గోదావరీ తీరాన పుణ్యక్షేత్రాలు
- గొర్తి వేంకట సోమనాథ శాస్త్రి
భారతదేశంలో గంగానది తరువాత పేర్కొనదగ్గ పెద్ద జీవనది గోదావరి. ఇది మహారాష్ట్రలోని నాసిక్ సమీపంలో నున్న త్రయంబకంలో జన్మించి దక్కను పీఠభూమి హృదయసీమను పునీతం చేస్తూ సుమారు 1,465 కిలోమీటర్లు పయనించి తూర్పున గల బంగాళాఖాతంలో కలుస్తుంది. ఈ నది మహారాష్ట్ర, తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల దాహార్తిని తీర్పుతూ, తూర్పుగోదావరి జిల్లాలోని ధవళేస్వరం దగ్గర గౌతమీ, వశిష్ట పాయలుగా విడిపోతుంది. వీటిలో గౌతమీ గోదావరి యానాం దగ్గర, వశిష్ట గోదావరి అంతర్వేది వద్ద బంగాళాఖాతంలో కలుస్తాయి.
మనదేశంలో నదీతీరాలు నాదనిలయాలు. నిత్యం సంస్కృత మంత్రోచ్చారణతో సందడిచేస్తాయి. ఈ నదీతీరాల్లోనే అనేక ఆలయనిర్మాణాలు జరిగి “దేవళాల దేవిడి భారతమ్మ చల్లని ఒడి” అనిపిస్తాయి. గోదావరి నదీతీరప్రాంతం కూడా అనేక దేవాలయాల/పుణ్యక్షేత్రాలతో అలరిస్తుంటుంది. వాటిలో ముఖ్యమైన వాటిని గూర్చి తెలుసుకొందాం.
మహారాష్ట్ర :
త్రయంబకేశ్వరం:
“అంబకం” అంటే కన్ను. సూర్యుడు, చంద్రుడు, అగ్ని మూడు కన్నులుగా వెలసిన శివరూపానికి నెలవే త్రయంబకేశ్వరం. ఈ పున్యక్షేత్రంలోనే బ్రహ్మగిరి శిఖరంపై ఉద్భవించి రెండువేల అడుగుల ఎత్తునుంచి చెంగలించి తూర్పు దిక్కునకు ప్రవహించే పునీత గంగాధారాయే గోదావరి.
ఈ క్షేత్రంలో గల త్రయంబకేశ్వరాలయం భారతదేశంలోని ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటిగా ప్రసిద్ధిపొందినంది. ఇక్కడ లింగం బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల ముఖములను కలిగిన త్రిముఖలింగం. ఈ ఊరిని, ఆలయాన్ని పీష్వా వంశస్థుడైన నానాసాహెబ్ పీష్వా నిర్మించి అభివృద్ధి చేశాడు. శివునికి ప్రీతిపాత్రమైన ఆభరణం రుద్రాక్షమాల. ఈ ఆలయ సమీపములో అనేక రుద్రాక్ష వృక్షములు కలవు. ఇక్కడ గోదావరి నదిలో పితృదేవతలకు శ్రాద్ధకర్మలు చేసిన, వారికి మోక్షము సిద్ధించునని విశ్వసిస్తారు.
తెలంగాణా
- బాసర: ఆదిలాబాద్ జిల్లాలోని ముదోల్ మండలానికి చెందిన గ్రామమే బాసర.
పూర్వం వైకుంఠంలో గంగాదేవితో జరిగిన గొడవ కారణంగా సరస్వతీదేవి భూలోకంలో సరస్వతీనదిగా రూపాంతరం చెందిది. ఇక్కడ దేవిని దర్శించుకొందుకు బ్రహ్మాది దేవతలు, మునులు వచ్చివెళ్తుండేవారట. ఒకసారి అకస్మాత్తుగా ఆమె అంతర్ధానమైనది. వెంటనే దేవతలు, మునులు సరస్వతీ పునరావిర్భావం వేదవ్యాసుని వల్లే సాధ్యమని అతని వద్దకెల్లారు. వారు కోరినట్లుగానే వ్యాసుడు సరస్వతిని ప్రసన్నం చేసుకొని, ఆమె చెప్పినట్లుగా గౌతమీతీరాన ఉన్న సైకతం(యిసుక)తో సరస్వతీ విగ్రహాన్ని చేశాడు. అలా వ్యాసమహర్షి అమ్మను ప్రతిష్టించిన ప్రాంతమే తొలుత వ్యాసపురియై కాలగతిలో వ్యాసర, బాసరగా మారింది. బాసరలో కొలువై ఉన్నది జ్ఞానసరస్వతి అయినందున పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తారు. ఇందుకు వసంతపంచమి, అక్షయతృతీయ మంచివని చెబుతారు. ఇక్కడ దసరా రోజులలో ఉత్సవాలను కన్నులపండుగగా చేస్తారు. ఈ క్షేత్రంలో ప్రధానదేవాలయానికి తూర్పుభాగాన మేడిచెట్టు నీడలో దత్తమందిరం, పశ్చిమభాగాన మహంకాళీ దేవాలయం, దక్షిణభాగాన శ్రీవ్యాస మందిరం ఉన్నాయి.
- భద్రాచలం:
ఖమ్మం జిల్లాలో గోదావరి నది దక్షిణతీరాన ఉన్న పట్టణమే భద్రాచలం.
పూర్వం భద్రుడనే భక్తుడు తపస్సుచేసి తను కొండగా మారి, శ్రీరాముడు ఆ కొండపై కొలువు తీరునట్లుగా వరం పొందుతాడు. రామావతారం చాలించి వైకుంఠం చేరిన రాముడు, తిరిగి భద్రుని మొర విని భూమికి వచ్చి భద్రగిరిపై కొలువుతీరాడు. ఈ భద్రగిరియే కాలగతిలో భద్రాచలం (భద్ర అచలం-చలనములేనిది-కొండ)గా పిలవబడుతున్నది. పోకల దక్కమ్మ అనే భక్తురాలు తనకు దొరికిన శ్రీ సీతారామలక్ష్మణుల విగ్రహాలను ఒక చెట్టుక్రింద ఉంచి పూజించేది. నేలకొండపల్లికి చెందిన కంచెర్ల గోపన్న ఆ ప్రాంతానికి తాశీల్దారుగా ఉండేవాడు. ఆయన ప్రజలనుంచి వసూలు చేసిన శిస్తు మొత్తం ఆరులక్షల ప్రభుత్వానికి జమచేయక, ఆ డబ్బును ఆలయనిర్మాణానికి, ఆభరణాలకు వెచ్చించాడు. ఇది తెలిసిన గోల్కొండ నవాబు అబల్ హసన్ తానీషా గోపన్నను కోటలో బంధించి చిత్రహింసలు పెట్టాడు. ఆ బాధలు తట్టుకోలేక కీర్తనల రూపంలో తనను వేడుకొనే గోపన్నను గమనించి శ్రీరాముడు తమ్ముడు లక్ష్మణునితో తానీషా వద్ద కొచ్చి బాకీ చేల్లిస్తాడు. తానీషా గోపన్నను విడుదల చేయటమే గాక, శ్రీరామనవమికి భద్రాచలంలో జరిగే సీతారామకల్యాణానికి ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు గోల్కొండ కోటనుంచి వెళ్ళేలాగ ఉత్తర్వులిచ్చాడు. అదే సంప్రదాయాన్ని యిక్కడి రాష్ట్రప్రభుత్వాలు యిప్పటికీ కొనసాగిస్తున్నాయి. శ్రీరాముని దయతో చెరవిముక్తి పొందిననాటినుంచి కంచెర్లగోపన్న రామదాసుగా పేరు పొందాడు. ఇక్కడ ఉన్న శ్రీ సీతారామచంద్రస్వామివారి దేవాలయానికి 35కి.మీ. దూరంలో ఉన్న పర్ణశాలలోనే శ్రీరాముడు సీతాలక్ష్మణ సమేతుడై వనవాసం చేశాడని అంటారు.
- ధర్మపురి:
కరీంనగర్ జిల్లలో ఒక మండల కేంద్రమైన ధర్మపురి ప్రధానంగా శ్రీ యోగ లక్ష్మీనృసింహ, శ్రీ ఉగ్రనరసింహ ఆలయాలకు నిలయము. ధర్మవర్మ అనే మహారాజు తపస్సుకు మెచ్చిన నృసింహుడు యిక్కడ లక్ష్మీసమేతుడైన యోగనరసింహుడిగా కొలువయ్యాడన్నది స్థలపురాణం.
11,12 శతాభ్దాలలో ధర్మపురంగా ప్రసిద్ధి చెందిన యీ క్షేత్రం ప్రాచీనకాలం నుంచి వైదిక విద్యలకూ, జ్యోతిష్య శాస్త్రానికి నిలయమై, నేటికీ సంప్రదాయ విద్యలకు నెలవైయున్నది. పితృకర్మలకు, కుజదోషనివారణకు ప్రసిద్ధి చెందిన యీ క్షేత్రంలో, యోగ నృసింహస్వామికి కల్యాణం చేయించిన ఎటువంటి వైవాహిక సమస్యలైనా తీరుతాయని చెబుతుంటారు. సుమారు వేయి సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర గల ధర్మపురి శ్రీ వేంకటేశ్వర, వేణుగోపాల, ఆంజనేయ, రామలింగేశ్వర ఆలయాలకు కూడా నెలవైనది. ఇక్కడ గోదావరి పుష్కరాలలో స్నానం చేసే ముందు ఇంటినుంచి తెచ్చినదైన చిటికెడు మట్టి నదిలో వేసి, కృత్య అన్నదేవతను ప్రార్ధించి స్నానం చేయాలని, లేకుంటే మన స్నానఫలాన్ని ఆ దేవత తీసేసుకొంటుందని స్థానికులు చెబుతారు.
- కాళేశ్వరం:
‘తెలుగు’ అన్న పదానికి మూలమైన త్రిలింగములలో ఒక లింగం కాళేశ్వరంలో ఉన్నదని పండితులు చెబుతారు. ఈ క్షేత్రం కరీంనగర్ జిల్లాలో ఉనది.
ఇక్కడ ఒకే పానపట్టంపై రెండు లింగాలుంటాయి. అందులో ఒక లింగం శివునిదైతే, మరొక లింగ స్వరూపం యమునిదని చెబుతారు. కాలుడు(యముడు), ఈశ్వరుడు కలిసి పానపట్టాన్ని పంచుకొంటున్నందున యీ క్షేత్రాన్ని కాళేశ్వరంగా పిలుస్తారు. గోదావరి, ప్రాణాహిత,గోదావరి అంతర్లీనంగా ఉండే సరస్వతీ నదులు కలిసే త్రివేణి సంగమ క్షేత్రంగా కూడా యీ క్షేత్రాన్ని పిలుస్తారు. శ్రీ కాళేశ్వర ముక్తేశ్వరస్వామి నెలవైన యీ క్షేత్రంలో యాత్రికులు కార్తీకస్నానాలాచరించి మొదట గణేశుని, తదుపరి కాలుని, చివరగా శివుణ్ణి ప్రార్ధిస్తారు. ఆలయంలోని బయటకు అక్కడ ఉన్న యమకోణంలోంచి మాత్రమే రావాలని, అలాచేస్తే యమదోషం పోతుందని భక్తుల విశ్వాసం. ఇక్కడ ముక్తేశ్వర లింగానికి రెండు నాసికా రంద్రాలున్నాయి. వాటిలో నీరుపోస్తే త్రివేణిసంగామతీరంలో నదిలో కలుస్తుంది. రుజువుకోసం ఒక కలెక్టరుగారు వెయ్యి లీటర్ల పాలను తెప్పించి పోయించగా త్రివేణిసంగామతీరంలో పాలు కనిపించాయట.
ఈ క్షేత్రంలో మహాసరస్వతి, సూర్యదేవాలయాలు కూడా చూడదగ్గవి.
ఆంధ్రప్రదేశ్:
- కొవ్వూరు:
పురాణకాలంలో పదిహేను సంవత్సరాలు క్షామం తాండవించి ప్రజలు, మునులు అల్లాడగా వారికి గౌతమ మహర్షి ఆశ్రయమిచ్చాడు. అతని వద్ద గాయత్రీదేవి ప్రసాదించిన బంగారుపాత్ర ఉన్నది. ఆ పాత్రలో విత్తనాలు నింపి తన పొలంలో వాటిని ఉదయం చల్లేవాడు. ఆ పాత్ర మహిమ వల్ల సాయంత్రానికి పంట చేతికోచ్చేది. గౌతముని యీ సుభిక్షాన్ని చూసిన కొందరు మునులు అసూయతో ఒక మాయాగోవుని సృష్టించి అతని పొలాల్లోకి తోలారు. ధ్యానంలో ఉన్న గౌతముడు అలికిడికి కళ్ళు తెరచి, తనపొలంలో పంటను మేస్తున్న గోవును దర్భతో అదిలించాడు. ఆ మాయాగోవు కొంతదూరం వేదనతో పరిగెత్తి మరణించింది. పాపనివారణకు గౌతముడు బ్రహ్మగిరి వెళ్ళి శివునికై తపస్సు చేసి గంగను వరంగా పొందాడు. ఆ గంగను చనిపోయిన గోవుపై పారించగా, గౌతమునికి గోహత్యాపాతకవిముక్తి, గోవుకి స్వర్గప్రాప్తి లభించాయి. గౌతముని వల్ల భూమికి వచ్చిన గంగ గౌతమీ గోదావరిగానూ, గోవు సంచరించిన గోవూరు కొవ్వూరు కాగా, అది వేదన అనుభవించిన ప్రాంతం తొలుత పశువేదనగా, కాలగతిలో పశివేదలగా మారిందని కథ.
కొవ్వూరు గోష్పాదక్షేత్రంగా పేరొందినది. పుష్కర సమయంలో యిక్కడ గోదావరిలో స్నానం చేస్తే స్వర్గప్రాప్తి కలుగుతుందన్నది భక్తుల విశ్వాసం. పశ్చిమగోదావరి జిల్లాలోని యీ ఊరు గోదావరి నది గట్టున రాజమండ్రికి యీవల తీరంలో ఉన్నది.
- పట్టినం/పట్టిసీమ:
ఇది పశ్చిమగోదావరి జిల్లాలోని కొవ్వూరుకు 25కి.మీ. దూరంలో ఉన్న సుప్రసిద్ధమైన శైవక్షేత్రం.
దక్షప్రజాపతి తన అల్లుడైన శివుని తప్ప మిగిలిన దేవతలందరినీ పిలిచి యాగం చేయబూనుకొన్నాడు. శివుని భార్య, దక్షుని కూతురైన సతీదేవి పుట్టింటిపై మక్కువతో తండ్రి పిలవకున్నా యాగాన్ని చూట్టానికి వచ్చింది. అక్కడ తన అక్కచెల్లెళ్ళు అవమానించినా సహించింది. కానీ తండ్రి దక్షుడు తన భర్త శంకరుణ్ణి దేవతలముండు తూలనాడుతుంటే తట్టుకోలేక ఆత్మాహుతి చేసుకొంది. ఆమె మరణవార్త విన్న శంకరుడు ఉగ్రుడై వీరభద్రుణ్ణి సృష్టించి దక్షుణ్ణి శిక్షించి రమ్మని పంపుతాడు. వీరభద్రుడు యాగశాలలో భీభత్సం సృష్టించి దక్షుని శిరస్సును తన ఆయుధమైన పట్టసం(పొడవైన వంకీ కత్తి) తో ఖండించినప్పుడు ఆ విసురుకి పట్టసం భూమి మీద పడిందని, అలా పట్టసం పడిన ప్రాంతమే పట్టసం/పట్టసాచలక్షేత్రం/పట్టిసం/పట్టిసీమ అయిందని చెబుతారు. వీరభద్రుని ప్రళయ నృత్యానికి భయపడిన దేవతలు అగస్త్య మహామునిని ప్రార్ధించగా, ఆ ముని వీరభద్రుని శాంతింపజేసి యీ ప్రాంతంలోని దేవకూట పర్వతంపై కొలువుతీరమని కోరినాడు. అగస్త్యుని కోరికపై వీరభద్రుడు లింగరూపంలో యిక్కడి దేవకూట పర్వతంపై వెలిసినాడని కథ. అగస్త్యుడు వీరభద్రుని నుదుటిని ఒక పొడవాటి అల్లని జుట్టుతో ముడివేసాడని చెబుతారు.స్వయంభులింగమైన వీరభద్రలింగాన్ని చుట్టి ముడివేయబడ్డ జుట్టుని మనం చూడవచ్చు. ఈ వీరభద్రస్వామి ఆలయంతో పాటు భద్రకాళి, కనకదుర్గ, లక్శ్మీగణపతి, కుమారస్వామి, సుబ్రహ్మణ్యస్వామి, మహిషాసురమర్దని తదితర ఆలయాలను కూడా చూడవచ్చు.
ఈ ప్రాంతం పాపికొండల నడుమ ప్రకృతి సౌందర్యంతో శోభిల్లుతూంటుంది.
- రాజమండ్రి:
“వేదంలా ఘోషించే గోదావరి” గట్టున “అమరధామంలా శోభిల్లే” రాజమహేంద్రవరమే యీ రాజమండ్రి. తూర్పుగోదావరి జిల్లాలో పెద్ద పట్టణం.
పదవ శతాబ్దంలో మొదటి అమ్మరాజ విష్ణువర్ధనుడి(క్రీ.శ.919-934) చేత నిర్మితమైన యీ పట్టణం అతని బిరుదైన “రాజమహేంద్ర” పేరు మీద రాజమహేంద్రవరమైనదని చెబుతారు. చాళుక్య ప్రభువైన రాజరాజ నరేంద్రుని(క్రీ.శ.1022) పాలనలో యీ ప్రాంతానికి రాజకీయంగా, చారిత్రకంగా పేరు వచ్చినది. తొలి తెలుగు పద్యకావ్యమైన మహాభారతములో కొంతభాగం రాజరాజ నరేంద్రుని ప్రోత్సాహంతో అతని ఆస్థానకవి నన్నయ్యచే వ్రాయబడినది.
గోదావరి పుష్కరాలలో ప్రముఖపాత్ర వహించే రాజమండ్రిలో కోటిలింగాల దేవాలయం, అనేక చారిత్రక ప్రాధాన్యత గల చిన్న చిన్న దేవాలయాలు, కట్టడాలు, గౌతముని ఘాట్ వద్ద యిస్కాన్ కట్టించిన కృష్ణ దేవాలయం ప్రత్యేక ఆకర్షణలు.
- ర్యాలి:
ఈ క్షేత్రం తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలంలో వశిష్ట, గౌతమీ గోదావరి ఉపపాయల మధ్య గల చిన్న గ్రామం.
క్షీర సాగర మధనానంతరం విష్ణువు జగన్మోహిని రూపంలో దేవతలకు అమృతం పంచుతాడు. శంకరుడు జగన్మోహినిని మోహించి వెంటపడగా అయ్యప్ప జన్మిస్తాడు. అలా వెంటపడిన సమయంలో జగన్మోహిని కొప్పునుంచి ఒక పుష్పం రాలిపడుతుంది. అలా పూవురాలిపడిన ప్రాంతమే ర్యాలిగా పేరు పొందింది.
పదకొండవ శతాబ్దంలో వేటలో అలసిపోయిన అప్పటి చోళరాజు విక్రమదేవుడు ఒక పొన్నచెట్టు కింద నిద్రపోయాడు. అప్పుడు శ్రీమహావిష్ణువు కలలో కనబడి “నీ రధచక్రం మేకు రాలిపడిన చోట భూగర్భంలో నా క్షేత్రం ఉందని” చెబుతాడు. వెంటనే రాజు ఆప్రాంతాన్ని తవ్వించగా జగన్మోహినీ కేశవస్వామి విగ్రహం దొరికింది. అంత విక్రమదేవుడు ఆ ప్రాంతంలోనే ఒక ఆలయం కట్టించి, ఆ విగ్రహాన్ని అక్కడ ప్రతిష్టించాడు. ఏక సాలిగ్రామ శిలతో తయారైన యీ విగ్రహం ముందువైపు కేశవస్వామి రూపంతోను, వెనకవైపు జగన్మోహినీ ఆకారంతోను ఉంటుంది. స్వామి పాదాలవద్ద ఉన్న చిన్న గంగ తలనుంచి గంగ పారుతూoటుంది. విగ్రహం ముందువైపు శంఖం, చక్రం, గదలను పట్టుకొని అభయహస్తమిస్తూ నాలుగు చేతులుండగా, విగ్రహం పైన ఆదిశేషుడు నీడపట్టుతుంటాడు. అదే విగ్రహం వెనకవైపు యివేమీ కనిపించకుండా రెండు చేతులు, అందమైన సిగముడి, కుడికాలు పిక్కపై నల్లని పుట్టుమచ్చ దర్సనమిస్తాయి. నిత్యపూజలు, హారతి, నైవేద్యాలను విగ్రహానికి రెండువైపులా చేస్తారు.
ఈ ఆలయానికి అభిముఖంగా కొద్ది దూరంలో మహేశ్వరుని ఆలయం ఉంటుంది. శంకరుని విగ్రహాన్ని బ్రహ్మ కమండలంతో శుద్ధి చేసినందున ఈ దేవుని ఉమా కమండలేశ్వరుడని పిలుస్తారు. ఈ ఆలయ ప్రాంగణంలో శ్రీదేవి, భూదేవి, నారద, తంబుర, కిన్నెర కింపురుషాది విగ్రహాలు కొలువై ఉన్నాయి.
- కోటిపల్ల్లి:
పవిత్రగోదావరీ నది ఒడ్డున ఉన్న ప్రసిద్ద పుణ్యక్షేత్రమైన కోటిపల్లి తూర్పుగోదావరి జిల్లా పామర్రు మండలానికి చెందిన పల్లెటూరు. ఈ క్షేత్రంలో అనేక పవిత్ర జలాలు వచ్చి చేరతాయని దీనికి కోటితీర్ధం అని కూడా పేరున్నది.
కోటిపల్లి దేవాలయంలో అమ్మవారితో కూడిన కోటీశ్వరస్వామీ, రాజరాజేశ్వరీ సహిత సోమేశ్వరస్వామీ, శ్రీదేవి, భూదేవి సహిత జనార్ధనస్వామి విగ్రహాలున్నాయి. వీటిని ఇంద్రుడు, చంద్రుడు, కశ్యపమహర్షి ప్రతిష్టించారని చెబుతారు. సోమేశ్వరాలయంలో దసరా ఉత్సవాలు, కార్తీకదీపోత్సవాలు బాగా జరుగుతాయి. ఆలయానికి ఎదురుగా సోమగుండం అనే చెరువు ఉన్నది. శివరాత్రి యీ ఆలయ ప్రాంగణంలో కోటిదీపాలు వెలిగిస్తారు. ఆలయంలో నాలుగు ప్రదక్షిణ మండపాలున్నాయి. ఉత్తరమండపంలో కాలభైరవ మందిరముంది. ఈ దేవాలయంలోనే చంద్రమౌళీశ్వరస్వామీ, శంకరాచార్యుల మందిరం, ఉమాసమేత మృత్యుంజయలింగం, నవగ్రహాలగుడి ఉన్నాయి.
- ముక్తేశ్వరం:
తూర్పుగోదావరిజిల్లా అమలాపురానికి 14కి.మీ.దూరంలో గోదావరీ తీరాన ఉన్న గ్రామం ముక్తేశ్వరం. పచ్చటి ప్రకృతి, పంటకాల్వలు, కొబ్బరితోటలతో అలరాడే ముక్తేశ్వరంలో గోదావరి నదికి ఆవలివైపున కోటిపల్లి ఉంటుంది. ఈ ఊరిలో ఉన్న ముక్తేశ్వర దేవాలయం పురాతనమైనది. ఈ ముక్తేశ్వరుని దేవాలయానికెదురుగా ఉన్న మరొక శివాలయంలో ఉన్న దేవుడిని క్షణముక్తేశ్వరుడని పిలుస్తారు. ముక్తేశ్వరాలయంలోని విగ్రహం రుద్రాక్ష ఆకారంలో ఉంటుంది.
- అయినవిల్లి:
ఇది అమలాపురానికి 12కి.మీ. ముక్తేశ్వరానికి 2 కి.మీ. దూరంలో వరసిద్ధి వినాయకుని ఆలయమున్న ప్రాంతం. సువిశాలమైన ఆవరణలో ఎత్తైన ప్రాకారంతో విరాజిల్లే యీ ఆలయంలో రెండు గోపురాలున్నాయి. ఈ ఆలయప్రాంగణంలో క్షేత్రపాలకుడైన కాలభైరవుని ఆలయంతో పాటు శ్రీదేవి, భూదేవి సహిత కేశవాలయం, శివాలయం, శ్రీ అన్నపూర్ణాదేవి ఆలయం ఉన్నాయి. సాధారణంగా వినాయకుని దేవాలయాలు తూర్పుముఖాభిముఖంగా ఉంటే అయినవిల్లిలో ఆలయం దక్షిణాభిముఖంగా ఉండటం విశేషం.
ఈ ఆలయంలో కృష్ణ, శుక్ల పక్షాల్లో చవితి, దశమి, ఏకాదశి తిధులలో, వినాయకచవితి పర్వదినాలలో ప్రత్యేకపూజలు చేస్తారు. అంతేగాక భాద్రపద శుద్ధచవితి, కార్తీకమాసంలో మొదటి, నాల్గవ సోమవారాలలో, కృష్ణాష్టమి రోజున గ్రామోత్సవం జరుపుతారు.
- మందపల్లి:
తూర్పుగోదావరిజిల్లా కోనసీమప్రాంతంలోని కొత్తపేట మండలానికి చెందిన గ్రామము మందపల్లి.
పూర్వం అశ్వత్థా, పిప్పలాదులనే రాక్షసులు యీ ప్రాంతంలో తపస్సు చేసుకొనే మునులను చంపి తినేవారు. అప్పుడు మునులంతా శివుని గూర్చి తపస్సు చేస్తున్న శనీశ్వరుని వద్దకెళ్ళి మొరపెట్టుకోగా, మందుడు ఆ రాక్షసులను యుద్ధంలో వధించాడు. అసురసంహారంవల్ల కలిగిన బ్రహ్మహత్యాపాతకాన్ని నివారించుకొందుకు అతడు యిక్కడ శివాలయాన్ని ప్రతిష్టించి పూజలు చేశాడు. వాస్తవానికి యిది సోమేశ్వరాలయమైనా శనీశ్వరుడు ప్రతిష్టించినందున శనీశ్వరాలయంగా పేరు వచ్చింది.
శత్రు, రోగ, రుణవిముక్తి కోసం, జాతకంలో శనీశ్వరుని ప్రభావాన్ని నివారించుకోవటానికి ప్రజలు యీ క్షేత్రానికొస్తారు. ఏటా శనిత్రయోదశిరోజుల్లోను, శ్రావణమాసంలోను యిక్కడ మందేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేస్తారు. శ్రీ బ్రహ్మేశ్వర, నాగేశ్వర, వేణుగోపాలస్వామి దేవాలయాలు కూడా యీ క్షేత్రంలో ఉన్నవి.
- ముక్కామల:
పశ్చిమగోదావరిజిల్లా వెరవలిమండలకేంద్రానికి(వెరవలికి) మూడు కిలోమీటర్ల దూరంలో వశిష్టగోదావరి ఒడ్డున ఉన్న గ్రామం ముక్కామల. పురాణాల్లో యీ గ్రామాన్ని బ్రహ్మగుండం, కుమారక్షేత్రం, మునికోడు, ధర్మగుండం, త్రిపద్మక్షేత్రంగా వ్యవహరించారు. ఒకే కాడకు మూడు తామరపూలు వికసించినందున దీనిని పద్మక్షేత్రం(ముక్కామల)గా పిలుస్తున్నారన్నది పురాణ కధనం.
ఈ గ్రామంలో గ్రామకంఠంలో రామాలయం, తూర్పునవీధిలో శివాలయం, పడమర వీధిలో విష్ణాలయాలున్నాయి. శివాలయంలో కార్తీకపున్నమినాడు జ్వాలాతోరణము, శివరాత్రికి తీర్ధం, భీష్మయేకాదశికి వైష్ణవాలయంలో ఉత్సవాలు జరుగుతాయి. ముక్కామల గోదావరిరేవు బ్రహ్మగుండాల క్షేత్రంగా ప్రసిద్ధికెక్కినది. గోదావరి పుష్కరాలలో జనం విపరీతంగా వచ్చి గోదావరిలో స్నానాలు చేసి తరిస్తారు.
- అంతర్వేది:
శివుని పట్ల తాను చేసిన అపచారాలకు ప్రాయశ్చిత్తంగా బ్రహ్మ యిక్కడ రుద్రయాగం చేశాడని, ఆ యాగానికి వేదిక అయినందున యీ ప్రాంతాన్ని అంతర్వేదికగా పిలిచారని పురాణ కథనం. వశిష్టుడు ఇక్కడ యాగం చేసినందున యీ ప్రాంతం అంతర్వేది అయినదని మరొక కథనం.
హిరణ్యాక్ష్యుని కుమారుడైన రక్తావలోచనుడు శివునికై వేల సంవత్సరాలు తపస్సు చేసి తన శరీరంలోని రక్తపుబొట్టు యెన్ని ఇసుకరేణువులపై పడుతుందో అంతమంది రక్తవలోచనులు ప్రభావించాలని వరం పొందాడు. తదుపరి వరగర్వంతో యాగాలు చేసే బ్రాహ్మణులను, గోవులను హింసించేవాడు. అదే సమయంలో విశ్వామిత్రుని కోరికపై వశిష్టుని ఆశ్రమంలో భీభత్సం సృష్టించి అతని నూరుగురు కుమారులను సంహరించాడు. వశిష్టుడు మహావిష్ణువుని ప్రార్ధించాడు. అప్పుడు మహావిష్ణువు శ్రీలక్ష్మీసమేతుడై నరహరి రూపంలో వచ్చి రక్తవలోచానునితో యుద్ధం చేశాడు. వరప్రభావంతో అతని నెత్తురు పడిన యిసుకరేణువులనుంచి వేలాది రాక్షసులు జన్మించి, భీభత్సం చేయసాగారు. ఇది గమనించిన నరహరి తన మాయాశక్తితో అతని రక్తం నేలపై పడకుండా రక్తకుల్య అనే నదిలోకి పారేట్లు చేసి తన సుదర్శనచక్రంతో అతనిని నిర్జించాడు. పిదప వశిష్టుని కోరికపై లక్ష్మీనృసింహస్వామిగా యిక్కడనే కొలువైనాడు.
వశిష్ట ఆశ్రమము, దీపస్తంభము, అస్వరూడాంభికా ఆలయము, క్షేత్రపాలకుడైన నీలకంఠయేస్వర, విఘ్నేశ్వర, ఆంజనేయస్వామి ఆలయాలు యిక్కడ ప్రసిద్ధములు. వశిష్టగోదావరి సముద్రంలో కలిసేచోటును అన్నాచెల్లెలిగట్టు అంటారు. సముద్రనీటి మధ్యలో పొడవుగా ఇసుక మేటవేసి గట్టు మాదిరిగా ఉంటుంది. ఆ గట్టుకి ఒకవైపు నీరు స్వచ్చంగా ఉంటే మరొకప్రక్కన మట్టితో కూడి ఉంటుంది.
దక్షిణ భారతంలో అతిపొడవైన జీవనాడిగా గణుతికెక్కిన గోదావరి తీరప్రాంతం ఆద్యాత్మకతకు నిలయలైన దేవళాల దేవిడి గానూ, పురాణాల చావడిగానూ మారి ప్రధానంగా తెలుగువారి జీవనవిధానంలో విడదీయరాని అనుబంధంతో పెనవేసుకొనిపోయింది.
*****
No comments:
Post a Comment