్పుడెప్పుడో చదివినవి, ఇప్పుడు ఎలా చెప్పేదీ?' అంటూ పెదవి విరుస్తారు.
అదే 'పోనీ చిన్నప్పుడు నేర్చుకున్నఒక పద్యాన్ని చెప్పండి,' అని అడిగితే, నూటికి 95% మంది , కనీసం తెలుగు చదవడం రాని వారు కూడా, వెంటనే కనీసం ఒక పద్యమైనా చెప్తారు. నిజానికి ఆ పద్యాల్ని గుర్తుచేసుకు చెప్పడం మొదలుపెట్టాకా అది ఒక్క పద్యంతో ఆగదు, అంటే అతిశయోక్తి కాదు. 'నాకు ఇంకోటి కూడా వచ్చు, చెప్పేదా?' అంటూ పెద్దలు కూడా పిల్లల్లా మారిపోయి, చెబుతూ, ఏదో విజయగర్వంతో మురిసిపోవడం చూస్తుంటాము. మరి పాఠాలు, గద్యం గుర్తులేనిది, పద్యం ఎలా గుర్తుంది? అంటే...
పద్యం హృద్యమైన భావాలను లయబద్ధమైన ఛందస్సుతో అల్లిన మాలిక. పద్యం తెలుగువారి సంపద, ఒక గతి, లయ తో కూడిన పద్యం ఒక్కసారి నేర్చుకుంటే ఇక జీవితంలో మర్చిపోలేము. అందుకే మన సాహిత్యంలో విశిష్టమైన స్థానం సంపాదించుకున్నది - పద్యం. తెలుగు సాహిత్యంలో కలకాలం నిలిచిపోయే కీర్తిని సంపాదించుకున్నవారు కూడా పద్యకవులే కావటం విశేషం.
పోతన గారి వంటి మహానుభావులు 'ఓం ఐం హ్రీం శ్రీం ' వంటి శ్రీమాత బీజాక్షరాల్ని 'అమ్మలగన్నయమ్మ' అన్న పద్యంలో, ఏ సరస్వతీ దేవి షోడశ నామాల్ని తలచుకుంటే, పెద్దలకు, పిల్లలకు బుద్ధి జాడ్యం అనేదే ఉండదో, అటువంటి నామాల్ని, పూర్తి ధవళ వర్ణ వస్తువులతో కలిపి, 'శారద నీరదేందు' అన్న పద్యంలో పొందుపరచారని, మనం శ్రీ చాగంటి వారి ప్రవచనాల ద్వారా తెలుసుకున్నాము.
తెలుగుదనాన్ని పిల్లలకు పరిచయం చెయ్యాలన్న కోరిక, అంతర్లీనంగా ప్రతి ఒక్కరికీ ఉన్నా, ఏవి చెప్పాలో, ఎలా చెప్పాలో అనేక పుస్తకాల్ని విశ్లేషించి, సేకరించెంత సమయం వారికి ఉండదు. అందుకే అమూల్యమైన మన సంపద వంటి పద్యాన్ని ముందు తరాలకు అందించేందుకు ఒక అద్భుతమైన సాహితీ భాండాగారాన్ని తయారుచేసారు శ్రీ శ్రీ బాలాంత్రపు వేంకట రమణ గారు. వీటిని తెలుగు అకాడమీ వారు "తెలుగు పద్య మధురిమలు" అనే 258 పేజీల పుస్తకాన్ని తీసుకొచ్చారు. ఇందులో 10 శతకాలకు చెందిన కొన్ని పద్యాలు, 4 పురాణేతిహాసాల్లోని కొన్ని పద్యాలు, 10 కావ్యాల్లోని పద్యాలు పొందుపరిచారు.
అంతేనా ? అంటే, అంతే కాదు మరి... ఎందుకంటే... ఒక్కొక్క పద్యం క్రింద సులువుగా అర్ధమయ్యే రీతిలో భావం కూడా ఇవ్వబడింది. మన ధర్మానికి మూలస్థంభాల వంటి పురాణేతిహాసాలను క్లుప్తంగా సరళంగా తెలుపుతూ, వాటిలో ఆయువుపట్టు వంటి పద్యాలను ప్రస్తావించడం జరిగింది. ఇక కావ్యాలు- ప్రబంధాల గురించి తెల్పేటప్పుడు ఆయా కవుల జీవితచరిత్రలు, వారు రాసిన కావ్యాలు, విశేషించి, ఆ కావ్యాల్లో వారు చేసిన ఛందోబద్ధమైన సాహితీ ప్రయోగాలను కూడా అద్భుతంగా వివరించడం జరిగింది.
'ప్రాచీన సాహితీ భాండాగారం' వంటి ఈ పుస్తకం ప్రతి ఇంటా తప్పనిసరిగా ఉండదగ్గది. వెల కూడా చాలా తక్కువే. మీరు ఈ పుస్తకాలను కొని, మీ పిల్లల స్నేహితుల పుట్టినరోజులకి ఇచ్చినా, వారికి గొప్ప ఉపకారం చేసినట్లే ! కొనండి... బహుకరించండి... చదవండి... చదివించండి. ఇంత మంచి సంకలనం అందించిన శ్రీ బాలాంత్రపు వేంకట రమణ గారికి, ప్రచురించిన తెలుగు అకాడమి వారికి మనందరి జేజేలు చెబుదామా మరి !
పుస్తకం: తెలుగు పద్య మధురిమలు
ప్రచురణ: తెలుగు అకాడమి
వెల: 105/-
ప్రతులకు: తెలుగు అకాడమి పుస్తక విక్రయ శాలలు

No comments:

Post a Comment

Pages