అమ్మ - కొడుకు - అచ్చంగా తెలుగు

 అమ్మ - కొడుకు

- శ్యాంప్రసాద్ రెడ్డి కోర్శిపాటి.


అసలేం జరిగిందో ఏడేళ్ల రాజా రెడ్డికి అర్థం కావటం లేదు. ఎవరెవరో వస్తున్నారు. పలుకరిస్తున్నారు. అయ్యో పాపం అంటున్నారు. కొందరు పండ్లు, బిస్కెట్లు చేతిలో పెడుతున్నారు. కొందరు ఏడుస్తున్నారు. మరికొందరు పదో, ఇరవయ్యో జేబులో పెట్టి పోతున్నారు. రాజా రెడ్డికి ఏమీ అర్థం కావడం లేదు. అసలు అమ్మ ఏమైంది? ఎక్కడికెళ్ళిపోయింది? వీళ్లే... వీళ్లంతా కలిసి అమ్మని కర్రలకి కట్టేసి ఏడ్చుకుంటూ, మోసుకెళ్లారు. ఆరోజేంటో అమ్మ తనవైపు దీనంగా చూసింది. తనను దగ్గరకు తీసుకుని వళ్లంతా తడిమింది. అసలు అప్పుడు అమ్మేంటి కళ్ళు బలవంతంగా తెరిచి తనను చూసింది? అమ్మ నోట్లోంచి ఏదో తెల్లగా నురగ కక్కిందేంటి? ఉన్నట్టుండి అమ్మ కదలకుండా అయిపోయిందేమిటి? అప్పుడెందుకో వీళ్ళందరూ పెద్దగా ఏడ్చారు. తనకు మాత్రం ఏడుపు రాలేదు. అమ్మను తీసుకెళ్లిన వాళ్లందరూ వచ్చారు. అమ్మ మాత్రం అక్కడే ఉండిపోయింది. అమ్మ ఎక్కడుందంటే... అందరూ తన తల నిమిరి ఏడ్చే వాళ్ళే తప్ప అమ్మ ఎక్కడుందో చెప్పరేంటి? 

పదిహేను రోజుల తర్వాత బడికెళ్ళిన రాజా రెడ్డికి తోటి పిల్లలు చెప్పిన మాటలను బట్టి వాళ్ళ అమ్మ పాము కరిచి చచ్చిపోయిందని అర్థమైంది. "చచ్చిపోవడం అంటే ఏంటి?" ఇదే మాట తన ఆలనా పాలన చూస్తున్న అమ్మమ్మను అడిగాడు. చచ్చిపోవటం అంటే దేవుడి దగ్గరికి వెళ్లిపోవటం అట. అలా వెళ్లిన వాళ్ళెవరూ ఇక తిరిగి మన దగ్గరకు రారట.

ఇప్పుడు రాజా రెడ్డికి అమ్మ లేదు. ప్రతిరోజూ తాను బడికెళ్లేటప్పుడు శుభ్రంగా స్నానం చేయించి, బట్టలు తొడిగి, తల దువ్వి, పౌడర్ రాసి, పలకాబలపమిచ్చి, ఓ పది పైసలు బిళ్ళ జేబులో వేసి పంపే అమ్మ ఇప్పుడు లేదు. సాయంత్రం బడి నుంచి ఇంటికి రాగానే వేడివేడి పాలబువ్వ కలిపి తినిపించే అమ్మ ఇప్పుడు లేదు. ఆవో, గేదో ఈనితే బెల్లము, యాలకులు కలిపి కాచిన వేడి వేడి జున్ను పాలు అడిగి, అడిగి తినిపించే అమ్మ ఇప్పుడు లేదు. వేసవికాలంలో పొలం నుంచి వస్తూ తనకోసం తాటి ముంజలు రేకులో తెచ్చే అమ్మ ఇప్పుడు లేదు. 

ఎప్పుడూ నేస్తాలతో చలాకీగా ఆడుకుంటూ ఉండే రాజారెడ్డి నెమ్మదిగా స్తబ్దుగా మారిపోయాడు. ఎవ్వరితో కలిసేవాడు కాదు. ఆటలు అస్సలు ఆడేవాడు కాదు. ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ ఉండేవాడు. చదువు కూడా అంతంత మాత్రమే. వాళ్ళ అమ్మ చచ్చిపోయే నాటికే మంచంలో ఉన్న ముసలి నాన్న కూడా కొన్నాళ్ళకు దేవుడి దగ్గరకు వెళ్ళిపోయాడు. వీడికి యుక్తవయసు వచ్చే వరకూ వండి, వార్చి పెట్టిన అమ్మమ్మ కూడా కొంతకాలానికి కాలం చేసింది. 

ఇప్పుడు రాజారెడ్డి పూర్తిగా ఒంటరి వాడైపోయాడు. ఎప్పుడూ అమ్మ జ్ఞాపకమే. ఎవరైనా ప్రేమగా పిలిచి అన్నం పెడితే మురిసిపోయేవాడు. వారిలో అమ్మను, అమ్మ ప్రేమను వెతుక్కునే వాడు. ఎవరైనా ప్రేమగా పలుకరిస్తే వారు తనకు ఆత్మీయులనుకుని ఆనందపడే వాడు. కొంతకాలానికి ఊళ్లో అలా పిలిచి అన్నం పెట్టే వాళ్ళు కూడా కరువైపోయారు. ఎప్పుడూ పరధ్యానంగా, అమాయకంగా ఉండే రాజా రెడ్డిని తోటి ఈడు వాళ్ళు కూడా పట్టించుకునేవాళ్ళు కాదు. దాంతో పూర్తిగా ఒంటరి వాడయిపోయాడు. చదువా అబ్బలేదు. పనీపాటా చేతకాదు. ఉన్న కొద్ది పొలాన్ని కౌలుకిచ్చి ఆ కౌలు డబ్బులతోనే కాలక్షేపం చేస్తున్నాడు. అసలు రాజారెడ్డికి అమ్మ తప్ప వేరే ఏ విషయంపైనా ధ్యాస లేదు. ఎప్పుడూ అమ్మ గురించే ఆలోచన. ఏ తల్లీ కొడుకుల్ని చూసినా తన దౌర్భాగ్యం గుర్తొచ్చి కన్నీళ్ళొచ్చేవి. ఇప్పుడు ఆ కన్నీళ్లే తనకు తోడుగా మిగిలాయి.

రాజారెడ్డికి పాతికేళ్ళ వయసు వచ్చినప్పటినుంచి చుట్టుపక్కల వాళ్ళు, బంధువులు "పెళ్లెప్పుడు చేసుకుంటావు రా?" అని అడగటం మొదలుపెట్టారు. కానీ రాజారెడ్డి ఆలోచన మాత్రం అమ్మ మీదే ఉంది. అమ్మ ప్రేమ కోసం అతని మనసు తహతహలాడుతోంది. ఇక ఊళ్ళో ఉంటే లాభం లేదనుకుని తన దగ్గరున్న గుడ్డా గోసె సర్దుకుని అమ్మ ప్రేమను వెతుక్కుంటూ ఓ సమీప బంధువు ఆశ్రయం కోరి వారింటికెళ్ళాడు. వారి దగ్గరే కొన్నాళ్లు ఉంటానన్నాడు. కానీ ఆ ఇంటి పెద్దాయన "ఒరే అబయా... మా ఇంట్లో పెళ్లీడుకొచ్చిన పిల్లలున్నారు. వాళ్లకు పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నాం. ఈ సమయంలో ఇంట్లో ఉంచుకోవటమంటే... పిల్లనిచ్చే వాళ్ళు ఇవన్నీ ఆలోచిస్తారు కదా? అర్థం చేసుకో." అని సున్నితంగా చెప్పి పంపేశాడు.

మళ్లీ ఒంటరి బ్రతుకు. మొత్తానికి బంధువులు పూనుకుని దగ్గర్లో ఒక ఊరిలోని ఒక పేదింటి పిల్లను చూసి పెళ్లి చేశారు. ఆ అమ్మాయి పేరు సరోజ. సరోజ చూడ చక్కనైన పిల్ల. అణకువైయినది. ఎలాంటి ఆలనా పాలనా లేక అస్తవ్యస్తంగా ఉన్న ఇంటిని అనతికాలంలోనే చక్కదిద్దింది. ఇంట్లో ఎక్కడ ఉండాల్సిన వస్తువులు అక్కడ అమర్చుకుని అందంగా తీర్చి దిద్దుకుంది. చుట్టుపక్కల వారందరికీ తలలో నాలుకయింది. ఎవరింట్లో ఏ కార్యం జరిగినా తానే ముందుండి నిర్వహిస్తుంది. ఎవరికి ఏ ఆపద వచ్చినా ఆదుకుంటుంది. తనకున్న కొద్దిపాటి చదువుతోనే ప్రభుత్వం ప్రకటించిన ఆరోగ్యమిత్ర ఉద్యోగాన్ని సంపాదించింది. దాంతో ఇప్పుడు ఊరందరి బాగోగులు చూడటం ఆమె బాధ్యతగా కూడా మారింది. సహజంగానే చొరవ, స్నేహశీలత కలిగిన అమ్మాయవటంతో అనతికాలంలోనే అందరికీ చేరువైంది. ఊర్లో అందరూ వారిద్దరిదీ చూడముచ్చటైన జంట అనుకుంటారు. అమాయకుడైనా, వాడికి అనుకూలవతియైన భార్య దొరికిందని, ఏమైనా వాడు అదృష్టవంతుడని అనుకుంటారు. కానీ వారికి పిల్లలు లేకపోవడం ఒక్కటే లోటు. నేనే ఒక సారి ఆమెతో అన్నాను.... "ఎవరినైనా తెచ్చుకుని పెంచుకోవచ్చు కదమ్మా?" అని. చిన్న నవ్వు నవ్వి సరిపెట్టిందామె. బహుశా పరాయి వారి పిల్లల్ని తెచ్చుకొని పెంచుకోవడం ఇష్టం లేదేమో అనుకుని మిన్నకున్నాను.

కొన్నాళ్ళ క్రితం మా ఇంట ఓ చిన్న పూజ నిర్వహించాం. సన్నిహిత బంధువులను కొందరిని పిలిచాం. వారిలో రాజారెడ్డి దంపతులు కూడా ఉన్నారు. ఇంట్లో పూజ జరిగిన రోజు అందరూ భోజనాలు చేస్తున్నారు. ఆమె మాత్రం ఒక గదిలో వాడికి అన్నం కలిపి నోట్లో పెడుతూ కనిపించింది. " అదేంటే వాడికి నువ్వు కలిపి నోట్లో పెడుతున్నావ్?" అని అడిగిన ఓ పెద్దావిడకు " అంతా పైన పోసుకుంటాడత్తమ్మా" అంటూ అరమరికలు లేకుండా ఆమె చెప్పిన సమాధానం నన్ను అబ్బురపరచింది.

పొద్దున ఓ పుణ్య క్షేత్ర దర్శనానికి బయల్దేరాం. సాయంత్రానికి అక్కడికి చేరుకున్నాం. పెద్దవాళ్లు, ఆడవాళ్ళందరికీ రూములు ఓ దగ్గర దొరికాయి. వారినక్కడ దించి, మరి కొంత దూరంలో ఉన్న వేరే రూముల వద్దకు పిల్లలతో కలిసి మగవాళ్ళం బయల్దేరాం. ఆ అమ్మాయి వెంటనే బ్యాగ్ లోంచి ఓ కవరు తీసి అందులో వాడికి కావాల్సిన పంచె, టవలు, బ్రష్షు, పేస్టు, సోపు, పొద్దున స్నానం చేశాక వేసుకోవాల్సిన బట్టలు అన్నీ సర్ది ఇచ్చింది. పొద్దున దర్శనానికి వెళ్ళాం. ఆడవాళ్ళను ముందుకు పంపి మేం వెనక నడుస్తున్నాం. అందరూ వెళ్లిపోతున్నారు. ఆమె మాత్రం వెనక్కి తిరిగి వాడు వస్తున్నాడా రావటం లేదా? అని చూస్తూ వెళుతోంది. ఇంటికి తిరిగొచ్చాక బ్యాగ్ లోంచి రెండు నవరత్న ఆయిల్ ప్యాకెట్లు బయటకు తీసింది. వాడ్ని ఒక కుర్చీలో కూర్చోబెట్టి ఆ ఆయిల్ తో తలంటుతోంది. "ఈ రాత్రి వేళ అదెందుకమ్మా?" అనడిగాను ఉండబట్టలేక. " "ఎండాకాలం వేడి చేస్తుంది కద మామా... ఇది అంటుకుని స్నానం చేస్తే కాస్త చల్లబడుతుంది." అంటూ వాడికి తలంటుతోంది. నాకు ఆ దృశ్యాన్ని అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది. తల్లిలేని రాజా రెడ్డికి తల్లి దొరికింది, బిడ్డలు లేని సరోజకు ఓ బిడ్డ దొరికాడు అనిపించింది. వారిద్దరిలో నాకు ఓ అమ్మ, ఓ కొడుకు కనిపించారు. అమ్మ కోసం దశాబ్దాలపాటు ఎదురుచూసిన రాజా రెడ్డికి ఆమె అమ్మయింది. పిల్లలు లేని ఆ తల్లికి వాడు కొడుకయ్యాడు. ఆనాటి ఆమె చిరునవ్వు నాకిప్పటికర్థమైంది.

***

No comments:

Post a Comment

Pages