విశ్వవ్యాప్త రామాయణం - 3 - అచ్చంగా తెలుగు

విశ్వవ్యాప్త రామాయణం - 3

Share This
విశ్వవ్యాప్త రామాయణం - 3
ఆదిత్య శ్రీరామభట్ల 


సిక్కుమతంలో రామాయణం:

బౌద్ధ, జైన మతాలలోనే కాకుండా సిక్కు మతంలోని పవిత్ర గ్రంథమైన గురుగ్రంథసాహిబ్‌లో కూడా రామాయణం గురించి చెప్పబడింది. అయితే ఇక్కడ ప్రతీకాత్మకంగా పాత్రలను చూపించారు. సిక్కులు కూడా దశావతారాలను నమ్ముతారు. ప్రపంచాన్ని సరైన దారిలో నడపటానికి ఆ పరమాత్మ పది అవతారాలలో వచ్చాడని వారి నమ్మకం. అందులో భాగంగానే రాజారాముడు అవతరంచాడనీ, లోకంలో ధర్మ సంస్థాపన చేశాడని నమ్ముతారు. రావణాసురుడిని అహంకారానికి, సీతాదేవిని బుద్ధికి, రాముడిని అంతరాత్మకు, లక్ష్మణుడిని మనస్సుకు ప్రతీకలుగా గురుగ్రంథసాహిబ్‌లో చెప్పబడింది.

ఆగ్నేయాసియాలో రామాయణం:

శ్రీమద్రామాయణం కేవలం భారతదేశంలోనే కాక శ్రీలంక, చైనా, మయన్మార్, థాయిలాండ్, ఇండోనేషియా, కాంబోడియా, లావోస్, ఫిలిప్పీన్స్, మలేషియా, మంగోలియా, వియత్నాం, జపాన్ వంటి దేశాల్లో కూడా ప్రసిద్ధి చెందింది. పూర్వం ఆగ్నేయాసియా దేశాలు భారత దేశంతో వ్యాపార సంబంధాలు కలిగి ఉండేవి. వర్తకానికి వెళ్లే వ్యాపారులు వారితో పాటు క్రమంగా రామాయణాన్ని కూడా మోసుకెళ్లారు. 

అలాగే ఆగ్నేయ ఆసియా దేశాల్లోనే కాకుండా తూర్పు ఆసియా దేశాలలో బౌద్ధ విస్తరించడంతో రామాయణం అక్కడ కూడా ప్రవేశించింది. ప్రస్తుత ఇండోనేషియా దేశంలోని జావా, సుమాత్రా ద్వీపాలని పూర్వకాలంలో శ్రీవిజయ అని పిలిచేవారు. శ్రీవిజయ రాజ్యానికి మనదేశంలోని తమిళనాడులోని చోళ,పాండ్య, పల్లవ రాజ్యాలతో వ్యాపార సంబంధాలుండేవి. అలాగే ఇండోనేషియా దేశం యొక్క ప్రస్తుత జాతీయ చిహ్నం కూడా గరుత్మంతుడే, దాన్ని వాళ్లు అధికారికంగా గరుడ పంచశీల అని పిలుస్తారు.

ప్రస్తుతం ఆగ్నేయాసియా దేశాల్లో హిందూమతం లేకపోయినా ఇండోనేషియా,మలేషియా లాంటి ముస్లిం దేశాలలో, కాంబోడియా, లావోస్ వియత్నాం, థాయిలాండ్, చైనా, జపాన్ లాంటి దేశాల్లో రామాయణం బాగా ప్రసిద్ధి చెందింది. ఉదాహరణకి ఇప్పటి థాయిలాండ్ మహారాజ ప్రమాణస్వీకారం థాయిలాండ్ రామాయణం మీదే జరుగుతుంది. థాయిలాండ్‌ని పరిపాలించిన రాజులందరినీ 'రామా' అనే పేరుతో సంబోధిస్తారు. వారి యొక్క పూర్వరాజ్యాన్ని అయుథ్య(అయోధ్య) అని పిలిచేవారు. ప్రస్తుత రాజు పేరు వచిరలాంగ్‌కొన్ కానీ అధికారిక రాచరిక నామం మాత్రం 'రామా X'. థాయిలాండ్ దేశం యొక్క జాతీయచిహ్నం కూడా విష్ణుమూర్తి యొక్క వాహనమైన గరుత్మంతుడే.

ఆగ్నేయాసియా, తూర్పు ఆసియా దేశాలలోని రామాయణాలను ఏ పేర్లతో పిలుస్తారో ఒకసారి చూద్దాం...

1) శ్రీలంక - జానకీహరణ ( సింహళ భాష)
2) థాయ్‌లాండ్ - రామాకీన్ ( థాయ్ భాష )
3) ఫిలీప్పిన్స్ - మహారాద్య లావణ ( ఫిలిప్పినో భాష )
4) మయన్మార్ - యమ జాత్‌దావ్ లేదా యమాయన ( బర్మీస్ భాష )
5) మలేషియా - హికాయత్ సేరి రామ ( మలయ భాష )
6) లావోస్ - ఫ్రా లాక్ ఫ్రా రామ్ ( లావో భాష )
7) ఇండోనేషియా - రామకవచ ( బాలినీస్ భాష )
                          - కాకవీన్ రామాయణ ( ప్రాచీన జావానీస్ భాష )
                          -  రామాయణ స్వర్ణద్వీప ( సుమాత్ర మలయ భాష )
8) కాంబోడియా - రియామ్‌కర్/రామకేర్తి ( ఖ్మేర్ భాష )
9) చైనా - లంగ్‌కా సిప్ హోర్ ( తాయ్ లూ భాష )
10) జపాన్ - రామాయెన్న/రామాయెన్‌షో ( జపానీస్ భాష )

శ్లోకం||:
మహారత్న పీఠే శుభే కల్పమూలే, 
సుఖాసీనమాదిత్యకోటి ప్రకాశమ్‌ |
సదా జానకీ లక్ష్మణోపేతమేకం,
సదా రామచంద్రం భజేహమ్‌ భజేహమ్‌ ||

శ్రీ రామ జయం....

No comments:

Post a Comment

Pages