దివ్యజ్యోతి - 4(పెద్ద కథ) - అచ్చంగా తెలుగు

దివ్యజ్యోతి - 4(పెద్ద కథ)

Share This
దివ్య జ్యోతి - 4 (పెద్ద కథ)
రోజారమణి
అనసూయమ్మ జ్యోతి వైపు చూసింది. " అమ్మా!  ఇంట్లో పెద్ద గొడవ అయింది. నేనే మీకు చెబుదామనుకున్నాను. ఈ లోపల మీరే వచ్చారు. ఇంటిదగ్గర చెప్పడానికి వీలుపడలేదు. అందుకనే ఇలా పని ఉందని మీతో పాటు వచ్చాను."  "సరే ఏం జరిగింది చెప్పు"
 " అమ్మ, తమ్ముడు ఖర్చులకు విపరీతంగా డబ్బులు అడుగుతున్నారని భరద్వాజ్ గారు చెబుతున్నారు. లెక్కల్లో భరద్వాజ్ గారు ఒక అమౌంట్ చూపిస్తే, అమ్మ తమ్ముడు మేమంత  తీసుకోలేదని  చెబుతున్నారు. ఈ విషయం మీద ఇంట్లో గొడవ అయింది. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కాలేదు. అలా అనేసరికి భరద్వాజ్ గారికి కోపం వచ్చి వెళ్ళిపోయారు.  నేను తర్వాత లెక్కలన్నీ పరిశీలించి చూశాను. నాకెందుకో మా అమ్మది, తమ్ముడుది తప్పు ఉందని అనిపించింది.  అప్పటికే అంతా అయిపోయింది.  ఇప్పుడు నేను ఏం చేయగలను. ఎవరిని అడిగితే ఏ విధంగా అర్థం చేసుకుంటారో అని భయం. అమ్మని, తమ్ముడు ని ఏమీ అనలేక భరద్వాజ్ గారి మీద చిరాకు పడ్డాను. అది మనసులో పెట్టుకుని భరద్వాజ్ గారువెళ్ళిపోయారు. మళ్లీ వేరే మేనేజర్ కోసం వెతుక్కోవాలి. ఇలా అయిందని తెలిస్తే కృష్ణ రావు గారు కూడా బాధపడతారు. కానీ..  నాది ఏమి చేయలేని పరిస్థితి అయిపోయింది." అంది జ్యోతి.  "అదే ఏదో జరిగి ఉంటుందని నాకు అనిపించింది. సరేలే! జరిగిందేదో జరిగింది. కృష్ణారావు గారికి నేను చెప్తాను. మళ్లీ వేరే మేనేజర్ ని ఎవరినైనా వెతుకుదాం. ఈసారి కాస్త జాగ్రత్తగా ఉండు జ్యోతి. డబ్బు చాలా ప్రమాదమైనది. డబ్బు సంపాదించడమే కాదు అందరితో ఎలా జాగ్రత్తగా ఉండాలి అన్నది కూడా తెలుసుకోవాలి. లేకపోతే ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు" అన్నారు అనసూయమ్మ గారు.   మాటల సందర్భంలో అనసూయమ్మ గారు "అవునట్టు రాహుల్ నీది కూడా MBA అయింది అన్నావ్ కదా! మరి ఇప్పుడు చేస్తున్న ఉద్యోగం బాగానే ఉందా? " "పరవాలేదు ఆంటీ" అన్నాడు రాహుల్." అది కాదు నీకేమీ అభ్యంతరం లేదంటే  మన జ్యోతి దగ్గరే మేనేజర్ గా ఎందుకు పనిచేయకూడదు. పైగా నువ్వు జ్యోతి శ్రేయస్సు కోరుకునే వాడివి కూడాను. నీ చదువుకు తగ్గ జీతం జ్యోతి ఇస్తుందిలే! ఏమంటావ్ జ్యోతి? " అడిగింది అనసూయమ్మ. "మీరు ఎలాగంటే అలాగేనమ్మా. మీకన్నా నా మంచి కోరుకునే వారు ఇంకెవరున్నారు? " అంది జ్యోతి. "రాహుల్ నువ్వేమీ మాట్లాడటమే లేదు. ఏమంటావ్?" "అలాగే ఆంటీ. మీ మాట నేనెందుకు కాదంటాను. నాకు కూడా జ్యోతి దగ్గర పని చేయటం అంటే చాలా సంతోషం. జ్యోతి మంచి కోరుకునే వారిలో నేను కూడా ఒకడినే. మీరు ఎలా చెప్తే అలాగే చేద్దాం. కాకుంటే ఒక నెలరోజులు గడువు ఇవ్వండి. ఇప్పుడు పని చేసే ఆఫీస్ లో రిజైన్ చేయాలి కదా!" అన్నాడు రాహుల్.  ఈ లోపు అనసూయమ్మ గారి ఇల్లు రానే వచ్చింది. రాహుల్ అనసూయమ్మ గారిని దింపి మరల జ్యోతిని తీసుకుని వెనుతిరిగాడు. "జ్యోతీ! ఆంటీ చెప్పింది నీకు సమ్మతమేనా?"  అడిగాడు రాహుల్.   "అనసూయమ్మ గారు నా మంచి కోరుకునే వ్యక్తి. నువ్వు నాకు మంచి స్నేహితుడివి. అలాగే నా మంచి కోరుకునే వాడివి కూడా! నువ్వు మేనేజర్ గా ఉంటానంటే అంతకు మించి నాకు కావాల్సిందేముంది" అంది జ్యోతి. రాహుల్ జ్యోతిని తన ఇంటి దగ్గర దింపి, కార్ తీసుకుని అనసూయమ్మ గారి ఇంటికి వెళ్లిపోయాడు.  నెలరోజుల తర్వాత రాహుల్ మేనేజర్ గా జ్యోతి దగ్గర చేరాడు. జ్యోతి ఫైనాన్షియల్ వ్యవహారాలు, ఖర్చులు,జమలు అన్నీ రాహుల్ చూసుకోవడం ప్రారంభించాడు. జ్యోతి తల్లి, తమ్ముడు చేస్తున్న ఖర్చులన్నీ మొహమాటం లేకుండా జ్యోతి తో చెప్పటం, అలాగే వారికి కూడా అడిగినంత డబ్బు కాకుండా జ్యోతి ఎంత చెప్తే అంతే ఇవ్వడం ఇటువంటి వ్యవహారాలన్నీ చాలా చాకచక్యంగా నిర్వహించేవాడు.      దీంతో జ్యోతికి కూడా రాహుల్ అంటే నమ్మకం అభిమానం రెండూ ఏర్పడ్డాయి.  వారి మధ్య  స్నేహం ఇంకా బలపడింది. జ్యోతి కి ఆ అభిమానం,  స్నేహం చాలా బాగా నచ్చాయి. తన సంతోషం కోసం ఆలోచించే ఒక వ్యక్తి తన జీవితంలోకి వచ్చాడు అన్న ఆనందం జ్యోతిలో తొంగి చూసింది.  రాహుల్ జ్యోతి యొక్క ఫైనాన్షియల్ వ్యవహారాలతో పాటు ఆమె డేట్స్ కూడా చూసుకునేవాడు.      "రాహుల్! ఈరోజు రాత్రికి మా ఇంటికి భోజనానికి రా! చాలా రోజులైంది నీతో మనసు విప్పి మాట్లాడి, కాసేపలా మాట్లాడుకుందాం!" అంది జ్యోతి.  "ఇప్పుడు ఎందుకులే జ్యోతి మరోసారి వస్తాను." "అలా కాదు, నాకు కూడా సమయం ఎక్కువగా దొరకదు కదా! రేపు షూటింగ్ ఏమీ లేదు కదా !"  " లేదనుకో"  "మరింకేం రా!" అంది జ్యోతి. 
చీకటి పడే సమయానికి ఇద్దరూ జ్యోతి ఇంటికి చేరుకున్నారు. "రాహుల్ కూర్చో! ఐదు నిమిషాల్లో ఫ్రెష్ అయి వస్తాను. ఇద్దరం కలిసి భోజనం చేద్దాం!" అంటూ పనమ్మాయిని పిలిచి రాహుల్ కు జ్యూస్ ఇమ్మని చెప్పి జ్యోతి తన గదిలోకి వెళ్లిపోయింది. కాసేపటి తరువాత తెలుపు రంగు జార్జెట్ నైట్ గౌను వేసుకుని,  జుట్టు అంతటినీ గులాబీ రంగు రిబ్బన్ తో కట్టి పోనీటైల్ వేసుకుని  దిగింది జ్యోతి. చూడ చక్కని రూపం జ్యోతిది. రాహుల్ జ్యోతిని చూస్తూ అలాగే ఉండిపోయాడు. " రాహుల్ ఏంటి అలా చూస్తున్నావ్? పద భోజనానికి వెళ్దాం!" ఇద్దరూ డైనింగ్ టేబుల్ పైన ఎదురెదురుగా కూర్చున్నారు. నౌకరు వడ్డిస్తున్నాడు. "ఏంటి? ఈరోజు కూడా దొండకాయ కూరేనా? నాకు నచ్చదు అని ఎన్నిసార్లు చెప్పను. నేను తినే రెండు రొట్టెలకు నాకు ఇష్టమైన కూర చేయటానికి లేదా? ఎన్నిసార్లు ఈ కూర వొద్దని చెప్పినా ఇదే చేస్తూ ఉంటారు " గట్టిగా అరిచింది జ్యోతి. " నేను అమ్మగారికి చెప్పానమ్మా! జ్యోతమ్మ గారికి దొండకాయ అంటే ఇష్టం ఉండదని. కానీ ఈ పూటకిలా కానిచ్చేయమంటే చేశాను." అన్నాడు నౌకరు. జ్యోతి కేకలు విని రంగమ్మ బయటికి వచ్చింది. " ఏమైందే తల్లీ! ఎందుకలా కేకలు పెడుతున్నావ్?"  "నేను తినేది రెండు రొట్టెలు. కనీసం దానికి నాకు నచ్చిన కూర చేయకపోతే ఎలా? " అడిగింది జ్యోతి. "ఈరోజు కూడా దొండకాయ కూరే చేశావా? ఎన్నిసార్లు చెప్పను దొండకాయ కూర అంటే జ్యోతికి ఇష్టం ఉండదని? " 'అమ్మగారు మీకు ఉదయమే చెప్పాను కదా! కూరగాయలన్నీ అయిపోయాయి.  జ్యోతమ్మ గారికి దొండకాయ కూర అంటే ఇష్టం ఉండదని. ఈ పూటకి చేశేయమంటేనే చేశాను కదా!"  అన్నాడు నౌకర్. నౌకరు వైపు కళ్ళు ఎర్రగించి చూసింది రంగమ్మ. "కూరగాయలు అయిపోయాయి అని చెప్తే నేను తెప్పించకుండా ఉండుండేదన్నా? నువ్వు చెప్పకుండా తప్పు నా మీద పెడితే  ఎలా?" అంటూ ప్లేట్ మార్చింది రంగమ్మ.  "మళ్లీ ఇటువంటి పొరపాటు ఇంకెప్పుడూ చేయకూడదు" అంటూ నౌకరు కు వార్నింగ్ ఇచ్చింది రంగమ్మ. ఎటువైపు సమాధానం చెప్పలేని నౌకరు మిన్నకుండిపోయాడు.  జ్యోతి కి పరిస్థితి అంతా అర్థమైంది. "నువ్వు తిను రాహుల్  ఈ ఫ్రూట్స్ నేను తినేస్తాను. ఇదంతా మా ఇంట్లో సాధారణమైన విషయమే! నువ్వు కానీ!" అంది జ్యోతి. "ఏదో తిన్నాను అనిపించుకున్నాడు రాహుల్ "  ఇద్దరూ కలిసి లాన్ లో  అలా కాసేపు కూర్చున్నారు.   "నా గురించి నీ అభిప్రాయం ఏమిటి" అడిగింది జ్యోతి 
రాహుల్ మౌనంగా చూశాడు. "మాట్లాడవేం రాహుల్?" "ఏం మాట్లాడను?" "అదే నాపైన నీ ఉద్దేశం ఏమిటి?" అని  "నువ్వేం అనుకుంటున్నావ్ నా గురించి?" "ఇవన్నీ కాదుగానీ మనం పెళ్లి చేసుకుందామా?" సూటిగా అడిగింది జ్యోతి. "అన్నీ ఆలోచించే అడుగుతున్నావా? జ్యోతి"  "అవును రాహుల్. నీ కన్నా మంచి వాడు, నన్ను అర్థం చేసుకునే వాడు నాకు దొరకడు. పైగా నువ్వంటే నాకు చాలా అభిమానం, ఇష్టం కూడా! నీకు కూడా నేనంటే అభిమానం ఉందనే నాకు అనిపించింది. అందుకనే చనువుతో అడుగుతున్నాను. ఏమంటావ్?" "మీ అమ్మగారు, మీ ఇంటి పరిస్థితులు అన్నీ ఆలోచించే నిర్ణయం తీసుకుంటున్నావా?"  "అవన్నీ పక్కన పెట్టు నేనంటే నీకు ఇష్టమా కాదా? అది మాత్రం చెప్పు. మిగతావి నేను చూసుకుంటాను." "నువ్వంటే నాకిష్టమే! కానీ మీ అమ్మగారు మీ తమ్ముడిని  హీరోగా  పరిచయం చెయ్యాలి అనుకుంటున్నారు కదా! ప్రొడ్యూసింగ్ కూడా నీ చేత చేయిద్దాం అన్న అభిప్రాయం కూడా ఉన్నట్టుంది. మరి ఈ సమయంలో  నువ్వు పెళ్లి నిర్ణయం తీసుకుంటే ఆవిడకు నచ్చుతుందో లేదో?"  అన్నాడు రాహుల్. "నేను అనసూయమ్మ గారితో ఈ విషయం గురించి మాట్లాడాను." "నువ్వు తీసుకున్న నిర్ణయం మంచిదే! కానీ రాహుల్ అభిప్రాయం కూడా ఒకసారి కనుక్కో" అన్నారు."నీ నిర్ణయం ఏమిటో చెబితే మిగతా విషయాలు ఆలోచిస్తాను. చూశావుగా ఇంట్లో పరిస్థితి.  'విక్రమ్' చదువు సగంలోనే ఆపేసినా అమ్మ వాడిని ఏమీ అనలేదు. పైగా చాలా చెడు అలవాట్లు కూడా అబ్బాయి. వాడిని హీరోగా పరిచయం చెయ్యమని నా ప్రాణం తోడేస్తోంది. ప్రొడ్యూసర్ లు దొరకటం లేదు అంటే.. మనమే పెట్టుబడి పెడదాం అంటోంది.  సినిమా హిట్ అయితే పరవాలేదు. లేకుంటే పరిస్థితి ఏమిటి?  నువ్వు నాకు అన్ని విషయాలలోనూ సలహా ఇస్తూ ఉంటావు. అలాగే నా జీవితంలో కూడా తోడుంటే బావుంటుందనిపిస్తోంది రాహుల్. నీ కన్నా గొప్పగా నన్ను అర్థం చేసుకునే వారు ఎవరూ లేరు. మనిద్దరి మధ్య ఉండే స్నేహంతో   అడుగుతున్నాను. అలోచించి చెప్పు" అంది జ్యోతి.  మరుసటి రోజు ఉదయం అనసూయమ్మ గారితోను, తన కుటుంబ సభ్యులతోనూ  కూడా చర్చించి ఒక నిర్ణయానికి వచ్చాడు రాహుల్. రాహుల్ కు జ్యోతి అంటే అభిమానమే! కానీ తను సినిమానటి  అవటం వలన  భవిష్యత్తులో తనకు ఏమైనా ఇబ్బందులు వస్తాయేమోనని  ఒక ఆలోచన.  అయితే అనసూయమ్మ గారి అభిప్రాయం మేరకు రాహుల్ జ్యోతిని వివాహం చేసుకోవటానికి ఒప్పుకున్నాడు.     రంగమ్మ, విక్రమ్ ల అభిప్రాయం అటూ ఇటుగా ఉన్నప్పటికీ  జ్యోతి దానిని పట్టించుకోలేదు. ఒక శుభముహూర్తంలో అనసూయమ్మ గారు,  కృష్ణారావు మొదలగు పెద్దల సమక్షంలో రాహుల్ జ్యోతిని వివాహం చేసుకున్నాడు.

(ఇంకా ఉంది)

No comments:

Post a Comment

Pages