నరకద్వారాలు - అచ్చంగా తెలుగు

 నరకద్వారాలు

సి.హెచ్.ప్రతాప్

 



మనిషి జీవితం నిజంగా సత్యసంధతతో, ధర్మనిష్ఠతో సాగితేనే ఆనందమయంగా మారుతుంది. కానీ మనస్సులో చోటు చేసుకునే మూడు ప్రధాన దోషాలు – కామం, క్రోధం, లోభం – మనిషిని ఆధ్యాత్మికంగా, నైతికంగా, సామాజికంగా పతనానికి నడిపిస్తాయి. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఈ విషయాన్ని స్పష్టంగా వివరించాడు –
"త్రివిధం నరకస్యేదం ద్వారమ్ నాశనమాత్మనః – కామః క్రోధః తథా లోభః"
అంటే ఈ మూడు ద్వారాల ద్వారా మనిషి తన ఆత్మనాశన వైపు అడుగులు వేస్తాడన్నమాట.

కామం అనేది కేవలం శృంగార కోరిక మాత్రమే కాదు. అది వస్తువు, పదవి, అధికారం, భోగాలపై నియంత్రణలేని ఆకర్షణకు కూడా వర్తిస్తుంది. ఈ యాంత్రిక యుగంలో మనిషి నిరంతర భయభ్రాంతిలో జీవిస్తున్నాడు. భయమే ఎన్నో కోరికలకు మూలం అవుతోంది. భద్రతకోసం లేదా అస్తిత్వానికి భరోసా కోసం మొదలయ్యే కోరికలు, నెరవేర్చాలన్న తపన మనసును బంధిస్తుంది. ఒక కోరిక తీరగానే మరో కోరిక జన్మిస్తుంది – ఇది అంతులేని చక్రం.

ఈ కోరికలు నెరవేరనప్పుడు పుట్టే తీవ్ర స్పందనే క్రోధం. ఇది శాంతిని నశింపజేస్తుంది, వివేకాన్ని హరిస్తుంది. ఒక వాడిన శబ్దం, వేసిన గుద్దు, ఉచ్చరించిన పదం — ఇవన్నీ క్రోధంలోంచి పుట్టినవే. క్రోధవశుడైనవాడు మంచి చెడు తేడా మరిచి అసత్పథాన్ని ఆశ్రయిస్తాడు. ఇలాంటివారిని మనశ్శత్రువులుగా భావించాలి.

లోభం అనేది ధనం, అధికారం, లాభం వంటి విషయాల్లో ‘ఇంకా కావాలి’ అన్న దురాశ. ఇది అసత్య మార్గాలవైపు నడిపిస్తుంది. ధర్మాన్ని పక్కనబెట్టి, అనైతికంగా సంపాదించాలన్న కోరికే లోభం. చరిత్ర మనకు చెబుతుంది – లోభి చివరకు నశించాల్సిందే.

భగవద్గీతలో మరొక చోట శ్లోకం ఉంది:

"కామమాశ్రిత్య దుష్పూరం, దంభమానమదాన్వితాః, మోహాద్గృహీత్వా అసద్గ్రాహాన్, ప్రవర్తంతే అశుచివ్రతాః"

ఈ శ్లోకం యొక్క అర్థం దంభం, అహంకారం, మోహంతో ఆక్రమితులైనవారు తాము ఆశించిన భోగాలకు లోనై, శాస్త్రవిరుద్ధంగా ప్రవర్తిస్తారు.

ఈ సమస్యలు సముద్రపు అలలు వలె వరుసగా ఉవ్వెత్తున వస్తుంటాయి. పరిష్కరించగలిగినవాటిని పరిష్కరించాలి. సాధ్యం కానివాటిని భగవంతుని చేతుల్లో ఉంచాలి – అదే నిజమైన విజ్ఞత. అంతఃశాంతిని కోరేవాడు కోరికల బంధనాన్ని విడిచిపెట్టాలి. అప్పుడే మనిషి భగవంతుని సన్నిధిలోకి చేరి, తన సత్యస్వరూపాన్ని దర్శించగలుగుతాడు.

భౌతిక ప్రయోజనాల కన్నా, పరోపకారం, సేవలో జీవించిన మహనీయులు లాల్ బహదూర్ శాస్త్రి గారు, ఏ.పి.జె. అబ్దుల్ కలాం గారు – వీరంతా దైవీ గుణ సంపన్నులే. వారి జీవితం మనకు మార్గదర్శకంగా నిలుస్తుంది.

మనలోని జ్ఞానరత్నాన్ని దోచేయాలనుకునే కామం, క్రోధం, లోభం అనే దొంగలు ఎల్లప్పుడూ మన మనస్సు తలుపు దగ్గర కాచుకుని ఉంటాయి. వాటిని జయించకపోతే మనిషి తన స్వార్థానికి బానిసైపోతాడు.

కాబట్టి ప్రతీ మానవుడు కామాన్ని నియంత్రించి, క్రోధాన్ని శాంతింపజేసి, లోభాన్ని పారద్రోలే ప్రయత్నం చిత్తశుద్ధితో చేయాలి.ఈ మూడు నరకద్వారాలు మూసినప్పుడే జీవితం ఆనందదాయకమైన మార్గంలో ప్రవహిస్తుంది.

***

No comments:

Post a Comment

Pages