బీరకాయ పీచు సంబంధం(జాతీయం కథ)
కాశీవిశ్వనాథం పట్రాయుడు
9494524445
ఒకప్పుడు, రంగాపురం అనే పల్లెటూరిలో సీతమ్మ అనే పెద్దావిడ ఉండేది. ఆమెకు పెద్దగా ఆస్తిపాస్తులు లేకపోయినప్పటికీ, అందరినీ ఆదరించే గుణం, బంధుప్రీతి ఆమె సొంతం.
ఎక్కడో ఏడెనిమిది తరాల వాళ్ళైనా, పది పల్లెల దూరం వాళ్ళైనా, అస్సలు పరిచయం లేని వాళ్ళలో కూడా ఏదో ఒక 'బంధుత్వాన్ని' వెతికి పట్టుకోవడం ఆమెకు ఒక అలవాటు.
సీతమ్మ గారి ఏకైక కొడుకు, రవి కంపెనీలో ఉద్యోగం చేస్తూ పట్నంలో స్థిరపడ్డాడు. రవికి పెళ్లి నిశ్చయమైంది.
పెళ్లి పనులు జోరుగా సాగుతున్న సమయంలో, సీతమ్మ గారి ఇంట్లోకి “వదిన గారూ బాగున్నారా? పెళ్ళి సందడి మొదలైందా?” అని ఆప్యాయంగా పలకరిస్తూ ఒక కొత్త వ్యక్తి ప్రవేశించాడు.
“నా పేరు మురళి. మీరంతా నా దగ్గరి బంధువులే. నన్ను పోల్చుకున్నారా?” అని అడిగాడు.
“లేదు నాయనా! ఇంతకూ మీది ఏ ఊరు? మీరు ఎవరి తాలూకా?” అని అడిగింది.
"మా నాన్న గారి చిన్న తండ్రి గారి బావ గారి మేనకోడలి భర్త గారి బావ గారి చెల్లి గారి పిన్నమ్మ గారి తోడికోడలి అక్క కొడుకు మీ ఆయన. ఆ లెక్కన మీరు నాకు వదిన అవుతారు” అన్నాడు.
"ఏంటమ్మా ఈ వరుసలు? ఇదెక్కడి బంధుత్వం?" అని చిరాకు పడ్డాడు రవి.
“మనది బీరకాయ పీచు సంబంధం బాబూ” అన్నాడు మురళి.
“ఆ పీచు సంగతి ఏమిటో నాకు అర్థం కాలేదు” అని తల పట్టుకున్నాడు రవి.
“బీరకాయ పీచు సంబంధం అనేది ఒక జాతీయం. బీరకాయ పీచులోని దారాలు అన్నీ ఒకదానితో ఒకటి గట్టిగా, చిక్కులుగా అల్లుకొని ఉంటాయి. ఈ దారాలు ఎక్కడ మొదలయ్యాయి, ఎక్కడ ముగిశాయి, ఏ దారం దేనితో కలిసింది అని విడదీసి చెప్పడం ఎలా సాధ్యం కాదో, ఏమాత్రం దగ్గర సంబంధం లేని ఎన్నో తరాల తరువాత కలిసే అతి దూరపు బంధుత్వం వలన ఏర్పడే సంబంధాన్ని కూడా అలాగే వివరించడం సాధ్యం కాదు. అలాంటి వాటిని బీరకాయ పీచు సంబంధం అంటారు” అని వివరించాడు మురళి.
కానీ సీతమ్మ మాత్రం మురళి మాటలకు పొంగిపోయింది. "ఇంత దూరం బంధుత్వం ఉందంటే! మన వాళ్ళు ఎంత గొప్పవాళ్ళో! ఏది ఏమైనా మీరు మా బంధువులు. ఇక్కడే ఉండి మా అబ్బాయి పెళ్లి జరిపించండి” అంది సీతమ్మ.
ఆ రోజు నుంచి మురళి సీతమ్మ ఇంట్లో తిష్ట వేశాడు. "నేను దగ్గరి బంధువుని" అని గొప్పలు చెప్పుకుంటూ అనవసర ఖర్చులు పెట్టించేవాడు.
రవి పెళ్ళికి వచ్చినవారు అనుమానం వ్యక్తం చెయ్యడంతో బండారం బయటపడుతుందని గ్రహించి పలాయనం చిత్తగించాడు మురళి.
సీతమ్మకి విషయం అర్థమైంది. ఆ రోజు నుండి, సీతమ్మ ఇలాంటి దూరపు బంధువుల పట్ల జాగ్రత్తగా ఉండడం మొదలుపెట్టింది.
'బీరకాయ పీచు సంబంధం' తెలుగువారి వాడుకలో ఉన్న "దూరపు బంధుత్వం" లేదా "అస్సలు సంబంధం లేకపోయినా అతి కష్టం మీద ముడిపెట్టే బంధుత్వం" ను సూచించడానికి ఉపయోగించే ఒక వ్యంగ్యమైన జాతీయం.
'బాదరాయణ సంబంధం' అనే సామెత కూడా ఇంచుమించు ఇదే అర్థాన్ని సూచిస్తుంది.
***




No comments:
Post a Comment