జ్యోతిష్య పాఠాలు - 18 - అచ్చంగా తెలుగు

 జ్యోతిష్య పాఠాలు - 18 

PSV రవి కుమార్

 

పాఠం -  18

యోగాలు

చంద్రమంగళ యోగం

ఈ యోగం చంద్ర, కుజ గ్రహాల వలన ఏర్పడుతుంది. ఈ రెండు గ్రహాలు, ఒకే రాశి లో ఉండుటగానీ, సమ సప్తకములలో ఉండుట గానీ, అనగా, చంద్రుని నుండి, కుజుడు సప్తమం లో ఉండుటగానీ, కుజుని నుండి చంద్రుడు సప్తమం లో ఉండుట గానీ జరిగిన ఈ యోగం ఏర్పడును. 

ఈ యోగం  ఉన్న వారికి ధన సంపాదన లోటు ఉండదు. ఈ యోగం ఏ భావం లో ఏర్పడునో ఆ భావ ఫలితాలు ఇచ్చును. ఈ యోగం ఒక విధం గా కాస్త ఇబ్బందికర యోగం అనే చెప్పాలి.

ఈ యోగం ఏర్పడిన వారికి తల్లి తో సత్సంబంధాలు ఉండవు. ఎప్పుడూ వాదనలు జరుగుతూ ఉండును. కొంతమందికి వైవాహిక సౌఖ్యం ఉండదు. విదేశాలకు వెళ్ళి ధనార్జన చేయుదురు లేదా విదేశి ధనం సంపాదించును. కొంతమంది లో ధన సంపాదన ఎలా చేయునో బాహ్య ప్రపంచానికి తెలియక పోవచ్చు.

వీరిలో కొంతమంది అధికారులుగా,మరికొంతమంది రాజకీయాల యందు రాణించును. ఎటువంటి సమస్యను అయినా ధైర్యం గా ఎదురుకొంటారు. వ్యయ స్థానం లో కనుక ఈ యోగం ఏర్పడిన, వ్రుద్దాప్యం లో సన్యసించును లేదా ఆధ్యాత్మికత ఆలోచనలు పెరిగి, దైవ భక్తి లో ఉండును. 


విపరీత రాజయోగం

ఈ యోగం ముందుగా ఇబ్బందులు చవిచూపించి ఆ పిదప యోగ ఫలితములు ఇచ్చును.ఈ యోగం, 6,8, 12 భావాల వలన కలుగును.  

6వ భావాధిపతి, 8, 12 స్థానాలలో ఉండుట. ఈ యోగమును హర్ష యోగం అంటారు.

8వ భావాధిపతి, 6, 12 స్థానములలో ఉండుట. ఈ యోగమును సరల రాజ యోగం అంటారు.

12వ భావాధిపతి, 6,8 స్థానములలో ఉండుట. ఈ యోగమును విమల రాజయోగం అంటారు.

లేదా 6,8,12 భావాలు, ఒకే రాశి లో ఉండుట, లేదా 6,8,12 భావాలు సమ సప్తకములలో ఉండుట వలన ఈ యోగం ఏర్పడును.

ఈ యోగం ఏర్పడినవారికి, ఏ గ్రహం వలన ఈ యోగం ఏర్పడినదో, ఆ దశ అంతర్దశలలో ముందుగా ఇబ్బందులు చవి చూసి, ఆ పిదప, విజయాలు సాధించును.


రాజయోగం

కేంద్రాధిపతులు కోణం లో ఉండుట, లేదా కోణాధిపతులు, కేంద్రాలలో ఉండుట లేదా కేంద్రాధిపతులు, కోణాధిపతులు కలిసి ఒకేరాశి లో ఉండుట వలన ఈ యోగం ఏర్పడును. ఈ యోగం ఏ గ్రహాలవలన ఏర్పడునో ఆ గ్రహ దశ అంతర్దశ లలో ధన లాభం కానీ, ఉద్యోగం లో పదోన్నతి కానీ కలుగును. 

కోణాధిపతులు 2వ భావం లో గానీ, 11వ భావం లో గానీ ఉండుట వలన కూడా రాజయోగం ఏర్పడి, ధన సంపాదన పెరుగును.

కేంద్ర కోణాధిపతులు కలయిక, 2వ భావం లో కానీ, 11వ భావం లో గానీ ఏర్పడిన ధన యోగం కలుగును. శని యొక్క ద్రుష్టి కానీ, శని సంబంధం కానీ కలిగిన, ధన సంపాదన నిదానం గా ఉండును. ఆకస్మిక ధనార్జన ఉండదు. మెల్లమెల్లగా ధనార్జన పెరుగును.

9వ భావాధిపతి స్వక్షేత్రం లో ఉండుట గానీ, ఉచ్చ పొందుట గానీ జరిగిన లక్ష్మీ యోగం కలుగును. ఈ యోగం వలన, ధనమునకు లోటు ఉండదు, ఉన్నత విద్య కల్గును, సమాజం లో మంచి పేరు కీర్తి ప్రతిష్టలు కలుగును. 

 

నీచభంగ రాజయోగం

ఏగ్రహమయిన నీచ పొందిన ఆ గ్రహము తన బలమును కోల్పోయి, వ్యతిరేక ఫలితములు ఇచ్చును లేదా నిర్వీర్యం అగును. కానీ అదే నీచభంగం జరిగిన, స్థాన బలమును బట్టి రాజయోగమును ఇచ్చును.

నీచ పొందిన గ్రహము, లగ్నం నుండి కానీ, చంద్రును నుండి గానీ, కేంద్రమునందు ఉండిన అనగా 1,4,7,10 స్థానముల నందు ఉండిన నీచభంగం జరిగి రాజయోగం ఇచ్చును.

నీచపొందిన గ్రహం, ఏ రాశిలో నీచ పొందిందో ఆ రాశ్యాదిపతి చేత చూడబడిన నీచభంగం జరిగి రాజయోగం పొందును.

నీచ పొందిన గ్రహము ఏ రాశిలో నీచ పొందిందో ఆ రాశ్యాదిపతి, ఉచ్చ పొందిన, నీచభంగం అగును.

నీచ పొందిన గ్రహం ఏ రాశి లో నీచ పొందిందో ఆ రాశ్యాదిపతి, లగ్నం నుండి కానీ, చంద్రుని నుండి గానీ, కేంద్రం లో ఉన్న నీచభంగం జరిగి రాజయోగం ఇచ్చును.

ఈ యోగం ఉన్నవారికి ఆ గ్రహ దశ అంతర్దశ లలో ధన లాభం, పదోన్నతి, అలాగే ఏ స్థానం లో ఉనదో ఆ స్థాన ఫలితములు ఇచ్చును.

ఈ యోగములన్నియూ యోగించాలని అనిన ఆ గ్రహ దశలు గానీ, అంతర్దశలు గాని రావలెను. ఆ సమయంలో నే ఈ ఫలితములు అనుభవములోకి వచ్చును. వచ్చే పాఠం లో దోషాల గురించి తెలుసుకుందాం.

***

No comments:

Post a Comment

Pages