పుష్కరములు - అచ్చంగా తెలుగు

పుష్కరములు

Share This

పుష్కరములు

- చెరుకు రామమోహనరావు 


పుష్కరమును గూర్చి తెలుసుకొనే ప్రయత్నము చేసే ముందు వాయు పురాణములోని ఈ కథ కాస్త చదువుతాము.పూర్వం తుందిలుడనే ధర్మాత్ముడు శంకరుని గురించి తపమాచరించి ప్రత్యక్షం చేసుకున్నాడు. స్వామి వరం కోరుకోమన్నాడు. తుందిలుడు ' స్వామీ శాశ్వతంగా నీలో ఐక్యంచేసుకొ'మ్మన్నాడు. ఈశ్వరుడు తన అష్టమూర్తులలో ఒకటైన జలమూర్తిలో శాశ్వతంగా స్థానం కల్పించినాడు. ఇలా సకల జీవరాశిని పోషించగలిగే శక్తి అతనికి లభించింది. ఎన్నో అర్థాలు గలిగిన పుష్కరమునకు పోషక శక్తి అన్నది కూడా ఒకటి. అలా తుందిలుడు పుష్కరుడైనాడు. బ్రహ్మదేవునికి, సృష్టికి జలముతో అవసరం ఏర్పడినప్పుడు ఈశ్వరుని ప్రార్థించగా జలాధిపతియైన పుష్కరుడు బ్రహ్మదేవుని కమండంలంలోకి ప్రవేశించుట జరిగింది. బ్రహ్మ కార్యం పూర్తి అయిన తరువాత ప్రాణులను బ్రతికించే ధర్మము నెరవేర్చడానికి బృహస్పతి ప్రాణులకు జీవాధారమైన జలంకావాలని బ్రహ్మదేవుని ప్రార్ధించగా బ్రహ్మవల్లె యన్నాడు కానీ పుష్కరునికి బ్రహ్మను వదలుట ఇష్టము లేదు.. అప్పుడు బృహస్పతి, బ్రహ్మ, పుష్కరులు కలసి చేసుకొన్నా నిర్ణయము ఏమిటంటే గ్రహరూపంలో ఉన్న బృహస్పతి మేష వృషభాది పన్నెండు రాశులలో ప్రవేశించేటప్పుడు పన్నెండు రోజులు,మిగత సంవత్సరములోని మధ్యాహ్న సమయంలో రెండు మూహూర్తములు పుష్కరుడు బృహస్పతితో ఉండాలని నిర్ణయించుకొన్నారు. ఆ సమయంలో సమస్త దేవతలు బృహస్పతి అధిపతిగా పుష్కరునితో కూడి యున్న నదికి వస్తారు కనుక పుష్కరకాలంలో నదీ స్నానం పుణ్యప్రదమని పురాణముల సారాంశము.
అందరూ పండితులై వుండరు గనుక సామాన్య ప్రజకు సరళమైన రీతిలో సారాంశము చెప్పే ఉద్దేశ్యముతో ఎంతో ఆదరముతో మనకు ఈ కథలు అందింపబడినాయి.
భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశము అన్న పంచ భూతాత్మకమైనది దేహము. దేహి ఉన్నంతవరకు ఈ పంచ భూతాలతో సంబంధ బాంధవ్యములు ఉండవలసిందే. ఏది లేకున్నా కష్టమే! ఇందులో మొదటిది నీరు.అందుకే 'జల్ జో న హోతా తో యే జగ్ జాతా జల్ ' అన్నారు జాతీయ భాషలో! మనలను కాపాడేది దేవతలినపుడు ,మనల కాపాడే జలము దేవతే కదా!
మొదట పుష్కరము 12 సంవత్సరాలకెందుకు అన్నది చూస్తాము.మనకు ప్రభవ, విభవాది 60 సంవత్సరములు వున్నాయి. 60 సంవత్సరములెందుకు అంటే భూమికి అతి దూరముగా వున్న గురు గ్రహము యొక్క భ్రమణకాలము 12 సంవత్సరములు. అదే అత్యంత దూరములో వున్న శని గ్రహము 30 సంవత్సరములు తీసుకొంటుంది. అంటే బయలుదేరిన బిందువు నుండి తిరిగి ఈగ్రహములు ఒకే సరళ రేఖ మీదికి వచ్చుటకు 60 సంవత్సరాల కాలం పడుతుంది. అంటే గురువు (12 x 5 = 60) ఐదు మార్లు, శని (30 x 2 = 60) రెండు మార్లు, తిరుగవలెనన్నమాట. అంటే 60 సంవత్సరముల కాలం ముగియగానే మరులా ప్రభవ నుండి 60 సంవత్సరముల కాలం మొదలౌతుందన్నమాట. అది పుష్కరమునకు బృహస్పతికి గల సంబంధం లేక జల సంబంధం. మనకు 12 రాశులు . కాబట్టి గురువు ఒకరాశినుండి బయలుదేరి అదే రాశికి రావటానికి 12 సంవత్సరాలు పడుతుందన్నమాట. ఆ విధంగా 12 సంవత్సరాలు 12 రాశులు 12 నదులు మనకు పునః పునః తెస్తూనే వుంటాయి.గంగ కు మేషరాశి లో,నర్మద (రేవా) కు వృషభ రాశిలో,సరస్వతికి మిథున రాశిలో, యమునకు కర్కాటక రాశిలో, గోదావరికి సింహరాశిలో, కృష్ణకు కన్యారాశిలో, కావేరికి తులారాశిలో, భీమాకు వృశ్చిక రాశిలో పుష్కరవాహినికి ధనుః రాశిలో , తుంగభద్రకు మకర రాశిలో , సిందుకు కుంభ రాశిలో, ప్రాణహితకు మీనా రాశిలో పుష్కరాలు జరుగుతాయి. బృహస్పతి ఆ రాశిలో ఉన్నంతకాలము ఆ నది పుష్కరములో ఉన్నట్టే. పుష్కరకాలము సాధారణముగా ఒక సంవత్సరము పాటు ఉంటుంది. పుష్కరకాలములోని మొదటి పన్నెండు రోజులను ఆది పుష్కరము అని, చివరి పన్నెండు రోజులను అంత్య పుష్కరము అని వ్యవహరిస్తారు. ఇవి అత్యంత ప్రాధాన్యమైనవి.మిగిలిన మధ్యకాలములో , మధ్యాహ్న కాలమందు 2 ఘడియలు పుష్కర పుణ్య కాలమున్తుందని శాస్త్రవచనము.
సాధారణంగా పుష్కర కాల నదీ స్నానములలో తర్పణం ,పిండ ప్రదానం మరియు శ్రాద్ధ కర్మలు చేసి పితరులను తృప్తి పరచి వారి ఆశీశ్శులు అందుకోవడం శుభప్రదమని శాస్త్ర వచనము.మొదటి రోజున హిరణ్య శ్రాద్దం,తొమ్మిదవ రోజున అన్న శ్రాద్ధం,పన్నెండవ రోజున ఆమ శ్రాద్ధం చేయడం మంచిదని ఋషులు చెప్పారని పురాణాలు చెప్తున్నాయి.శ్రాద్ధకర్మలు ఉపనయనం,వివాహం అయిన పురుషులు పితృ వియోగము పిదపనే అర్హులు..ఈ 12 రోజులూ 12 దానాలను కూడా నిర్దేశించినాయి శాస్త్రాలు.
నేటి మానవ జీవనములో కొన్ని మాత్రమె సుసాధ్యములు, కొన్ని సాధ్యములు మిగతావి అసాధ్యములు. చివరి రోజున తిల (నువ్వులు ) దానము మంచిది. సప్తర్షులేగాక, చాలా మంది దేవతలు కూడా సూక్ష్మరూపులై ఈ నదుల ప్రాంతంలో పుష్కరాలప్పుడు సంచరి స్తుంటారనీ, పుష్కర స్నానాలు చేసే వారికి శుభాలను కలిగిస్తారనీ కూడా నమ్మకం. పుష్కరాలు జరిగే సంవత్సర కాలంలో నదికి సవిూప ప్రాంతాలలోని వారు వివాహాది శుభ కార్యాలు చేయరు. తప్పని సరిగా చేయవలసి వస్తే వేరే ప్రాంతాలకు వెళ్లి చేస్తారు. ఉత్సవాలు జరిగే పన్నెండు రోజులూ అవకాశం ఉన్నవారు నదీ స్నానాలు చేస్తారు, తీరంలో పూజలు, తర్పణాలు, జపాలు, దానాలు చేసే సాంప్రదాయం ఉంది. నీటిలో మానవుంకి ఉపయోగపడే రెండు శక్తులున్నాయని వేదం చెప్తుంది. ఒకటి దాహార్తిని తీర్చడం, రెండు దేహ శుద్ధి, తప్పుగా అనుకోవద్దు, అంటే శుభ్రపరచడం . ఈ రెండు బాహ్య శక్తులైతే అంతరంగికంగా మేధ్యం,సంప్రోక్షణం, అనే రెండు శక్తులున్నాయని వేదం వివరిస్తుంది.మేధ్యం అంటే నదిలో స్నానంచేసి మూడుసార్లు మునక వేస్తే తెలిసి తెలియక చేసే పాపాలు పోతాయని అలాగే సంప్రోక్షణం అంటే నీటిని చల్లడం వలన ద్రవ్య శుద్ధి జరుగుతుందని పురాణాల చెబుతున్నాయి.నీరు నారాయణ స్వరూపం. పాపాలు స్నానంద్వారా పటాపంచలౌతాయని విశ్వసిస్తారు. సాధారణ స్నానమునకంటే తీర్ధ స్నానం ఉత్తమం, దానికంటే నదీ స్థానం ఉత్తమం దానికంటే పుష్కర సమయ నదీస్నానం ఉత్తమోత్తమం. ఆసమయంలో దేవతలలంతా పుష్కరునితో నదిలో ప్రవేశీస్తారని హిందువుల విశ్వాసం.త్రికరణాలతో చేసే పాపాలు పోతాయని,పుష్కర స్నానం ఒకసారి చేస్తే పన్నెండు సంవత్సరాల కాలం పన్నెండు పుణ్య నదులలో స్నానంచేసిన పుణ్యం లభిస్తుందని,అశ్వమేధ యాగం చేసినంత పుణ్యం లభిస్తుందని ఋషి వాక్కు. మోక్షప్రాప్తి కలుగుతుందని బ్రహ్మాండ పురాణం వర్ణిస్తుంది.నదీ జలాలను సేవిస్తే పాప ప్రక్షాళన జరుగుతుందని నదీ జలాలలో స్నానమాచరిస్తే బుద్ధి మాంద్యం,అలసత్వం మొదలైన శారీరక ఋగ్మతలు నశిస్తాయని తైత్తరీయ ఉపనిషత్తు వివరిస్తుంది.
గోదావరీ పుష్కర ఫలితమస్తు!

No comments:

Post a Comment

Pages