గుగ్గిళ్ళ గురవయ్య - అచ్చంగా తెలుగు
గుగ్గిళ్ళ గురవయ్య
(మా జొన్నవాడ కథలు - 5)
- టేకుమళ్ళ వెంకటప్పయ్య (9490400858)

ఉదయం 8 గంటలయింది. నెల్లూరు నుంచి బస్సు రాగానే, దేవళానికిబొయ్యే భక్తులు, మిగతా జనం బిలబిలమంటూ దిగారు. ఇంతలో ఒకతను బస్సులోంచి దూకినంత పని జేసి  ఆయాసంతో రొప్పుకుంటూ రోజుకుంటూ వచ్చి "గురవయ్యా! గురవయ్యా! ఒక శేరు శనగుగ్గిళ్ళు, ఒక అర్ధశేరు పెసరగుగ్గిళ్ళు, అర్ధశేరు అలచందగుగ్గిళ్ళు కట్టి గబాల్న కట్టీ... మళ్ళీ ఈ బస్సు రివర్సు జేసుకునే లోపు పోవాల. కానీ….కానీ…..బిన్నా… బిన్నా.." అని అరిచేసరికి  "సరేలే! మనిద్దరికీ ఇదేంకొత్తా… సుబ్బయ్యా! రోజూ ఉండే బాగవతమే గదా! అయినా నేనడగతా ఉండానూ.. నువ్వెక్కకుండా బస్సు కదల్తదా చెప్పు?" అని కట్టిచ్చాడు గురవయ్య. "కాతాలో రాస్కో బస్సు దిప్పేసి టిక్కట్లు గొడతున్నాడు కండట్రు.   యోవ్..   డ్రైవర్‌ సామీ!.. నేనొస్తన్నా..ఆపాపు… ఓల్డాన్" అని ఒక ధర్మకేక వేసి  లగెత్తాడు.
"వీడి ఉబద్ర పాడుగానూ... శెట్టీ.. ప్రతిదినం ఇంతే కదా ఈ నాయాల. కొద్దిగైనా నిలుపూ నిదానమూ ఉండబళ్ళా.. అహా.. ఉండబళ్ళేదా అని.. నా టీ అంగడికాడకొచ్చి కొంచెం టీ.. గీ.. దాగి, అమ్మోరి దరిశనం జేస్కోని తర్వాతి బస్సుకుపోతే కొంపలేమన్నా మునగతాయా అంటా" అని వెంకటేశ్వర్లనగానే " ఓరి.. వాడి సెకలు నీకు నీకూ నాకూ కొత్తా ఏమన్నా.. యెంకటేశ్వర్లా…. ఇప్పుడు టైము  8 దాటిళ్ళా.. వాడు గుగ్గిళ్ళు కాసేపు ములుమూడి బస్టాండులో,  కాసేపు ఆత్ముకూరు బస్టాండ్ కాడ… ఒంటిగంటా రెండింటిదాకా అమ్ముకోని… ఆపాట్న కోమలవిలాసుకుబొయ్యి సుబ్బరంగా రెండుపూటలకు గలిపి ఒకేసారి మెక్కి,  రాత్రికి  సారా దాగి పణుకోడము అలవాటయ్యిందాడికి.  ఒక్క మాట మాత్రం మనం జెప్పుకోవాలయ్యో… యెంకటేశ్వర్లా… ఒకటో తేదీ మాత్రం ఠంచనుగా నా అప్పు గట్టేస్తాడు" అనంగానే "వాడి మొహంలే శెట్టీ.. హుండీబుడ్డి బెట్టి రోజూ రెండొందలేస్తాడంట  దాన్లో..  లేకపోతే రోజు గడవబళ్ళా వాడికి .. పెళ్ళామా.. పిల్లా... జెల్లా? ఒంటికొమ్ము సొంటికాయ… తాగి తందనాలాడ్డమే ఈడిపని..అదుగో..  ఆడ నాకోసరం.. టీఅంగడి కాడికి ఎవరో వచ్చినట్టున్నారు… నే బోతన్నా... బేరం బోద్ది మళ్ళొస్తాలే!" అంటూ వెళ్ళిపోయాడు. బుచ్చి నుంచీ భూషయ్య, పెనుబల్లి నుంచీ పేరయ్యశెట్టి వస్తామని ఆటో డ్రైవర్లచేత చీటీలు రాయించి పంపడంతో ఆ గుగ్గిళ్ళు జాగర్తగా పొట్లాలు కడుతూ కూర్చున్నాడు.
గురవయ్యశెట్టి గుగ్గిళ్ళంటే ఇటు గూడూరు నుంచి అటు కావలి దాకా జెప్పుకుంటారు. నెల్లూళ్ళో అన్ని సెంటర్ల కాడా జొన్నవాడ గురవయ్య గుగ్గిళ్ళ గురించి గొప్పగా చెప్పుకుంటారు.  గత చాలా యేళ్ళనుంచీ ఉదయాన్నే ముందురోజు రాత్రి శెనగలు, అలచందలు, పెసలు లాంటివి నానెయిడం పొద్దున్నే 4-5 గంటలకు లేచి పెన్నలో ముణిగి, శుచిగా సుబ్బరంగా కమ్మగా గుగ్గిళ్ళు జెయ్యడం. అమ్మణ్ణికి అన్నిరకాల గుగ్గిళ్ళూ కొంచెం కొంచెం ప్రసాదం పెట్టి, అవి అక్కడున్న పిలకాయలకి.. బీదాబిక్కికి పంచిపెట్టాక నాస్టా జేసి అంగడి తీయడం అలవాటయింది. పదేళ్ళ కిందట పెళ్ళాం ఏదో రోగమొచ్చి పోయింది. కొడుకు బెజవాళ్ళో గవర్నమెంటుద్యోగమయింది. నెలకొకసారి వచ్చి చూసి పోతాడు.    
మిట్ట మధ్యాహ్నం 12 గంటలయింది. అందరికీ పొట్లాలిచ్చి,  కాతా పుస్తకంలో రాసుకొంటుండగా "శెట్టీ..బోజనం..." అని అరుపు విని పూటకూళ్ళమ్మ  ఓటెలునుంచీ రావడంతో వచ్చి డబ్బులిచ్చి క్యారియర్ తీసుకుని  లోనకు వెళ్ళాడు.  
*   *  *
ఉదయం 10 గంటల సమయంలో" శెట్టీ.. పూజారయ్యోరొచ్చాడు. ఒక సారి బయటికిరా!" అని ఎవరో కేకలేసేటప్పటికి దడాల్న బయటికి వచ్చి "అయ్యా! నమస్కారం సామీ! తమరొచ్చారేంది? కబురు పెడితే నేనే వచ్చేవాణ్ణి గదయ్యా!" అన్నాడు. "ఏంలేదు శెట్టిగారూ! రేప్పొద్దునకు ఉదయం 10 శేర్ల ప్రసాదానికి ఒకరు డబ్బులిచ్చారు. మా ఆడోళ్ళు పని మీద నెల్లూర్లో ఉన్నారు. అందుకని.. రేపు ఉదయం తొమ్మిదిన్నరకు 10 శేర్ల శెనగుగ్గిళ్ళు కావాలి" అనగానే "అయ్యా! ప్రసాద మంటున్నారు. నేంజెయ్యొచ్చా!" ఏం పర్వాలేదు. అయ్యన్నీ నేను జూసుకుంటా గదా! కాస్తా… స్నానమదీ జేసి మడిగుడ్డ గట్టుకోని.. ఏంది.. మడితో చేస్తే చాలు. ప్రసాదమిచ్చేదాకా ఆళ్ళనీళ్ళని దాకబాక..ఆ.. " అంటూ చేతిలో డబ్బులు పెట్టి వెళ్ళిపోయాడు.
ఇదేం పితలాటకంరా దేవుడా! అనుకొంటూ దేవళానికిబొయ్యి అమ్మణ్ణికి మనస్ఫూర్తిగా ప్రార్ధించి బయటకొస్తుండగా ఒక పదేళ్ళ పిల్ల "యోవ్! శెట్టీ.. నువ్ జేసే గుగ్గిళ్ళు బలే రుచిగా ఉంటాయి. రేపుగూడా తెస్తావా!" అంది. "నిన్నిదివరకు ఇక్కడెక్కడా చూళ్ళేదే..ఊరికి కొత్తా? " అని ఎగాదిగా చూసే సరికి " నా పేరు దుర్గ... నేను ఆడుంటా శెట్టీ!" అని దేవళం వైపు చూపించింది.  దేవళం వెనకాలయింటుదేమో అనుకుని నవ్వుకున్నాడు.   ఇంటికొచ్చి స్టవునస్పేటకు మనిషిని పంపించి కావాలిసిన సామాన్లు తెప్పించుకున్నాడు. మరుసటిరోజు 4 గంటలకే పెన్నలో స్నానంజేసి అమ్మణ్ణిని ప్రార్ధించి పని ప్రారంభించి ఘుమ ఘుమా వాసనొచ్చే తాళింపు వేసి 9 గంటలకల్లా గుగ్గిళ్ళు రెడీ చేసి కబురు పంపాడు. పూజారి సహాయకులను పంపించి మడిగా ప్రసాదం దేవళానికి తెప్పించుకున్నాడు. 11 గంటలకు గుళ్ళో అందరికి ప్రసాదం పంచిపెడుతుంటే శెట్టి కూడా లైన్లో నిలబడి ప్రసాదం తిన్నాడు. ఉభయదాతలు “ఇట్టాంటి గుగ్గిళ్ళు జీవితంలో తినలేదు స్వామీ”  అని అయ్యోరితో అనడం విన్నాడు.నిన్న కనబడ్డ దుర్గ కనబడి "శెట్టీ.. ఈ ప్రసాదం చాలా రుచిగా ఉంది. నువ్వు చేసిన గుగ్గిళ్ళ మాదిరే! అచ్చు!" అంది.  ఇదెక్కడి పిల్లరా నాయనోయ్.. నన్నొదిలిపెట్టేట్టు లేదు అనుకుని నవ్వుకుంటూ బయటికొచ్చాడు. పూజారి అందరూ గుగ్గిళ్ళు బ్రహ్మాండంగా ఉన్నాయన్నారని పొగిడారు. శెట్టి మాత్రం దేవళం వైపు దిరిగి “అమ్మా! నాకు పొగడ్తలు అవీ ఇవీ ఏంబల్లేదుగానీ నీ దయుంటే చాల్తల్లీ.. చల్లంగా జూడు చాలు”  నమస్కారం చేశాడు.
*   *  *
కొంతకాలం గడిచాక "క్రొత్తొక వింత-పాతొక రోత అన్న" సామెతగా ప్రజల రుచుల్లోను అభిరుచుల్లోను మార్పులొచ్చాయి. దేవళానికి కొంచెం దూరంగా శెట్టింటికి ఎదురుగా ఒక పాని-పూరి బండి, ఒక నూడుల్స్ అమ్మే బండి వెలిశాయి. పిలకాయలు ఎగబడి అక్కడ కొనుక్కోడం ప్రారంభించారు. అదొక ఫ్యాషన్‌గా తయారయింది. 
రెండు రోజులు సెలవులొచ్చాయని శెట్టి కొడుకు ఈశ్వరయ్య బెజవాడ నుంచి వచ్చాడు. బస్సుదిగి బ్యాగు ఎనకాల తగిలించుకొని తన ఇంటివైపు నడుస్తుండగా పాని-పూరి బండి అబ్బాయి పెద్దగా "ఏంది సామీ! ఏడికి అటు బోతా ఉండావు? కొంపదీసి గుగ్గిళ్ళకోసమా ఏంది?" అనేసరికి అక్కడి పిల్లలు న్యూడుల్స్ బండి అబ్బాయి అంతా పెద్దగా నవ్వారు. “రాత్రికి బాబుకు బాంబులు గేరంటీరా!” అనేసరికి చప్పట్లు గొట్టి మరీ నవ్వారు. వీళ్ళతో గొడవెందుకని కోపంగా ఇంట్లోకి నడిచాడు. 
   *   *  *
"నాయనా! నువ్వేమైనా జెప్పు ఆ బళ్ళోళ్ళు  మాత్రం మనింటికెదురుంగా బళ్ళు బెట్టడానికీల్లేదు అంతే! దూరంగా ఏడన్నా బెట్టుకోమను" అన్నాడు ఈశ్వరయ్య కోపంగా. ఒరే ఆడబెట్టుకో.. ఈడబెట్టుకోమని చెప్పడానికి మనమెవురంరా అయ్యా!  ఆచోటేమన్నా మన తాతగట్టిచ్చిన ముల్లే.. ఏంది? ఇది నలుగురు దిరిగే ఈధి.. వాళ్ళిష్టం. “నేను బెజవాడ బొయింతర్వాత రెండు బోర్డులు పంపిస్తా కొరియర్లో... వాటిని మన ఇంటిముందు తగిలించు కనీసం ఆ పనన్నా జెయ్యి చాలు. అన్నిటికి బయమే నీకు" అన్నాడు. సర్లేరా! బయం గియం కాదురా! ఎవరి యాపారం ఆళ్ళది. మనమేమీ ఇయ్యాళ కొత్తగా బోర్డులు రాసుకోబల్లా.. మన కత.. మన గుగ్గిళ్ళెవ్వారం అందరికి దెలవదా ఈశ్వరయ్యా జెప్పు." అన్నాడు.
అంతకు ముందంత గాకపొయినా శెట్టి బేరాలు శెట్టికొస్తూనే ఉన్నాయి. కాలం జరిగిపోతూ ఉంది. ఒక రోజు పోస్టబ్బాయి వచ్చి "మీ పిలగాడు బెజవాణ్ణుంచి పంపాడు" అంటూ సంతకం బెట్టించుకొని ఒక పెద్ద అట్ట ఇచ్చి వెళ్ళాడు. మన గుగ్గిళ్ళ గురించి రాశాడేమో అనుకుని పక్కరోజు దేవళం గుమాస్తాను పిలిచి వాటిని విప్పి చదవమన్నాడు.
చదివింతర్వాత పెద్దగా నవ్వుతూ "గురవయ్యా! నీ కొడుకు చానా తెలివిగల్లోడయ్యో! ఏమో అనుకున్నా గానీ...ఈ బోర్డులు గానీ నీ ఇంటి ముందు బెట్టావనుకో ఇటు ఆ పాని-పూరి ఓడు, మళ్ళీ ఆ పాములబొమ్మలబండి నూడుల్సోడు జొన్నాడొదిలి పారిపోవడమే నాయాళ్ళు" అన్నాడు.   "అదేందది ఏముంది? దాంట్లో కాస్తా చదవు ముందుగాల" అన్నాడు. ఆయన నవ్వుతూ " ఈ పానీ పూరీలు, చాట్‌లు, నూడుల్స్ తింటే వచ్చే రోగాలు. డాక్టర్లు వీటిని వద్దని చెప్తున్నారని" మొత్తం చదివి వివరంగా వినిపించాడు.” బోర్డ్‌లు బయట పెట్టు చెప్తా..”అని పెద్దగా నవ్వేసి వెళ్ళిపోయాడు. శెట్టి బోర్డులను తీసి బీరువా మీద పెట్టాడు. 
కొంతకాలం గడిచాక ఈశ్వరయ్య ఆఫీసు ట్రైనింగని బొంబాయి వెళ్ళిన సమయంలో గురవయ్యకు ఆరోగ్యం దెబ్బ తినింది. ఆర్.ఎం.పీ డాక్టరు ఏవో బిళ్ళలు టానిక్కులు ఇస్తూనే ఉన్నాడు కానీ తగ్గినట్టే తగ్గి మళ్ళీ తిరగబెడుతూ ఉంది.  పానీపూరీ బండ్ల వాళ్ళు రోజూ తిరిగే గురవయ్యకు ఏమైందని ఒకరోజు సాయంత్రం ఇంటికి వచ్చారు. గురవయ్య వసారాలో మంచం మీద పడుకొని పెద్దగా దగ్గుతూ ఉన్నాడు. లేవలేక "ఎవరాడ...!" అన్నాడు. వాళ్ళిద్దరూ లోనకు వచ్చి ఎదురుగా ఉన్న చెక్క బల్లమీద కూర్చొని "శెట్టీ! మేము ఎదురుగా ఉన్న బళ్ళోళ్ళం. నువ్వు అసలు తిరగడంలేదు. అంగడి గూడా రెండ్రోజుల కాడ్నుoచీ తియ్యడంలేదు ఏమైందోనని చూడ్డానికి వచ్చాం" అన్నారు. "ఓరోరి మీరంట్రా! చానా సంతోషమబయా! ఎట్టాగుంది మీ వ్యాపారం?" అనే లేచి కూర్చునేసరికి వాళ్ళు ఆశ్చర్యపొయ్యారు. శెట్టి ఒపిక దెచ్చుకుని అట్టా దగ్గుతూనే "ఒరేయ్ యెంకటేశ్వర్లా రొండు టీ" అని చప్పట్లు గొట్టి సైగ జేశాడు.  “శెట్టీ….ఇప్పుడేంబల్లేదు గానీ..         నీ కొడుకని తెలియక మొన్నామద్దిన మీ ఈశ్వరయ్యతో గుగ్గిళ్ళ గురించి కాస్తా పొరబాటుగా మాట్లాడాం. ఏమనుకోబాకయ్యా.." అన్నారు.  సర్లేండబయా! నేనేమైనా అన్నానా మిమ్మల్ను! తెలీక అనుంటార్లే! మావాడికి మాత్రం బాగా కోపం వచ్చిందయ్యో! వాడు జేసిన పని…. అని పెద్దగా నవ్వేసరికి తాతకు దగ్గుతెర ముంచుకొచ్చింది. మెల్లిగా సర్దుకుని... “ఆ కతేందో తర్వాత చెబ్తాగానీ టీ దాగండి ముందు చల్లరిపోతుంది”. గ్లాసులిస్తే గానీ బయటికి బోడు యెంకటేశ్వర్లు" అన్నాడు. టీ గ్లాసులు తీసుకుని వెళ్ళాక "అబయా! మీరు చిన్న పిలకాయలు. ఒక్క మాట వినండి. ఏ యాపరంలోనైనా నాణ్యత ముఖ్యం. నాణ్యతుంటే అన్నీ వస్తాయి. గుంటూరాయన క్రేను వక్కపొడి గ్రంధి సుబ్బారావు యెరికేనా మీకు? అట్టాగే హైదరాబాదు పుల్లారెడ్డిని ఎరుగుదురా! వాళ్ళంతా ఎట్ట పైకొచ్చింది? అద్దెలుసుకోండి ముందు. మన వస్తువు మాదిరి ఎక్కడా ఉండగూడదoతే! అట్ట జెయ్యాల యాపారం. ఆ నాణ్యత మాత్రం ఎప్పటికీ ఉండాల. యాపారమంటే నాణ్యత, నమ్మకం గుర్తు బెట్టుకోండి. డబ్బులు ఆటంతటవే వస్తాయి. నేనూ చాలా బాధలు పడ్డా చిన్నప్పుడు. చేతిలో చిల్లపెంకు లేకుండా ఈ ఊరొచ్చి అమ్మతల్లిని నమ్ముకొని, ఎక్కువ లాబాల్లేకపొయినా యాపారంలో పేరు దెచ్చుకోవాలని నిదానంగా నిదానంగా పేరు దెచ్చుకున్నా. అంతే గానీ... సినిమాల్లో జూపిచ్చినట్టు రాత్రికి రాత్రి ఏమీ అద్భుతాలు జరగవు ఎవళ్ళ జీవితాల్లో. మన ఎంత కృషి చేస్తే అంత ఫలితం" అని  "అయ్యొ.. అసలు కత మర్చిపొయ్యా.. ఉండు..అని బీరువామీద రెండు అట్టలుంటాయి తేయ్యా.."   అని వాళ్ళకిచ్చాడు. వాటిని చదివిన బండ్లవాళ్ళు నివ్వెరపొయ్యారు. "ఈటిని మా అబ్బాయి బెజవాడ నుంచి రాయించి అంపిచ్చాడు. బయట కట్టమన్నాడు. " కానీ ఒక్కటి గుర్తు పెట్టుకోండి. మనం ఎవరి కడుపు మీద గొట్ట గూడదు. ఎవరి బొచ్చెలో అయినా రాయెయ్యాలని జూశామంటే మొదట దేవుడు మన బొచ్చెలోనే రాయేస్తాడు. అది మటుకు గ్నాపకం బెట్టుకోండి. మీరు బతకండి. చేతనైతే సాయం జెయ్యండి. ద్రోహం మాత్రం జెయ్యొద్దు." అనేసరికి ఇద్దరూ శెట్టి సంస్కారానికి పాదాభివందనం జేశారు. పిల్లా పాపలతో చల్లంగుండండి… హాయిగా.. " అని దీవించాడు. 
   *   *  *
పక్కరోజు జ్వరం ఎక్కువయ్యేసరికి కొడుకుకు ఫోన్‌ జేసి పిలిపించారు చుట్టుపక్కలోళ్ళు. డాక్టరొచ్చి రెండు మూడు రోజులకంటే బతకడని చెప్పాడు. బండ్లవాళ్ళే మాత్రలు వేస్తూ దగ్గరుండి అన్నీ చూసుకుంటున్నారు. ఒక రోజు ఉదయాన్నే మంచం దగ్గర గజ్జెల శబ్దం వినపడింది. ఒక పాప వచ్చి పక్కన మంచమ్మీద కూచొని "తాతా! ఎట్టుంది నీకు? నువ్వు పొద్దున పూట దేవళంలోకి గుగ్గిళ్ళతో రావడంలేదని నేనే వచ్చా! నిన్ను చూద్దామని! దిగులు పడవాక! నీ కొడుకొస్తున్నాడులే! సాయంత్రానికి" అంది చెవిలో చెప్పింది. బలవంతంగా మాట పెగిలిరాకపొయినా ఎవరూ అని సైగ జేసి అడిగాడు. "నేను  గుగ్గిళ్ళ దుర్గమ్మను... గుర్తులేదా" అని పెద్దగా నవ్వింది.. ఓ..నువ్వా అమ్మా! అన్నాడు. "అన్నీ నువ్వనుకున్నట్టే జరిపిస్తాం తాతా! దిగులేంబెట్టుకోవాక. నీకు బాధలే ఉండవు రేపట్నించీ! సాయంత్రానికి శివయ్యే వస్తాడు"  అని వెళ్ళిపోయింది. గజ్జెల శబ్దం దూరమయ్యాక అప్పటికి గురవయ్యకు మెల్లిగా అసలు విషయం అప్పటికి అర్ధమయింది అసలు విషయం. అప్పుడే బయటనుంచి వచ్చిన టీఅంగడి వెంకటేశ్వర్లు "ఏంది తాతా! కలవరిస్తున్నావా! ఎవరితో మాట్లాడుతున్నావు?" అని అడిగేసరికి నవ్వుకొని "ఎవరూ రాలేదులేరా! ఏదో కల అంతే!. మంచినీళ్ళియ్యి" అన్నాడు. నీళ్ళుతాగి మనసులోనే లెక్కపెట్టుకుంటూ 108 సార్లు  'ఓం నమశ్శివాయ’ జపం చేశాడు. 
సాయంత్రానికి కొడుకు భోరుమని ఏడ్చుకుంటూ ఆటో దిగే సరికి గురవయ్య చివరి దశలో ఉన్నాడు. రాగానే దిండు క్రింద ఒక కవరు తీసిచ్చాడు. కొడుకు ఏడుస్తూ! తండ్రి చేతిలో చెయ్యి వెయ్యగానే తండ్రి గట్టిగా పట్టుకుని ఇక నాపని అయిపొయింది అన్నట్లు సైగ చేశాడు.  పానీపూరిబండివాడు, నూడుల్స్అమ్మేవాడు నాయన కాళ్ళదగ్గర               నిలబడ్డారేందని ఆశ్చర్యంగా చూస్తూ... ఉత్తరం విప్పి చదవసాగాడు . దూరంగా శంఖం ఊదిన శబ్దం వినపడింది. 
“నాయనా.. ఈశ్వరా! నీకు ఆ ఈశ్వరుడి పేరు పెట్టుకున్నా చివరి నిముషంలో ఆ పరమేశ్వరుడిని తలుచుకోని పోవాలని... కానీ.. నాకు ఆ భాగ్యం ఉందో లేదో తెలీదు. నేనేం చదువుకోలేదు. ఎక్కువ ఆస్తీ పాస్తీ… బూమీ బుట్రా సంపాయించలేదు. మీ అమ్మ నువ్వు హైస్కూల్లో ఉండగానే పొయింది. ఆ దిగులుతో బ్రతుకుమీదే విరక్తి గలిగింది.  సద్దామని చానా సార్లనుకున్నా... మొండి ధైర్యం తెచ్చుకోని నిన్ను చదివించి ఈ మాత్రం అన్నా పైకొచ్చేట్టు చేసానంటే అదంతా మీ అమ్మ చివరికోరికే!  నీ చిన్నప్పుడు గుగ్గిళ్ళ అంగడిలో పెడతానంటే మీ అమ్మ పెద్ద గలభా చేసి నిన్ను హైస్కూల్లో చేర్చింది. దాని మాట ప్రకారమే నిన్ను చదివించాను. నా మాదిరిగాకుండా ఉద్యోగస్తుడివయినావు. అంతే జాలు నాకు. పొయ్యేముందు రెండు మాటలు జెప్పాల నీకు. డబ్బులు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు. వ్యాపారమయినా, ఉద్యోగమయినా నమ్మకం పోగొట్టుకుంటే మళ్ళీ రాదు. నమ్మకం, పనిలో నాణ్యత అనేవి చాలా ముఖ్యం. నాకు దెలిసింది నేను చెప్పగలిగింది చివరి సలహా అదే నీకు. అంతన్నా నాకేం దెలేదు. ఇంక ఆస్తులంటావా...  మీ అమ్మ పసుపు కుంకాలకని మా అత్తామామా ఇచ్చిన మినగంట్లో రెండెకరాలు, నన్ను ఇంతదాకా కాపాడిన ఆ తల్లికి దేవళం పేరు మీద రాశాను. మీ అమ్మ సొమ్ము మళ్ళీ అమ్మకే ఇవ్వాలని అనుకున్నాను. అంతే! ఇలా చేసినందుకు నా మీద కోపం పెట్టుకోవద్దు. నీకు ఈ ఊర్లో ఉన్న నాలుగెకరాల మాగాణి మాత్రమే ఇవ్వగలుగుతున్నాను.  నా ఆకరి కోరిక ఒకటుందయ్యా ఈశ్వరయ్యా! దాహం వేసిన వారికి మంచినీళ్ళు దానం చేస్తే పుణ్యలోకాలకు పోతారని మా అమ్మ చిన్నప్పుడు చెప్పేది. అందుకని  ఈ చోటులో ఒక సిమెంటు వసారా వేసి దేవళానికొచ్చే భక్తులకు ఒక పెద్ద కూలర్ పెట్టించ మని కోరుతున్నాను.  కనీసం నేను పొయిన కొద్ది తరాలైనా ఇక్కడే గుగ్గిళ్ళగురవయ్య అనే వాడొకడుండేవాడని జ్ఞాపకం పెట్టుకుంటారని ఈ పని చేస్తున్నా!" ఉత్తరం చదివి కన్నీళ్ళతో చూసే సరికి తండ్రి ప్రాణాలు అప్పుడే వదలినట్టు తెలుస్తోంది. కళ్ళు మాత్రం కొడుకునే "నేను చెప్పింది మరచిపోవాక ఈశ్వరా!” అన్నట్టు చూస్తున్నాయి.  తండ్రి  కళ్ళను ఎడమచేత్తో మూసి, ఆయన చేతులో బిగుసుకుపోయిన తన కుడి చేతిని మెల్లిగా విడిపించుకున్నాడు కన్నీరు మున్నీరవుతూ  ఈశ్వరయ్య.
   *   *  *

No comments:

Post a Comment

Pages