ఎన్నడొకో నే నీచెర దగులక - అచ్చంగా తెలుగు

ఎన్నడొకో నే నీచెర దగులక

Share This

ఎన్నడొకో నే నీచెర దగులక 

(అన్నమయ్య కీర్తనకు వివరణ)

డా.తాడేపల్లి పతంజలి 

 




రేకు: 0352-06 సం: 04-308


పల్లవి: ఎన్నడొకో నే నీచెర దగులక


అన్నిటా శ్రీపతికాధీనమౌట


చ.1: 

దేహాధీనము తిరిగేటి జీవులు


దేహము యర్థాధీనము


మోహాధీనము ముంచినయర్థము


ఆహా యిది పుణ్యాధీనము


చ.2: సతతము బురుషుడు సతులయాధీనము


అతివలు వయసుకు నధీనము


గతియగు వయసులు కాలాధీనము


అతిశయమిది మాయాధీనము


చ.3: దైవాధీనము తగినజగ మిది


దేవుడు మోక్షాధీనము


చేవల మోక్షము శ్రీవేంకటపతి -


సేవాధీనము సిలుగే లేదు


భావం


పల్లవి:

ఓ మాయా !  ఎప్పుడు  నేను  నీ బంధమునుంచి విడిపోయేది.?! ఎప్పుడు అన్ని విషయాలలోను శ్రీ వేంకటేశునికి స్వాధీనమయ్యేది?


చ.1:

తిరిగేటి జీవులందరూ దేహానికి అధీనులు.


దేహము అర్థమునకు(ఇంద్రియార్థముధనముకారణముకార్యమువ్యవహారము) అధీనము.


అధికమైన అర్థము మోహమునకు అధీనము.


ఆహా! ఈ మోహము పుణ్యమునకు అధీనము.


చ.2:


ఎప్పుడు పురుషుడు స్త్రీలకు ఆధీనమయి ఉంటాడు.


స్త్రీలు వయసుకు అధీనలు.(స్త్రీలు తమవయస్సులోని అందానికి అధీనలు.


 వారిలో అందము ఉన్నంతవరకు పురుషులు వశులై ఉంటారని భావం)


వయసులు కాలానికి అధీనము.( స్త్రీల వయస్సులలోని అందాలు  కాలానుగుణంగా తగ్గిపోతాయని భావం)


ఇదంతా మాయకు అధీనము.

చ.3:


ఈ ప్రపంచము దైవాధీనము.


దేవుడు మోక్షానికి ఆధీనము.


శక్తి కలిగిన ఆమోక్షము శ్రీవేంకటేశ్వరుని యొక్క సేవకు అధీనము.


స్వామిని సేవిస్తే ఎటువంటి ఆపద రాదు.( కనుక మాయకు గురికాకుండా ఉండటానికి అందరూ శ్రీ వేంకటేశుని సేవించాలని భావం)


విశేషాలు


మాయా


మీయతే అనయా ఇతి మాయా.దేనిచేత కొలవబడుతుందో అది మాయ.ఇది పరమాత్మ శక్తి.


మా’ అంటే లేదుకాదు అనీ, ‘యా’ అంటే ఏది’ అనీ అర్థం చెప్పుకుని ఏది లేదోఏది కాదో అది అని ఒక వివరణ ఉంది.


***

No comments:

Post a Comment

Pages