రిచ్చా రాము
వెంకోరా
అది 1985వ సంవత్సరం, రాజమండ్రి లో ఒక చోట నుండి మరో చోటుకి వెళ్ళడానికి రిక్షా ఎక్కాల్సిందే. మన కధ కూడా రిక్షా తొక్కే ఒక సామాన్య జీవిది.
రాములు రిక్షా తొక్కి కుటుంబాన్ని బ్రతికిస్తున్న ఒక సామాన్యుడు. అద్దెకి రిక్షా తీసుకుని ప్రతీ రోజు ఎంతో కష్టపడి, సాయంత్రానికి రిక్షా అద్దె కట్టి మిగిలిన డబ్బులతో ఇంట్లోకి కావలసిన పచారు సామానులు తెచ్చేవాడు. ఏ రోజైనా రిక్షా తొక్క లేదో… ఆ రోజు కుటుంబం మెత్తం పస్తులే. ఏ రోజైనా బందు వచ్చిందంటె ఇక ఆ రోజు అంతే సంగతి.
రాములు లాలాచెరువు దగ్గర ఒక చిన్న వీధిలో ఉంటున్నాడు, ఊరి చివర ఖాళి స్థలం లో అందరితో పాటే తను కూడా ఒక గుడిసె వేసుకుని ఉంటున్నాడు. ఎప్పుడు ఖాళీ చేసి పొమ్మంటారో అన్న భయం. తనకి ఉన్న ఒకే ఒక కోరిక, తను ఉంటున్న స్థలం కొని, ఈ భూమి మీద తనకీ ఉండటానికి ఒక చోటుందని అనిపించుకోవటం. దాని కోసం రోజుకి పది రూపాయలు ముంతలో దాస్తున్నాడు.
రాములుకి ఒక కూతురు, ఒక కొడుకు. కూతురి వయసు పది సంవత్సరాలు, కొడుకు వయసు మూడు. రాములు భార్య కొడుకుని ప్రసవించి చనిపోయింది. అప్పటి నుండి రాములు రిక్షా తొక్కడానికి వెళ్ళినపుడు, పక్కింటి అవ్వే ఈ పిల్లలని చూసుకుంటుంది.
ఇలా కష్టాలు ఈదుతున్న రాములుకి, మెల్లగా నడుము నొప్పి మొదలైంది. కొన్ని రోజులు ఓర్చుకొని రిక్షా తొక్కుతూనే ఉన్నాడు. నొప్పి బిళ్ళలు తెచ్చుకొని వేసుకున్నా మానటం లేదు. ఒక రోజు రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళాడు. మామూలు గానే బిళ్ళలు ఇచ్చి వారం తరువాత రమ్మన్నారు. వారం బిళ్ళలు వాడినా నొప్పి తగ్గ లేదు. మళ్ళీ ఆసుపత్రికి పోయాడు. కొన్ని పరీక్షలు చేసి రెండు రోజుల తరువాత రమ్మన్నారు, వెళ్ళాడు. రాములుకి ఒక కిడ్నీ పాడయ్యిందని చెప్పాడు వైద్యుడు. కిడ్నీ మార్చాలన్నాడు. కానీ ఆ సదుపాయం ప్రభుత్వ ఆసుపత్రిలో లేదూ, నా ఆసుపత్రి ఉంది అక్కడకు రా మారుద్దాము అన్నాడు. సరేనని రాములు వైద్యుడి ఆసుపత్రికి వెళ్ళాడు.
రాములు ఆ ఆసుపత్రి చూసి ఆశ్చర్యపోయాడు. ఎంత పెద్దదో, చాలా శుభ్రంగా కూడా ఉంది. వైద్యుడి దగ్గరకు వెళ్లి కిడ్నీ మార్చమన్నాడు. వైద్యుడు రాములుకి కిడ్నీ మార్చే విధానం మెత్తం వివరించి, ఒక లక్ష రూపాయలు పట్టుకుని వస్తే కిడ్నీ మారుస్తానని చెప్పాడు. అంతే, రాములుకి ఏమీ వినబడలేదు. వైద్యుడు చెప్పిందంతా మరచిపోయాడు. ఒక్క లక్ష రూపాయలు అనే మాటే గుర్తొసోంది అతనికి. అసలు లక్ష అంటేనే తన ఊహకి అందటం లేదు.
ఈ విషయం తన వీధిలో వారికి తెలిసింది అందరూ వచ్చి ఓదార్చారు, అంతకన్నా వాళ్ళూ ఏమీ చేయలేని వారే. రాములుకి తను చచ్చిపోతే తల్లి లేని పిల్లలు అనాథలు ఔతారేమోనని బెంగ మొదలైంది. తన ఆలోచనంతా పిల్లల గురించే.
అనారోగ్యం వల్ల రిక్షా తొక్కడం మానేశాడు. తను దాచుకున్న ముంతలో డబ్బులే వాళ్ళను బ్రతికిస్తున్నాయి. రాములు విషయం వాళ్ళ వీధిలో ఉండే సత్తిగాడికి తెలిసింది. సత్తి అసలు పేరు సత్యనారాయణ. సత్తిగాడు చిన్న చిన్న దొంగతనాలు చేసి బ్రతుకుతుంటాడు. సగం రోజులు జైల్లో, సగం రోజులు బయట ఉంటాడు. వాడికి ఎవ్వరూ లేరు. వీధిలో పెద్ద వాళ్ళు ఎంత నచ్చజెప్పినా వాడు దొంగతనాలు మానలేదు. దొంగతనం చేసిన వస్తువులు అమ్ముకుని జల్సా చేస్తాడు, దొరికితే ఎలాగో జైల్లో తిండికి దిగులు లేదు. ఇదీ వాడి జీవిత పాలసీ.
సత్తిగాడు, రాములు గుడిసెకి వచ్చి పిల్లలని బయటకు పంపి కొంత సేపు రాములుతో మాట్లాడాడు. అంతే సాయంత్రానికి పోలీసులు వచ్చి రాములుని పట్టుకెళ్ళారు. కోర్టు రాములుకి రెండు సంవత్సరాల కారాగార శిక్ష విధించింది.
మరుసటి రోజు కల్లా రాములు జైల్లో ఉన్నాడు. వాళ్ళ వీధిలో వాళ్ళకి ఏం జరిగిందో అర్ధం కావట్లేదు, పిల్లలని పక్కింటి అవ్వే చూసుకుంటోంది. వీధిలో వారె రోజుకొకరు చొప్పున వాళ్ళకి అన్నం పెడుతున్నారు. ఏం జరిగిందని సత్తిగాడి ఎంత అడిగినా వాడు నోరు మెదపటం లేదు. ఈ సచ్చినోడే, వాడు చేసిన నేరాన్ని రాములు మీద నెట్టి ఉంటాడని సత్తిగాడు కనబడినప్పుడల్లా బూతులు తిడుతున్నారు. తిట్లు సత్తిగాడికి అలవాటే….. వాడేమీ పట్టించుకోవటం లేదు. శ్రద్ధగా వాడి దొంగతనాలు వాడు చేసుకుంటున్నాడు.
రాజమండ్రి జైల్లో వైద్యశాలలోని వైద్యుడిని రాములు కలిసాడు. తనకి కిడ్నీ మార్చాలన్న ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు చెప్పిన విషయం చెప్పాడు. వారు రాములుని మరలా పరీక్షల కోసం పంపారు, రాములు చెప్పింది నిజమేనని తేలింది. వెంటనే రాములుకి కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స కోసం ఎర్పాట్లు చకచకా జరిగిపోయాయి. రాములుని హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రికి బందోబస్తుతో తీసుకెళ్లి అక్కడే శస్త్రచికిత్స చేయించారు ప్రభుత్వ ఖర్చులతో. కొన్ని నెలలకి రాములు ఆరోగ్యం కుదురుకుంది. సత్తిగాడు వారానికి రెండు సార్లు రాములు పిల్లలను జైలుకి తీసుకుని వచ్చి రాములుతో మాట్లాడించి తీసుకెళ్లేవాడు. జైల్లో ఉన్న వర్క్ షాప్ లో రాములు సబ్బుల తయారి శ్రద్ధగా నేర్చుకున్నాడు. జైల్లో మంచి ప్రవర్తనతో మెలగడం వలన ఒక సంవత్సరం ఆరు నెలల తరువాత రాములు విడుదలై ఇంటికి వచ్చాడు.
రాములు ఇంటికి తిరిగి వచ్చిన వెంటనే సత్తిగాడు వచ్చి రాములుని కలసి వెళ్ళాడు. వీడు మళ్ళీ రాములుకి ఏదో అన్యాయం చేస్తాడని వీధిలో జనం మళ్ళీ సత్తిగాడిని తిట్టడం మొదలు పెట్టారు. తిట్లు సత్తిగాడికి అలవాటే….. వాడేమీ పట్టించుకోవటం లేదు. రాములు తను ఉన్న స్థలం మరుసటి రోజే కొనేశాడు. వీధిలోని జనం నోరెళ్లబెట్టారు. రాములు కూడా చెడిపోయాడనీ, సత్తిగాడిలా ఎదో చేయకూడని పనులు చేస్తున్నాడని చెవులు కొరుక్కోవటం మొదలు పెట్టారు. ఈ గోల విని పక్కింటి అవ్వ ఉండబట్టలేక రాములుని నిలదీసింది.
రాములు అవ్వకి జరిగింది ఇలా చెప్పాడు.
"రాజారావు పిఠాపురం జమీందారు. అతని చిన్నకొడుకు సత్యం జల్సారాయుడు. వాడి దుబారా తెలిసి రాజారావు డబ్బులు ఇవ్వడం మానేశాడు. డబ్బుల కోసం సత్యం పిఠాపురం కుక్కుటేశ్వర స్వామి గుళ్ళో నగలు దొంగతనం చేసి ఊళ్ళో జనానికి దొరికిపోయాడు. జమీందారు మంచితనం తెలిసిన ఎస్సై, సత్యం భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని, సత్యానికి బదులుగా నేరం ఒప్పుకోమని పాత నేరస్తుడైన సత్తిగాడిని అడిగాడు. నేరం ఒప్పుకుంటే లక్ష రూపాయలు జమిందారు నుండి ఇప్పిస్తానని కూడా చెప్పాడు. దానికి సత్తిగాడు, రెండు సంవత్సరాలు జైల్లో ఉండటం నావల్ల కాదు వేరే మనిషిని చూస్తానని చెప్పాడు. అలా నా దగ్గరికి సత్తిగాడు వచ్చి, నువ్వు బయట ఉంటే కిడ్నీ రోగం తో చచ్చిపోతావు, నీ పిల్లలు దిక్కులేని వారు అవుతారూ, అదే నేరం ఒప్పుకుంటే నీకు లక్షరూపాయలు వస్తాయి దానితో పాటు జైల్లోనే నీకు ప్రభుత్వం వారు కిడ్నీ ఆపరేషన్ ఉచితంగా చేయిస్తారు అని చెప్పాడు. నాకు ఇలాంటి పనులు గిట్టవు కానీ తల్లిలేని పిల్లలను దృష్టిలో ఉంచుకుని ఇక వేరే గతి లేక సత్తిగాడు చెప్పినదానికి ఒప్పుకున్నాను. ఒక వేళ సత్తిగాడు చెప్పిన లక్ష రూపాయలూ రాకపోయినా నా ఆరోగ్యం బాగయితే పిల్లలని నేనే జాగ్రత్తగా పెంచుకోవచ్చు అనే ఆలోచనతో జైలుకి వెళ్ళటానికి సిద్ధపడ్డాను. పిఠాపురం జమిందారు, ఊళ్ళో జనానికి అనుమానం రాకుండా, చిన్న కొడుకు సత్యాన్ని ఆ రెండు సంవత్సరాల పాటు మద్రాసులో ఉంచాడు. అవ్వా, సత్తిగాడు మాట నిలబెట్టుకున్నాడు. నేను జైలు నుండీ తిరిగి వచ్చిన వెంటనే నాకు లక్ష రూపాయలూ తెచ్చి ఇచ్చాడు. అందులో కొంత డబ్బుతోనే నేను ఈ ఇళ్ళ స్థలం కొన్నాను. "
అంతా విన్న అవ్వ, 'పోన్లే బాబూ, ఏ దిక్కూ లేని నీకు, నీ పిల్లలకి ఆ బగమంతుడే ఒక తోవ చూపాడు... ఇన్నాళ్ళూ అనవసరంగా ఆ సత్తిగాడిని ఆడిపోసుకున్నాను.' అంటూ బాధపడింది.
రాములు రిక్షాతొక్కడం మానేసాడు. సత్తిగాడు ఇచ్చిన కొంత డబ్బుతో ఒక షెడ్డు అద్దెకు తీసుకుని, దానిలో సబ్బుల తయారీ యంత్రాలు పెట్టుకుని చిన్నగా బట్టల సబ్బులు తయారు చేసి అమ్మడం మెదలు పెట్టాడు. నెల తిరిగే సరికి ఓ రిక్షా బండి కొని దానికి ఓ మనిషిని పెట్టి, ఒక మైకు బిగించి దాని తో వీధులో బట్టల సబ్బులు అమ్మించడం మొదలు పెట్టాడు.
రాములు పిల్లలు కాన్వెంటుకి వెళుతున్నారు. సబ్బుల తయారీ షెడ్డులో సత్తిగాడి ఫోటో పెట్టుకున్నాడు రాములు. రోజూ ఆ ఫోటోకి దణ్ణం పెట్టి పని మొదలు పెడతాడు. ఇక రాములుకి శుభమే.
అవ్వ సత్తిగాడిని చూసినప్పుడల్లా అన్నవరం సత్యనారాయణ స్వామే వచ్చి రాములుని ఆదుకున్నాడేమో అని అనుమానం. సత్తిగాడు కనబడినప్పుడల్లా చేతులెత్తి దణ్ణం పెట్టేది. సత్తిగాడు ఇవేమీ పట్టించుకోవటం లేదు. శ్రద్ధగా వాడి దొంగతనాలు వాడు చేసుకుంటున్నాడు.
*************
కథ చాలా బాగుంది. కథ నడిచిన తీరు వాడిన పదాలు సులభంగా మరియు అర్థవంతంగా ఉన్నాయి.
ReplyDelete