గూగులమ్మ - ఓ సరదా కథ
గోపాలకృష్ణ ఎస్ తంగిరాల
నల్ల రంగు పేంట్ మీద తెల్ల చొక్కా ఇన్ షర్ట్ చేసుకుని ఉత్సాహంగా
నడుచుకుంటూ వెళ్తున్న 29 ఏళ్ళ శివప్రసాదు, కేశవస్వామి గుడి దాటాక కుడి సందులోకి
తిరిగాడు.
ఆ వీధిలోని మంగిన గంగాధరం గారిల్లు పక్కనే ఉన్న డాబా
దగ్గరకొచ్చేసరికి ప్రసాదు కాళ్ళు అసంకల్పితంగా ఆగాయి. డాబా అరుగు మీద తుండు గుడ్డ
కట్టుకుని కూర్చుని ఉన్నారు సూర్యనారాయణ మాష్టారు. ఆయన రిటైరయ్యి దాదాపు నాలుగు
సంవత్సరాలు అవుతోంది. ఇప్పటికీ అలాగే సన్నగా రివటలా ఉన్నారాయన. నుదుటి మీద నాలుగు
గీతలూ, కళ్ళ మీద సులోచనాలు వచ్చి చేరాయి. అంతే.
ఒకప్పుడు సూర్యనారాయణ మాష్టారంటే బడి పిల్లలందరికీ హడల్. అవటానకి
తెలుగు మాష్టారైనా డ్రిల్లు మాస్టారు కావలసిన ఫిజికల్ ఫిట్నెస్ ఉండేది. ఆయన ఒక
పద్యం చెపితే పరీక్షల దాకా చదువుకోవాల్సిన పని ఉండేది కాదు. అంతగా కంఠతా వచ్చేసేవి
పిల్లలకు.
ఆలోచనల్లోంచి తెప్పరిల్లిన ప్రసాదు ఆయన ముందు నిలబడి చేతులు జోడించి "నమస్కారం
మాష్టారూ" అన్నాడు. ప్రసాదుని ఎగాదిగా చూసిన మాస్టారు "నువ్వు ..
నువ్వు.. అప్పారావు గారి అబ్బాయి ప్రసాదం కదూ" అన్నారు.
ప్రసాదం అన్న పిలుపుకి చిన్నబుచ్చుకున్న ప్రసాదు తడబడుతూ "ప్రసాదం కాదండీ
... శివ ప్రసాద్ నా పేరు" అన్నాడు.
కళ్ళజోడు లోంచి తీక్షణంగా చూసిన మాస్టారు నవ్వేసి "సరేలేరా శివ
ప్రసాద్. నేనేమైనా కాదన్నానా ఏమిటి" అని "ఏరా అబ్బాయ్..
ఎలా ఉన్నావు? చాన్నాళ్ళకి కనిపించావు" అన్నాడు వచ్చి
కూర్చో అన్నట్లుగా అరుగు మీద తట్టి చూపిస్తూ.
ప్రసాదు వినయంగా చేతులు కట్టుకుని కూర్చుని "బావున్నాను
మాష్టారు. మీరు బావున్నారా?" అని అడిగాడు.
మాష్టారు నీరసంగా నిట్టూర్చి "ఏం బావుండటం
లేరా... మా అమ్మాయి పురిటికొస్తే మూడు లక్షలైంది. ఆ తరవాత మనవడు ముక్కు
చీదుతున్నాడని హాస్పిటల్ కి తీసుకెళ్తే ముప్ఫై వేలు బిల్లేశారు. ఇంట్లో అందరికీ
కరోనా వస్తే కాసుల పేరు అమ్మాల్సొచ్చింది..." ఏకరువు పెట్టారు
మాష్టారు
ప్రసాదు తల గోక్కుంటూ (స్వగతంలో) 'నేనేదో మాట వరసకు బావున్నారా అంటే
ఈయన బాగోతం మొత్తం చెప్పేస్త్నారురా బాబూ' అనుకున్నాడు
"ఏంట్రా... ఏదో గొణుక్కుంటున్నావూ?" అడిగారు మాష్టారు
ప్రసాదు తల ఊపుతూ "అహ... ఏం లేదండీ. మీరు
చిక్కిపోయినట్టు కనపడుతున్నారనీ.." చాకచక్యంగా మాట
మార్చాడు
మాష్టారు ఫెళ్ళున నవ్వుతూ ప్రసాదు తొడ మీద ఠప్ మని శబ్దం వచ్చేలా
చరిచి "చిక్కకపోతే బలుస్తానేవిటిరా... కరోనా వచ్చినప్పుడైతే
కాలం చేస్తాననుకున్నాను. సరే కానీ చాలా రోజులు కనపడలేదు. ఏవై పోయావురా?" కాస్త ఆప్యాయంగా
అడిగారు
మాష్టారు కొట్టిన చోట పాముకుంటూనే సిగ్గుపడుతూ "ఏం లేదు
మాష్టారు. ఈ మధ్య మనకు పెళ్ళైందండీ" అన్నాడు ప్రసాదు
... అందుకే మీకు కనబడలేకపోయాను అనే అర్ధం వచ్చేటట్టుగా.
మాష్టారు చిరు కోపంతో మళ్ళీ ఠప్ మని శబ్దం వచ్చేలా ప్రసాదు తొడ మీద
చరిచి "తాటాకులతో బిల్డింగ్ కట్టాలనుకునే వాడిలా మొహవూ
నువ్వూను. మనకు పెళ్ళైందంటావేవిట్రా? అక్కడికి మనిద్దరికీ ఒకే ముహుర్తంలో
పెళ్ళైనట్టూ" అన్నారు
అయ్యబాబోయ్ చచ్చానురా బాబూ అనుకుంటూ కాస్త గట్టిగా "అబ్బే... అదేం
లేదండీ... ఏదో మాటవరసకు అలా అన్నాను. నాకు ఈ మధ్యనే పెళ్ళయింది" అన్నాడు
ప్రసాదు... ఇక్కడి నుంచి వెళ్ళే లోపు ఇంకెన్నిసార్లు చరుస్తారో ఈయన అనుకుంటూ.
నవ్వేసిన మాష్టారు "ఊ... మరింకేవిట్రా .. కొబ్బరి
బోండాంలా కళకళ లాడుతూ ఉండాలి కానీ ఇలా వలిచి పారేసిన కొబ్బరి డొక్కలా
అయిపోయావేవిటీ...సరేలే కానీ... ఎలా ఉంది కొత్త కాపురం?
అనడిగారు చిద్విలాసంగా కాలూపుతూ...
మళ్ళీ సిగ్గు పడిన ప్రసాదు "బానే ఉందండి..." అన్నాడు మెలికలు
తిరుగుతూ
మాష్టారు సీరియస్ గా ప్రసాదు కేసి చూస్తూ"ముందు బానే
ఉంటుందిరా .. ఆ తర్వాతే, బతుకు బస్టాండ్ అయిపోతుంది. నన్నే తీసుకో... పెళ్ళైన
కొత్తలో అప్పుడే ఇస్త్రీ చేసిన ఖద్దరు చొక్కాలా ఉండేవాణ్ణి. ఇప్పుడు చూడు, వంటవాడు
కట్టి పారేసిన కొల్లాయి గుడ్డలా అయిపోయాను..." అన్నారు
ఇక్కడినుంచి ఎలా బయట పడాలా అని ఆలోచిస్తున్న ప్రసాదు ఏమనాలో తెలియక "మరేనండి..." అన్నాడు
అసంకల్పితంగా
మాష్టారు కోపంగా ప్రసాదుని మింగేసేలా చూస్తూ "ఒరేయ్ ఒరేయ్...
బిరియానిలో పంచదార కలుపుకునే వాడిలా మొహఁవూ నువ్వూను. నీక్కూడా అంత లోకువైపోయానా?" అన్నారు
ప్రసాదు తడబడుతూ "అబ్బబ్బే... మీరేదో కొల్లాయి
గుడ్డలా అయిపోయాను అంటుంటేనూ... ఎప్పుడూ హుషారుగా మాట్లాడేవారు. ఇప్పుడు ఇలా
అంటున్నారేమిటా అనీ... " అన్నాడు
నిజమే అన్నట్లు తల పంకించిన మాష్టారు "అవునురా..
జడ్జీలా దర్జాగా ఉండేవాణ్ణి. దర్జీలా నిర్జీవంగా అయిపోయాను.." అంటూ
నిట్టూర్చారు.
ఏదో అనబోయిన ప్రసాదు జేబులో మొబైల్ మోగడంతో తీసి "హలో..." అని మాష్టారు
కేసి చూసి "ఒక్క నిమిషం మాష్టారూ..." అంటూ కాస్త
దూరంగా వెళ్ళి మాట్లాడి మళ్ళీ వచ్చి కూర్చున్నాడు.
ప్రసాదు చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ కేసి చూస్తూ "అవునొరే... ఈ
ఇంటర్నెట్ అని ఉంటుందిట. అందులో గూగులమ్మ అని ఒకావిడ ఉంటుందిట. అది ఏఁవడిగినా
ఠక్కున చెప్పేస్తుందిట...మా మనవడు చెప్పాడు. నిజమేనేవిట్రా? " అని అడిగారు
మాష్టారు
కాస్త గర్వంగా తన కొత్త మొబైల్ ని చూస్తూ "అవునండీ...
గూగుల్, ఏదడిగినా చెప్పేస్తుందండి" అన్నాడు
ఆ మాట విన్న మాష్టారు ప్రసాదుకి కాస్త దగ్గరగా జరిగి గొంతు తగ్గించి
రహస్యం చెప్తున్నట్టు "మా ఆవిడని అదుపులో పెట్టడం ఎలాగో మీ గూగుల్ తల్లిని
అడిగి కనుక్కోరా...బాబూ" ప్రాధేయపడుతున్నట్లుగా అడిగారు
ప్రసాదు ఆశ్చర్యంగా మాష్టారు కేసి చూస్తూ "అదేంటి
మాష్టారూ... మీరు మాకు చదువు చెప్పే రోజుల్లో మీ పేరు చెప్తే మేం నిక్కర్లు
తడుపుకునే వాళ్ళం... అలాంటిది మీరు ఇలా..." అన్నాడు జాలి
పడుతున్నట్లు
గాఢంగా నిట్టూర్చిన మాష్టారు "ఏం చెప్పమంటావురా
నా బాధ. అప్పట్లో నా పేరు చెబితే మీరు తడుపుకునేవారు. ఇప్పుడు నా భార్య పేరు
చెబితే నేను తడుపుకుంటున్నాను..." అనేశారు మెడ వేలాడేసి.
ప్రసాదు అయోమయంగా "ఏంటండీ?" అన్నాడు
ప్రసాదు తొడ మీద ఠపీమని మళ్ళీ చరిచిన మాష్టారు ఫెళ్ళున నవ్వుతూ "పంచె రా పంచె" అన్నారు
మాష్టారు చరిచిన దెబ్బకి మంట నషాళానికి అంటుతుండగా "అయ్య బాబోయ్" అన్నాడు... తొడ
అరచేత్తో పాముకుంటూ
"సర్లేరా.. ఈ మాత్రానికే కాలో చెయ్యో విరిగినంత
బిల్డప్పు ఇస్తున్నావు. నీ సొల్లు కబుర్లు ఆపి గూగులమ్మని అడగరా..." అన్నారు మాష్టారు
ఈయన అడిగిందేదో చూసి చెప్పేస్తే ఇక్కడి నుంచి దొబ్బేయచ్చు అనుకున్న
ప్రసాదు "గూగుల్ లో ఎన్నో రకాల ప్రశ్నలకు సమాచారం దొరుకుతుంది
కానీండీ, ఇలాంటి ప్రశ్నలకు ఏం సమాధానం చెబుతుందో మరి" అంటూ మొబైల్ లో
ఏదో నొక్కుతుంటే....
"ఒరే ఆండ్రిబ్బ. నేను చెప్పిన పని మానేసి ఆ మొబైల్
పిసుకుతావేమిట్రా పింజారి వెధవా..." అన్నారు మరోసారి
ప్రసాదు తొడ మీద చరచబోతూ
లేచి ఒక్క గంతులో దూరంగా జరిగిన ప్రసాదు ఆయనకేసి చూస్తూ "అడగడం అంటే తలుపు
కొట్టి ఏవండోయ్ గూగులమ్మగారూ అని అడగడం కాదండి. మనం అడగాల్సిన ప్రశ్నను ఇందులో
టైపింగ్ చేస్తే అది జవాబు ఇస్తుందండి.." అన్నాడు కాస్త
విసురుగా
నవ్వేసిన మాష్టారు "అయ్ బాబూ... అంత
కోపవెందుకురా... చిన్నోడివి కదా అన్న చనువు కొద్ది అడిగితే, చెప్పడం మానేసి చిరాకు
పడతావేవిట్రా.." అన్నారు
ప్రసాదు మళ్ళీ మొబైల్ కేసి చూస్తూ మళ్ళీ నొక్కుతుంటే...
మాష్టారు అసహనంగా "ఏవిట్రా రాస్తున్నావూ..." అనడిగారు
ఆయన కేసి చూసి కాస్త దూరం మెయింటైన్ చేస్తూ"హౌ టు కంట్రోల్
మై వైఫ్ అని టైప్ చేశానండి..." అన్నాడు ప్రసాదు
ఒక్క అంగలో ప్రసాదు పక్కకు చేరిన మాష్టారు ఠపీ మని ప్రసాదు తొడ మీద
గట్టిగా చరిచి "నా పెళ్ళాం గురించి అడగమంటే నీ పెళ్ళాం గురించి
అడుగుతావా అంట్ల వెధవా..
అయినా నిన్న కాక మొన్న పెళ్ళైనవాడివి... పెళ్ళాన్ని కంట్రోల్ చేయాలనే
గొడవ నీకెందుకురా" అన్నారు
కళ్ళ వెంట నీళ్ళు తిరిగినంత పనైంది ప్రసాదుకి.
"అబ్బా .. చంపేహేరండి బాబూ.. మీకు దణ్ణం పెడతాను... కొట్టకండి
మాష్టారూ" అన్నాడు బతిమాలుకుంటున్నట్టు.
ఫెళ్ళున మరోసారి నవ్వేసిన మాష్టారు "చాల్లేరా నువ్వూ
నీ వేషాలూను. ముందు నాకీ సంగతి చెప్పు. నా పెళ్ళాం గురించి అడగమంటే నీ పెళ్ళాం
గురించి అడుగుతావెందుకురా? కొంపతీసి మీ ఆవిడ కూడా తాట తీసేస్తోందా నీది" అన్నారు
ఉత్సాహంగా, ఉత్సుకతతో.
విస్తుబోయిన ప్రసాదు"అదేం కాదు
మాష్టారూ... మా మాష్టారి భార్యని కంట్రోల్ చేయడం ఎలా అని అడిగితే, అది మీ మాష్టారు
అడగాలి కానీ నువ్వడుగుతావేంటి అని గూగుల్ తల్లి కోప్పడుతుందండీ... అందుకని
నేనడిగినట్లు అడిగితే జవాబిస్తుంది కదండీ..." అన్నాడు 'ఈయనకి
ఎలా చెబితే అర్ధం అవుతుందిరా బాబూ' అనుకుంటూ
మళ్ళీ కోపంగా చూసి "ఏడిసినట్టే ఉంది నీ తెలివి. నీ
పెళ్ళాం గురించి అడిగితే నా పెళ్ళాం గురించి ఎలా చెప్తుందిరా... సొట్ట మొహం
వెధవా.." అన్నారు మాష్టారు
ప్రసాదు చిరాగ్గా మొహం పెట్టి"పెళ్ళాం ఎవరికైనా
పెళ్ళావే కదండీ..." అన్నాడు
మాష్టారు అపనమ్మకంతో "ఏడిచి మొహం
కడిగినట్టే ఉంది నీ తెలివి.... సరే.. ముందు పని చూడు" అన్నారు
మొబైల్ కేసి చూస్తూ... టైపింగ్ చేసిన ప్రసాదు మొహంలో అకస్మాత్తుగా
రంగులు మారాయి. షాక్ అయినట్టు చూసి మాష్టారు కేసి చూస్తూ మొబైల్ మాష్టారుకి
చూపెట్టాడు.
ప్రసాదు మొహం కేసి చూసిన మాష్టారు "ఏమైందిరా... మొహం
కిలుం పట్టిన ఇత్తడి తప్పేళాలా పెట్టావూ" అని అడగడంతో
ఏం చెప్పాలో ఎలా చెప్పాలో తెలియనట్లు ఇబ్బంది పడుతూ "అదీ... అదీ..." అంటూ ప్రసాదు
నీళ్ళు నమిలాడు.
అసహనంగా అరుగు మీద నుంచి లేచి నుంచుని "హోం వర్క్
చేయకుండా వచ్చి బెంచి ఎక్కిన వాడిలా మొహం అలా పెట్టేవేవిట్రా? ఏదీ ఆ మొబైల్ ఇలా
ఇయ్యి... అందులో ఏం ఉందో చూస్తాను..." అంటూ ప్రసాదు
చేతిలో మొబైల్ లాక్కొని స్క్రీన్ కేసి చూసిన మాస్టారు మరింత షాకై పోయారు.
మొబైల్ స్క్రీన్ మీద....
హౌ టు కంట్రోల్ మై వైఫ్ అన్న ప్రశ్నకు సమాధానంగా....
"వియ్ ఆర్ స్టిల్ ట్రైయింగ్ టు ఫైండ్ ఆన్సర్ టు దిస్
క్వశ్చన్" అని ఉంది
********




No comments:
Post a Comment