అపార్థం
గోపాలకృష్ణ ఎస్ తంగిరాల
"హలో సుకన్యా.. రిపోర్ట్ వచ్చిందా?"
"ఊఁ..."
"ఏమని వచ్చింది రిపోర్ట్ లో..?
".........."
"పోజిటివేనా?"
"ఊ..."
"డాక్టర్ కి చూపించావా?"
"ఊఁ..."
"ఏమన్నారు?"
"-----"
"ఎన్ని నెలలు"
"మూడు..."
"మూడు.... హ్మ్..."
"భయం వేస్తోంది"
"భయపడకు... మనం అనుకున్నదేగా
..
కానీ.. ఎట్టి పరిస్థితుల్లోనూ శారదకి ఈ విషయం తెలియకుండా జాగ్రత్త పడాలి"
"ఇది దాస్తే దాగేదా నవీన్... రోజు రోజుకు వచ్చే తేడా తెలిసిపోదా?"
"కరెక్టే...కానీ ఇప్పుడే తెలిస్తే ఏడుపులు, పెడబొబ్బలు... నేను చెయ్యాల్సిన
పనులు ఏవీఁకావు"
"-----"
"ముందు లాయర్ ని కలిసి లీగల్ పనులు పూర్తి చేయాలి. ఆ తర్వాత ఇంట్లో
తెలిసినా...ఎంత గొడవలయినా చేసేదేమీ ఉండదు.."
"తప్పు చేస్తున్నానేమో... విషయం ఇంతవరకు వచ్చినా మీ ఆవిడకి తెలియకుండా
ఉంచటం తప్పు కదా"
"చూడు సుకన్యా... తప్పొప్పులు అనేవి మన ప్రయోజనాలు, పరిస్థితులు బట్టి
మారుతూంటాయి. అన్నీ నాకొదిలేసి నువ్వు నిశ్చింతగా ఉండు"
"సరే... జాగ్రత్త. లీగల్ పనులన్నీ సాధ్యమైనంత తొందరగా పూర్తి చెయ్యి. మీ
ఆవిడ ఎదురుపడి అడిగితే నేను తట్టుకోలేను"
"నన్ను అర్థం చేసుకున్నందుకు, నాపై నమ్మకం ఉన్నందుకు చాలా థాంక్స్ సుకన్యా.
ఉంటాను...బై"
***
తన
భర్తకు, తన స్నేహితురాలు సుకన్యకు మధ్య జరిగిన ఛాటింగ్ చూసి నిర్ఘాంతపోయింది శారద.
ఛాటింగ్ జరిగిన తేదీ పరిశీలించింది. దాదాపు ఐదారు వారాల క్రితం జరిగిన ఛాటింగ్
అది. నమ్మలేనట్టు కొద్దిసేపు తన భర్త మొబైల్ చాటింగ్ చూస్తూ స్తబ్దురాలై ఉండి
పోయింది.
బాత్రూం
తలుపు చప్పుడు విని ఈ లోకంలోకి వచ్చిన శారద చప్పున మొబైల్ మూసేసి ఏమీ తెలియనట్టే
వంటింట్లోకి వెళ్ళిపోయింది. స్నానం చేసి బయటకొచ్చిన నవీన్ తల తుడుచుకుంటూ ఉండగా భార్య
కాఫీ పట్టుకొచ్చి టేబుల్ మీద పెట్టింది.
"ఏవండీ... ఈ మధ్య సుకన్య కనపడటం లేదు. నాలుగైదు నెలలయింది తనని కలిసి. మీకేమైనా ఫోన్ చేసిందా?"
అని శారద అడిగిన ప్రశ్నకు నవీన్ తల దువ్వుకుంటూ "లేదు శారదా... తను బిజీగా ఉన్నట్టుంది. ఇండో అమెరికన్ ఆంకాలజీ హాస్పిటల్
లో చేరిందిగా... కొన్నాళ్ళైన తరువాత ఇంటికి పిలుద్దాం " అంటూ కాఫీ తాగేసి బై చెప్పి వెళ్ళిపోయాడు నవీన్. 'ఎంత సులభంగా
అబద్ధం చెప్పాడు తన భర్త' అనుకుంటూ భర్త వెళ్ళిన వైపే చూస్తూ ఉండిపోయింది శారద.
శారద,
నవీన్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెద్దలను ఎదిరించి చేసుకోవటం మూలాన
బంధుత్వాలు తెగిపోయాయి. అయినా వాళ్ళిద్దరి దాంపత్యం ఎంతో అన్యోన్యంగా సాగింది. తన
తల్లిదండ్రులు, బంధువులు దూరమైనా ఎప్పుడూ ఆ లోటు రాకుండా చూసుకున్నాడని ఎప్పుడూ
పొంగిపోయేది శారద. పెళ్ళై ఏడేళ్ళయినా ఇంకా పిల్లలు కలగలేదు. శారదలో చిన్న లోపం
ఉందని,మందులు వాడితే సరిపోతుందని డాక్టర్లు చెప్పటంతో త్వరలోనే పిల్లలు పుడతారనే
ధీమాతో ఉంది తను ఇన్నాళ్ళూ...
ఇప్పుడు
అకస్మాత్తుగా... తన భర్తకు సుకన్యకు మధ్య నడుస్తున్న వ్యవహారం బయట పడడంతో శారదకు
ఏం చెయ్యాలో పాలుపోక విల విల లాడింది.
'....సుకన్యకు
అప్పుడు మూడో నెలంటే ఇప్పుడు ఐదో నెలా? పెరిగిన కడుపు కనపడుతుందని కలవటానికి రావటం
లేదా తను? లీగల్ పనులంటాడేమిటీ తన భర్త? విడాకులిస్తున్నాడా? పిల్లలు కలగటం లేదనే
పాయింట్ మీద విడాకులు సులభంగానే ఇచ్చేస్తారేమో. ఎలా? ఏంచేయాలిప్పుడూ?' శారదకు ఏం
చేయాలో పాలుపోలేదు. కోపం దుఃఖం తన్నుకు రాసాగాయి. ఏమీ తినకుండా ఏడుస్తూ
మంచం మీద వాలిపోయిన శారద అలాగే నిద్ర పోయి సాయంత్రం నాలుగింటికి లేచింది.
మొహం
కడుక్కొని అద్దంలో చూసుకుంటూ జుట్టు సరిచేసుకుంటూ "... ఎందుకు ఈయన దాని వెంట పడుతున్నారు?
నేను నచ్చటం లేదా? అయినా ఆ సుకన్య ఇంత నీచానికి ఎలా పాల్పడింది... ఇలా పరి పరి
విధాల ఆలోచిస్తున్న శారద తన భర్త స్నేహితుడైన ధర్మారెడ్డికి ఫోన్ చేసింది.
"హలో అన్నయ్య గారూ.. మీతో అర్జంటుగా మాట్లాడాలి. ఇప్పుడే.
నేనొస్తున్నాను.... అన్నట్టు ఆయన ఫోన్ చేస్తే ఈ విషయం చెప్పకండి" అని ఫోన్ పెట్టేసి తన భర్త ఆప్తమిత్రుడు ధర్మారెడ్డిని కలవటానికి
బయలుదేరింది శారద.
****
ఫోన్
పెట్టేసిన ధర్మారెడ్డి ఆలోచనలో పడ్డాడు. శారద తనను కలవటానికి రావడం కొత్తేమీ కాదు.
ఎన్నోసార్లు తనకిష్టమైన వంటకం చేసినప్పుడల్లా తను ఊళ్ళో ఉంటే పట్టుకొచ్చి
ఇస్తుంది. కొన్నిసార్లు భార్యాభర్తలు ఇద్దరూ వచ్చి బలవంతంగా భోజనానికి
లాక్కెళ్తారు.
కానీ...
మొదటి సారి శారద తనను కలవడానికి వస్తూ తన భర్తకు తెలియకూడదు అనటం.
ధర్మారెడ్డి
మొదటినుంచి నవీన్ కుటుంబంలో ఒకడిగా ఉన్న వ్యక్తి. ఆ మాటకొస్తే వాళ్ళ పెళ్ళి
దగ్గరుండి చేసింది ధర్మారెడ్డే....
ఈ
మధ్య వ్యాపారంలో తలమునకలైపోవటం వల్ల తన మిత్రుడైన నవీన్ ని కలవలేకపోతున్నాడు. కాలింగ్ బెల్
చప్పుడుకి ఈ లోకం లోకి వచ్చిన ధర్మారెడ్డి లేచి మెయిన్ డోర్ తెరిస్తే ఎదురుగా
శారద... ఏడ్చి ఏడ్చి కళ్ళు ఉబ్బి మొహం పీక్కు పోయి...
ఆమెనలా
చూడగానే ధర్మారెడ్డి కంగారు పడ్డాడు. "ఏమైంది శారదా...? ఏమిటలా అయిపోయావు. ఏం
జరిగింది" అని ప్రశ్నల వర్షం కురిపిస్తున్న అతని మాటలు
పట్టించుకోకుండా తల వంచుకుని లోపలి కొచ్చి కుర్చీలో కూలబడింది శారద.
కదిలిపోయిన
ధర్మారెడ్డి ఆమె తల మీద చెయ్యి వేసి లాలనగా, "ఏమైందమ్మా" అనగానే... అంతవరకు
ఉగ్గబట్టుకున్న దుఃఖం జలపాతంలా ఉబికింది శారదకు.
"అన్నయ్య గారూ.. మీ ఫ్రెండ్ నాకు ఇంత ద్రోహం చేస్తారనుకోలేదు" ఆపుకోలేని ఉక్రోషంతో వెక్కి వెక్కి ఏడుస్తున్న శారదను ఆపడం ధర్మారెడ్డి
వల్ల కాలేదు. శారద శిరస్సు మీద చేయుంచి కాస్సేపు మౌనంగా ఉండిపోయాడు.
కాస్సేపటికి
తేరుకున్న శారద చెప్పిన విషయం విని విస్తుపోయిన ధర్మారెడ్డి తల అడ్డంగా ఊపుతూ "నువ్వు
పొరబడుతున్నావమ్మా శారదా. నవీన్ అలాంటి పని ఎప్పటికీ చేయడు" లాలనగానే స్ఫుటంగా ఒక్కొక్క మాట వత్తి పలుకుతూ అన్నాడు ధర్మారెడ్డి.
"నేను ఆయనను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన భార్యను అన్నయ్యా... నాకు
నామీద కన్నా ఆయన మీదే నమ్మకం ఎక్కువ. నా అంతట నేను స్వయంగా ఆయన ఫోన్లో వాళ్ళిద్దరి
ఛాటింగ్ చూడకపోయి ఉంటే, ఈ విషయం స్వయంగా మీరే చెప్పినా నమ్మేదాన్ని కాదు. ఆ విషయం
మీకు తెలియనది కాదు" ధర్మారెడ్డి కన్నా ప్రస్ఫుటంగా
స్థిరంగా చెప్పింది శారద.
ఆ
మాట నిజమే. భర్త మీద శారదకి ఉన్న నమ్మకం ధర్మారెడ్డికి తెలియనిది కాదు.
తల
పట్టుకుని ఆలోచనలో పడిపోయాడు ధర్మారెడ్డి.
"ఆయన లేని జీవితం నాకు వద్దు అన్నయ్య గారూ. అలా అని ఆయన ఆ దొంగ ముండతో
అక్రమ సంబంధం కొనసాగిస్తే సరేలే అని సహజీవనం చేయలేను. అందుకే...." అని ఊపిరి పీల్చుకుని
"నేను చచ్చిపోతాను" స్థిరంగా అంది
శారద.
చలించిపోయాడు
ధర్మారెడ్డి. "తొందర పడకు శారదా. నిజానిజాలు పూర్తిగా తెలుసుకోకుండా ఏ నిర్ణయానికీ
రాకూడదు. నేను కనుక్కుంటాను అసలు సంగతి" అని అంటూ
చెయ్యి సాచి శారద అరచేయి తన తల మీద పెట్టుకుని "అంతవరకు
నువ్వు ఏ అఘాయిత్యం చేయనని మాట ఇయ్యి శారదా" అన్నాడు.
కొద్దిసేపు
ఏమీ మాట్లాడలేదు శారద. ధర్మారెడ్డి కూడా తలమీద నించి చెయ్యి తియ్యలేదు. శారద
కళ్ళలోకి సూటిగా చూస్తూ ఉండిపోయాడు. మాటలే కరవయ్యాయి. సమయం భారంగా గడిచింది.
ఒక
నిర్ణయానికి వచ్చినట్లు కళ్ళు తుడుచుకుంటూ విరక్తిగా నవ్వి "అలాగే అన్నయ్య గారూ"
అన్నది శారద.
ఊపిరి
పీల్చుకున్నాడు ధర్మారెడ్డి.
****
ముందు
ధర్మారెడ్డి నవీన్ పనిచేసే ఆఫీస్ కి వెళ్ళాడు. నాలుగైదు రోజులుగా ఆఫీస్ కి రావటం
లేదనడంతో నవీన్ మొబైల్ కి ఫోన్ చేశాడు. కానీ ఎన్నిసార్లు ఫోన్ చేసినా నవీన్ ఆన్సర్
చేయలేదు. దాంతో ధర్మారెడ్డిలో మొదటిసారిగా అనుమానం మొదలైంది. శారద అనుమానం
నిజమేనా? నవీన్ కూడా ఎంతవాడైనా కాంతాదాసుడేనా? ఇలా పరి పరి విధాల ఆలోచనలు
చుట్టుముట్టాయి. చాలా సేపు ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చిన వాడిలా తల విదిలించి
సుకన్య నివాసానికి బయలుదేరాడు.
సుకన్య
తాను పనిచేసే హాస్పిటల్ లో ఉన్న హాస్టల్ లోనే ఉంటుంది. ఒకటి రెండు సార్లు
ధర్మారెడ్డి సుకన్యను హాస్టల్ లో డ్రాప్ చేశాడు కూడా. అక్కడి స్టాఫ్ కి తన రూం
మేట్స్ కి ధర్మారెడ్డిని తన అన్నయ్యగా పరిచయం చేసి ఉన్నది సుకన్య.
ధర్మారెడ్డి
హాస్టల్ కి వెళ్ళే సమయానికి ఎక్కడికో వెళ్ళటానికి కాబోలు సుకన్య ఆటో ఎక్కుతున్నది.
ధర్మారెడ్డిని చూసి "అన్నయ్యా..." అంటూ ఎదురొచ్చి చేతులు
పట్టుకుంది. సీరియస్ గా ఉన్న ధర్మారెడ్డి సుతారంగా సుకన్య చేతులు
విడిపించుకున్నాడు. సుకన్య ధర్మారెడ్డి మొహం కేసి చూసి "రండి అన్నయ్యా.. నేను మీ దగ్గరకే బయలుదేరాను" అని
చెప్పి ఆటోవాడితో వెళ్ళిపొమ్మని ధర్మారెడ్డిని హాస్టల్ విజిటింగ్ హాల్ కి
తీసుకెళ్ళింది.
ఇదేంటి
సుకన్య నా దగ్గరకి బయలుదేరాను అంటుంది అని అయోమయంగా ఉన్న ధర్మారెడ్డి హాల్ లోకి
వెళ్ళగానే "ఏమిటి సంగతి?" అని అడిగాడు.
ఎన్నాళ్ళ
నుండో ఉగ్గబట్టుకున్నట్టు ధర్మారెడ్డి గుండెల్లో తల దాచుకుని భోరున ఏడవసాగింది
సుకన్య.
మరింత
అయోమయానికి గురయ్యాడు ధర్మారెడ్డి. సుకన్య పట్ల పెంచుకున్న అనుమానం, కోపం తనలోనే
అణగదొక్కుకుని అసంకల్పితంగానే సుకన్య వీపు లాలనగా నిమురుతూ "ఏమైంది సుకన్యా?"
అన్నాడు.
కొద్ది
సేపటి దాకా సుకన్య ఏడుపు ఆపుకోలేక పోయింది. తరువాత మెల్లగా ధర్మారెడ్డి నించి దూరం
జరిగి కళ్ళు తుడుచుకుంటూ
"సారీ అన్నయ్యా" అన్నది.
"ఏమైంది సుకన్యా?" అనునయంగా అడిగాడు
ధర్మారెడ్డి. "మీకు... మీకు... నవీన్ బావ ఏమీ
చెప్పలేదా?' అడిగింది సుకన్య. మౌనంగా లేదన్నట్టు తలూపాడు ధర్మారెడ్డి.
ఊపిరి
పీల్చుకుని చెప్పటం ప్రారంభించింది సుకన్య.
****
సుకన్య
చెప్పటం ముగించే సరికి తెల్లగా పాలిపోయింది ధర్మారెడ్డి ముఖం. కళ్ళు కన్నీటి
సరస్సులే అయ్యాయి. వణుకుతున్న పెదవులతో ఏదో అనాలని ప్రయత్నించాడు. కానీ మాట
రాలేదు. సోఫాలోంచి అతి కష్టం మీద లేవబోయిన ధర్మారెడ్డి పట్టుతప్పి నేలమీద
కూలబడ్డాడు.
అప్పుడొచ్చింది
అతనికి... సన్నగా గుండె నొప్పి. శ్వాస బలంగా తీయటం ప్రారంభించాడు. చూస్తుండగానే
అతని ముఖం వివర్ణమవడం మొదలు పెట్టింది.
సుకన్యకు
తెలుసు ఆ కండిషన్ ఏమిటో.
సైనోసిస్...
చూస్తుండగానే
ధర్మారెడ్డి శరీరం బిగుసుకుపోనారంభించింది... నుదుటి నుండి ధారాపాతంగా చెమట.
మాసివ్
హార్ట్ ఎటాక్..
అప్పుడర్ధమయింది
ఆమెకు...తాను చేసిన తప్పు ఏమిటో... ధర్మారెడ్డికి చెప్పొద్దని నవీన్
ఎందుకన్నాడో...
అవన్నీ
ఆలోచించేంత టైం ఇప్పుడు లేదు సుకన్యకి. తను చేయాల్సిన పని తక్షణమే మొదలుపెట్టింది.
ఇప్పుడామె
సుకన్య కాదు. ధర్మారెడ్డికి స్నేహితురాలు కాదు. ఒక ప్రొఫెషనల్.
ఎదురుగా
ఉన్నది తన మిత్రుడు కాదు. ఒక పేషెంట్. అంతే
సుకన్య
ఒక్క స్విఫ్ట్ మూమెంట్ లో ధర్మారెడ్డి షర్ట్ బటన్స్ ఊడదీసి అతనికి సి. పి. ఆర్
ఇవ్వడం మొదలు పెట్టింది. ధర్మారెడ్డి గుండె మీద తన ఎడమ అరచేయిని, దానిపై తన
కుడిచేయిని ఆన్చి జంటిల్ గా ఫర్మ్ గా హార్ట్ మసాజ్ స్ట్రోక్స్ ఇవ్వడం
ప్రారంభించింది.
ఒకటి...
రెండు... మూడు...
అలా
మసాజ్ చేస్తూనే ధర్మారెడ్డి ముఖం పరిశీలనగా చూసింది. ఊపిరి ఆడటం లేదు.
మరింకేమీ
ఆలోచించ లేదు. ఒక చేతితో అతని ముక్కు మూసి, మరో చెయ్యి అతని తల వెనుక పెట్టి
వెనక్కు వంచి నోటిలో నోరు పెట్టి గాలి బలంగా ఊదింది. అతని ఛాతీ పైకి పొంగింది.
మళ్ళీ
మసాజ్... ఒకటి.. రెండు...
ఇంత
హడావుడిలోనూ తను చేయాల్సిన మరో ముఖ్యమైన పని విస్మరించలేదామె. తన ఫోన్ నుంచి
హాస్పిటల్ కి ఫోన్ చేసి అంబులెన్స్ పిలిచింది.
మళ్ళీ
మసాజ్... ఒకటి.. రెండు...
మళ్ళీ
గాలి ఊదటం....
కొద్దిసేపు
కాలంతో పోరాటం చేసిందామె.
ఆమె
కష్టం ఫలించింది. ధర్మారెడ్డి మొహం మామూలు రంగుకి తిరిగింది. మెల్లగా ఊపిరి
తీసుకోవడం మొదలుపెట్టాడు.
కొద్ది
నిమిషాల్లోనే శరవేగంతో అక్కడికి వచ్చింది అంబులెన్స్. వచ్చిన టీం లో తనకు తెలిసిన
డాక్టర్ ఉన్నాడు. అతని కేసి చూసి తలూపుతూ "ఇప్పుడే రివైవ్ అయ్యింది" అంది సుకన్య.
క్షణాల్లో
ధర్మారెడ్డిని అంబులెన్స్ లో పడుకోబెట్టి ఆక్సిజన్ మాస్క్ పెట్టారు. అంబులెన్స్ లో
డ్యూటీ డాక్టర్ సుకన్య కేసి చూసి మరేం ఫర్వాలేదు అన్నట్లు తల ఊపాడు. సుకన్య గాఢంగా
ఊపిరి పీల్చుకుంది.
*****
తన
దగ్గర మాట తీసుకున్న రెండు రోజులైనా ధర్మారెడ్డి జాడ లేకపోవటంతో శారద
ధర్మారెడ్డికి ఫోన్ చేసింది. కానీ ఫోన్ ఎత్తకపోవడంతో ఏం చెయ్యాలో అర్ధం కాలేదు
శారదకి.
నవీన్
కూడా క్యాంపుకెళ్తున్నా అంటూ రెండు రోజుల క్రితమే వెళ్ళిపోవడంతో శారద బతుకు
భారమైపోయింది. ఒంటరిగా ఉండటంతో ఆలోచనలు చుట్టుముడుతున్నాయి. కొన్నిసార్లు
ఏడుస్తుంది. ఏ పని చేయాలన్నా నిరాసక్తత. భోజనం సహించేది కాదు.
సుకన్యని
నిలదీసి అడగాలని, ఛెడామడా తిట్టాలని ఆవేశం ఊపేసేది శారదని. కానీ సుకన్య ముఖం కూడా
చూడాలనిపించ లేదు.
ఇంక
ఉండబట్టలేక ధర్మారెడ్డి ఇంటికి వెళ్ళిన శారదకు తాళం పెట్టిన తలుపులు
దర్శనమిచ్చాయి. నిరాశతో నిస్పృహగా వెనుదిరిగిన శారదకు పక్కింటి కాంపౌండ్ లో ఒక
పెద్దావిడ కనపడింది శారదకు.
"ధర్మారెడ్డి ఎక్కడున్నాడో ఏమైనా తెలుసాండి" అని అడిగిన శారదను ఎగాదిగా చూసి "నువ్వెవరమ్మాయీ?
నీకు అతనేమౌతాడు?" అని అడిగిందా పెద్దావిడ మొక్కజొన్న
పొత్తు నించి గింజలు కొరికి తింటూ. "ధర్మారెడ్డి మా
అన్నయ్యండీ" అన్నది శారద, మా ఆయన ఫ్రెండ్ అంటే ఏం ఆరాలు
తీస్తుందో ఈ పెద్దావిడ అనుకుంటూ.
"చెల్లెల్నంటున్నావు. నీకు తెలీదా? ధర్మారెడ్డికి హార్ట్ ఎటాక్ వచ్చింది.
హాస్పిటల్లో పడి ఉన్నాడు. బతకటం కష్టవేఁట" మొక్క జొన్న
పొత్తు నించి తన వళ్ళో పడిన గింజల్ని ఏరుకుని తన నోట్లో వేసుకుంటూ తను కనుక్కున్న
గొప్ప విషయం ఏదో ప్రపంచానికి తెలియజేస్తున్నట్లు గర్వం ఫీలౌతూ చెప్పిందా
పెద్దావిడ. బతకటం కష్టం అన్నది ఆమె సృష్టి. ఆ మాత్రం మసాలా లేకుండా అలాంటి వాళ్ళు
మాట్లాడరు. అలా కల్పించి చెప్పడంలో ఒక రకమైన తృప్తి చెందుతారు.
"ఎ...ఎప్పుడు జరిగింది ఇది?" నోరు పిడచ
కట్టుకుపోతుండగా కళ్ళలో నీళ్ళు తిరుగుతుండగా బేలగా అడిగింది శారద. శారద మొహంలో
షాక్ కనపడటం పట్టరాని సంతోషాన్నిచ్చింది ఆ పెద్దావిడకు. తిండి కన్నా శారద
భావోద్వేగం అమితాసక్తిగా ఉండి మొక్క జొన్న పొత్తును కొరుక్కు తినటానికి తాత్కాలిక
విరామం ఇచ్చిందావిడ.
"మూడు రోజులయిందమ్మా... అదేదో అమెరికా అంకమ్మాజీ ఆసుపత్రిలో పెట్టారు
అతగాడిని. అయినా అతను ఉన్నా పోయినా పట్టించుకునే వాళ్ళేరీ.... నిన్ను కూడా
ఎప్పుడూ చూడలేదమ్మాయ్... నీకూ మీ అన్నయ్యకు కూడా పడదా ఏవిటి?" అడిగిందా పెద్దావిడ, ఏమైనా స్టోరీ చెప్పకపోతుందా అన్న గంపెడాశతో.
ఆ
పెద్దావిడ వాగ్ధాటి ఆపేసమయానికి కాస్త తేరుకుంది శారద. అంత దుఃఖంలోను కొద్దిగా
నవ్వొచ్చింది శారదకు, ఆంకాలజీ ని అంకమ్మాలజీ అన్నప్పుడు. రెండు చేతులు జోడించి "వస్తానండీ.
హాస్పిటల్ కి వెళ్ళాలి" అంటూ వెనుదిరిగి వడి వడిగా
నడుచుకుంటూ వెళ్ళిపోయింది శారద.
శారద
ఏమైనా తన అన్నతో ఉన్న గొడవలు, తగవులు చెప్తుందేమో అని ఆశించిన పెద్దావిడ నిరాశ
చెంది నిట్టూరుస్తూ మళ్ళీ మొక్కజొన్న పొత్తు తీసుకుని కొరకడం మొదలెట్టింది.
****
శారద
అమెరికన్ ఆంకాలజీ ఆసుపత్రి చేరుకుని సుకన్య గురించి వాకబు చేసింది. కనిపిస్తే
కొట్టేసేదేమో. కానీ సుకన్య అక్కడ లేదు. సెలవు పెట్టి ఎక్కడికో వెళ్ళిందట.
కార్డియాలజీ
ఐ.సి.యు కి వెళ్ళిన శారదని లోపలికి వెళ్ళనివ్వ లేదు అక్కడి స్టాఫ్. గ్లాస్
విండోనించే చూసింది ధర్మారెడ్డిని. వెంటిలేటర్ మీద ఉన్నాడతను. కోలుకుంటున్నాడని,
వెంటిలేటర్ ద్వారా శ్వాసను అందిస్తున్నారని, రెండు మూడు రోజులు ఇంకా ఐ.సి.యు లోనే
ఉండాలని చెప్పారు అక్కడి స్టాఫ్.
బయటకొచ్చిన
శారదకు అంతా గందరగోళంగా ఉంది.
సిటీలో
ఎన్నో గుండె ఆసుపత్రులు ఉండగా ఇక్కడెందుకు చేర్చారు ధర్మారెడ్డిని? ఇక్కడైతే
సుకన్య సహాయం చేస్తుందనా? అయినా అంతలా మాసివ్ హార్ట్ ఎటాక్ ఎలా వచ్చింది? హార్ట్
ఎటాక్ కి, మా సమస్యలకు ఏమైనా సంబంధం ఉందా? సుకన్య సెలవు పెట్టి ఎక్కడికెళ్ళింది?
ఒక వేళ సుకన్య, తన భర్తా కలిసే ఎక్కడికైనా వెళ్ళారా? ఎలా తెలుస్తుంది?
ఇలా
పరి పరి విధాల ఆలోచిస్తున్న శారదకు వాళ్ళిద్దరూ కలిసి వెళ్ళారనే అనుమానం
బలపడసాగింది.
తనిప్పుడు
ఏం చేయాలి? రైలు కింద తల పెట్టి చచ్చిపోతే? ఇంటికెళ్ళి ఫ్యాన్ కి ఉరేసుకుంటే?
చెరువులోనో, నదిలోనో దూకేస్తే? వీటన్నింటి కన్నా నిద్ర మాత్రలు మింగెయ్యడం మేలు.
కానీ నిద్ర మాత్రలు మెడికల్ షాపుల్లో ఇవ్వరు. ఎలా?
ఇలా
ఆలోచిస్తూ, నడుస్తూ తనకు తెలియకుండానే చాలా దూరం వచ్చేసింది శారద. చుట్టూ చూసిన
శారదకు దగ్గరలోని బస్టాండ్ లో విజయవాడ వెళ్ళే బస్సు కనపడింది. అప్పటికప్పుడు ఒక
నిర్ణయానికి వచ్చినదానిలా ఆ బస్సు ఎక్కి విజయవాడకు టికెట్ తీసుకొని కూర్చుంది.
***
విజయవాడలో
శారద బాల్య స్నేహితురాలు శివాని ఉంటుంది. ఆమె ఒక లాయర్. శారదను చూడగానే ఎగిరి
గంతేసినంత పని చేసిందామె. ఫోన్ చేయగానే బస్టాండ్ కి వచ్చి శారదను తన ఇంటికి
తీసుకెళ్ళింది. దారిలో తానడిగిన ప్రశ్నలకు అరకొరగా అన్యమనస్కంగా సమాధానాలు
చెబుతున్న శారదను పరీక్షగా చూసిన శివాని నిస్తేజంగా పాలిపోయినట్టున్న మొహం,
రాత్రంతా బస్సులో ఏడ్చి ఏడ్చి ఉబ్బిన కళ్ళు చూసి జరుగరానిదేదో జరిగిందని అర్ధం
చేసుకుని మరింక మాట్లాడలేదు.
పదిహేను
నిమిషాలు కార్లో ప్రయాణించి ఇంటికి చేరాక కట్టుకోవడానికి బట్టలిచ్చి స్నానం చేసి
రమ్మని శారదను బాత్రూం లోకి పంపింది శివాని. దాదాపు అరగంట స్నానం తరవాత కాస్త
రిలీఫ్ అనిపించింది శారదకు. బయటకొచ్చేసరికి జీడిపప్పు ఉప్మా వేడి వేడిగా
చేతికందించింది శివాని. ఆమెకు తెలుసు శారదకు ఉప్మా అంటే ఇష్టమని. శివాని మొహంలో
శారద పట్ల గల ప్రేమ అభిమానం తొణకిసలాడుతున్నది. ఎన్నో రోజులు తరువాత మనస్ఫూర్తిగా
ఆహారం తిన్నది శారద. వేడి వేడి కాఫీ కూడా తాగాక శారద మొహంలో కళ వచ్చి చేరింది.
అలసటగా కన్నులు మూసుకున్న శారద కొద్ది నిమిషాల్లోనే నిద్రాదేవి ఒడిలోకి జారుకుంది.
అలా
ఎంత సేపు పడుకుందో తెలియదు కానీ కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగా టీపాయ్ మీద
కనపడిందొక కాగితం.
"ఏమీ ఆలోచించకుండా హాయిగా పడుకోవే శారదా. నేను కోర్టుకెళ్ళి
మధ్యాహ్నానికల్లా వచ్చేస్తాను. కలిసి భోజనం చేద్దాం. ఈలోపులో ఆకలేస్తే డైనింగ్
టేబుల్ మీద అన్నీ రెడీగా ఉన్నాయి. తినేసెయ్యి - నీ శివాని" ముత్యాల్లాంటి అక్షరాలకేసి చూస్తూ మళ్ళీ నిద్రలోకి జారుకుంది శారద.
అందానికి,
ఆత్మాభిమానానికి మారుపేరు శివాని. అందుకేనేమో, ఆమె జీవితాన్ని ఎవరితోనూ
పంచుకోలేదు. జీవితం లో ఏ విషయంలోను కాంప్రమైజ్ కాలేని వాళ్ళు ఎవరితోనూ కలిసి
జీవించలేరు.
ఎవరో
తట్టి లేపినట్లు లేచి కూర్చుని చుట్టూ చూసిన శారదకు వంటింట్లోంచి ఆహార పదార్థాలు
తెచ్చి డైనింగ్ టేబుల్ మీద సర్దుతున్న శివాని కనిపించింది.
"లేచావా తల్లీ. తొందరగా రావే, ఆకలి దంచేస్తోంది నాకు" అన్నది శివాని నవ్వుతూ. బలహీనంగా నవ్వి "లేపొచ్చు
కదే" డైనింగ్ ఛైర్లో కూర్చుంటూ అన్నది శారద.
ఇద్దరూ
మాట్లాడుకుంటూ భోజనం ముగించారు. తరవాత సోఫాలో కూర్చుని చెప్పడం ప్రారంభించింది
శారద. అంతా చెప్పి వెక్కి వెక్కి ఏడవటం మొదలెట్టింది.
కొద్దిసేపు
ఆమెను ఏడవనిచ్చి "మీ ఆయనతో ఒక్కసారి మాట్లాడి ఉండవలసిందే శారదా" అన్నది
శివాని సాలోచనగా. నవీన్, సుకన్యల ఛాటింగ్, సుకన్యతో మాట్లాడనే లేదని నవీన్
చెప్పిన అబద్ధం, ఉన్నట్లుండి సుకన్య మొహం చాటేయడం ఇవన్నీ చూస్తుంటే శారద అనుమానం
నిజమే అనిపించినా శారద తన భర్తతో మాట్లాడి ఉంటే మరింత స్పష్టత, ఆధారాలు
దొరికుండేవి అనిపించింది శివాని లాయర్ బుర్రకి.
నిర్వికారంగా
చూసింది శారద తన స్నేహితురాలికేసి. స్నేహితురాలికి ఏదో చెప్పాలని ప్రయత్నించి
అలసటగా కళ్ళు మూసుకుంది. అంతే. ఆ తర్వాత ఏం జరిగిందో ఆమెకు తెలియలేదు.
కళ్ళు
తెరిచేసరికి ఎదురుగా నవ్వుతూ శివాని కనపడింది. అయోమయంగా చుట్టూ చూసిన శారద తానొక
ఆసుపత్రి బెడ్ మీద ఉన్నట్లు గ్రహించి, ఏం జరిగిదన్నట్లు శివానికేసి చూసింది.
ఉబికి
వస్తున్న ఆనందాన్ని ఆపుకుంటూ శివాని "కంగ్రాచ్యులేషన్సే" అంది
మెరుస్తున్న కళ్ళతో. మరింత అయోమయానికి గురైన శారద ఏదో చెప్పాలని నోరు తెరిచేలోపు
"నువ్వు తల్లివి కాబోతున్నావే" అంది
శివాని.
ఒక్క
క్షణం శారదకు అర్ధం కాలేదు, తన స్నేహితురాలు మాట్లాడేది ఏమిటో. అర్ధం అయ్యాక
సంభ్రమాశ్చర్యాలతో కళ్ళ వెంట నీళ్ళు కారుతుండగా శివాని చేతులు పట్టుకుని "థాంక్యూ శివానీ"
అన్నది.
ఇంకా
ఏదో మాట్లాడబోతున్న శివాని తన మొబైల్ మోగడంతో ఆగు అన్నట్లుగా శారదకు సైగ చేసి ఫోన్
లో హలో అన్నది. అవతల వ్యక్తి మాట్లాడిన మాటలు వినబడటంలేదు, కానీ శివాని మాటలు
వినపడుతున్నాయి.
శివాని:
అవును. నేనే శివాని. చెప్పండి
అవతల
వ్యక్తి: --------
శివాని:
ఏం, ఇప్పటికి గుర్తొచ్చిందా మీ భార్య?
అవతల
వ్యక్తి: --------
శివాని:
తన ఏ పరిస్థితుల్లో ఉందో తెలిస్తే మీరిలా మాట్లాడరు
అవతల
వ్యక్తి: --------
శివాని:
ఆసలేమనుకుంటున్నారండీ మీరు? తనకు ఎవరూ లేరనుకుంటున్నారా? ఏం చేసినా చెల్లుతుంది
అనుకుంటున్నారా?
అవతల
వ్యక్తి: ---------
శివాని:
లుక్ మిస్టర్. డోంట్ థింక్ యు కెన్ గో స్కాట్ ఫ్రీ. ఐ విల్ నాట్ లెట్ యు. వెయిట్
ఫర్ ద కాన్సీక్వెన్సెస్ మీ...
ఆ
మాటలు వింటుండగానే శారదకు అర్ధం అయిపోయింది అవతల వ్యక్తి తన భర్తే అని. తను గర్భం
దాల్చిన సంతోషం క్షణం కూడా నిలవకుండా చేసిన భర్త పట్ల వళ్ళు తెలియని ఆగ్రహం
ఆవహించింది.
ఆవేశంతో
ఊగిపోతూ "ఛీ... ఉచ్ఛం నీచం లేని వాడితో మాటలేంటే? పెట్టెయ్. ఇంకెప్పుడూ ఫోన్
చెయ్యొద్దని చెప్పు..." అని అరవసాగింది.
శివాని
ఫోన్ లో కోపంగా "ఐ విల్ టాక్ టు యు లేటర్" అని ఫోన్ కట్ చేసి,
శారద పక్కన కూర్చుని 'కూల్ డౌన్ శారదా కూల్ డౌన్. నువ్వు ఆవేశ పడకు' ఆన్నది
లాలనగా.
*****
రోజులు,
వారాలు గడుస్తున్నాయి. స్నేహితురాలిని అపురూపంగా చూసుకుంటోంది శివాని. శారద
మెల్లగా మామూలు మనిషి అయ్యింది. శివాని ఎంత చెప్పినా వినకుండా ఇంటి పని, వంట పని
తానే చేయసాగింది. వంటల్లో శారదది అమృత హస్తం. అద్భుతమైన వంటలు అలవోకగా చేసేది.
వాటిని ఆస్వాదిస్తూ "నాకు జీవితం ఇప్పుడే మొదలైంది అనిపిస్తోందే శారదా" అన్నది శివాని.
ఒకరోజు
ఉదయం శారదను రొటీన్ పరీక్షల కోసం ఆసుపత్రికి వెళ్లడానికి రెడీ అవుతుండగా శివానికి
ఫోన్ వచ్చింది.
శివాని
హలో అనగానే "నేను హైదరాబాద్ నించి ధర్మారెడ్డిని మాట్లాడుతున్నాను.... అని కొద్ది సేపు
మాట్లాడాడు. అది విన్న శివాని మొహం చుక్క రక్తం లేనట్లుగా పాలిపోయింది. అలాగే అని
చెప్పి ఫోన్ పెట్టేసి మెల్లగా నడుచుకుంటూ హాల్లోకి వెళ్ళి శారదకేసి తదేకంగా
చూసింది. శారద నవ్వుతూ "ఏమిటే, అలా చూస్తున్నావు?"
అన్నది. శివాని తల అడ్డంగా ఊపుతూ నిట్టూర్చి"మనం అర్జెంట్ గా హైదరాబాద్ వెళ్ళాలి. ఎందుకు, ఏమిటి అని అడక్కు. పద
" అన్నది.
***
ఇండో
అమెరికన్ ఆంకాలజీ గేటు లోపలకు దూసుకు వచ్చి ఆగిన కారులోంచి శారద చేయి పట్టుకొని "మెల్లగా దిగు"
అన్నది శివాని.
కారులోంచి
దిగి చుట్టూ చూసిన శారద అయోమయంగా "ఇక్కడకు తీసుకొచ్చావెందుకే" అడిగింది.
శివాని
స్నేహితురాలి కేసి చూస్తూ"ఇప్పుడు ఇక చెప్పాలి. తప్పదు" అనుకుంటూ
చెప్పింది మెల్లగా, స్పష్టంగా....
"చూడు శారదా... నువ్వు నేను కూడా మీ ఆయనను తప్పుగా అర్థం చేసుకున్నాం. మీ
ఆయన నీకు ఏ అన్యాయం తలపెట్టలేదు. నీకు న్యాయం చేయటానికే తాపత్రయ పడ్డాడు. సుకన్య
దుర్మార్గురాలు కాదు. నీకు నీ కుటుంబానికి సహాయం చేయడానికే ప్రయత్నించింది"
అంటూ ఆగింది.
శారద
కళ్ళలోకి చూస్తూ "నువ్వు కడుపుతో ఉన్నావు. ఆవేశ పడకు. నేను చెప్పేది శాంతంగా విని దృఢంగా
ఉండు" అన్నది.
శారద
మనసు కీడు శంకించ సాగింది. తనకు తెలియకుండా ఏదో దారుణం జరుగుతోంది అనిపించింది.
అధికమవుతున్న ఆందోళనను అదుపులో పెట్టుకుంటూ అదురుతున్న గుండెలను చిక్కబట్టుకుని "ఏమైందే"
అన్నది బేలగా
శివాని
మెల్లగా "మనం విజయవాడలో బయలుదేరేముందు మీ ఆయన ఫ్రెండ్ ధర్మారెడ్డి ఫోన్ చేశాడు. మీ
ఆయనకి.. " అని ఒక్క క్షణం ఆగి శారదకేసే చూస్తూ
"బ్లడ్ కేన్సర్" అన్నది.
మెదడులో
ఏదో విస్ఫోటనం చెందినట్లు, వందల మెరుపులు ఒక్కసారిగా వెలిగి ఆరిపోయినట్లు... శారద
మ్రాన్పడి నిలిచిపోయింది.
శివాని
శారద భుజం పట్టుకుని అనునయంగా తట్టుతూ... "ఆరోజు మీ ఆయన ఫోన్ లో నువ్వు చూసిన ఛాటింగ్ కేన్సర్ గురించే. ఊళ్ళో
తన పేరున ఉన్న పొలం నీ పేరున మార్పించటానికి మీ ఆయన ఇన్నాళ్ళూ వాళ్ళ ఊరు చుట్టూ, కోర్టు చుట్టూ తిరిగాడు. తాను పోయాక నీకు జీవితం భారం కాకూడదని తన కుటుంబ సభ్యులతో
తగవులాడి తన పేరున ఉన్న ఆస్థి నీ పేరున మార్పించేందుకు ఎంతో శ్రమించాడు. లీగల్ పనులు అంటే అవే. నువ్వనుకున్నట్లు విడాకులు కాదు. ముందే తెలిస్తే నువ్వు
తట్టుకోలేవని, తాను చేయాల్సిన పనులు చేయలేనమో అని నీకు చెప్పకుండా సుకన్యను ఆపాడు"
అని చెప్పి ఊపిరి పీల్చుకుంది శివాని. "సుకన్యను
కలిసి విషయం కనుక్కుందామని వెళ్ళిన ధర్మారెడ్డికి సుకన్య నీ భర్త కేన్సర్ గురించిన
వార్త చెప్పడంతో గుండెపోటు రావడంతో సుకన్య ఇదే హాస్పిటల్ లో చేర్పించింది” కొనసాగించింది శివాని.
“అనుమానం అనేది రంగుల కళ్ళద్దాల లాంటిది శారదా. ఒక్కసారి అది
కళ్ళమీదకొచ్చాక ప్రపంచాన్ని మనం చూసే తీరే మారిపోతుంది. అందుకే ‘ఎన్ని నెలలు’ అనే
పదం నీకు ‘ఎన్నో నెల’గా కనపడింది" కంట్లో నీళ్ళు సుడులు
తిరుగుతుండగా చెప్పింది శివాని.
ప్రపంచం
మొత్తం ఒక్కసారిగా గిర్రున తిరిగినట్లనిపించింది శారదకు. తూలి పడబోతున్న శారదను
పట్టుకుని "నీ భర్త చివరి క్షణాల్లో ఉన్నాడు. వెళ్ళు. వెళ్ళి నీలో పెరుగుతున్న తన
అంశను గురించి చెప్పు" అంటూ నవీన్ ఉన్న రూంలోకి
తీసుకెళ్ళింది శివాని.
కాలం
ఎటువంటి గాయాన్నైనా మాన్పుతుంది. తన కడుపులో పెరుగుతున్న పసి పాప కోసమైనా శారద పరిస్థితులతో
పోరాడుతుందని శివానికి తెలుసు.
***




No comments:
Post a Comment