కలిసొచ్చిన అదృష్టం - అచ్చంగా తెలుగు

 కలిసొచ్చిన అదృష్టం

(మా జొన్నవాడ కథలు)

                        - డా.టేకుమళ్ళ వెంకటప్పయ్య (9490400858)


"ఓయి…. మావో...! ఈరోజైనా నాలుగుడబ్బులు తెచ్చేది ఉందా? లేదా? పొద్దుగూకులూ… ఆ పెన్నమీద.. ఆ పనికిమాలిన తెప్ప ఒకటేసుకుని తిరగడం, సాయంకాలానికి పీకల్దాకా తాగి ఇంటికి రావడం.  ‘ఏం చేపలు పడలేదు రత్తీ..’ అని తాగిన మత్తులో దీర్ఘాలు తీసి  చెప్పి గురకలుబెట్టి నిద్రపోవడం. పెద్దపండగ నెలగూడాలేదు. కొత్తపెళ్ళానికి ఒక చీర గొందామని, ఓ నగగొందామని గానీ లేకపాయె. పాడు బతుకు ఛీ!" అన్న రత్నమ్మ మాటలకు ఛీదరించుకొని "సర్లేవే! రత్తీ.. ఎప్పుడూ ఉండే యెదవ గోలే గదా నీది. చేపలు పడకపోతే నేనేం జెయ్యాల. ఇవాళ ఇంకో మూలకు బోయి ప్రయత్నం జెయ్యాల! సరే కానీ….గభాల్న అన్నం మూట గట్టి తగలెయ్! .టైం తొమ్మిదవతా ఉంది" అన్నాడు చెంద్రయ్య. "హూం.. దీనికేం తక్కవలే! అట్నేగానీ.. సాయంత్రం పెద్దపెద్దచేపలు రెండో మూడో తీస్కోన్రా మావా! తినాలనుంది. ఎంతసేపు గంజన్నం, పచ్చిమిరక్కాయ.. తినలేక ఛస్తున్నా.." అన్నమాటకు నవ్వి "అవునే రత్తీ…….నాగ్గూడా తినాలనే ఉంది. ఆ పెంచిల్‌శెట్టిని అడిగి సామాను ఎత్తుకొనిరా!" అని మూటదీసుకొని బయల్దేరాడు చెంద్రయ్య. "ఆ..ఆ..  ఆషావుకారు నాకు బెట్టేటట్టున్నాడు తిరగమాత… మళ్ళీ అప్పుకు బోతే.. ఇప్పటికే మూడొందలయిందని కస్సు బుస్సుమంటున్నాడు. చూస్తాలే.. నువ్వు సాయంకాలం తాగడానికి పోకుండా చేపల్ దీస్కోని గభాల్న లగ్దోలుకుంటూ వచ్చెయ్యాల" అంది.  వెనక్కు దిరిగి ఒక్కసారి నవ్వి "అట్టాగేలే..” అంటూ వేటకు వెళ్ళిపోయాడు.

- సాయంత్రం ఆరుగంటలు. "బుజ్జీ ఉత్తరంతట్టుగాకుండా దక్షిణంతట్టు బొయినా ఇవాళ.. చేపలే చేపలు... ఒడ్డున్నే గొనుక్కున్నారు జనం. ఇదిగో ఐదొందలు…" అని సంతోషంగా ఇవ్వగానే  "నీ తాగుడుకుబోంగా మిగిలినవా?" అన్న మాటకు "ఛీ! ఇవాళ పోలేదే నమ్ము. ఒట్టు. ఇదిగో పెద్ద మట్టగుడిసెలు రెండు దెచ్చినా.. చూడు.. ఎంత నిగ నిగలాడుతున్నాయో! నోరూరిపోతుందనుకో.." అని నీటి తొట్టిలో వదిలాడు. "సరే! పాత అప్పుదీర్చి మళ్ళీ సామాన్లు తేవాల.. నేను పెంచిల్‌శెట్టి అంగడికిబొయ్యొస్తా.. ఇంటికాణ్ణే ఉండు ఆడికీ ఈడికీ పోబాక. అసలే జొన్నాళ్ళో దొంగలు దిరుగుతున్నారంట" అంటూ బయల్దేరింది.

ఉదయాన్నే అన్నమ్మూట సర్దుకుని రేవుకుబోతూ "ఏమి  మసాలా వాసనొస్తున్నాదే రత్తీ…. చేపల కూర.. పోంగానే తినెయ్యాల.." అన్నమ్మూట సర్దుకుని రేవుకుబోతూ అన్నమాటలకు పకపకా నవ్వి.."రాత్రిగ్గూడా ఉందిలే మామా..గబాల్న వచ్చెయ్!" అంది చేతికి పెట్టుకున్న  ఉంగరం సర్దుకుంటూ.

దక్షిణపు ఒడ్డున బాగా చేపలు ఉండడంతో రోజూ వలనిండా చేపలు పడుతున్నాయి.  రోజూ ఆరేడు వందలు కళ్ళజూస్తుండడంతో ఇద్దరూ మంచి కుశాలుగా  ఉన్నారు. రత్నమ్మ దుబారా మనిషి కాకపోవడంవల్ల నాలుగు డబ్బులు దాచింది. ఒక నెల అయ్యాక "మావా! రేపు మనం నెల్లూరు బోవాల. రేపు రేవుకొద్దు" అని బాంబు పేల్చింది. ఎందుకన్నట్టు చూశాడు అర్ధంకాక. "పెద్దపండగ ఇంక పది రోజులే ఉండేది.... కాళ్ళకు గజ్జెలు కొనాల. నీకూ నాకూ మంచి గుడ్డలు కొనాల. సండే మార్కెట్లో మంచి మంచి కొత్త రకాలేవో.. వచ్చాయంట సూరమ్మత్త చెప్పింది.  దాని చీరకంటే మంచి చీర గొనుక్కోవాల నేను. అంతేగాదు…. మావా! మంచి సినిమా జూడాల. చాన్రోజులయింది.  ఆటకుబొయ్యి సందేళకొద్దాం సరేనా.." అంది.

ములుమూడి బస్టాండులో ఆటో దిగి చిన్నబజారుకు జేరుకున్నారు. అక్కడ రెండు మూడు అంగళ్ళల్లో గజ్జెలు చూసి..బాగా లేవని ఒక పెద్ద బంగారు అంగట్లోకి వెళ్ళారు. సత్యనారాయణ జెవెల్లర్స్. చానా పెద్ద అంగడి. అక్కడ రకరకాల గజ్జెలు చూసి ముచ్చటపడి ఒక మంచి జత కొని రత్నమ్మ పరుసులోంచి డబ్బులు తీసి ఇస్తూ ఉండగా “మోవ్.. నీ లక్ష్మీదేవి ఉంగరం బలే ఉండాదే.. కొత్త మాడల్లాగా ఉందే! ఏడగొన్నావూ..!" అన్న ప్రశ్నకు ఉలిక్కిపడి "మా నాయన లగ్గమప్పుడు చేపిచ్చింది. లచ్చిందేవి ఉంగరమిస్తే మాకు కలిసొచ్చద్దని ఇచ్చారు. యాణ్ణో.. జెయిపిచ్చిండు..తెలవదు నాకు.." అంది.  చెంద్రయ్య ఏమీ అర్ధంకాక చూస్తున్నాడు. తనూ ఎప్పుడూ ఆఉంగరాన్నిఆమె చేతికి  చూడలేదు. "ఒకతూరి చూసిస్తా!" అని అడిగి తీసుకుని భూతద్దంలో పరీక్షగా చూసి.. ఒకసారి ఇద్దర్నీ పరకాయించి చూసి "తీసుకోమ్మా.. జొన్నాడా మీది? ఎంకురెడ్డి… ఆయన భార్య మహలచ్చమ్మను ఎరుగుదురా మీరు?" అని తిరిగి ఇచ్చేశాడు. "మా సర్పంచి గదంటయ్యా.. ఎంకురెడ్డి..శానా మంచాయన..నాకాణ్ణే చేపలు గొనేది" అన్నాడు నవ్వుతూ చెంద్రయ్య. రత్తి ఏమీ మాట్లాడకుండా మళ్ళీ  ఉంగరం వేలికి  పెట్టేసుకుని "రా మావా! చానా పన్లుళ్ళే.. మనకింకా! " అంటూ అక్కణ్ణుంచీ బయటపడి,  సండే మార్కెట్లో కావాలసిన గుడ్డలు కొనుక్కుని, మ్యాట్నీ సినిమా చూసి రాత్రి ఏడింటికి ఇంటికి చేరుకున్నారు.

“రత్తీ..ఆ ఉంగరం ఎక్కడిదే నీకు..ఇంతకు ముందు నేనెప్పుడూ చూళ్ళేదు..నాకయినా సత్తెం జెప్పవే!" అన్నాడు నిద్రకు ఉపక్రమిస్తూ.. "మావా! నేనేమన్నా దొంగనా? ఆ ఉంగరం నువ్వు ఒకరోజు రెండు పెద్దపెద్ద మట్టగుడిసెలు తెచ్చిళ్ళా... ఒక చేప కడుపులో ఉందిది. మళ్ళీ ఎవరితో అనమాక.." అంది. కానీ ఆ అంగడాయన మనది జొన్నాడని కనిపెట్టాడు. అది సరే! ఎందుకు ఎంకురెడ్డి....ఆయన భార్య పేర్లెందుకు జెప్పాడు అనీ..అర్ధం గావడంలేదు" అన్న మాటలకు "మావా! నువ్వేం భయపడబాక..మనమేమయినా దొంగలమా చెప్పు!" అంది. 

ఒకరోజు సాయంత్రం - దంపతులిద్దరూ దేవళానికి బోయి వెంకురెడ్డి ఇంటిమీదుగా వస్తూండగా వాళ్ళ తలమనిషి బయటికొచ్చి "అమ్మగారు మిమ్మల్ను ఒకసారి లోపలికి రమ్మన్నారు" అన్నాడు. తలపైకెత్తి చూస్తే...మేడ మీద మహలక్షమ్మ కనబడింది. లోపలికి వెళ్ళి వరండాలో నిలబడ్డ ఐదు నిముషాలకు మహలక్షమ్మ వచ్చి "చెంద్రయ్యా..నువ్వు పెద్ద పెద్ద చేపలు పడుతున్నావంట..మాకు అమ్మడంలేదు" అని నవ్వింది. "లేదమ్మా.. అన్నీ అక్కడ ఒడ్డున్నే అమ్మేసి సందేళకు ఇంటికెల్తన్నా.." అన్నాడు. "ఏమే రత్తీ..కొత్త సంసారం ఎట్టా ఉందీ?" అన్న ప్రశ్నకు సిగ్గుపడి "బాగానే ఉందమ్మా..చెంద్రయ్య అప్పుడప్పుడూ తాగుతాడుగానీ మా మావ మంచి మనసున్నోడమ్మా!" అంది. "అవునే చేతికి ఉంగరం భలే ఉందే ఏదీ.. నన్ను చూణ్ణీ" అని పరీక్షగా చూసి "ఏడ చేయించావు మే..దీన్ని" అంది. రత్తి మళ్ళీ మామూలు పాటే పాడింది. "ఓహో అట్నా..సరేలే! చానారోజులయింది మిమ్మల్ని చూసి అని..చిలకా గోరింకల్లాగా పోతుంటే ముచ్చటగా ఉందే రత్తీ.." అని నవ్వింది. ఇంతలో వెంకురెడ్డి బయటికి వచ్చి "చెంద్రంగాడికి పట్టిందల్లా బంగారమే..గుడిసె దీసి పెంకుటిల్లు కట్టిస్తున్నాడంట" అన్నాడు. "నిజమేనయ్యా.. వానొస్తే ఇళ్ళంతా నీళ్ళే.. రత్తి ఇబ్బంది పడతా ఉంది..అందుకని.." అన్నాడు. "సరేలేరా..మనూరోళ్ళు పైకొస్తే మాకు సంతోషంగాదా ఏందీ.. ఎల్లిరాండి యింక చీకటి పడతా ఉంది" అన్నాడు.

"మావా..ఈళ్ళంతా నా ఉంగరమ్మీద బడ్డారేందీ!" అనగానే "రత్తీ..రేపు నేను రేవుకు బోను..ఆ ఉంగరం ఇయ్యి. దాని మాదిరి ఇంకో గిల్టుంగరం చేయిస్తా..బయటికి వచ్చినప్పుడు అది బెటుకో..సరేనా..ఏదైనా గొడవైతే అదిచ్చేద్దాం. ఎట్టాగుంది నా ఆలోచన" అన్న చెంద్రయ్య మాటలకు "నిజమే మావా..గలభా అవకముందే మనం జాగర్త పడాల..ఆ..ఆపనిజేస్తే పోతుంది. ఇంకో మాట మావో..మనం గజ్జెలు కొన్న కాడికి పోబాక.. వాడుత్త మాయ ముండాకొడుకు మాదిరిగా ఉన్నాడు..జాగర్త" " అంది.

ప్రక్కరోజు - ఉదయాన్నే చిన్నబజారు చేరి ఒక చిన్న అంగట్లో దూరి "సామీ..మా అమ్మ ఉంగరం యిది. ఇట్టాంటిదే నా భార్య కూడా కావాలని గలభా జేస్తా ఉంది. ఇంకో గిల్టుంగరం జేసిస్తావా..పున్నెం ఉంటాది". "యోవ్... ఇప్పటికిప్పుడంటే తమాషానా..కుదరదు సాయంత్రం దాకా ఉండాల.. ఐదువందలవుతుంది.. గిల్టుదానిమీద మెత్తుగా బంగారం పూతేసి అనుమానం రాకుండా జేస్తా సరేనా.." అన్నమాటకు సంతోషంగా ఒప్పుకున్నాడు. "ఒరిజినల్ ఉంగరానికి ఏదైనా చిన్న గుర్తు బెట్టు మళ్ళీ అదో.. ఇదో.. తెలవక గందరగోళం అవుతుంది" అన్న మాటకు. "గుర్తేంబల్లా గానీ..ఇదుగో  నీ ముంగటే ఒరిజినల్ దానికి నల్లదారం చుడతా సరిపోద్ది" అన్నాడు.

చెంద్రయ్య కోమలవిలాసులో సుష్టుగా తిని మూడు గంటలకు వచ్చాడు. "యోవ్.. ఇవిగో నీ ఉంగరాలు. రెండూ తీస్కో.. పాతదానిగ్గూడా పాలీషు బెట్టా..సరేనా! నీ భార్యకు.. మీ అమ్మకు ఏం తకరాదు లేకుండా జేశా పో....." అని నవ్వాడు. ఇంతలో ఫోన్ రావడంతో "అట్నే బావా.. ఏం సమస్యేలే.. సాయంత్రం వస్తా నీ కాడికి" అని ఫోన్ పెట్టేశాడు. ఉంగరాలు తీసుకుని ఇంటి దారి పట్టాడు చెంద్రయ్య. 

రత్తి దారం చుట్టిన ఉంగరం ట్రంకుపెట్టెలో అడుగున మూటగట్టి దాచిపెట్టింది. దూప్లికేట్ ఉంగరం పెట్టుకుని ఏదైనా గొడవైనా దీన్ని తీసి ఇచ్చెయొచ్చు" అని ధైర్యంగా ఉంది.  ప్రక్కరోజు ఉదయం - చెంద్రయ్య రేవుకు పోతూ ఉండగా సత్యనారాయణ జెవెల్లర్స్ అంగడాయన కారుదిగి దేవళంలోకి వెళ్ళడం జూసి "ఈడు ఇక్కడిగ్గూడా వచ్చాడేంది.. దేవుడా! వీడికి మళ్ళీ అగపడకుంటే మంచిది" అనుకుంటూ మొహం తిప్పుకుని ఆయనకు కనబడకుండా గబ గబా నడిచి రేవుకు వెళ్ళిపొయినాడు.

ఆరోజునుండి మళ్ళీ చేపలు పడ్డం తగ్గిపోయాయి. ఏం చెయ్యాలో అర్ధం కావడంలేదు. రోజూ వందా ఏభై కంటే ఎక్కువ డబ్బులు రావడంలేదు. పెంకుటింటి కోసం కొంత అప్పుగూడా చేశాడు.  ఒకరోజు రేవులో ఒక బ్రాహ్మడు సంకల్పం చెప్తూ కనిపిస్తే "సామీ.. మొన్నటిదాకా బాగా పడ్డాయి చేపలు మళ్ళీ పడడంలేదు ఏం చెయ్యాలో తెలీడంలేదు" అని తన బాధను చెప్పుకుని మొరపెట్టుకున్నాడు. బ్రాహ్మడు "చెంద్రయ్యా..నువ్వు..నీ భార్యా.. కలిసి కామాక్షమ్మకు వంద రూపాయలు ముడుపు కట్టండి. దాన్ని ఒక వారం రోజులు రోజూ పసుపు కుంకుమతో పూజచేసి, వారం తర్వాత తర్వాత హుండీలో వేస్తానని మొక్కుకోండి" అంతా శుభం జరుగుతుందని చెప్పి ఐదు రూపాయలు దక్షిణ తీసుకున్నాడు. ఆ వారం అంతా చెంద్రయ్యకు పాతికా పరకా తప్ప ఏమీ ఆదాయం లేదు. వారం తర్వాత చెంద్రయ్య, రత్నమ్మ అమ్మవారికి ముడుపు చెల్లించుకొంటూ.. ఒరిజినల్ ఉంగరాన్ని అమ్మవారి ముందు పెట్టి, పూజచేసి యిమ్మని.. అడిగిన రత్నమ్మ దగ్గర పాతికరూపాయలు తీసుకొని పూజచేసి ఇచ్చాడు. ఆ ప్రక్కరోజునుండి మళ్ళీ చెంద్రయ్య వలలో బోలెడు చేపలు..చేతినిండా ఆదాయం..వ్యాపారం పుంజుకుంది. అప్పులు తీర్చుకుని సంతోషంగా ఉన్నారు.

గిల్టు ఉంగరం చేసిన అంగడి వాడు..సత్యనారాయణ జెవెల్లర్స్ ఓనర్ బావమరిదేనన్న సంగతి గానీ..దానిమీద గుర్తు చూసి బావకు ఆరోజు ఫోన్ చేయగా, ఆయన సలహా మేరకు రెండు డూప్లికేట్ ఉంగరాలు చేసి చెంద్రయ్యకు ఇచ్చిన విషయం గానీ.. ఓనరు ఒరిజినల్ ఉంగరం బావమరిది దగ్గర  తీసుకుని రెడ్డిగారి భార్యకు చేర్చి రెండువేలు తీసుకున్నాడని కానీ. .ఈనాటికీ చెంద్రయ్యకు..రత్నమ్మకూ ఈనాటికీ తెలీదు. నల్లదారం గట్టిన ఉంగరమే అసలు ఉంగరమని భ్రమ పడుతూ రత్తి ట్రంకు పెట్లో ఇప్పటికి దాచిపెట్టి.. అప్పుడప్పుడూ చూసుకుని.. కలిసొచ్చిన అదృష్టమని మురిసిపోతూ ఉంటుంది.

-0o0-

No comments:

Post a Comment

Pages