బసవ పురాణం -22 - అచ్చంగా తెలుగు
పురాణ కధలు
బసవ పురాణం -22 
                                                                                                 పి.యస్.యమ్. లక్ష్మి


22.  హలాయుధుని కధ
సిరియాలుడిని తీసుకుని శివుడు జంగమ దేవర వేషంలో హలాయుధ పురం వెళ్ళాడని చెప్పాను కదా.  వీరిని దూరంనుంచి చూసి హలాయుధుడు వీరి కెదురొచ్చి, తమ ఇంటికి తీసుకుపోయి అన్ని పరిచర్యలు కావించి, భోజనం పెట్టి, అప్పుడు నెమ్మదిగా అడగ సాగాడు.  “హర మూర్తులారా (అతిధులను దైవ స్వరూపులుగా భావించే రోజులవి) మీరెక్కడినుంచి ఇక్కడికి వచ్చారు.  నా గృహం పావనం చెయ్యటానికే ఇక్కడికి వచ్చారా.  భగవత్స్వరూపులయిన మిమ్మల్ని చూసి నాకు చాలా సంతోషం వేసింది.  నా పూజలందుకుంటూ ఇక్కడే కొంత కాలం వుండండి” అని వేడుకున్నాడు.  

దానికి శివుడు “భక్తాగ్రేసరా, మా వంటి జంగమాలను మీ  వంటి గృహస్తులే కదా సర్వదా నిర్వహించేది.  మేము ఒకే చోట వుండే వాళ్ళం కాదు.   భక్తుల పూజలందుకొనుచు అన్ని ఊళ్ళల్లో వున్న శివ వ్రత ధురీణులను నిరీక్షిస్తూ వుంటాము.  భక్తులెక్కడ వున్నా వెదికి వారిండ్లకు పోతూ వుంటాము.  వాళ్ళు కూడా మమ్మల్ని వారి ప్రాణ లింగంబులని భావిస్తూ వుంటారు.  మమ్మెరుగని వారుండరు.  మేము జన్మించినది నిరాలంబపురము.  మా జననీ జనకులెవరో మీకు తెలియదు.  మమ్మల్ని ముందునుంచి పెంచి పెద్ద చేసింది మీవంటి భక్తులే.  అంతదాకా ఎందుకు.  మొన్నీ మధ్యనే సిరియాలుశెట్టి  అతిధి అతని పుత్రుని మాంసాన్ని విందులో కోరాడు. అతడలాగే చేయగా శివుడాతనిని మరల బ్రతికించి పురజనులందరితో కైలాసం తీసుకెళ్ళాడు కదా.  అప్పుడు మేమక్కడే వుండి మా కళ్ళారా చూశాము”.  అని చెప్తూ  వుండగా హలాయుధుడి ఏమీ తెలియనివాడివలే  “ఏమిటి సిరాయాలుడుని శివుడు జంగమ రూపమున వచ్చి నీ కొడుకుని చంపి ఆమాంసాన్ని మాకు పెట్టమని నిజంగా కోరాడా?” అని అడిగాడు.  దానికి శివుడు “అవును..  ఈ కధ ఏదో మేమెక్కడో విన్నది కాదు.  ఆ సమయంలో మేమక్కడే వుండి చూశాము.  ఇంకా నీకు నమ్మకం కుదరక పోతే దీనికి అనేక సాక్ష్యాలు వున్నాయి.  కవులు ఈ సిరియాలు చరిత్రని వ్రాశారు.  నాటకాలుగా ప్రదర్శిస్తున్నారు.  గొర్రెల కాపర్ల ఆటవిడుపు సమయంలో, మహిళల పని పాటల్లో ఈ కధ గానం జరుగుతోంది” అని నమ్మబలుకుతున్నాడు.

హలాయుధుడు చాలా కోపంతో  “ఆహా, ఏమి ఆశ్చర్యకరమగు గాధ వింటిని.  రాక్షసులు తినే మనుష్య మాంసాన్ని శివుడు తినగోరాడా?  కోరాడే అనుకో.  దయా విహీనుడై యముడిలాగా కొడుకుని చంపాలని అతనికి బుధ్ధి ఎలా పుట్టింది?  పుట్టిందే అనుకో!  తల్లి కూడా ఎలా అందుకొప్పుకుంది?  తన కుమారుడైనంత మాత్రాన చంపటానికి అతనికి స్వతంత్ర్యమెక్కడ వుంది?  ఆత్మ హత్య చేసుకుంటేనే ఎంతో పాపం కదా! మరి ఇంకో ప్రాణిని చంపితే!!  అయినా శివుడు నర మాంసం కోరాడుగానీ కొడుకుని చంపి పెట్టమని అడగలేదు కదా.  మరి తన శరీరంలో కొంత కండ కోసి పెట్టవచ్చుకదా.  కొడుకు శరీరం కన్నా తమ శరీరం ఎక్కువా!?  కనికరము లేక, పాప భీతి రవ్వంత లేక కొడుకుని చంపిన వాని భక్తి ఎంత?  అలాంటి మూఢ భక్తిని పరీక్షింపబోయిన ఆ మూఢ దైవము యొక్క దైవత్వమెంత??  అట్టి ఘోర కృత్యాన్ని ఆచరించిన ఆ శివునికి, సిరియాలుడికి, ప్రమధ గణానికి వెలి” అని అందరికీ చాటింపు చేయించాడు.

సిరియాలుడు అతని కోపం చూసి భయపడ్డాడు.  కానీ అతను “మీరు జంగమ రూపంలో వచ్చారు కనుక మిమ్మల్ని మన్నిస్తున్నాను. లేకపోతో మీరు కూడా దండనార్హులే” అంటూ ఇంకా “శివుడు రాక్షసులచే పూజింపబడుతున్నాడు గనుక రాక్షసత్వము సిధ్ధించెను.  దేవత్వమెట్లు నిల్చును? అందుకే సిరియాలుడిచే అట్లాటి పని చేయించాడు” అని కోపంతో అనేక దుర్భాషలాడుతుండగా శివుడు, సిరియాలుడు ఏమీ మాట్లాడలేక చిన్నబోయిన ముఖాలతో, హలాయుధుని  శాంతింప చేయలేక ఒక మూల ఒదిగి కూర్చున్నారు.  శివుడు శ్యామలా దేవిని తలుచుకున్నాడు.

శ్యామలాదేవి ఒక పేద ముత్తైదువయగు జంగమ భక్తురాలి రూపంలో వచ్చింది.  హలాయుధుడామెని లోపలకి తీసుకు పోయి సత్కరించాడు.  ఆమె హలాయుధుని పొగుడుతూ, నీవు జంగమ భక్తులకు ఏది కోరితో అదిస్తావని ప్రతీతి లోకంలో వుంది.  అది విని ఇలా వచ్చాను.  అనగా హలాయుధుడు సిగ్గుతో లోకంలో వున్న భక్తులలో అధమాధముడను అనగా శ్యామలా దేవి తనెవరో తెలియజేసి నువ్వు పరమ భక్తుడవు గనుకే నేను నీకు దర్శన మిచ్చాను.  అని అతనిని ఆశీర్వదించి అందరి విషయము తెలిపెను.  ఈ ఫాలాక్షుడు మీ ధృఢ భక్తుకి మెచ్చి, నీకు లొంగి, నీతో ఓడితిమని సిగ్గుపడి మాటాడలేక నన్ను తలచుకొనగా నేను వచ్చాను.  

హలాయుధుడు సిగ్గుతో తల వంచుకుని శివుని అనేక విధముల పొగిడి, “నన్ను మాయ చేసి భ్రమ పెట్టి లేనిపోని కారు కూతలు నాచే కూయించి,  పైగా నేను చెందవలసిన లజ్జా భావముతో ఏమీ ఎరుగని వానివలె నిల్చుంటివా!?  పైగా మా అమ్మని కూడా రప్పించావు.  అయినా నాదే పొరపాటు. ఆవిడ ఎక్కడో వున్నదనుకోనేల!  నీ అర్ధాంగి కదా. సదా నీతోనే వుంటుంది.  నువ్వు ముందే నీ నిజ స్వరూపంతో కనిపించిన నేనీ దుర్భాషలాడేవాడిని కాదు కదా.   లేకపోతే నా మూఢత్వం లోకానికి ఎలా తెలుస్తుంది  అదీకాక భక్తుల అహంకారాన్ని అణగదొక్కటానికి ఇలాంటి వేడుకలకు నువ్వు పూనుకుంటావు..  ఇంక చాలు నీనిజ రూప దర్శనమిమ్ము” అని కోరాడు.  తనకి ప్రణమిల్లుతున్న సిరియాలుడిని లేవనెత్తి, నీవంటి భక్తుడు ముల్లోకములలో లేడు.  నీవట్లునుకొనుటకు తగిన వాడవే.  అయినా మనమట్లా అనుకోవటం మన అహంభావాన్ని తెలియజేస్తుంది.  అహంకారము మాయ.  దాని జయించిన వాడె మాయను జయించినవాడు.  భక్తుల అహంకారమలాగే కొనసాగిస్తే భక్తవత్సలుడికి అవమానం.  అందుకే నిన్ను నా దగ్గరకు తీసుకు వచ్చి ఇలా మన ఇద్దరి అహంకారాన్నీ పోగొట్టాడా పరమ దయాళుడు.  

శివుడు పార్వతీ దేవితో సహా వారికి సాక్షాత్కరించి ఆ పురంలో వారందరికీ కైలాస ప్రాప్తి కలుగజేశాడు.  ఈ విధంగా సిరియాలుడి అహంభావం పోగొట్టటానికి హలాయుధుడి కధ కల్పించి ఆ జగన్నాటక సూత్రధారే కపట నాటకమాడాడు.  భక్తులకు అహంకారం కూడదని తెలియజేయటానికి. 

No comments:

Post a Comment

Pages