మోక్షార్థం - అచ్చంగా తెలుగు

 మోక్షార్థం

-ప్రతాప వెంకట సుబ్బారాయుడు


భగవంతుడు శక్తి కేంద్రం. ఆ శక్తి పరిథిలో సంచరిస్తే కలిగే అనుభావాలు అనుభవైకవేద్యం. భక్తి ప్రదర్శించేది కాదు ముభావంగా ముక్తి మార్గాన్ని అనుసరించేది. దేవుడంటే సృష్టికారకుడు, పంచభూతాల నిర్వాహకుడు, మన ఆలోచనలకు, అభిప్రాయాలకు అందనివాడు. చూడగలిగిన వారికి ఇందుగలడందులేడని, ఎందెందు వెదకి చూసిన అందందు ద్యోతకమయ్యేవాడు. 

నీతి, నిజాయితీ, న్యాయ సద్గుణాల్లో ప్రస్ఫుటంగా ప్రతిఫలించేవాడు.

నిజ భక్తులకు కష్టాల్లో, బాధల్లో, భయాల్లో అండగా ఉన్నాడనిపించే తోడు.

తులసి ఆకు ప్రేమకు, పిడికెడు అటుకుల ఆప్యాయతకు లొంగిపోయేవాడు.

ప్రహ్లాదుడు హరిని మనసులో నాటుకున్నట్టు, ఆంజనేయుడు శ్రీరాముణ్ని ఎట్టి పరిస్థితుల్లోనూ విడవనట్టు, త్యాగయ్య, రామదాసులు రామచంద్రుడు తప్ప ఈ లోకంలో మరేదీ లేదనుకున్నట్టు, ధూర్జటి శివయ్యను ఆరాధించినట్టు మనలో స్వామిభక్తి నిండి, నిభిడీకృతమైపోవాలి. అంతరాత్మను అంతర్యామికి చేరువ చేయడానికి ఆ మహాత్ములు అలవరచుకున్నంత ఓర్పు, సహనం అభ్యసించాలి.

ఇంట్లో దేవుడి గూటితో మొదలై వీధిలోని గుడితో అంతమయ్యేది కాదు ఆయన అస్తిత్వం. ఆది అంతం లేనిది. అప్రకటితం. శరీరం వెళ్లలేని చోటుకు సైతం మనసు వెళ్లగలగడం మన అదృష్టం. మనసును ఇలాతలం నుండి ఊర్ధ్వలోకాలకు మళ్లించాలి.

మోక్షమార్గం అనేది ప్రణాళికాపూర్వక పాఠ్యాశం కాదు. నమూనాలు, అడుగుజాడలు, అనుభవసారాలు ఉపయోగపడవు.

అభ్యాసంతో ముక్తి పొందలేం. ఎవరి మార్గం, ఆచరణ వారిది. భక్తి సులభసాధ్యం కాని, దేవుడు భక్తసులభుడు కాదు. 

అన్యథా శరణం నాస్తి. నువ్వు తప్ప నాకెవ్వరూ లేరు. మరెవ్వరూ తెలియదు. నీట ముంచినా పాల ముంచినా నీదే భారం అని త్రికరణశుద్ధిగా నమ్మితే, నారు పోసిన వాడు నీరు పోస్తాడు. సకల జీవరాశిలో మానవజన్మ ప్రసాదించిన పరమాత్ముడు, సత్కర్మాసక్తులను తరింపజేస్తాడు. 

మనిషిగా పుట్టి, మనీషిగా ఎదిగి భగవంతుడిలో ఒదిగిపోవడంకన్నా కావలసింది ఏముంటుంది. దేవుడిలో జీవుడు లయమవ్వడమే మోక్షార్థం.

రాక్షసులు తమ మొండి పట్టుదలతో దివారాత్రాలు తపస్సు చేసి భగవంతుణ్ని ప్రసన్నం చేసుకుంటారు. భగవత్ సాక్షాత్కారం జరిగినప్పుడు ఆయన పాదాలు గట్టిగా పట్టుకుని, ఆయన మనసులో స్థానం సంపాదించుకోక తుచ్ఛమైన కోరికలు కోరి తమ చావు తామే కోరి తెచ్చుకుంటారు.

దేవుడు మనకొక ఉపకారం చేశాడు. రాక్షసులుగా పుట్టించకుండా మానవజన్మ ప్రసాదించాడు. అసంబద్ధ కోరికలు కోరకుండా పరమాత్మని చేరాలని కాని, నేను అన్న అహంకారంతో ప్రోది చేసుకున్న దుష్ట ఆలోచనలు మనసును ఆక్రమించి వక్రమార్గం పట్టిస్తుంటాయి. బుద్ధికి మనసును వశం చేసి, దేవుడిపై నిమగ్నం చేయాలి. అప్పుడప్పుడు దానవత్వం వైపు కదిలే తక్కెడను దైవత్వం వైపుకు ఒరిగేలా చేసుకోవాలి. 

మానవులు భూమ్మీద జన్మించి, మరణిస్తుంటారు. దేవుడు ప్రకృతి రూపంలో చిరంజీవిగా ఉండి మానవులను సంస్కరించి సద్గతులు ప్రసాదిస్తాడు. ఎన్ని జన్మల పుణ్యం మూటకట్టుకుంటే, భూమ్మీద తరించడానికి మనుషులుగా పుట్టామో కదా!


***** 



No comments:

Post a Comment

Pages