సర్వహృదయాంతర్వర్తి భగవంతుడే - అచ్చంగా తెలుగు

సర్వహృదయాంతర్వర్తి భగవంతుడే

Share This

సర్వహృదయాంతర్వర్తి భగవంతుడే

రచన: సి.హెచ్.ప్రతాప్ 


భగవద్గీత లోని 10 వ అధ్యాయం భగవద్విభూతి ఎన్నో ప్రత్యేకతలను సంతరించుకుంది. భగవంతుని దివ్య గుణగణాలు, ఆయన దివ్య స్వరూపం,లక్షణాలు వంటివి ఆయన ద్వారానే అర్జునుడిని నిమిత్తమాత్రునిగా చేసుకొని చెప్పబడ్డాయి. భగవంతుని యొక్క వైభవోపేతమైన మరియు దేదీప్యమానమైన మహిమలను గుర్తుచేసుకుంటూ ఆయనపై ధ్యానం చేయటానికి సహాయముగా అర్జునుడికి ఈ అధ్యాయము శ్రీ కృష్ణుడిచే చెప్పబడినది.ఈ జగత్తులో ఉన్న ప్రతిదానికీ తనే మూలము అని ఈ అధ్యాయం ద్వారా తెలుయజేస్తున్నాడు భగవానుడు. మానవులలో ఉన్న విభిన్న లక్షణములు ఆయన నుండే ఉద్భవించాయి. సప్తర్షులు, నలుగురు మహాత్ములు మరియు పద్నాలుగు మనువులు ఆయన మనస్సు నుండే జనించారు మరియు వారి నుండే ఈ ప్రపంచంలోని అందరు మనుష్యులూ అవతరించారు. సమస్తమూ ఆయన నుండే ఉద్భవించాయి అన్న విషయం తెలుసుకున్నవారు ఆయన పట్ల భక్తితో దృఢ విశ్వాసంతో నిమగ్నమౌతారు.

శ్లో:
అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయస్థితః ।
అహమాదిశ్చ మధ్యం చ భూతానామంత ఏవ చ
(20 వ శ్లోకం)


ఓ అర్జునా, నేను ఈ సమస్త సృష్జ్టిలో వున్న సర్వ జీవుల హృఅదయాలలో కొలువై వున్న పరమాత్మనని నన్ను తెలుసుకొనుము. అన్ని జీవులకు సృష్టి, స్థితి, లయలకు, ఆది మద్యాంతములకు నేనే కారణభూతుడినై వున్నాను అన్నది ఈ శ్లోకం తాత్పర్యం.
సృష్టికి పూర్వం తానే ఈ సమస్త విశ్వానికి ఆత్మనై వున్నానని, తన నుండే ఈ సృష్టి ఆరంభానికి అంకురార్పణ జరిగిందని, సృష్టిలో ప్రవేశించే ప్రతీ జీవి భగవంతుని చేత మాత్రమే సృష్టింపబడి ఆయన అంశగా వుంటుందని భగవానుడు స్పష్టం చెస్తున్నాడు.పరమాత్మ యొక్క అంశమే జీవాత్మ , కాగా ఈ జీవాత్మ కారణంగానే జీవుల దేహం వృద్ధి పొందుతుంది. కాబట్టి ఈ భూమిపై నివసించే లక్షల కోట్ల జీవుల హృదయాలలో నివసించేది ఆ పరమాత్మయేనని, ఆయన ఆజ్ఞ, అనుజ్ఞల కారణంగానే జీవుల చావు, పుట్టుకలు ఆధారపడి వున్నాయని అర్ధం అవుతోంది. 
తానే సమస్త జీవ భూతముల మొదలు, మధ్య, తుది (ఆది-మధ్య-అంతము) అని. అవి ఆయన నుండే ఉద్భవించాయి, కాబట్టి ఆయనే మొదలు. సృష్టి యందు వసించే జీవరాశియంతా ఆయన శక్తి చేతనే సంరక్షించి కొనసాగింపబడుతున్నది, కాబట్టి ఆయనే మధ్యము. మరియు మోక్షము పొందిన వారు ఆయన యొక్క దివ్య ధామమునకు వెళ్లి, ఆయన సన్నిధిలోనే నిత్యశాశ్వతంగా నివసిస్తారు. కాబట్టి అతి దుర్లభమైన ఈ మానవ జన్మను సార్ధకం చేసుకునేందుకు సర్వ జీవ సమానత్వాన్ని ఆచరించడం ఎంతో అవశ్యం. చరాచర భూతములన్నింటికినీ బాహ్యభ్యంతరముల యందు పరిపూర్ణముగా ఉండువాడును, చరాచరరూపుడును అతడే అతిసూక్ష్మ రూపుడైనందువలన తెలిసికొన శక్యము కానివాడు. అతిదూరంగా అతిదగ్గరగా స్థితుడైనవాడు ఆ భగవంతుడే. సృష్టిలోని ప్రతి అణువులోనూ దైవం ఉన్నాడనీ, చూడగలిగే జ్ఞానాన్ని సంపాదించినప్పుడు... సమస్త ప్రకృతిలోనూ సర్వాంతర్యామి అయిన దైవాన్ని దర్శించగలమనీ  మనం భగవంతుని తత్వం గురించి పూర్తిగా అవగతం చేసుకోవాలి.  

***

No comments:

Post a Comment

Pages