పుణ్యవతి - 10వ భాగం - అచ్చంగా తెలుగు

పుణ్యవతి - 10వ భాగం

Share This

పుణ్యవతి - 10

 గొర్తి వెంకట సోమనాథ శాస్త్రి(సోమసుధ)





@@@@@@@@@
(రవి ఇంటికి వచ్చిన సృజనకు అతనికి జ్వరం వచ్చిందని తెలుస్తుంది. అంతేగాక, తన తండ్రి అతనికి ఉదయమే మందులు తెచ్చిపెట్టినట్లు తెలుస్తుంది. అతని గదిలో చిత్రలేఖనం బొమ్మలను చూసి వాటి విషయం అడుగుతుంది. రవి తన స్నేహితుడు ఉత్తంరాజు గురించి ఆమెకు చెబుతాడు. అతనికి తన కృతజ్ఞతలు చెప్పమన్న ఆమెకు తను ఆత్మహత్య చేసుకున్నట్లు రవి చెబుతాడు. తరువాత. . . .)
@@@@@@@@

అతను తిరిగి మంచం మీద నుంచి లేచి కిటికీ వద్దకెళ్ళాడు. "వాడు ఆత్మహత్య చేసుకొన్నాడన్నారు" చెబుతున్న రవి గొంతు బాధతో బొంగురుపోయింది.

"అరె! ఏమైంది?"

"వాడు కాలేజీలో ఒక అమ్మాయిని గాఢంగా ప్రేమించాడు. కానీ ఆ అమ్మాయికి వాడంటే ఇష్టం లేదు. డబ్బున్నవాళ్ళంటే దానికి పిచ్చి. ఆమె బలహీనతకి డబ్బున్న ఒక కుర్రాడు ఎర వేసాడు. ఒక రోజు తన నలుగురి మిత్రులతో కలిసి ఆమెను పిక్నిక్కుకి తీసుకెళ్ళి, కబళించాలని ధనికుల కుర్రాడు ప్రణాళిక వేసుకున్నాడు. అనుకోకుండా వారి మాటలు విన్న నా మిత్రుడు ఆ అమ్మాయిని పిక్నిక్కుకి వెళ్ళొద్దని, వాళ్ళ ఎత్తుగడను ఆమెకు చెప్పాడు. ప్రేమ మైకంలో పూర్తిగా మునిగిపోయిన ఆ అమ్మాయి, నా మిత్రుడి మాటలు వినలేదు సరికదా, తన మంచి కోరి అతను చెప్పిన విషయాన్ని వాళ్ళకు చెప్పేసింది. నాలుగు రోజుల తరువాత కృష్ణానది గట్టున వాడి శవం, వాడి జేబులో భగ్నప్రేమతో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు చెప్పే ఉత్తరం దొరికాయి. జరిగింది ఆత్మహత్య కాదని, ఆ ఉత్తరంలో చేతివ్రాత మా వాడిదే కాదని వాడి మిత్రులైన మాకు తెలుసు. కానీ కొండలాంటి ఆ ధనికుడి కొడుకుని గాని, తిమ్మిని బెమ్మిని జేసే పోలీసు జులుంని కానీ ఢీకొట్టే శక్తి మాకు లేదు. మంచి చిత్రకారుడిగా పేరులోకి రావలసిన ఉత్తమ రాజు, మా ఉత్తంరాజు అలా అనామకుడిగా కృష్ణలో కలిసిపోయాడు."

"ఇప్పుడా అమ్మాయి ఎక్కడ ఉంది? ఎలా ఉంది?" సృజన అడిగింది.

"గో టూ హెల్!"

అప్రయత్నంగా రవి అరిచిన అరుపుకి ఆమె త్రుళ్ళిపడింది. పట్టుకున్న కిటికీ ఊచలను బలంగా నలిపేస్తూ ఆవేశంగా వణికిపోయాడతను. కొద్ది క్షణాల తరువాత ఆవేశాన్ని అదుపు జేసుకొని వచ్చి మంచంపై కూర్చుంటూ, "క్షమించండి!" అన్నాడు.

"ఆడపిల్లను చూడగానే సమాజానికి ఎంతో సానుభూతి కలుగుతుంది. ఆమె రూపాన్ని చూసి అమాయకురాలు అనుకుంటారు. దాన్ని కొంతమంది ఆడవాళ్ళు సొమ్ము చేసుకుంటారు. అందుకే ఆడది చెప్పే కన్నీటి కథలను మీ మగవాళ్ళు నమ్మినట్లు మా ఆడవాళ్ళం నమ్మం. కానీ మీ మిత్రుడు ప్రేమించిన వ్యక్తి మాత్రం ఖచ్చితంగా అమాయకురాలే! అంతేకాదు మూర్ఖురాలు కూడా! అభిమానంతో తన మంచిని కోరి ఇచ్చిన మీ మిత్రుడి సలహాను వినలేదు సరి కదా, తనకు హాని చేయాలనుకున్న వాడికే ఆ విషయాన్ని చెప్పింది. మీ వాణ్ణి తప్పించాక, వాళ్ళు పబ్బం గడుపుకొనే ఉంటారు. ఇప్పుడు ఆ అమ్మాయి ఎక్కడో జీవచ్ఛవంలా బతుకుతూండవచ్చు. కానీ చనిపోయిన మీ మిత్రుడు మాత్రం మీలో 'ఆవేశం'గా బ్రతికే ఉన్నాడు" అందామె.

వెంటనే ఏదో గుర్తుకొచ్చినట్లు చేతివాచీని చూసుకొని, "వచ్చి చాలాసేపయింది. నాన్న వస్తారేమో. వస్తా" నంటూ సృజన బయటకు పరిగెత్తింది.

"సృజనా!"

రవి పిలుపుకి పరిగెడుతున్న ఆమె మనసుకి పగ్గం వేసి వెనక్కి లాగినట్లు ఆగిపోయింది. అప్రయత్నంగా ఆమె గుండెలో తీయని స్పందన, అంధకారమైన తన బ్రతుకులో ఎక్కడో చిగురువేసే తెలియని ఆశ. వెనక్కి తిరిగి తలెత్తి చూసిన ఆమె కళ్ళలో వెలుగుకి రవి గుండె ఝల్లుమంది.

"సారీ! చనువుగా ఏకవచనంలో పిలిచాను!" రవి క్షమాపణ.

"మీ కన్నా వయసులో చిన్నదాన్ని. అలా పిలవటంలో తప్పేమీ లేదు" సిగ్గుపడుతూ తలవంచి చెప్పిందామె.

ఇద్దరి మధ్య కొద్ది క్షణాలు మౌనం.

"మీ అక్కయ్య సుధగారు వ్రాసిన కవితలు ఇస్తారా? మరేం లేదు. లోకం ఆమెను త్వరగా పంపించేసినా, ఆమె భావాలు లోకానికి అవసరం అవుతాయేమో! వాటిని అచ్చేయించి, సుధగారి ప్రతిభను కొద్దిమందైనా గ్రహించేలా చేయాలని నాకు అనిపించింది."

రవి మాటలకు సరేనని తలూపి, తడబడే అడుగులతో తన ఇంటి వైపు కదిలింది సృజన.

"సృజనా!"

రవి పిలుపులోని మార్దవానికి మనసులో కలిగిన ఉద్వేగాన్ని తట్టుకోలేక, మంచం మీద బోర్లాపడి ఏడ్చేసింది సృజన. కొంతసేపయ్యాక మనసుని సంబాళించుకొని, లేచి పెరట్లోకెళ్ళి ముఖం కడుక్కొంది. తరువాత పెట్టెల్లో ఎక్కడెక్కడో పడి ఉన్న సుధ కవితల పుస్తకాలను వెతకటం ప్రారంభించింది.

ఇక్కడ రవి తన గదిలో పచార్లు ప్రారంభించాడు. అప్రయత్నంగా తను పిలిచిన పిలుపుకి ఆమె కళ్ళలో కనిపించిన వెలుగు, అతని కవి హృదయంలో సంచలనం రేపింది. ఒక కన్నెపిల్ల కళ్ళల్లో ఎంత శక్తి ఉంటుందో తొలిసారిగా అతనికి కనిపించింది. తన పిలుపుకి ఆమెలో కలిగిన సంచలనానికి చక్కని అక్షర రూపమిస్తే? . . . ఊహ వచ్చినదే తడవుగా కాగితం, కలం అందుకున్నాడు. అతనిలో భావావేశం అక్షరాలుగా బయటకు దూకింది.

"అన్నంత పని చేసెనమ్మా! నేడు కంటినీళ్ళతో కట్టె పందిరి!
నేల తోడుగా నింగి ఆడగా - కన్నెమనసులో కలలు పాడగా-
అన్నంత పని చేసెనమ్మా! నేడు కంటినీళ్ళతో కట్టె పందిరి!

కొండకొమ్మున కోన లోపల రాగ విరులను కొప్పున తురిమి
నిండుజాబిలి పండువెన్నెల పట్టి తెచ్చి తన మోమున కద్ది-
అన్నంత పని చేసెనమ్మా! నేడు కంటినీళ్ళతో కట్టె పందిరి!

లోయ లోపల చెంగలించెడు వాగు ప్రేమతో విరగబూసిన
మధురసమలరే మల్లె పందిరి - ఏమి అడుగునో తాను పుల్లరి?
అన్నంత పని చేసెనమ్మా! నేడు కంటినీళ్ళతో కట్టె పందిరి! "

వ్రాసిన పుస్తకం మూసి తలెత్తిన రవికి బల్లపై ఫ్లాస్కు కనిపించింది. దీన్ని తరచుగా తన ఇంటికి వచ్చిపోయే రంగనాధంగారు చూస్తే, కొంపలు అంటుకుంటాయి. ఆలోచన వచ్చినదే తడవుగా ఫ్లాస్కులోని బార్లీ నీళ్ళు వేరే గిన్నెలో పోసుకొని, ఖాళీ ఫ్లాస్కుతో పరుగులాంటి నడకతో సృజన ఇంటి వైపెళ్ళాడు.

"సృజనగారూ!" రవి గొంతు విని ఆమె ఉలిక్కిపడింది.

ఈ పెద్దమనిషికి తన ఇంటికి వచ్చి పిలిచే ధైర్యం ఎలా వచ్చింది? గంట క్రితం తాను అతని ఇంటికి వెళ్ళటం వల్ల తెగించాడా? అతను ఇల్లు కావాలని అడిగినప్పుడు తన తండ్రి మాటలు ఆమెకి గుర్తుకొచ్చాయి.

"నీ మీద నమ్మకం ఉందయ్యా! మా అమ్మాయి మీదే నమ్మకం లేదు!"

'నిజమే! తండ్రి చెప్పినట్లే తాను చిన్న కుప్పిగంతు వేసింది. రవి తమ ఇంటి గుమ్మంలో ఉండగా నాన్న వస్తే? తను అతని ఇంటికి వెళ్ళిన విషయాన్ని రవి చెప్పేస్తే? కొంపలంటుకోవూ?' పరుగులాంటి నడకతో బయటకు వచ్చిందామె.

"ఏమిటండీ! ఏమిటిలా వచ్చారు?" కంగారుగా అడిగిందామె.

"మీ ఫ్లాస్కు ఇచ్చి వెడదామని" రవి చెప్పాడు.

"బార్లీ నీళ్ళూ?"

"వేరే గిన్నెలో పోసుకున్నా!"

"అదేం?"

"ఏమి లేదండీ! మీ నాన్నగారు తరచుగా నా ఇంటికి వస్తున్నారు. వారు దీన్ని నా ఇంట్లో చూస్తే గొడవ పెట్టవచ్చు. అందుకే తెచ్చి ఇచ్చేస్తున్నా!"

"అంతేనా? మన స్నేహం పెరుగుతుందని భయపడుతున్నారా?" కళ్ళు అదోలా తిప్పుతూ అడిగిందామె.

"మన స్నేహం పెరగాలనే ఫ్లాస్కు ఇచ్చేస్తున్నా!" అని రవి తన ఇంటివైపు నడిచాడు.

రవి మాటలకు సృజన మనసు ఉప్పొంగిపోయింది. అంతలోనే దూరంగా రోడ్డుపై రంగనాధం వస్తూ కనిపించి, ఆమె గుండె ఝల్లుమంది. "రవి వెళ్ళటం ఒక్క నిమిషం ఆలస్యమై ఉంటే ఎంత గొడవయ్యేదో?" అనుకుంటూ చేతిలోని ఫ్లాస్కుతో ఇంటిలోకి పరుగు తీసిందామె.
@@@@@

ఉదయాన్నే హోటల్లో టిఫిన్ తిని ఇంటికి వచ్చాడు రవి. సృజన ఇంట్లో జరుగుతున్న హడావిడిని గమనించిన అతనికి గుండె ఝల్లుమంది.

(ఇంకా ఉంది) 

No comments:

Post a Comment

Pages