చంద్రమణి కోట రహస్యం (అనువాద నవల) - 32 - అచ్చంగా తెలుగు

చంద్రమణి కోట రహస్యం (అనువాద నవల) - 32

Share This

చంద్రమణి కోట రహస్యం (అనువాద నవల) - 32

అనువాదం : గొర్తి వేంకట సోమనాథ శాస్త్రి (సోమసుధ)
ఆంగ్ల మూలం : The moonstone castle mistery
నవలా రచయిత : Carolyn Keene
 


(మిస్టర్ వీలర్ పైకి కనిపించని తలుపు ఉన్న గదిలో దొరికాడని పోలీసు అధికారి చెబుతాడు. తన కారు కూడా ఆ కోటలోనే ఉండవచ్చునని నాన్సీ చెప్పటంతో, అధికారి అమ్మాయిలతో యిద్దరు పోలీసులను పంపుతాడు. చివరికి వారు కోట పక్కన భారీగా గడ్డి పెరిగిన మట్టిదిబ్బలో తలుపును, మూసి ఉన్న ఆ తలుపు వెనుక నాన్సీ కారుని కనుగొంటారు. వారు కారులో బయల్దేరబోతుండగా అకస్మాత్తుగా కందకం మీద వంతెన పైకి లేవసాగింది. తరువాత. . . .)
@@@@@@@@@@@@@@@@@

ముగ్గురు అమ్మాయిలు కారులోంచి దిగారు. వాళ్ళు కోటగోడ లోపలికి సర్దుకోని వంతెన వైపు చూసారు.

"ఈ వంతెన ఖచ్చితంగా తనంత తానుగా పైకి లేవలేదు" చెప్పింది జార్జ్. "పోలీసు కారు వల్ల ఏర్పడిన ప్రకంపనం తాళ్ళను వదులు చేసి, దాని రహస్య యంత్రాన్ని విడిపించి ఉండాలి."

"అంటే కారుని యిక్కడే వదిలేసి, ఈత కొట్టి అటువైపు వెళ్ళకపోతే, మనం బందీలుగా యిక్కడే ఉండాలన్నమాట!" బెస్ నిట్టూర్చింది.

"అవసరం లేదు" నాన్సీ ఆమెతో చెప్పింది. "బహుశా ఆ వంతెనను నేను కిందకు దించగలను."

"పోలీసుల సంగతేమిటి?" అకస్మాత్తుగా బెస్ అడిగింది. "బహుశా మనం గట్టిగా హారను కొడితే, వాళ్ళు వెనక్కి రావచ్చు."

ఆ పని చేయటానికి ఆమె కారు వద్దకు వెళ్ళింది. కానీ అరనిమిషం సేపు ఆమె హారను ఎంతగా మోగించినా, స్పందన లేదు.

నాన్సీ, జార్జ్ వంతెన దగ్గరకు వెళ్ళారు. పైకీ, కిందకూ వంతెన్ని కదిలించే బరువైన ఆ యినుప గొలుసులను పట్టుకొని, వాళ్ళిద్దరూ బలంగా లాగారు. ఒక వైపు పనిచేసింది కానీ రెండవ వైపు కదలటానికి మొరాయించింది.

"గోడలోకి యిరుక్కొన్న గొలుసు వల్ల యిబ్బంది వస్తున్నట్లుంది" నాన్సీ పేర్కొంది. "నేను వెళ్ళి తెలుసుకొంటాను."

"కానీ ఎలా?" జార్జ్ అడిగింది. "నువ్వు పూర్తిగా గోడ పైకి ఎక్కలేవు."

నాన్సీ నవ్వింది. "అయితే రాతిగోడలో మెట్లలా ఉన్న గూళ్ళను చూడు" అందామె. "అలా కట్టడంలో కూడా ఒక ఉపాయం ఉండి ఉంటుంది."

"సరె!" అంది జార్జ్. "కానీ నువ్వు వేటిని పట్టుకొని ఎక్కుతావు?"

"గోడ మీద లావుగా ఉన్న చెట్టు తీగలు కనిపిస్తున్నాయి చూడు" నాన్సీ గమనిస్తూ చెప్పింది. మరుక్షణం దృఢంగా ఉన్న లతాకాండాన్ని పట్టుకొందామె. ఆమె దాన్ని పట్టుకొని తన శక్తి కొలదీ గాలిలో వేళ్ళాడింది. "ఇది నా బరువును తట్టుకోగలదు" అందామె.

దృఢమైన తీగలు, గోడలోని గూళ్ళ సాయంతో ఆమె వేగంగానే గోడ పైకి చేరుకోగలిగింది. వంతెన పై భాగానికి చేరుకోగానే, స్థూలమైన గొలుసును, అది చుట్టబడిన పళ్ళ చక్రాన్ని ఆమె పరీక్షించటం మొదలెట్టింది. ఆ పళ్ళచక్రంలోని రెండు దంతాలకు, ఆ పళ్ళ చక్రం తిరగలేని విధంగా గొలుసు చుట్టుకుపోవటం వల్ల వంతెన కదలటంలేదు.

లతాకాండాన్ని ఒక చేత్తో గట్టిగా పట్టుకొని యువ గూఢచారి పళ్ళచక్రం గాడిలో మెలి తిరిగిన గొలుసుని పైకెత్తి, ముడి తప్పించటానికి ప్రయత్నించింది. మొదట్లో బరువైన యినుప గొలుసులో మెలికను తప్పించటం ఆమెకు కుదరలేదు. అంతేగాక ఆమె సమతుల్యతను కోల్పోయి తూలి పడబోయింది.

"జాగ్రత్త!" జార్జ్ హెచ్చరించింది. "నన్ను పైకొచ్చి సాయం చేయమంటావా?"

"నీకైతే సాధ్యం కావచ్చు" నాన్సీ అంది. "కానీ నువ్వు ఏమి చేసినా వేరే తీగను పట్టుకొని పైకి రా!"

జార్జ్ కిలకిలా నవ్వి, సూచనలను అనుసరించింది. "మోటదానిలా ఉంటేనే, ఏదో ఒక రోజు ఉపయోగకరంగా మారుతుందని నాకు తెలుసు" తను పైకి ఎక్కుతూ అందామె. త్వరలోనే ఆమె స్నేహితురాలి పక్కన ఉంది.

ఇద్దరు అమ్మాయిలు చాలా కష్టపడ్డారు. కానీ వాళ్ళు బలంగా లాగటానికి ధైర్యం చేయలేదు. అలా చేస్తే, ఆ శక్తి అస్థిమితంగా ఉన్న తమను తూలి పడేలా చేస్తుందని భయపడ్డారు. చివరకు వాళ్ళు గొలుసులోని కొక్కాలలో మెలికను తప్పించి పళ్ళచక్రం యొక్క గాడిలో తిన్నగా సర్దుకొనేలా చేయగలిగారు.

"భగవంతునికి కృతజ్ఞతలు!" చెప్పింది జార్జ్.

నాన్సీ ఒక నిట్టూర్పు విడిచింది. "నేను పూర్తిగా ఉపశమనం పొందాను. ఇప్పుడు మనం చేయాల్సిందల్లా యిది పని చేస్తుందో లేదో చూడటమే!"

జార్జ్ యికిలించింది. "ఇప్పుడు నువ్వు నన్ను కిందకు దిగి పరీక్షించమంటావని అనుకొంటున్నాను." ఆమె దిగి, రెండు గొలుసులను విడుదల చేసింది. వెంటనే కందకపు వంతెన కిందకు దిగింది.

"ఇది చాలా అద్భుతం!" బెస్ అరిచింది. "మీ అమ్మాయిలు సానుకూల మేధావులు."

"ఏమైనప్పటికీ, మేమంత పాడు మెకానిక్కులం కాదు" అంది జార్జ్.

నాన్సీ నేల మీదకు దిగగానే, కజిన్లిద్దరినీ కాలినడకన వంతెన దాటమని ఆమె పట్టుబట్టింది. "కారులో నేను ఒక్కతినే వస్తాను. ఏదైనా తప్పు జరిగితే, మీరు నాకు సాయంగా వద్దురు గానీ!"

బెస్, జార్జ్ ఊపిరి బిగబట్టి నిరీక్షించారు. కానీ నాన్సీ సురక్షితంగా వంతెన దాటింది. ఆమె స్నేహితురాళ్ళు కారులోకి ఎక్కగానే, ఆమె పట్టణం వైపు కారుని పోనిచ్చింది.

"నాకు కడుపు కాలుతోంది" అంది బెస్. "సాహసకృత్యం ఎప్పుడూ నాలో ఆకలిని రగిలిస్తుంది."

జార్జ్ నవ్వింది. "ఒత్తిడి నీ కోరికను చంపేయ్యాలి, కానీ పెంచకూడదు" అందామె.

తాము బ్రాస్ కెటిల్ కి వెడదామని నాన్సీ సూచించింది. "మిస్టర్ సీమన్ గురించి మిసెస్ హేంస్టెడ్ మనకు మరి కొంత సమాచారం యివ్వొచ్చు."

టీరూంలోకి అడుగు పెట్టగానే, ముసలి వనిత తన ఊగుడు కుర్చీలో ముందుకి వెనక్కి ఊగుతూ కనిపించి, వాళ్ళలో హుషారు పుట్టింది. ఒక్కసారిగా ఆమె వారి వైపు తిరిగింది.

"ఉదయం నుంచి మాట్లాడటానికి ఎవ్వరూ లేరు" ఆమె ఫిర్యాదు చేసింది. "మీరేమి చేస్తున్నారో చెప్పండి."

"మేము తిరగడానికి వెళ్ళాం" నాన్సీ ఉదాసీనంగా చెప్పింది. "మిసెస్ హేంస్టెడ్! మీకు తెలుసా? అతను మీకు చెప్పినట్లుగా, మిస్టర్ సీమన్ నుంచి నేనెప్పుడూ బహుమతిని పొందలేదు. ఈమధ్య అతను ఈ చుట్టుపక్కల ఉన్నాడా?"

"లేదు. అతను లేడు" మిసెస్ హేంస్టెడ్ బదులిచ్చింది. "కానీ నీకు తెలుసా, నేను అతని గురించి ఒక తమాషా విన్నాను."

వెంటనే అమ్మాయిలు అప్రమత్తమై, అది ఏమిటని ఆమెను అడిగారు.

వృద్ధ మహిళ కోపం వచ్చినట్లుగా పట్టుదలతో కుర్చీలో ఊగసాగింది. "అతను నన్ను మోసం చేసాడు - అదే అతను చేసింది” అని చెప్పింది. "ఇన్నాళ్ళూ అతను ఊళ్ళు పట్టుకు తిరిగే వ్యాపారి అనుకొన్నాను. కానీ అతను మిసెస్ విల్సన్ అన్న వృద్ధురాలి దగ్గర పనిచేస్తున్నాడని నిన్న రాత్రే తెలిసింది."

అమ్మాయిలు చిరునవ్వును బలవంతంగా ఆపుకొన్నారు. తాను మోసపోయినట్లుగా మిసెస్ హేంస్టెడ్ భావించింది. అది ఆమెకు నచ్చలేదు.

మిసెస్ విల్సన్ ఒక సంపన్న వితంతువు అని, డీప్ రివర్ శివార్లలో ఆమె నివసిస్తోందని మిసెస్ హేంస్టెడ్ చెప్పింది.

"కొంతకాలం క్రితం వరకు," శ్రీమతి హేంస్టెడ్ కొనసాగింది, “మిసెస్. విల్సన్ నలుగురు సేవకులను పెట్టుకొంది. కానీ ఇప్పుడు ఆమె దగ్గర ఒక జంట మాత్రమే ఉంది. అక్కడ పనిచేస్తున్న స్త్రీ మిస్టర్ సీమన్ భార్యేనని నేను అనుకొంటున్నాను. మిసెస్ విల్సన్ యికపై పట్టణానికి రాదు. ఆమెకు వంట్లో బాగులేదని చుట్టుపక్కల వదంతులొస్తున్నాయి."

"ఇది చాలా దారుణం" నాన్సీ సానుభూతితో చెప్పింది. “మిస్టర్ అండ్ మిసెస్ సీమన్ ఆమెను చూసుకుంటారా?"

"అనే అనుకొంటున్నాను" మిసెస్ హేంస్టెడ్ చెప్పింది. "అక్కడ ఏమి జరుగుతోందో ఏమాత్రం తెలియదని చుట్టుపక్కల చెప్పుకొంటున్నారు. ఆ జంటలో ఒక్కరు కూడా పట్టణానికి రావటం లేదు. వాళ్ళు ఆహారానికి, సరుకులకు టెలిఫోనులోనే ఆర్డర్లు యిస్తున్నారు. చిత్రమేమిటంటే, వాటిని అప్పగించే వాళ్ళు అక్కడ ఎవరినీ చూడలేదట. బయట మిల్క్ బాక్సులో డబ్బులు ఉంచుతున్నారట."

తక్షణమే నాన్సీ మనసు గతంలో జరిగిన హోర్టన్ అమ్మమ్మ కథ వైపు మళ్ళింది. అది కూడా యిలాంటి కథే! ఆమె దగ్గర పనిచేసిన జంట సీమన్లేనా? వెంటనే ఈ క్లూని అనుసరించాలని నాన్సీ అనుకొంది. ముసలామెతో మామూలు ధోరణిలో మాట్లాడుతూ, మాటల మధ్యలో మిసెస్ విల్సన్ యిల్లు ఉన్న ప్రాంతం గురించి అడిగింది.

"సరె! మీరు మెయిను రోడ్డుకి చేరగానే, పాత కోట వైపు వెళ్ళే దారిని పట్టుకోండి. ఆ కోటను దాటాక, మీరు వెళ్ళిన రోడ్డుకి ఎడమవైపున ఉన్న తదుపరి బాటకు మళ్ళండి. అక్కడ నీటికి దగ్గర్లో, పల్లంలో ఉన్న చివరి యిల్లే మిసెస్ విల్సన్ యిల్లు."

ముగ్గురు అమ్మాయిలు తాము భోజనం చేసి సెలవు తీసుకొంటామని మిసెస్ హేంస్టెడ్ కి చెప్పారు.

(సశేషం)

No comments:

Post a Comment

Pages