సరదాగా వాళ్ళిద్దరూ - అచ్చంగా తెలుగు

సరదాగా వాళ్ళిద్దరూ

Share This

సరదాగా వాళ్ళిద్దరూ

కృష్ణసఖి

 


 



"ఏంటి రోజీ వయసు పెరిగేకొద్దీ  ఇంకా చిన్నపిల్లలా అయిపోతున్నావ్? ఇదిగో నీ కళ్ళజోడు! తీసి జాగ్రత్తగా దాచుకో!" అంది పదిహేడేళ్ల మనవరాలైన రూప యాభై ఏళ్ళ నానమ్మను. 
"ఇక్కడ పెట్టానా? దీని కోసం గదంతా వెతికాను. బైబిల్ చదువుదామని అనుకుంటుంటే ఎప్పుడూ ఈ కళ్ళజోడు కనిపించదు!" అంటూ రోజీ కళ్ళజోడు చేతపుచ్చుకుని నేత్రాలకు తొడిగింది. 

విసవిసా గదిలోకి నడుచుకుంటూ వెళ్ళి అక్కడున్న పుస్తకాలన్నిటినీ తిరగేసింది. "మీ అమ్మ గదిని సర్ధుతుంటే నా పుస్తకాలన్నీ సతమతం అయిపోతున్నాయి. ఎవరు సర్ధమన్నారు ఇవ్వన్నీ?" కాస్త విసుగ్గానే అరుస్తూ అడిగింది. 

"ఈ వయసులో కూడా ఈ అరుపులు అవసరమా రోజీ? అమ్మ కాకుంటే నువ్వు సర్దుతావా? కళ్ళజోడు వెతుక్కోవడమే నీకు మహా కష్టం." అని నవ్వింది రూప.

"నేను సర్ధుతాను. ఇంకా ఆ విషయానికొస్తే ఇప్పటికీ కూడా ఇంటి పని నేనే చేస్తా! ఎప్పుడైనా మీ అమ్మ చేయనిస్తే కదా? ఎప్పుడూ ఈ వయసులో మీకెందుకు ఈ పని అంటూ ఈ గదిలోంచి బయటకు రానియ్యదు." అని విరుచుకుపడింది. 

"అది కాదు రోజీ నీ వయసులో రెస్ట్ తీసుకుంటే మంచిదని అమ్మ ఉద్దేశ్యం! కావాలంటే చెప్పు అమ్మ చర్చ్ నుండి వచ్చాక, అమ్మతో మాట్లాడి నువ్వు పనులు చేయడానికి పర్మిషన్ తీసుకుంటా!" అంది ముడతలు పడిన రోజీ బుగ్గల్ని గిల్లుతూ.

"అదేం అక్కర్లేదు గానీ, ఈరోజు మార్కెట్ కు వెళ్ళి నాకు నచ్చినవి తిని రావాలని ఉంది. మీ అమ్మ వచ్చేలోపు వచ్చేస్తా! మీ అమ్మకి చెప్పకు!" అని అంది మెల్లగా. 

"ఏం తింటావ్? తీపి తింటే సుగర్, కారాలు తింటే బీపీ కదా? అమ్మకి తెలిస్తే నన్ను ఎగరేసి తన్నుద్ది! ఇదంతా అవసరమా?" అడిగింది రూప భయపడుతూ. 

"చూడు మనవరాలా ఇన్ని రోజులూ మీ అమ్మకి భయపడి అవేం తినలేదు అనుకుంటున్నావా?" అంటూ పకపకా నవ్వి "మీ ఆమ్మ గోల మీ అమ్మదే నా తిండి నాదే!" అంటూ అక్కడి నుండి ఇలియానా అన్నంత ఫోజు కొడుతూ బయటకి నడిచింది. 

రోజీ చూడ్డానికి చాలా బొద్దుగా, ముడతలు పడుతున్న దేహంతో, సగానికి పైగా నెరసిన జుట్టుతో, ఎప్పుడూ తళుక్కుమనే గాజుకళ్ళతో... మెరిసిపోతూ ఉంటుంది. 

ఆమె బజారులోకి అడుగుపెట్టగానే దుకాణ దారులందరూ ఆమెను పలకరిస్తూ రోజీ మేడం ఎలా ఉన్నారు..? అంటూ కుశల ప్రశ్నలు అడుగుతూనే ఉన్నారు. అందరికీ నవ్వుతూ సమాధానం చెప్తూనే ఉంది. 

"ఏం రత్నాకర్ ఎలా ఉన్నావ్ ? నీ ఎండుచేపల వ్యాపారం ఎలా ఉంది? ఇంట్లో ఒంట్లో అంతా బావుందా?" అని నవ్వుతూ అడిగింది ఎండుచేపల వాడ్ని. 

"నీకేం అక్కా! నీ కోడలు పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటుంది. అందరం అట్ల కాదే!" అన్నాడు విసెన కర్రతో గాలి విసురుకుంటూ. 

'అందరికీ నా కోడలి మీదే పడ్డాయి కళ్ళు. మాట్లాడితే నీ కోడలు పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటుంది అంటున్నారు. వాళ్ళకి లేరా కొడుకులు, కోడళ్ళు.' అని మనసులోనే అనుకుంటూ ముందుకు సాగింది. 

శనగల సుబ్బయ్య దగ్గర గిద్దెడు కారం శనగలు పుచ్చుకుని మార్కెట్ మధ్యలో ఎడమ వైపుకి ఉన్న రావి చెట్టు కింద కూర్చుని తీరిగ్గా తింటుంది. 

రోజీకి ఒకే ఒక్క కొడుకు. అతడు డానీ. అతడు ఫాదర్ కావడం వల్ల ఎప్పుడూ క్రైస్తవ మహాసభలు అంటూ చాలా బిజీగా ఉంటాడు. రోజీ భర్త చనిపోయి చాన్నాళ్ళయ్యింది. డానీకి మేరీతో పెళ్లయ్యాక రోజీ బాధ్యతలన్నీ మేరీనే చూసుకుంటుంది. మేరీకి పెద్దలంటే చాలా అభిమానం. ఆ గౌరవంతోనే రోజీకి కొంచెం ఆరోగ్యం పాడైనా అల్లాడిపోతోంది. 'అత్తగార్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎప్పుడూ ఏ లోటూ లేకుండా చూసుకోవాలి' అని తెగ ఆరాటపడిపోతూ ఉంటుంది. 

మేరీలో ఇన్ని మంచి దైవ గుణాలు ఉన్నాయనే ఆలోచనతో కోరికోరి కోడలిగా దొరకబుచ్చుకుంది రోజీ. ఎన్ని ఎలా ఉన్నా వయసు పెరిగేకొద్దీ తనని గదికే అంకితం చేసేసిందని అప్పుడప్పుడు కోప్పడుతూ ఉంటుంది. అలా ఆమెపై కోపం వచ్చినప్పుడే ఇలా పంతానికి పోయి మార్కెట్ కి వచ్చి తనకి నచ్చినట్లు చేస్తుంది. 

రోజీ ఊడిపోతున్న పళ్ళతో శనగల్ని నములుతూ ఉండగా అక్కడికి ఒక కారు వచ్చి ఆగింది. కారులో ఉన్న పెద్దమనిషి కారు దిగి "ఏవండీ ఇక్క జూబెల్ రోజీ గారి ఇల్లు ఎక్కడ?" అని అడిగాడు. 

రోజీలో ఆశ్చర్యం ముంచుకొచ్చింది. అతడి వయసు యాభై ఏళ్లు దాటినట్లు తెలుస్తుంది. అయినా ఎంత హుందాగా ఉన్నాడో. మొహంలో ఉట్టిపడే కళ.  అతడ్ని చూస్తుంటే ఎక్కడో బాగా పరిచయం ఉన్న వ్యక్తిలా ఉన్నాడు. కానీ, అతడ్ని చూసిన జ్ఞాపకంగానీ, మాట్లాడిన స్మరణ ఆమె చెంతకు చెరకపోయేసరికి... ఆమెలో ఎన్నో ప్రశ్నలు మొలకెత్తాయి. 'నన్నే నా ఇల్లు ఎక్కడ? అని అడుగుతున్నాడు ఈ పెద్దమనిషి. ఎవరై ఉంటాడు ఈయన?' అని మనసులోనే అనుకుంటూ "మీరు ఏమవుతారు ఆవిడకి?" అని అడిగింది. 

"నేను ఆమెకి బాగా కావాల్సిన మనిషి! ఆవిడ ఇల్లు గురించి మీకు తెలుసా తెలీదా?" అని అడిగాడు విసుగ్గా. 

"అరే అంత విసుగెందుకు? రండి ! వాళ్ళింటికి తీసుకెళ్తా!" అంటూ పైకి లేచింది. 

ఆమె వెనుకే అతడు కారు నడుపుతూ వెళ్ళాడు. ఇంటికి చేరగానే "ఇదిగో ఇదే మీరు అడుగుతున్న రోజీ ఇల్లు!" అంటూ లోపలికి వెళ్ళి సోఫాలో కూర్చుని"రూప అతిధి వచ్చారు! వెళ్లి కాఫీ కలుపుకుని తీసుకురా!" అని అంది. 

ఆమె వాలకాన్ని చూస్తూ "మీరెవరు ?" అని ప్రశ్నించాడు అతడు. 

"ఇప్పటికీ కూడా అర్థం కాలేదా? నేనే మీరు వెతుకుతున్న రోజీని! విషయం ఏమిటి చెప్పండి? ఏదైనా ఇన్సూరెన్స్ డబ్బులు ఏమైనా ఇస్తున్నారా?" వెక్కిరిగా నవ్వింది రోజీ. 

"నువ్వూ నీ కొంటె వేషాలు మానలేదా?" అంటూ ఆమె పక్కనే కూర్చున్నాడు అతడు. 

ఆమెలో ఆశ్చర్యం. ఎవరూ తన పక్కన కూర్చునే ధైర్యం చేయరు. అలాంటిది ఇతడేంటి అని ఆలోచిస్తూ ఉండగానే ఆమె ఆలోచనలు కొన్ని సంవత్సరాల ముందుకు వెళ్లిపోయాయి. 
"రోజీ ఏమైంది ఆలోచిస్తున్నావు? నన్నింకా గుర్తు పట్టలేదా?" అని అడిగాడతను. 
రోజీ కళ్ళు పెద్దవి చేసి "గిరీష్?" అని అంది ఆశ్చర్యంతో. 

ఇద్దరి కళ్ళల్లో ఆనందం తాండవం చేసింది. కాఫీతో అక్కడికి వచ్చిన రూప అదంతా చూసి "నాన్నమ్మ ఎవరీయన?" అని అడిగింది. 

రోజీ మొహంలో సిగ్గు చిగురించింది. లోలోపల మాట బయటకి చెప్పాలనే ఉండి కూడా కాస్త భయపడి "నా స్నేహితుడు" అని చెప్పింది. 
ఇద్దరూ కాఫీ తీసుకున్నారు. 
"రూప కొద్దిసేపు మీ స్నేహితుల ఇంటికి వెళ్లి ఆడుకో!" అని అంది రోజీ. 

సరేనని రూప అక్కడి నుండి వెళ్లిపోయింది. రోజీ మనసు గాల్లో తేలుతుంది. బయటికి అదంతా చెప్పలేకపోతుంది. ఆనందంలో తనెక్కడ చనిపోతుందోనన్న కంగారు కూడా ఆమెలో కలిగి మనసుకి కాస్త నిబ్బరం చెప్పుకుంది. 

"ఇటు రా గిరీష్ " అంటూ అతడి చేయి పట్టుకుని తన గదిలోకి తీసుకెళ్ళింది. 
ఆ గదంతా వాళ్ళ చిన్నప్పటి జ్ఞాపకాలతో చాలా అందంగా ఉంది. రోజీ మాటిమాటికీ అతడి చేయి పట్టుకుని కన్నీరు పెట్టుకుంటూ ఉండేసరికి "ఎందుకు రోజీ ఇప్పుడు ఇంతగా బాధ పడుతున్నావ్?" అని అన్నాడు గిరీష్. 

ఆమెలో దుఃఖానికి కారణం వారి పుట్టుకలే అని ఆమె బాధ. ఇద్దరూ చిన్ననాటి వయసు నుండే మంచి స్నేహితులు. పెరిగి పెద్దయ్యాక ఇద్దరి అభిప్రాయాలు ఒకేలా ఉన్నాయని వాళ్ళలో వాళ్ళే మురిసిపోయి ఒకరంటే మరొకరికి ఎంతో ఇష్టంగా ఉండేవారు.ఇష్టం ప్రేమగా మారి పెళ్ళిగా మారే రోజులు కూడా వచ్చాయి. ఇంట్లో చెప్పారు. మొదట్లో ఒప్పుకున్నారు. కానీ, రోజీ ఒక క్రైస్తవ మతానికి సంబంధించిన అమ్మాయి అవడం గిరీష్ ఇంట్లో వాళ్లకు నచ్చలేదు అని చెప్పారు. ఆ సంఘటనను ఎలా ఎదుర్కోవాలో వారిద్దరికీ కూడా అర్థం కాలేదు. బలవంతంగా అందరినీ ఎదిరించి ఎక్కడికైనా వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందామని గిరీష్ అంటే లేదు కుదరదు కుటుంబాన్ని కాదని మనం సంతోషంగా ఉంటే సరిపోతుందా అని ఆమె అడ్డుకుంది. 

అలా ఆ రోజు విడిపోయిన ఇద్దరూ ఈరోజు కలవడం ఆమె నమ్మలేకపోతుంది. కళ్ళల్లో కన్నీళ్లు, మనసులో ఆనందం. అదంతా అతడికి ఎలా వ్యక్తం చేయాలో ఆమెకి అర్ధం కాలేదు. అతడి చేతుల్ని పట్టుకుని గట్టిగా ఏడ్చింది. అతడి కళ్ళల్లో కూడా కనిపించని కన్నీరు. ఏడ్వాల్సిన పనేముంది? జీవితం బావుంటే మనుషులదేముంది? అని చాలా మంది అనుకుంటారు. కానీ, జీవితం ఎంత సాఫీగా సాగిపోయిన మన అనుకునేవారు మనకి అందుబాటులో ఉంటే అదొక ఆనందం. 

బాధంతా కరిగిపోయిన తరవాత గిరీష్ ఆమె వైపు చూస్తూ "రోజీ ఇన్ని రోజులూ చూడ్డానికి కూడా రాలేదు కదా! క్షమించు!" అని అడిగాడు. 

"అయ్యో ఎందుకలా? ఈ పెద్దోళ్ళ సంగతి తెలిసిందే కదా? ప్రతీదానికి ఏదోఒక లింక్ పెడతారు. అయినా పెళ్లయి వెళ్లిపోతే ఇక మళ్లీ రావకపోవడమే ఉత్తమం!" అంటూ అతడి చేయి విడిచింది. 

ఎందుకో ఆ క్షణం ఆమె గుండెల్లో భారం ఎక్కువయ్యింది. ఆమె చేతిలో చేయి వేసి "అవునూ మీ వారూ మీ పిల్లలూ ఎలా ఉన్నారు?" అని అడిగాడు. 

"మా వారు కాలం చేసి చాలా ఏళ్ళయ్యింది." 
అతడిలో మౌనం. 
"ఒకబ్బాయి పుట్టాడు. చాలా అందగాడు మా వారిలాగే!" అని అంది తన భర్త ఫోటో చూపిస్తూ. 

"అవును రోజీ నీకు తగ్గ భర్త దొరికారు!" అని అన్నాడు గిరీష్. 

ఆమె నవ్వి "ఇందాక కాఫీ తెచ్చింది కదా! నా మనవరాలు రూప! మా కోడలు చర్చ్ కి వెళ్ళింది. వచ్చాక చూద్దువులే" అని అంది. 

"అంతవరకూ ఉండే సమయం లేదు!" అన్నాడు ఆమె కళ్ళల్లోకి చూస్తూ. 

"నన్ను కలవడానికి రాలేదా?" అడిగింది ఆశ్చర్యంగా. 
"నీ కోసమే, కానీ... " అంటూ అతడు చెప్తూ ఉండగా ఎవరో వచ్చిన శబ్దానికి ఇద్దరూ చూసారు. 

మేరీ అప్పుడే ఇంటికి వచ్చింది. 
"అదిగో మాటల్లో వచ్చింది. తనే నా కోడలు! బంగారం" అని అంది. 

"అవును బంగారానికి బంగారమే తూగుతుందట!" అన్నాడు చిరునవ్వుతో. 
మేరీకి ఏమీ అర్థంకాక నుంచుని చూస్తుంది. 
"మేరీ! తిను నా చిన్ననాటి స్నేహితుడు. ఈరోజు భోజనం చేసి వెళతాడు. వంట సిద్ధం చెయ్యి!" అని అంది రోజీ. 

"లేదు రోజీ! పనుంది!" అంటూ అతడు చెప్తున్నా వినిపించుకోకుండా అతడ్ని భోజనం చేసే వరకూ వెళ్లనీయలేదు. అతడికి వీడ్కోలు పలికిన తర్వాత చాలా కాలానికి ఆమె మనసు ఆనందమయంగా అయిపోయింది. 

గదిలోకి వెళ్ళి మంచం మీద పడుకుని ఆలోచిస్తుంది. 'అతడు వచ్చిన పని ఏమిటో మరి?' అని అనుకుంటూ ఉండగా ఆమె చేతికి ఒక ఉత్తరం కొన్ని కాగితాలు కనిపించాయి. ఏమిటని తెరచి చూడగా..
"రోజీ ఈ దరఖాస్తులను నీ చేతిలోనే పెట్టాలని ఉంది. 
కానీ, నువ్వు తీసుకోవని తెలుసు కనుక, ఇలా నీ గదిలోనే ఉంచి వెళ్తున్నా! ఇదేమీ నా సొత్తు అనుకోకు! మనిద్దరం కలిసి సాధించినదే! అదే మనం పెళ్ళి చేసుకుందామని అనుకునే రెండేళ్ల క్రితం మనిద్దరం సరదాగా ఒక ఇన్సూరెన్స్ కంపెనీలో దరఖాస్తు చేశాం! గుర్తుందా? అప్పటి నుండి ఇప్పటికి యాభై లక్షలు అయ్యాయి. అదంతా నీ కోసమే! ఈ డబ్బు నీకే సొంతం. మనుషులం దూరంగా మిగిలిపోయాం. ఈ డబ్బుని మాత్రం మనిద్దరి జ్ఞాపకంగా నీ దగ్గరే ఉంచి, నీ ఇంటిని చక్కదిద్దుకో!" 

ఇట్లు గిరీష్. 

డబ్బు కోసం మనుషుల్ని వాడుకునే వారుండే ఈరోజుల్లో మనుషులూ, జ్ఞాపకం అంటూ చెప్తున్న గిరీష్ మాటలు కొత్తగా అనిపించాయి ఆమెకు. 
గుండెల్లో అతడి స్థాయి అందరానంత ఎత్తుకు ఎదిగిపోయింది. సరదాగా వాళ్ళిద్దరూ కట్టిన ఇన్సూరెన్స్ డబ్బులతో అతడి పేరున ఒక అనాధాశ్రమం కట్టించింది.

***

No comments:

Post a Comment

Pages