మిస్టర్ పెర్ఫెక్ట్ - అచ్చంగా తెలుగు

 మిస్టర్ పెర్ఫెక్ట్

- శ్యాంప్రసాద్ రెడ్డి కోర్శిపాటి

9550463236.


 

కాంట్రాక్టర్ సుబ్బారెడ్డికి ఓ కాంట్రాక్ట్ వచ్చింది. ఆ వర్క్ ప్రారంభించటానికి ఓ మంచి ముహూర్తం చూసుకున్నాడు. ముందురోజు మేస్త్రి దగ్గరకెళ్ళాడు. “ఇదిగో సుబ్రమణ్యవా! రేప్పొద్దన వర్కు మొదలుబెట్టాల. MLA, డీఈ గారూ ఇంకా కొందరు ఆఫీసర్లు, ఊళ్లోవాళ్ళు అందరూ వస్తా ఉండారు. అదిగో ఆ టిఫినంగడి శీనడ్ని టిఫిను బంపీమన్నా. నువ్వుగూడా ఓ 20 ఇటికిరాళ్ళు, ఒక అర బస్తా సిమెంటు, ఒక అర బస్తా ఇసక, బిందెడు నీళ్ళు, అయి పోసుకునేదానికి మగ్గు, మూలమట్టం, కర్ర, తూగుగుండు, టకార అన్నీ రెడీ జేసి ఉంచు. ఇదిగో నువ్వు తేవాల్సిన వస్తువుల లిస్టు. నేను పొద్దన్నే 7 గంటలకి వస్తా” అంటూ ఒక లిస్టు రాసి మేస్త్రికిచ్చివచ్చాడు. వచ్చినకాడ్నించి అందరికీ ఫోన్లో పనులు పురమాయించడం, ఎవరికేం చెప్పాలో చెప్పడం అంతా హడావుడిగా గడిచిపోయింది. పొద్దున్నే లేవాలిగా? పెందలాడ్నే పడుకున్నాడు.


కాంట్రాక్టర్ సుబ్బారెడ్డి వ్యక్తి మంచివాడే. అపకారి కాదు. కాకపోతే బీభత్సమైన పెర్ఫెక్షనిస్టు. ఏదైనా సరే పక్కా ప్లానింగ్ తో చెయ్యాలనే రకం. అదే సమయంలో కొంచెం మాట తొందర. ఇంట్లోవాళ్ళు, పనివాళ్ళు, స్నేహితులు, బంధువులు చేసే చిన్న చిన్న తప్పులక్కూడా తీవ్రంగా స్పందించి, ఎంతమంది ఉంటే అంతమందిలో ఎంతమాటంటే అంత మాట అనేసి వాళ్ళ పరువు తీసేస్తుంటాడు. తప్పు తమవైపే ఉండడంతో సుబ్బారెడ్డిని ఏమీ అనలేక వాళ్ళు లోపల్లోపలే బాధపడుతూ ఉంటారు. తను చాలా పర్ఫెక్ట్ అని ఫీలవడం, అందరూ అలా అనుకుంటూ ఉంటే, తన పెర్ఫెక్షనిజాన్ని చూసి హడలిపోతూ ఉంటే ఆయనకు మహదానందామని, అదోరకం శాడిజమని కొందరు బంధువులు, స్నేహితులు చాటుమాటు మాటల్లో అనుకుంటూ ఉంటారు.


రాత్రి పెందలాడే పడుకున్న సుబ్బారెడ్డి, పొద్దున్నే అనుకున్న టయానికి నిద్ర లేచాడు. వెంటనే చకచకా తయారై తను పనులు, వస్తువులు పురమాయించిన వాళ్లకందరికీ ఫోన్లు చేసి వాళ్ళు అవన్నీ సమకూర్చుకున్నారా లేదా, బయల్దేరారా లేదా అని ఆరా తీస్తున్నాడు. మధ్యలో ఏదో విషయానికి భార్య, పిల్లలపై ఓ రెండుసార్లు కేకలేశాడు. తను రాసుకున్న లిస్టు ప్రకారం తను తీసుకెళ్ళాల్సిన వస్తువులన్నీ కారులో పెట్టుకున్నానా లేదా అని ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకుని, కొడుకుని తొందరగా రమ్మని కేకేసి కారెక్కాడు. నాన్న సంగతి తెలిసిన కొడుకు గనుక ఉరుకులుపరుగులమీదొచ్చి కారెక్కాడు.


కారు స్పాటుకి చేరుకోగానే కారు దిగుతూ కూలీలని కారులోని వస్తువులు దించమని చెబుతూ రిష్టు వాచీలో టైము చూసుకున్నాడు సుబ్బారెడ్డి. ఒక్క నిముషం కూడా అటూఇటూ కాకుండా.... సరిగ్గా 7 గంటలు. సుబ్బారెడ్డి ముఖంపై కనిపించీ కనిపించకుండా గర్వంతో కూడిన సన్నని చిరునవ్వు అలా వచ్చి ఇలా మాయమైంది.


సుబ్బారెడ్డి నేరుగా సుబ్రమణ్యం దగ్గరకెళ్ళాడు. “ఏం సుబ్రమణ్యం నేను చెప్పిన వస్తువులన్నీ తెచ్చావా?” అని అడిగాడు. “తెచ్చానయ్యా” అంటూ ఓ నీళ్లున్న ప్లాస్టిక్ బిందె, మరో మూడు మూటలు చూపించాడు. ఓకే... అని మిగతా రావాల్సిన వాళ్లకి ఫోన్లు చెయ్యడంలో మునిగిపోయాడు కాంట్రాక్టర్ రెడ్డి. ఇంతలో రావాల్సిన వాళ్ళు ఒక్కొక్కరే రావటం మొదలైంది. ఇంకొందరు ఇంకా దారిలో ఉన్నారు. “నీయమ్మా భడవా ఎప్పుడ్రా నువ్వొచ్చేదా? తొందరగా రారా పనికిమాలిన ఎదవా” ఇలా రానివాళ్ళని ఫోన్లో తిడుతూ అటూ ఇటూ తిరుగుతున్నాడు రెడ్డి. ఇంతలో టిఫినంగడి శీనయ్య చట్నీలోకి గరిటె తేలేదని తెలిసి “ఏమేం తేవాలో అన్నీ ఒకటికి రెండుసార్లు చెప్పానుగదరా పనికిమాలినోడా.....” అంటూ శీనయ్యపై ఇంతెత్తునెగిరాడు. శీనయ్యకి అందరి ముందూ ఇబ్బందిగా అనిపించింది. “ఎట్నోఒకట్ట చేస్తాలే రెడ్డా....” అంటూ కళ్ళనీళ్ళు పెట్టుకున్నంత పనిచేశాడు శీనయ్య. ఇదంతా మేస్త్రి సుబ్రమణ్యం మౌనంగా చూస్తూ ఉన్నాడు.


ఇంతలో డిపార్ట్మెంట్ ఆఫీసర్లు, ఆ వెనుకే డీఈగారూ వచ్చారు. ఇంకా ఎమ్మెల్యే రాలా. అనుకున్న ముహూర్తం టైం అయిపోతావుంది. సుబ్బారెడ్డి కాలుగాలిన పిల్లిలాగా అటూ ఇటూ తిరుగుతున్నాడు. ఇంతలో ఎమ్మెల్యే వచ్చాడు. కోలాహలం ప్రారంభమైంది. రాగానే తొందరగా కానీమన్నట్టు సుబ్బారెడ్డి వైపు చూశాడు ఎమ్మెల్యే. మేస్త్రి సుబ్రమణ్యం వైపు చూశాడు రెడ్డి. సుబ్రమణ్యం ఒక బస్తాలో నుంచి కొన్ని ఇటుకలు బయటకు తీశాడు. ఆ రాళ్ళు ఒక దగ్గర పేర్చాడు. ఒక టకారా తీశాడు. అందులో కొంత ఇసుక, సిమెంటు వేశాడు. బిందెలో నీళ్ళు మగ్గులోకి వంచి అందులో పోశాడు. ఇప్పుడు దాన్ని తాపీతో కలపాలి. కానీ సుబ్రమణ్యం మౌనంగా నిలబడి రెడ్డి వైపు చూస్తున్నాడు. “ఊ... తాపీతో కలుపు” కొంచెం గదమాయించినట్టే చెప్పాడు రెడ్డి. “తాపీ తేలేదయ్యా” సుబ్రమణ్యం గొంతులో అదే వినయం. “ఏం ఎందుకు తేలేదు?” ఇప్పుడు రెడ్డి గొంతులో కోపం స్పష్టంగా ధ్వనిస్తోంది. “నువ్వు రాసిచ్చిన లిస్టులో తాపీ లేదు రెడ్డా” తాపీగా సమాధానం చెప్పాడు మేస్త్రి సుబ్రమణ్యం. కాంట్రాక్టర్ రెడ్డికి కోపమొస్తోంది. కానీ ఏమీ అనలేడు. తనే వస్తువులేమేం కావాలో లిష్టు రాసిచ్చాడు. అన్నట్టే తను లిష్టులో తాపీ రాయలేదు. “ఏం సుబ్బారెడ్డా లేటా?” అంటున్నాడు ఎమ్మల్యే. ఏం చెయ్యాలో తెలీదు. ఎవ్వర్నీ ఏమీ అనలేడు. సుబ్బారెడ్డి నలిగిపోతున్నాడు. ముఖంలో నెత్తుటి చుక్క లేదు.


చుట్టూ ఉన్నవాళ్ళకి ఇప్పుడిప్పుడే విషయం అర్థమై గుసగుసలు, ముఖాలలో ముసిముసి నవ్వులు మొదలయ్యాయి టిఫినంగడి శీనయ్యతో సహా. అలా నవ్వుతూ శీనయ్య సుబ్రమణ్యం వైపు చూశాడు. సుబ్రమణ్యం అప్పటికే శీనయ్యను చూస్తున్నాడు. సుబ్రమణ్యం ముఖంలో కూడా కనిపించీ కనిపించనట్టుగా ఓ సన్నని చిరునవ్వు. అచ్చు ఇందాక కారు దిగొస్తూ రెడ్డి నవ్వినట్టే .... గర్వంతో కూడిన చిరునవ్వు. ఎన్నాళ్ళనుంచి కడుపులో ఉందో... ఇప్పుడు వెలికి వస్తోంది... గుట్టుగా.... గుంభనంగా.....

                                                      ***

No comments:

Post a Comment

Pages