అపాత్రదానం వలన అనర్ధాలెన్నో! - అచ్చంగా తెలుగు

అపాత్రదానం వలన అనర్ధాలెన్నో!

Share This

అపాత్రదానం వలన అనర్ధాలెన్నో !

సి.హెచ్.ప్రతాప్
ప్రియములేని విందు పిండి వంటల చేటు
భక్తిలేని పూజ పత్రి చేటు
పాత్రమెరుగని ఈవి బంగారు చేటురా
విశ్వదాభిరామ వినుర వేమ..!

తాత్పర్యం :

ప్రేమలేని అన్న సంతర్పణములో పిండివంటలు పెట్టినా అవి వ్యర్థమే. అనర్హుడికి దానం ఇచ్చిన, అంటే... అపాత్రదానం చేసినందువలన బంగారము వన్నె తగ్గిపోతుంది. ఈ విధంగానే దేవుడిపై నమ్మకం లేనప్పుడు... ఎన్నో రకాల పూలతో పూజ చేసినప్పటికీ ఉపయోగం లేదని, అలాంటి పూజ వ్యర్థమేననీ ఈ పద్యంలో చెప్పాడు వేమన మహాకవి.ఘోర పాపాలకు నిలయమైన ఈ కలియుగంలో అధర్మం పాళ్లు, తద్వారా మనుషులలో అయోగ్యం, అపాత్రము పాళ్లు, ప్రతిఫలాపేక్ష ఎక్కువ ఉంటాయి. చాలామంది మంచిని ఆశించి పాత్రత గురించి ఆలోచన చేయకుండా నాలుగు మంచి మాటలు చెప్పేవారికి లోబడిపోయి ఇష్టానుసారంగా దాన ధర్మాలు, సహాయం చేస్తుంటారు. అయితే అపాత్రులకు చేసే దానం ఫలించదని పైగా పాపం చుట్టుకుంటుందని మహాభారతంలో విదురుడు తన విదుర నీతిలో స్పష్తంగా చెప్పాడు. కొడుకైనా, కూతురైన మరే ఇతర రక్స్త సంబంధం అయినా అపాత్ర దానం చేస్తే ఫలితం రాకపోగా పాప సంచయం అంటుకుంటుంది. కాబట్టి నిజాయితీతో సాయం చేయదలచుకుంటే ఆ దానాన్ని స్వీకరించే వారి పాత్రతను అంటే యోగ్యతను బాగా నిశింతంగా పరిశీలించి, ఫలాపేక్షలేకుండా చేయాలి. అప్పుడు పాప సంచయము మనకు రాదు. ఈ విచక్షణ చేయాలంటే మంచి-చెడు, ధర్మం-అధర్మం వివరాలు బాగా తెలియాలి. మనస్తత్త్వం అర్థం చేసుకోగలిగే సామర్థ్యం ఉండాలి. వీటన్నిటికీ అంతర్ముఖమైన సాధన ఉండాలి.  దక్షిణ భారత దేశంలో పద్మశ్రీ అవార్డు పొందిన తొలి హీరో  , తెలుగు వారికే కాక యావత్ దక్షిణ భారతదేసంలోనే ఆరఢ్యదైవంగా కొలవబడే శ్రీ  చిత్తూరు నాగయ్య జీవితం సినిమా వారికే కాదు సంపాదనపై అవగాహన కలిగించడానికి, సంపాదించిన డబ్బును జాగ్రత్త చేసుకోకపోతే భవిష్యత్తు జీవితం ఎలా ఉంటుందో చెప్పడానికి చిత్తూరు నాగయ్య జీవితం ఏ కాలం వారికైనా ఏ రంగం వారికైనా ఒక పాఠంగా ఉపయోగపడుతుంది.ఆయన తన ఆఖరి దశలో అపాత్ర దానం చేయవద్దని పదే పదే చెప్పేవారు. ఇతరులకు పెట్టనిదే మనకు పుట్టదని ఒక సామెత ప్రచారంలో ఉంది. మనకు ఉన్నంతలోనే ఇతరులకు సహాయం చేయాలి. చేయమన్నారు కదా అని అపాత్రదానం చేయకూడదు. మనం సంపాదించిన దానిలో ఎనిమిద వ వంతు ఇతరులకుదానం చేయాలని శాస్త్రం చెబుతోంది అయితే అపాత్రదానం వలన మన పుణ్యమంతా హరించుకుపోతుంది కాబట్టి తస్మాత్ జాగ్రత్త అని సుమతి శతకారుడు పలు మార్లు హెచ్చరించాడు. అపాత్రదానం అనర్థాలకు మూలం. ప్రతి మనిషికీ ఉపకారబుద్ధి ఉండాల్సిందే. కానీ అది అనర్హులకు ఉపకారం చేసేదిగా మారకూడదు. దానివల్ల ఉపకారం చేసేవాడు కష్టాలపాలు కావడమేకాదు, సోమరులను పెంచిపోషించినవాడవుతాడు.


పాత్ర పాత్ర వివేకోస్తి ధేనుపన్నగయోరివ
తృణాత్సంజాయతే క్షీరం క్షీరాత్సంజాయతే విషం

అంటే మనం సహాయం చేసేటప్పుడు పాత్రత కలిగివున్న వారికే చేయాలి. అపాత్రదానం చేయకూడదు అంటారు. అలాంటి పాత్ర అపాత్ర వివేకాన్ని సుభాషితకారుడు ధేను పన్నగ యోరివ అంటాడు అంటే పాత్రత కలిగిన వాడిని ఆవు తోనూ, లేనివాడిని  పాము తోనూ పోలుస్తాడు. ధేనువు గ్రాసం తిని మనకు క్షీరం  ఇస్తుంది. అదే పాము పాలు తాగి విషం కక్కుతుంది. పాత్రుడికి తృణం దానం ఇచ్చినా ఆ సహాయం మరిచిపోకుండా పాల లాంటి మనస్సు తిరిగి ఇస్తాడు. అదే అపాత్రదానం పాలు  చేసినా సంతృప్తి పొందడు సరి కదా తిరిగి విషం కక్కుతాడు.మూర్ఖునికి ఎంతటి దివ్యోపదేశం చేనినా ఫలితముండదు. అది సూకరాల ఎదుట ముత్యాలు వేసినట్టే కారడవిలో శశికళలు వెల్లివిరిసినట్టే. అపాత్రదానం మహా పాపం. ఎవరికేది తగునో దానినిచ్చి ఊరుకోవడం ఉత్తమం. ఔచిత్యం ప్రధానం అని వేమన తన మరొక పద్యంలో అత్యద్భుతంగా చెప్పాడు. దానాలు అనేకం ఉన్నాయి. అన్నదానం, భూదానం, గోదానం, వస్తుదానం, వస్త్రదానం, ధనదానం మొదలైన అనేక దానాలు ఉన్నాయి. అయితే వేటిలో ఏది ఉత్తమమైనది లేదా ఏది పరిపూర్ణమైన దానం అంటే తను చేసే కర్మ ద్వారా ఇతరులకు బాధ కలుగుతుందని భావిస్తే చెయ్యకుండా ఉండేది ఉత్తమమైన దానము. ఇచ్చే దానం తీసుకునే వ్యక్తి అర్హుడా, కాదా అని ఆలోచించకుండా అపాత్రదానం చెయ్యరాదు. కీర్తి కోసం కాంక్షించి ఇచ్చే దానము దానము క్రిందకు రాదు. అన్ని దానాల్లోకెల్లా అన్నదానమే ఉత్తమోత్తమము.

***

No comments:

Post a Comment

Pages