పుత్రోత్సాహం - అచ్చంగా తెలుగు

పుత్రోత్సాహం

Share This

 పుత్రోత్సాహం

G.S.S. కళ్యాణి.


పచ్చని పంటపొలాల పక్కనుండీ ఒక రైలు వేగంగా వెడుతోంది. ఆ రైల్లోని జనరల్ బోగీలో ఎనభయ్యేళ్ళ వెంకయ్య, ముప్పయ్యేళ్ల రామచంద్రలు ఒకే బెర్తులో కాస్త ఎడంగా కూర్చుని ఉన్నారు. వారికి ఎదురుగా ఉన్న సీట్లో చైతన్య తన అయిదేళ్ల కుమారుడు భాస్కరతో కిటికీ పక్కన కూర్చుని ఉన్నాడు. 

రైలు కిటికీలోంచీ వీస్తున్న చల్లగాలీ, అప్పుడప్పుడే ఉదయిస్తున్న సూర్యుడి నులివెచ్చని కిరణాలూ ఒకే సమయంలో మేనికి తాకుతూ మనసుకు హాయిని కలిగిస్తూ ఉండటంతో, పొలం పై ఎగురుతున్న పక్షులను చూస్తూ ఆనందంతో చప్పట్లు కొడుతున్నాడు భాస్కర. ముద్దుముద్దు మాటలతో భాస్కర చెబుతున్న కబుర్లను మురిపెంగా వింటూ, అతడు అమాయకంగా అడుగుతున్న ప్రశ్నలకు ఓర్పుతో సమాధానాలనిస్తూ, మధ్యమధ్యల్లో అతడిని ఆడిస్తూ, లాలిస్తూ, ఊరడిస్తూ, గారాబం చేస్తూ ఒక తండ్రిగా మురిసిపోతున్నాడు చైతన్య. 

అదే సమయంలో చైతన్యకు ఎదురుగా ఉన్న సీట్లోనే కూర్చుని ఉన్నా, ఆ కనపడుతున్న ప్రకృతి అందాన్ని కానీ, ముచ్చటగొలుపుతున్న భాస్కర చేష్టలను కానీ ఏమాత్రం పట్టించుకోవట్లేదు వెంకయ్య, రామచంద్రలు! రామచంద్ర చేతులు కట్టుకుని, నవ్వటం మర్చిపోయిన వాడల్లే మౌనంగా కూర్చున్నాడు. వెంకయ్య ముఖంలో దిగులూ, విచారం కొట్టొచ్చినట్లు కనపడుతున్నాయి. వృద్ధాప్యంవల్ల వెంకయ్య చర్మం ముడతలు పడిపోయి, అతడి దేహం పుల్లలా మారింది. అడుగు తీసి అడుగు వెయ్యడం అతడికి కష్టంగా ఉన్నా, ఆరోగ్యసమస్యలవల్ల ఒక కర్ర సహాయంతో మాటిమాటికీ లేచి ఇటు అటూ నాలుగడుగులు నడిచి మళ్ళీ వచ్చి తన సీట్లో కూర్చుంటున్నాడు వెంకయ్య. 

ఓమారు అలా లేవబోతూ రైలు కుదుపులవల్ల తూలి పడబోతున్న వెంకయ్య చెయ్యిని పట్టుకుని,  "నన్ను సహాయం చెయ్యమంటారా?", అని వినయంగా అడిగాడు చైతన్య. 

"పర్లేదులే బాబూ! ఒంటరివాడిని! ఒక్కడినీ అవస్థలు పడటం ఎలాగో అలవాటు చేసుకోవాలి. తప్పదు!!", అంటూ నిట్టూర్చాడు వెంకయ్య. 

చైతన్య స్పందించేలోపు రైలు పెద్ద శబ్దం చేస్తూ ఒక్కసారిగా ఆగిపోయింది. ఆ ఊపుకి రైల్లోని వారంతా ఎవరో తోసినట్లుగా ముందుకి పడ్డారు. ఆ క్షణం వెంకయ్య మెరుపువేగంతో తన చేతులను అడ్డంగా పెట్టి, పై బెర్తు నుండీ రామచంద్ర మీద పడబోతున్న ఒక బరువైన సూట్-కేసును ఆపాడు. సూట్-కేసు బరువుకు వెంకయ్య చెయ్యి విరిగినంత పనైంది. 

అప్పటివరకూ భాస్కరను తన గుండెలకు గట్టిగా హత్తుకుని, తన కౌగిట్లో అతడికి  రక్షణనూ, ధైర్యాన్నీ కల్పిస్తున్న చైతన్య తేరుకుని, "ఇదేమిటండీ? అంత బరువైన సూట్-కేసును బొత్తిగా బలంలేని మీ చేతులతో ఆపగలనని అసలు ఎలా అనుకున్నారూ?? ఆ సీట్లో కూర్చున్న వ్యక్తి మీకన్నా దృఢంగా కనపడుతున్నాడు. ఏదోవిధంగా ఆ దెబ్బను అతడు తట్టుకోగలిగేవాడేమో!", అన్నాడు కంగారుగా వెంకయ్య చేతిని పరిశీలిస్తూ. 

అందుకు వెంకయ్య, "బాబూ! ఈ రైలు ఎక్కినప్పటినుండీ చూస్తున్నాను. నువ్వు నీ కొడుకుకి ఎటువంటి కష్టమూ కలగకుండా చూసుకుంటున్నావు. మరి నేను కూడా నా ఒక్కగానొక్క కొడుకుని అలాగే జాగ్రత్తగా చూసుకుంటూ పెంచుకున్నవాడిని! వాడు ప్రమాదంలో ఉంటే వాడిని కాపాడవలసిన బాధ్యత నాదే కదా!!", అన్నాడు చిరునవ్వుతో.

"ఏమిటీ?? ఇతడు మీ అబ్బాయా?!!", అంటూ పరాయివాడిలా ప్రవర్తిస్తున్న రామచంద్రను చూసి ఆశ్చర్యపోయాడు చైతన్య.  

రామచంద్ర, వెంకయ్యల మధ్య మాటలు లేవని అర్ధం చేసుకున్న చైతన్య వెంకయ్యతో, “బాధపడకండి! ఈ కలియుగంలో ఇలాంటి కొడుకులుండటంలో ఆశ్చర్యం లేదు!”, అని అన్నాడు వెంకయ్యను ఓదారుస్తున్నట్లుగా.

"అబ్బే! అదేమీ లేదులే బాబూ! మావాడు మంచివాడేలే!!", నవ్వుతూ అన్నాడు వెంకయ్య.    

ఆ నవ్వు బలవంతంగా తెచ్చుకున్నదని చైతన్యకు ఇట్టే అర్ధమైపోయింది.

‘కొందరిని మార్చలేం!’, అని మనసులో అనుకున్నాడు చైతన్య.

అంతలో రైలు ఆఖరి స్టేషన్లో ఆగింది. వెంకయ్య గాయమైన తన చేతిని తన కండువాతో చుట్టి, తన సామాను పట్టుకుని కొంచెం కష్టపడి లేచాడు. వెంకయ్య రైలు దిగటానికి చైతన్య సహాయం చేశాడు. కొద్దిసేపటి తర్వాత రామచంద్ర కూడా రైలు దిగాడు. వెంకయ్య రామచంద్ర వంక చిరునవ్వుతో చూస్తూ తన దగ్గరకు రమ్మని సైగ చేశాడు. అంతవరకూ దీర్ఘాలోచనలో ఉన్న రామచంద్ర వెంకయ్య దగ్గరకు వెళ్ళాడు.

"ఒరేయ్ నాన్నా! నేను వెడుతున్నది మన సొంత ఊరిలోని మన పాత ఇంటికేగా! నా గురించి దిగులు పడకురా! నువ్వు ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి! అదే నా కోరిక!! వెళ్ళొస్తా!!", అన్నాడు వెంకయ్య.

అప్పుడు రామచంద్ర వెంకయ్య చెయ్యి పట్టుకుని, "ఆగు నాన్నా! నేనుండగా నువ్వు ఒంటరి జీవితం గడపాల్సిన అవసరం లేదు! నాకు ఊహ తెలిసినప్పటినుండీ నువ్వు నాకు అంతులేని ప్రేమను పంచిపెట్టావు! నన్ను చదివించి నా బాగోగులన్నీ చూశావు. ఇవాళ రైల్లో నువ్వు చెయ్యి అడ్డుపెట్టి నన్ను కాపాడకపోయి ఉంటే నేను ఏమైపోయేవాడినో!! నిజానికి ఇందాక మనకు ఎదురుగా కూర్చుని ప్రయాణించిన ఆ తండ్రీ-కొడుకులలో నాకు నువ్వు-నేనే కనపడ్డాము! నిన్ను ఇలా దిక్కులేకుండా విడిచిపెట్టి వెళ్లిపోవడం నాకు ఇష్టంగా లేదు. అమ్మ బతికి ఉంటే ఇలా జరగనిచ్చేది కాదు! నీ కోడలికి నేను ఏదో ఒకటి సర్ది చెప్పుకుంటా! నువ్వు మాతోనే ఉందువుగాని. నిన్ను నావెంట తీసుకెళ్ళిపోతాను. రా నాన్నా!!", అంటూ వెంకయ్య చేతిలోని సామానును బలవంతంగా లాక్కుని టికెట్ కౌంటర్ వైపుకి వడివడిగా నడిచాడు రామచంద్ర.

"నా రాముడు ధర్మపరుడే!!", అని అనుకుంటూ పుత్రోత్సాహంతో వస్తున్న కన్నీటిని తుడుచుకుంటూ రామచంద్రను అనుసరించాడు వెంకయ్య.  

        

*****


No comments:

Post a Comment

Pages