తల్లి కష్టాలు - అచ్చంగా తెలుగు
 తల్లి కష్టాలు

డాక్టర్. బీ. యన్. వీ. పార్ధసారధి


విశ్వనాధం, ఉమాదేవిలకి రాధ ఒక్కగానొక్క కూతురు. విశ్వనాధం, ఉమాదేవి ఇద్దరు ఉద్యోగస్థులయినప్పటికీ రాధ ఒకేఒక్క సంతానం అవటంతో అల్లారుముద్దుగా పెంచారు. రాధ కాలేజీ లో చేరినప్పటికీ, నిత్యం ఉదయం తల్లి ఉమాదేవి రాధకి కంచం లో అన్నం కలిపి స్వయంగా తినిపించేది. కాలేజీ బస్సు రోజూ ఉదయం ఎనిమిది గంటలకి వచ్చి వాళ్ళ ఇంటిముందే ఆగేది. రాధ కాలేజీలో చదివిన నాలుగేళ్లలో ఏ ఒక్క రోజు కూడా బస్సు రావటానికి కాస్త ముందుకానీ, లేదా బస్సు వచ్చిన వెంటనే నైనా కానీ తయారయ్యేది కాదు. కనీసం రెండు నిమిషాలనుంచి నాలుగైదు నిమిషాల వరకు రోజూ బస్సు రాధ కోసం ఇంటిముందు ఆగేది. అదీకాకుండా కాలేజీ బస్సు ఉదయం బయలుదేరిన వెంటనే మొదటి హాల్ట్ రాధ ఇంటిముందే కావటం తో బస్సు డ్రైవర్ కూడా కాస్త సర్దుకుని పోయేవాడు కానీ ఎన్నడూ రాధని తొందర పెట్టేవాడు కాదు. పైగా రాధకి కాలేజీలో మంచి విద్యార్థిగా పేరు వుంది. మృదుస్వభావంతో అందరితో సౌమ్యంగా మాట్లాడటంతో రాధ అంటే కాలేజీలో లెక్చరర్స్ నుంచి స్టాఫ్ అందరికీ అభిమానం.

 

రోజూ బస్సు రావటం తోనే రాధ తండ్రి విశ్వనాధం గబగబా వాకిట్లోకి వచ్చి డ్రైవర్ కి కాస్త ఆగమని సంజ్ఞ చేస్తాడు. డ్రైవర్ చిరునవ్వు నవ్వి బస్సు ఆపుతాడు. రాధ నిదానంగా తల్లి ఉమాదేవి చేతిలో గోరుముద్దలు తిని నెమ్మదిగా బయలుదేరి బస్సు ఎక్కి కాలేజీకి వెడుతుంది. చాలాసార్లు విశ్వనాధం భార్య ఉమాదేవి తో, " నువ్వు అనవసరంగా నీ గారాబంతో పిల్లని పాడుచేస్తున్నావు. దానికి వెంటపడి మరీ గోరుముద్దలు తినిపించి నువ్వు మాత్రం నీ ఆఫీస్ కి టైం అయిపోయిందని హడావుడిగా తినీ తినక ఉరుకులు పరుగులతో రోజూ ఆఫీస్ కి వెడతావు. "అని విసుక్కునే వాడు. దానికి ఉమాదేవి భర్త తో, "మీ సంగతి నాకు తెలియదా?  నేను తినీ తినక ఆఫీస్ కి వెడుతున్నాననే దానికంటే, రోజూ మీరు బస్సు డ్రైవర్ కి కాస్త ఆగమని చెప్పటం ఇష్టం లేక పైకి నామీద లేని ప్రేమని ఒలకబోస్తున్నారన్న విషయం నేను గ్రహించలేనా ఏమిటి? " అని వ్యంగ్యం గా భర్తకి సమాధానం చెప్పటం ఆనవాయితీ గా మారింది.

రాధ చార్టర్డ్ అకౌంటెన్సీ కోర్స్ పాస్ అయ్యింది. డెల్లాయిట్ కంపెనీ లో రాధకి ఉద్యోగం వచ్చింది. వెంటనే రాధకి పెళ్లి చేశారు. రాధ మొగుడు వెంకట్ ఐ ఐ టీ చెన్నై లో ఇంజనీరింగ్ పాస్ అయ్యి టీ సీ ఎస్ లో ఉద్యోగం చేస్తున్నాడు. మరో రెండేళ్ళకి రాధకి ఆడపిల్ల పుట్టింది. రాధకి పెళ్ళికి ముందే వెంకట్ తండ్రి మరణించాడు. పెళ్లి జరిగిన ఏడాదికే అతని తల్లికూడా మరణించింది. రాధ కూతురు శిరీష మూడేళ్లు వచ్చేవరకు అమ్మమ్మ ఉమాదేవి దగ్గరే పెరిగింది. 

 

శిరీష ని మూడేళ్ళకి స్కూల్ లో వేసాక రాధ,వెంకట్ లు శిరీష ని తీసుకునివెళ్లారు. అప్పటినుంచి శిరీష ఆలనా పాలనా రాధ, వెంకట్ లు చూసుకోవటం మొదలుపెట్టారు. మరో అయిదేళ్లకి వెంకట్ ని పూనాకి బదిలీ చేశారు. దానితో రాధ కూడా తన ఆఫీస్ లో రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ పెట్టుకుని తనుకూడా పూనాకి బదిలీ చేయించుకుంది.

  పునాకి వెళ్ళాక ఏడాదికి ఒకసారి వేసవిలో రెండు, మూడు వారాలు రాధ కుటుంబంతో వచ్చి పుట్టింట్లో గడిపి వెడుతోంది. ఇలా నాలుగేళ్లు గడిచాయి. ఇప్పుడు శిరీషకి పన్నెండేళ్ళు నిండాయి. ఉమాదేవి, విశ్వనాధం షిర్డీ వెడదామని అనుకున్నారు. షిర్డీ నుంచి పూనా దగ్గరే కాబట్టి రాధ తల్లిదండ్రులని షిర్డీ నుంచి పూనా కి రమ్మనమంది. షిర్డీ లో బాబా దర్శనం చేసుకుని పూనా వెళ్లారు ఉమాదేవి, విశ్వనాధం కూతురు ఇంటికి.    

ఉమాదేవి,విశ్వనాధం శుక్రవారం  రాత్రి కి పూనా చేరారు. శని, ఆదివారాలు శలవు దినాలు కావటంతో రాధ, వెంకట్ లు (శిరీష తో సహా) ఉమాదేవి, విశ్వనాధంలకి పూనాలోని ముఖ్యమైన గుళ్ళు, గోపురాలు, మ్యూజియం, మార్కెట్ వగైరాలు చూపించారు.  

మర్నాడు సోమవారం రానేవచ్చింది. రాధ, వెంకట్ లు ఒకేసారి వాళ్ళ ఆఫీసులకి తొమ్మిది గంటలకి బయలుదేరుతారు. శిరీష స్కూల్ బస్సు ఉదయం ఎనిమిదిన్నరకి వస్తుంది. శిరీష ని రోజూ ఉదయం తెమిల్చి స్కూల్ కి పంపడం ఒక పెద్ద యజ్ఞం అని తెలిసి, ఉమాదేవి ఉదయమే లేచి రాధకి వంటలో సహాయం చేసినప్పటికీ, శిరీషని స్కూల్ టైం కి తెమల్చటం గగనమయ్యింది. ఉమాదేవి శిరీష కి తినిపించడానికి మొదట ప్రయత్నించినప్పటికీ ప్రయోజనం లేకపోడటంతో రాధ చొరబడి గబగబా శిరీష కి నాలుగు ముద్దలు తినిపించేసరికి దేముళ్ళు దిగొచ్చారు. బస్సు డ్రైవర్ హారన్ కొట్టిన మూడు నిమిషాలకి కానీ శిరీష బ్రేక్ ఫాస్ట్ పూర్తి కాలేదు.

అప్పటికే వెంకట్ మూడుసార్లు వాకిట్లోకి వెళ్లి బస్సు డ్రైవర్ ని కాస్త ఆగమని ప్రాధేయ పడ్డాడు. మధ్య మధ్యలో ఇంటిలోపలికి వచ్చి శిరీష మీద, రాధ మీద వెంకట్ విసుక్కున్నాడు. ఈ తతంగం అంతా చూస్తున్న విశ్వనాధం వెంకట్ కి నెమ్మదిగా నచ్చ చెప్పాడు. విశ్వనాధం, వెంకట్ ల మధ్య జరిగిన సంభాషణని ఓరకంట గమనిస్తూనే వుంది ఉమా దేవి.

శిరీష వెళ్లిన అరగంటకి హడావుడిగా నాలుగు మెతుకులు తిని, ఉమాదేవి సర్ది పెట్టిన లంచ్ బాక్స్ లు తీసుకుని రాధ, వెంకట్ లు ఆఫీసులకి బయలుదేరారు.

" హమ్మయ్య. తుఫాను వెలిసినట్టయ్యింది.  వెంకట్ కూడా రోజూ రాధ కి ఉదయం కాస్త పనుల్లో సహాయం చేస్తే హడావిడి లేకుండా ముగ్గురూ నాలుగు మెతుకులు తిని వెడతారు కదా. అది లేకుండా పైపెచ్చు వెంకట్ రాధ మీద విసుక్కుంటే పాపం తను ఒక్కర్తే అన్ని పనులని ఎలా చెయ్యగలదు.  " అన్నాడు విశ్వనాధం ఉమాదేవి తో.

" అబ్బో. కూతురి మీద ప్రేమ ఒలక బోస్తున్నారు. రాధ చిన్నప్పుడు స్కూల్ కే కాదు కాలేజీకి వెళ్లడానికికూడా ఎంత సతాయించేదో అప్పుడే మరచిపోయారా? ఏ నాడైనా మీరు నాకు చిన్న సహాయం చేశారా? పైగా ఎప్పుడూ నామీదే విసుక్కునేవారు కదా! ఇప్పుడు మీ అల్లుడు కూడా మీలాగే ప్రవర్తిస్తున్నాడు. మీ మగవాళ్ళు అందరూ ఇంతే " అంది ఉమాదేవి నిష్టూరం గా.

"మగవాడు భర్త హోదా నుంచి తండ్రిగా మారినా సరే అతని కూతురు తల్లి అయ్యాక కానీ ఒక స్త్రీ తల్లిగా పడే కష్టాలు పూర్తిగా అర్ధం చేసుకోలేడు అన్న సంగతి నేను ఇప్పుడు గ్రహించాను." అన్నడు విశ్వనాధం.

" మన శిరీష పెరిగి పెద్ద అయ్యి పెళ్లి అవటానికి చాలా కాలం పడుతుంది. అంతవరకు తను పడే తల్లి కష్టాలు వెంకట్ ఎప్పుడు అర్ధం చేసుకుంటాడా అని మన రాధ ఎదురుచూస్తూ ఉంటుంది లెండి." అంది ఉమాదేవి వ్యంగ్యం గా.

***

No comments:

Post a Comment

Pages