పుణ్యవతి (నవల) - 6 - అచ్చంగా తెలుగు

పుణ్యవతి (నవల) - 6

Share This
పుణ్యవతి (నవల) - 6
రచన : గొర్తి వెంకట సోమనాథ శాస్త్రి(సోమసుధ)
@@@@@@@


(తను చూసిన ఇంట్లో అద్దెకు దిగటానికి సిఫార్సు చేయమని పుణ్యవతిని రవి అడుగుతాడు. రంగనాధం గారి పెద్ద కూతురి మరణం తరువాత ఆయన అలా మారిపోయారని ఆమె రవికి చెబుతుంది. అదే సమయానికి అక్కడికి వచ్చిన సృజన కళ్ళలో రవి పట్ల మమకారాన్ని గమనించిన పుణ్య, ఆమె వెళ్ళిపోయాక సృజనను పెళ్ళి చేసుకోమని రవిని అడుగుతుంది. తరువాత. . .)
@@@@@@@

"చూడమ్మా! స్నేహం వేరు, ప్రేమ వేరు. నీ స్నేహితురాలి ఆశలేమిటో మనకు తెలియదు. చూద్దాం. అయితే నా వైపు నుంచి అభ్యంతరం లేదు" రవి మాటలకు పుణ్యవతి కళ్ళలో ఆనందం చిగురించింది

"అన్నయ్యా! నాన్న ఆఫీసు పనిపై ఊరు వెళ్తున్న దారిలో జరిగిన బస్సు ప్రమాదంలో మరణించారు! భర్త పోయాక అమ్మను మా బంధువులంతా దూరం పెట్టారు. అలాగని అమ్మ అధైర్యపడలేదు. నాన్న పోయాక వచ్చిన ఉద్యోగంతో శేఖరం అన్నయ్యను, నన్ను పెంచి పెద్దచేసింది. ఎప్పుడూ మూడీగా ఉండే శేఖరం అన్నయ్య ముందు నిలబడాలంటేనే భయం. అన్నయ్య మంచివాడే! కానీ తన గొడవేదో తనది, నన్ను పట్టించుకొనేవాడే కాదు. ఉద్యోగం వచ్చిన కొన్నాళ్ళకు అమ్మ ఈ ఊరు బదిలీ చేయించుకొని మా బంధువులకు దూరంగా వచ్చేసింది. నాకు ఊహ తెలిసే సమయానికి రంగనాధం గారు, ఆయన ఇద్దరు కూతుళ్ళు పరిచయమయ్యారు. నేను కూడా ఎక్కువగా వాళ్ళింట్లోనే ఉంటూ, వాళ్ళతో బాటే ఆయన్ని నాన్నగారని పిలవటం అలవాటు చేసుకున్నాను. సృజన కన్నా సుధ అక్కయ్యతో ఎక్కువ చనువుగా ఉండేదాన్ని. సుధ మంచి భావుకత గల కవితలను, సినిమా పాటలను పుస్తకంలో వ్రాసుకునేది. తనకున్న పరిమిత జ్ఞానంలోనే హిందీలోను, తెలుగులోను చిన్నచిన్న కవితలను వ్రాసేది. పూలన్నా, పిల్లలన్నా దానికి ప్రాణం. వాళ్ళింట్లో నువ్వు చూసిన పూలతోట దాని హృదయానికి దర్పణం. చుట్టుపక్కల పిల్లల్ని ముస్తాబు చేయటంలో దాని కళాహృదయం కనిపించేది. వంటలు, ముగ్గులు - పదిహేనేళ్ళకే అది అన్నింటిలోను నిష్ణాతురాలైంది. మా కన్నా వయసులో అయిదేళ్ళే పెద్దదైనా, అంతకు మించిన పెద్దరికం దానిలో కనిపించేది. మా రెండిళ్ళల్లో ఎలాంటి సమస్యలొచ్చినా, సులువుగా పరిష్కరించేది. మూడేళ్ళ క్రితం అమ్మ చనిపోయినప్పుడు, దహనకాండకు సుధ అక్కయ్యే అన్నీ దగ్గర ఉండి పర్యవేక్షించింది. మగాళ్ళ ముందు ఆడపిల్ల తలెత్తి మాట్లాడకూడదని శాసించే శేఖరం అన్నయ్య కూడా సుధని సొంత చెల్లిగా ఎక్కువ అభిమానించేవాడు. పెద్దయితే, అది మంచి సంఘసేవికగా పేరు తెచ్చుకొనేది. ఆ రోజుల్లో నా హీరో, నాకు ప్రోత్సాహం సుధ అక్కయ్యే! 'నాతో చదువుతూ, మా అక్కయ్యతో తిరుగుతావేమే' అని సృజి నాతో ఎప్పుడూ కొట్లాడేది. అమ్మ చనిపోయిన ఏడాదిన్నరకి, మేము అక్కడనుంచి యిక్కడకు యిల్లు మారిపోయాం. మంచివాళ్ళను దేవుడు ఎక్కువ కాలం ఉంచడంటారు. సుధ ప్రేమవివాహానికి నాన్నగారు అడ్డు చెప్పలేదు. కానీ వాడి విశ్వరూపం, తన తండ్రిని నడివీధిలో కొట్టి అవమానించటం అది తట్టుకోలేకపోయింది. జీవితంలో పోరాడి గెలవాలనే తను ఇరవై ఏళ్ళకే వెళ్ళిపోయింది. ఆమె మరణంతో రంగనాధంగారు మానసికంగా దెబ్బతిన్నారు. తను బ్రతికి ఉండగానే సృజన్ని ఒక మంచి కుటుంబానికి పంపాలని తాపత్రయపడుతున్నారు. సృజి కూడా మనసులో ఏమనుకున్నా, తన తండ్రికి ఇష్టం లేని పని చేయదు. వాళ్ళిద్దరి మనసులో ఒకటే కలవరం. సృజీకి ఎలాంటి భర్త వస్తాడోనని! ఏడాది క్రితం అన్నయ్య స్నేహితుడిగా నువ్వు వచ్చావు. మాటల మధ్యలో చిన్న చిన్న కవితలు చెప్పే నీలో సుధే నాకు కనిపించింది. ఆ రోజు పిక్నిక్కులో మీ ఇద్దరినీ కలిపినా, నాకీ ఆలోచన రాలేదు. నిన్న నువ్వు వాళ్ళింటికి వెళ్ళటం, ఈరోజు యిద్దరూ యిక్కడ కలవటం, నిన్ను చూస్తున్న దాని కళ్ళలో మెరుపు చూసిన తరువాత నాకీ ఆలోచన వచ్చింది. సుధ చావుతో హతాశులైన రంగనాధంగారు కోలుకోవాలన్నా, సాంసారిక జీవితానికి భయపడే సృజన ఆనందంగా నా కళ్ళ ముందు తిరగాలన్నా నువ్వు దాన్ని పెళ్ళి చేసుకోవాలి."

పుణ్య దీర్ఘోపన్యాసానికి రవి నవ్వుతూ, "అలాగే! కానీ ఈ ఆరు నెలలు పూర్తవనీ! తన డిగ్రీ కూడా పూర్తి అవుతుంది. అంతవరకు ఇది నీ మనసులో ఉంచుకో!" అన్నాడు.

"అది కాదన్నయ్యా. . .!"

"చూడమ్మా! జీవితంలో పెళ్ళి ముఖ్యమైన ఘట్టమే! కానీ పెళ్ళే జీవితం కాదు. జీవితంలో సాధించవలసిన విషయాలు వేరే కూడా ఉంటాయి. అది మరిచిపోయే ఈరోజుల్లో చాలామంది దెబ్బ తింటున్నారు. ఏ వయసుకి ఆ ముచ్చట అన్నది నిజమే కావచ్చు. చదువు కూడా ఈ వయసులో ముచ్చటే కదా! జీవితం ముచ్చటగా సాగాలంటే మనం సమస్యలను పరిష్కరించుకొనే పరిజ్ఞానం ముందు సంపాదించుకోవాలి. ఎలాగోలా జీవించటం కాదు. ఒక పద్ధతి ప్రకారం జీవితాన్ని మలచుకోవాలన్నది నా ఉద్దేశం!"

రవి మాటలు పూర్తయ్యే సమయానికి శేఖర్ వచ్చాడు. అతని రాకను గమనించి పుణ్యవతి వంటింట్లోకెళ్ళింది.

"ఈరోజు ఆలశ్యమైనట్లుంది" శేఖరాన్ని అడిగాడు రవి.

"ఈమధ్య ప్రయివేటుగా ఎం.బి.ఎ. చేస్తున్నారా!" బూట్లు విప్పుతూ బదులిచ్చాడు శేఖర్.

"బాంకు ఉద్యోగానికి పరీక్ష వ్రాసినప్పుడు మనిద్దరం పరీక్ష హాల్లో కలుసుకున్నాం. నాకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. నువ్వు ప్రయివేటు కంపెనీలో చేరావు. పొరుగూరినుంచి ఉద్యోగానికి వచ్చిన నన్ను కొన్నాళ్ళు నీ ఇంట్లో పెట్టుకున్నావు. ఇన్నాళ్ళూ ఆ స్నేహానికి పొంగిపోయేవాణ్ణి. ఇప్పుడు జీవితంలో ఇంకా పైకి రావాలని నువ్వు పడుతున్న తాపత్రయం చూస్తుంటే, అభినందించకుండా ఉండలేకపోతున్నాను" రవి మాటలకు గంభీరంగా మారిపోయాడు శేఖర్.

"నాన్న చిన్నప్పుడే పోయాడు. బంధువులెవ్వరి ఆదరణకి నోచుకోని అమ్మ, తన కష్టంతో నన్ను డిగ్రీ వరకూ చదివించింది. నేను ఋణం తీర్చుకునేలోపునే అమ్మ వెళ్ళిపోయింది. ప్రస్తుతం బంధువులంతా మా యిద్దరినీ పూర్తిగా దూరం పెట్టారు. అప్పుడే నాలో కసి పెరిగింది. ఈ ప్రేమలు, అభిమానాలు అంతా వట్టి ట్రాష్! భార్యాభర్తల అనుబంధాన్ని కూడా విడదీసేది డబ్బు. ఆ డబ్బు కోసమే కష్టపడతాను. జీవితంలో పైస్థాయికి ఎదగటమే నా లక్ష్యం. అందుకోసం ఎలాంటి అడ్డంకులైనా ఎదిరిస్తాను. ఎంత నష్టాన్నయినా భరిస్తాను. నా ఎదుగుదలకు అడ్డుపడే ఏ బంధాన్నయినా వదిలేస్తాను."

"మా రచయితలు కాయకష్టం చేయకుండా నీతివాక్యాలు వ్రాస్తూ ప్రజల్ని సొమ్ము చేసుకుంటాం. మా కన్నా నీలాంటివారేరా మార్గదర్శకులు. మీరు కష్టపడి బాగుపడుతూ, సంఘాన్ని బాగుచేస్తారు."

రవి మాటలకు చిరునవ్వు నవ్వుతూ బట్టలు మార్చుకుని, పెరట్లోకి వెళ్ళాడు శేఖర్.

"అన్నయ్యా! నువ్వు ఇంటికి వెళ్ళి కష్టపడొద్దు. ఇక్కడే భోజనం చేసి వెళ్ళాలి" అంది అప్పుడే లోనుంచి వచ్చిన పుణ్యవతి.

"వాడెక్కడికీ పోడు గానీ ముందు నాకు భోజనం పెట్టు" అప్పుడే పెరట్లోంచి వచ్చిన శేఖర్ చిరాకుగా అన్నాడు. పుణ్యవతి అయిదు నిమిషాల్లో యిద్దరికీ వడ్డించింది.

"నువ్వు కూడా వడ్డించుకో!" అన్నాడు రవి.

"అది తరువాత తింటుందిలే!" శేఖర్ అనగానే రవి మౌనం దాల్చాడు.

"అన్నయ్యా! పాయసం!" చేతులు కడుక్కోబోతున్న శేఖర్‌తో అందామె.

"వద్దు" అని చేతులు కడిగాడు.

"ఈరోజు నా పుట్టినరోజని పాయసం వండాను. నువ్వు పొద్దున కూడా తినలేదు" భయపడుతూ చెప్పిందామె.

"వద్దని చెప్పానుగా! విసిగించకు!" కంచం ముందునుంచి లేచి పక్కగదిలోకి వెళ్ళిపోయాడు శేఖర్.

పుణ్యవతి కంట్లో నీళ్ళను గమనించాడు రవి. ఆమె హృదయం గాయపడిందని అతనికి అర్థమైంది.

"ఆ అన్నయ్య తినకపోతేనేం! ఈ అన్నయ్య ఉన్నాడుగా! పాయసంలో కాస్త ఉప్పు కలిపి తీసుకురా! అమృతంలా తాగేస్తాను" నవ్వుతూ అన్నాడు.

"అది కాదు. పొద్దున్న పాయసం పెడితే సాయంత్రం తింటానన్నాడు. ఇప్పుడిలా అంటున్నాడు" అంటూ కొంగుతో కళ్ళు తుడుచుకొందామె.

"కడుపు నిండా తింటే నిద్ర వస్తుందని వాడి భయమనుకుంటా! పై చదువులు చదువుతున్నాడు కదా! అంతేగానీ నీ మీద కోపం ఉండి కాదు. "

"అలాగే వాణ్ణి వెనకేసుకు రా!"

"మన దారికి వాడు రానప్పుడు మనకి మనమే ఏదో సర్ది చెప్పుకోవాలి గానీ, శత్రుత్వం పెంచుకోకూడదు. అంతేకాదు. ఈరోజు నీ పుట్టిన రోజు. పుట్టిన రోజు పూట నువ్వు కన్నీళ్ళు పెట్టుకుంటే ఆ అన్నకు జయం కాదు. ఊరుకో!" రవి మాటలకు కళ్ళు తుడుచుకొని అతనికి పాయసం వడ్డించింది.

"అన్నలోని అనురాగం ఆరిపోని బాధ్యత!
చెల్లిలోని మమకారం చెల్లిపోని చేయూత! "

"కొటేషను కొట్టావూ! నీ మాటలు మెచ్చుకుంటాను కదాని మరీ అంత ఉబ్బేయకు. అందరు అన్నలు అలా ఉంటారంటావా? తనకంటూ ఒక జీవితం ఏర్పడ్డాక, ఎవరి బాధలు వాళ్ళవే!"
@@@@@@@@@@@


"పుణ్యా! అక్కయ్య సావాసం చేసి నూటికి తొంభై శాతం దానిలాగే తయారయ్యావు. ఆ మొండితనం, ఆ పట్టుదలా..."

"ఆపుతావా? అక్కయ్య ఎవరనుకున్నావు? నా హీరో! అది మగాడై ఉంటేనా? నీకు వదిన్నయి, నిన్ను కాల్చుకు తినేదాన్ని. ప్చ్! నాకు అదృష్టం లేదు."

"పుణ్యా! నా కన్నా రెండు నెలలు పెద్దదానివి. నాకు అక్కయ్యలాంటి దానివి. నువ్వేమీ అనుకోనంటే నీకొక విషయం చెప్పాలని ఉంది."

చెప్పమన్నట్లు తలూపింది పుణ్యవతి.

(ఇంకా ఉంది)

No comments:

Post a Comment

Pages