శ్రీగానలోల (పొడుపుకథల) శతకము - పుట్రేవు నాగభూషణం - అచ్చంగా తెలుగు

శ్రీగానలోల (పొడుపుకథల) శతకము - పుట్రేవు నాగభూషణం

Share This

శ్రీగానలోల (పొడుపుకథల) శతకము - పుట్రేవు నాగభూషణం

పరిచయం: దేవరకొండ సుబ్రహ్మణ్యం కవి పరిచయం: గానలోల శతక రచయిత పుట్రేవు నాగభూషణం క్రీ.శ. 1894లో ఏలూరు. పశ్చిమ గోదావరి జిల్లాలో జన్మించారు. పుట్రేవు వేంకట సుబ్బరాయడు గారి ద్వితీయ సంతానము. అలంకారశాస్త్ర సంబంధమైన రచనలు, పురాణేతివృత్తాలతో కూడిన రచనలు ఎక్కువగా చేశారు. హరికథలు కూడా రాశారు. సీతాకళ్యాణం, మార్కండేయ చరిత్ర, విప్రనారాయణ చరిత్ర, శ్రీనివాస కళ్యాణం ఇతని హరికథలు. దాసపోషక శతకం కూడా రచించారు.
ఈకవి గురించి ఇతరవివరాలు తెలియటం లేదు.

శతక పరిచయం:

"దీని యర్థమేమి గానలోల" అనేమకుటంతో రచింపబడిన ఈశతకంలో 101 ఆటవెలది పద్యములున్నవి. ఈశతకంలో ప్రతి పద్యము ఒక పొడుపుకథ. దేవతాస్తుతికూడా వీరు పొడుపుకథలోనే చేసారు.

ఆ.వె. తండ్రికంటె గొప్పతనమున మున్ముందు
పూజనముల నందు పుణ్యుఁడెవ్వడొ
యట్టివాని నెపుడు నాత్మఁ గొల్చెదనన్న
దీని యర్థమేమి గానలోల   (విఘ్నేశ్వరుఁడు)

ఆ.వె. బాపనమ్మవయ్యు బతిఁ గల్గియుండియు
రచ్చమీదకెక్కు రమణియేపొ
యట్టియాపె నెపుడు నాత్మగొల్చెదనన్న
దీని యర్థమేమి గానలోల

ఆగ్తరువాతి అన్ని పద్యములలో మనకు చక్కటి పొడుపుకథలు కనిపిస్తాయి.

నాల్గు మొగములుఁడు నలినోద్భవుడుగాడు
కనులు పదియునాఱు కలిగియుండు
నాలుమగలకెపుడానందమిచ్చును
దీని యర్థమేమి గానలోల (మంచము)

నాల్గుకాళ్లునుండు నడుముచేతులు నుండు
వీనులనగలేవు వీఁపు గలదు
రాజసభలయందు తాజిల్లుచుండును
దీని యర్థమేమి గానలోల  (కుర్చీ)

పండ్లు నూఱుగలవు ప్రాణంబులును లేవు
జీవకోటినెల్ల జిక్కఁబట్టు
నరులతలలపైన నాట్యంబులాడును
దీని యర్థమేమి గానలోల  (దువ్వెన)

నెత్తిపైన పాత్ర నెత్తుకనోటితో
నడవుకఱ్ఱలెల్ల నట్టెమ్రింగి
యవనిజనులల్కెల్ల నన్నంబు నిచ్చును
దీని యర్థమేమి గానలోల  (ప్రొయ్యి)

కారమనెడుపేర ఘనతకెక్కునుగాని
యుప్పురీతినుండు చప్పరించ
నీరు తగుల కరఁగు నిప్పంట మండును
దీని యర్థమేమి గానలోల   (సురేకారము)

శుకము వనము శాఖ యొకమాటలోపల
కుదిరియుండు నరయఁ గూర్మితోడ
నదియెజనులకెల్ల నౌషధంబైయుండు
దీని యర్థమేమి గానలోల  (చిలుకతోటకూర)

వేయికన్నులుండు వేల్పురేడా కాడు
కడుపు చెవులు నోరు కాళ్ళులేవు
ధాన్యరాసులెల్లఁ దనివార భుజియించు
దీని యర్థమేమి గానలోల   (జల్లెడ)

ఎంతరాజునైన నెదిరింప నెదిరించు
మాటలాడెనేని మాటలాడు
జనులు వానిజూచి సంతోషపడెదరు
దీని యర్థమేమి గానలోల    (అద్దము)

పదివలువలుగట్టు పణ్యాంగనయుగాదు
చెలఁగి నేలబుట్టి సీతగాదు
తన్నుగోసి నరులు తప్పక యేడ్తురు
దీని యర్థమేమి గానలోల     (ఉల్లిపాయ)

రాజుమీఁద నెక్కు రౌతుమీఁదను నెక్కు
నందినెక్కు పిదప పందినెక్కు
నమృతము పయినెక్కు నన్నింటిపైనెక్కు
దీని యర్థమేమి గానలోల    (ఈఁగ)

ముసలివాఁడు నగును పసిబాలుఁడును నగు
నేలమీఁదనెపుడుడు నిలువఁబోడు
గాని యతనివలన కాలంబు దెలియును
దీని యర్థమేమి గానలోల    (చంద్రుఁడు)

జుట్టు విరియఁబోసి బట్త్లు పదిగట్టి
చెట్టుమీఁదనుండు చిట్టచివర
పొట్టచించెనేని పొడచూపు ముత్యముల్
దీని యర్థమేమి గానలోల    (మొక్కజొన్నపొత్తు)

ఇటువంటి ఎన్నొ వినోదముతో పాటు విజ్ఞానము కలిగించే ఎన్నొ పొడుపుకథలు ఈశతకంలో మనకు లభిస్తాయి.
మీరూ చదవండి. మీ మిత్రులచే చదివించండి.

No comments:

Post a Comment

Pages