శ్రీరుద్రంలో విశేషాలు - 10 - అచ్చంగా తెలుగు

శ్రీరుద్రంలో విశేషాలు - 10

Share This
శ్రీరుద్రంలో విశేషాలు - 10 

శ్రీరామభట్ల ఆదిత్య 



వందే పావనమంబరాత్మవిభవం వందే మహేన్ద్రేశ్వరం
వందే భక్త జనాశ్రయామరతరుం వందే నతాభీష్టదమ్
వందే జహ్నుసుతామ్బికేశమనిశం వందే త్రిశూలాయుధం
వందే భక్త జనాశ్రయం చ వరదం వందే శివం శంకరమ్. 

పదకొండవ అనువాకం: 

"సహస్రాని సహస్రసోయే..." అనే మంత్రంతో ప్రారంభమయ్యే ఈ పదకొండవ అనువాకం నమకంలో చివరిది. ఈ అనువాకంలో భక్తుడు రుద్రుని గణాల గురించి చెప్తాడు. వారిని తనకు రక్షగా ఉంచమని, వారి నుండి తనకు ఎటువంటి హాని కలగకుండా చూడమని కోరుతాడు. ఈ అనువాకంలో 13 మంత్రాలున్నాయి. ఈ విశ్వంలో అనేకానేక శక్తిరూపాలలో రుద్రగణాలున్నాయని ఈ అనువాకంలో వివరించడం జరిగింది. ఈ అనువాకం తరువాత ప్రత్యేకంగా 7 మంత్రాలను చదువుతారు. అత్యంత శక్తివంతమైన 'మహామృత్యుంజయ మంత్రం' కూడా ఈ 7 మంత్రాలలో భాగంగా చదువుతారు. 

"హే పరమేశ్వరా! నీ గణాలలో వేల సంఖ్యలో, వేల రకాలైన, వేల ఆయుధాలు ధరించే వేలమంది గణాలను మా నుండి వేల యోజనాల దూరంలో ఉంచవయ్యా. నీ గణాలలోని కొంతమంది కంఠం ఒకవైపు నీలంగానూ, మరోవైపు తెల్లగానూ ఉంది. వారు స్వర్గాన్ని ఎప్పుడో అందుకున్నారు. నీ గణాలు చెట్లుగాను, లేతగడ్డిగాను మరియు వారి కంఠం నీలం రంగుగాను, శరీరం ఎర్రగానూ ఉంది. వారిలో చాలామంది సైనికనాయకులు, వారిలో కొందరికి పిలకులు ఉండగా మరికొందరికి జుట్టు లేదు. వీరందరి నుండి కాపాడు. 

నీ గణాలలో చాలాగణాలు శత్రువులను హింసిస్తాయి. శివభక్తులను ఇబ్బంది పెట్టేవారిని అవి ఇబ్బందులపాలు చేస్తాయి. ధరమార్గంలో నడిచేవారిని రక్షిస్తాయి. అవి అన్నార్థులకు భోజనం పెట్టేవారిని కాపాడుతాయి. రకరకాల ఆయుధాలు, కత్తులు పట్టుకునే నీ గణాలు పవిత్రజలాలను కాపాడతాయి. నీ గణాలు ఏ రూపంలో ఉన్నా, ఎక్కడున్నా, అన్ని దిశలలో ఉన్నా వారి నుండి నాకు హాని కలగకుండా, సదా మేలుకలిగేలా చూడా పరమేశా! 

భూమిపైనా, ఆకాశంలో, అన్ని లోకాలలో ఉండే నీ గణాలకునా నమస్కారం. ఏ గణాలకైతే గాలి, ఆహారమే ఆయుధముగా మారి జీవులను చంపివేయు శక్తి ఉంటుందో వారికి నేను నా పదివేళ్ళతో నమస్కరిస్తున్నాను. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణముఖుడనై వారికి నమస్కరిస్తున్నాను. ఊర్ధ్వముఖుడనై కూడా వారికి నమస్కరిస్తున్నాను. వారందరికీ నా విశేష నమస్కారాలు. వారందరూ నాకు సంతోషాన్ని ప్రసాదించుగాక." 

నమః శివాయ... 

అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. 

త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ౹
ఉర్వారుకమివ బంధనాన్మృత్యోర్ముక్షీయ మాఽమృతాత్ ॥ 

( ఇంకా ఉంది )

No comments:

Post a Comment

Pages