అందని ద్రాక్షలు - అచ్చంగా తెలుగు

అందని ద్రాక్షలు

బి.ఎన్.వి.పార్థసారధి 

 



శివరావు,గౌరి దంపతులకి ఇద్దరు పిల్లలు వీణ, గంధర్వ్. వీణ కన్నా గంధర్వ్ ఆరేళ్ళు చిన్న వాడు. శివరావు హైదరాబాద్ నగరం లో ఒక ప్రైవేటు  కంపనీ లో చిరుద్యోగి. గౌరి ఒక ప్రైవేటు స్కూల్ లో టీచెర్ గా పనిచేస్తోంది. శివరావు కి ఎలాగైనా హైదరాబాద్ మహానగరంలో ఒక డబల్ బెడ్ రూమ్ ఫ్లాట్ కొనాలని బలమైన కోరిక. కానీ అతని జీతానికి బ్యాంకు వారు ఇచ్చే హౌసింగ్ లోన్ తో  డబల్ బెడ్ రూమ్ ఫ్లాట్ దాదాపు నగరం పొలిమేరల్లో కాని లభించటం లేదు. అప్పుడప్పుడు శివరావు కి జీతం పెరిగినప్పుడల్లా అతను బ్యాంకు లో మళ్ళీ హౌసింగ్ లోన్ కోసం ప్రయత్నించటం, బ్యాంకు వారు ఇచ్చే లోన్ పెరిగినప్పటికీ ఇళ్ళ ధరలు విపరీతం గా పెరగటం తో అటుతిరిగి, ఇటుతిరిగి చివరికి ఆ లోన్ తో ఇల్లు కొనాలంటే నగరం పొలిమేర న మాత్రం ఇళ్ళ ధరలు అందుబాటులో వుండటం జరుగుతోంది.

శివరావు కి తాత ముత్తాతల ద్వారా సంక్రమించిన ఆస్తి ఒక చిన్న ఇల్లు లేకపోలేదు. కానీ ఆ ఇల్లు కూడా హైదరాబాద్ నగరం నుంచి దాదాపు ముప్పై కిలోమీటర్ల దూరం లో వుంది. ఆ ఇంటిని అద్దెకి ఇచ్చారు కూడా. నెలకి మూడు వేలు అద్దె వచ్చే ఆ ఇంటిని అమ్మేదాం అని శివరావు ఎన్నోసార్లు అనటం, భార్య గౌరి వద్దని వారించటం వీరి సంభాషణ పిల్లలు వినటం ఒక ఆనవాయితీ గా మారింది.

హైదరాబాద్ నగరం చుట్టుపక్కల భూముల, ఇళ్ళ స్థలాల ధరలు బాగా పెరిగినప్పటికీ , దురదృష్టం వెంటాడుతూ వుండటం తో శివరావు ఇంటి ధర మాత్రం అతని జీతం లా కుంటుకుంటూ నామ మాత్రంగా పెరుగుతోంది.

వీణ ఇంజనీరింగ్ డిగ్రీ పాస్ అయి ఒక మంచి సాఫ్ట్ వేర్ కంపనీ లో ఉద్యోగం సంపాదించింది. గంధర్వ్ ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. వీణ ఉద్యోగం లో చేరి ఏడాది దాటింది. నాన్నా! నా ప్రొబేషన్ పీరియడ్ అయిపొయింది. ఇక నా ఉద్యోగం స్థిరపడినట్టే. నేను బ్యాంకు లో హౌసింగ్ లోన్ కి అప్లై చేస్తాను. “ అంది వీణ.          “ నువ్వు బ్యాంకు లోన్ తీసుకుని ఇల్లు కొన్నా , నీ పెళ్లి తరవాత మేము నీ ఇంట్లో ఉండము కదమ్మా ! పెళ్ళయ్యాక ఎలాగూ ఒకవేళ అవసరం అయితే అప్పుడు నువ్వు మీ ఆయన కలిసి బ్యాంకు లోన్ పెట్టుకుంటారు. కాబట్టి డబ్బులు దాచుకుని ఏ బంగారమో కొనుక్కో. నీకోసం మావల్ల వీలయినంత బంగారం ఇప్పటికే కొనిపెట్టాం  “ అన్నాడు శివరావు.

మరో ఏడాది గడిచింది. గంధర్వ్ ఇంటర్ పాస్ అయ్యాడు. ఇంజనీరింగ్ కాలేజీ లో సీట్ వచ్చింది. ఆ ఇంజనీరింగ్  కాలేజీ హైదరాబాద్ నగరం పొలిమేర లో వున్న శివరావ్ సొంత ఇంటికి మూడు కిలోమీటర్ల దూరం లో వుంది. మొదటి ఏడాది గంధర్వ్ కాలేజీ బస్సు లో వెళ్ళేవాడు. ఏడాది తిరిగే సరికి వీణకి పెళ్లి అయ్యి, అత్తవారింటికి వెళ్ళింది. శివరావు మరో నాలుగేళ్ళలో రిటైర్ అవుతాడు. మూడేళ్ళలో గంధర్వ్ చదువు పూర్తి అవుతుంది. రోజూ కాలేజీ కి బస్సు లో వెళ్లి రావటం తో గంధర్వ్ కి నాలుగు గంటల సమయం వృధా అవుతోంది.

“ మనం మన సొంత ఇంటికి మారిపోదాం. నాకు ఇంకా నాలుగేళ్ళు సర్వీస్ వుంది. నేను రోజూ ఆర్ టీ సి బస్సులో ఆఫీస్ కి వెళ్లి వస్తాను. గంటన్నర ప్రయాణం.  మహా అయితే రాను, పోను మూడు గంటల ప్రయాణం అవుతుంది. మనం మాన ఇంటికి మారిపోతే గంధర్వ్ కి కాలేజీ బాగా దగ్గిర అవుతుంది. వాడికి రోజూ నాలుగు గంటల బస్సు ప్రయాణం తప్పుతుంది. దానితో రోజుకి కనీసం మూడు గంటలయినా వాడు అదనం గా చదువుకోవటానికి వీలవుతుంది. నువ్వు అక్కడే ఎదో ఒక ప్రైవేటు స్కూల్ లో టీచర్ గా చేరవచ్చు. గత నాలుగేళ్ళలో మన ఇంటి చుట్టుపక్కల కొన్ని కొత్త కాలనీలు వచ్చాయి. అక్కడా కొన్ని మంచి ప్రైవేటు స్కూల్స్ వుంటాయి. నీకు టీచర్ ఉద్యోగం రాకపోదు.  “ అన్నాడు శివరావు.

అంగీకారం గా తలూపింది గౌరి.

“ మనలాంటి మధ్య తరగతి మనుషులకి హైదరాబద్ మహా నగరం లో  డబల్ బెడ్ రూమ్ ఫ్లాట్స్ ఎప్పటికైనా అందని ద్రాక్షలే!” అన్నాడు శివరావు.      

డాక్టర్. బీ. యన్. వీ. పార్ధసారధి

No comments:

Post a Comment

Pages