మొహమాటాలు - అచ్చంగా తెలుగు

మొహమాటాలు

పెయ్యేటి రంగారావుఆనందరావుకి తనభార్య మంజరి అంటే ఎంతో ప్రేమ. వారికి పదేళ్ళ కుమారుడు కూడా ఉన్నాడు. అతడిపేరు సనత్కుమార్.

మంజరి తనభర్త ఆలనాపాలనా ఎంతో శ్రధ్ధగా చూసుకుంటూఉంటుంది.

ఒకరోజు అర్థంతరంగా ఆనందరావుకి మెలకువ వచ్చేసింది. వంటింట్లోంచి గిన్నెలచప్పుళ్ళు భయంకరంగా వినిపిస్తున్నాయి. అంతకన్నా తారస్థాయిలో తన ఇల్లాలు అయిన మంజరి తిట్లదండకం చదువుతోంది. ఓహో! అంటే ఈ రోజు చెప్పా పెట్టకుండా పనిమనిషి యాదమ్మ మానేసిందన్నమాట! ఆనందరావుకి తన కర్తవ్యం గుర్తుకు వచ్చింది. దిగ్గున లేచి మొహం కడిగేసుకున్నాడు. ఎంతో ప్రేమగా భార్య దగ్గిరకి వెళ్ళి అన్నాడు, 'మంజూ, ఇవాళ యాదమ్మ రాలేదా?'

మంజరి గయ్యిమంది, 'ఎందుకు వస్తుంది? అక్కడికీ నేను మీతో అస్తమానూ చెబుతూనే ఉంటాను. మా గొడవల్లో మీరు తల దూర్చకండి అని. మీరు వింటారా? ఊహు! నిన్న అది ఇల్లు ఊడుస్తూంటే తగుదునమ్మా అని మీరు తయారయి, 'ఇదుగో, యాదమ్మా, ఇక్కడ దుమ్ముపోలేదు చూడు' అంటూ ఒకటే నస పెట్టేసారు. అప్పుడే నాకు అనుమానం వచ్చింది. ఇదుగో, ఇవాళ డుమ్మా కొట్టేసింది. ఇంక నేనే దానింటికి వెళ్ళి బతిమాలి తీసుకురావాలి.'

ఆనందరావు అన్నాడు, 'సారీ, నాదే తప్పు. ఇంక ఎప్పుడూ యాదమ్మని ఏమీ అనను. మధ్యాహ్నం నేనే అటెళ్ళి యాదమ్మ ఎందుకు రాలేదో కనుక్కుని రేపు పనిలోకి రమ్మని చెబుతాను. ఇంక ఇవాళ నువ్వు కాఫీ, ఫలహారాల సంగతి మర్చిపో. ఇదుగో, ఇప్పుడే నేను హోటలుకెళ్ళి, నేను టిఫిన్ చేసేసి, నీకు సనత్కుమార్‍కి కూడా టిఫిన్ పార్సిలు చేయించి తీసుకువస్తాను.'

మంజరి కొంచెం శాంతించింది. 'నాకు పనీర్ దోసె తెండి. టిఫిన్ పార్సెల్ చేసాక అప్పుడు కాఫీ ఫ్లాస్కులో పోయించండి. ఈ వెధవఫ్లాస్కులో వేడి ఎక్కువ సేపు ఉండటల్లేదు.'

ఆనందరావు ఫ్లాస్కు బుజానికి తగిలించుకుని స్కూటర్ స్టార్ట్ చేసి, సాయిగణేష్ హోటల్ కెళ్ళి, చక్కగా టిఫిన్ తిని ఒక డబుల్ స్ట్రాంగ్ కాఫీ తాగి, వక్కపొడి నములుతూ పార్సెల్ సెక్షనుకి వెళ్ళి పనీర్ దోసె, పూరీ ప్యాక్ చేయించుకుని, ఫ్లాస్క్ లో లైట్ కాఫీ పోయించుకుని కవుంటర్ దగ్గిరకి వచ్చాడు. అక్కడ తన ప్రక్కవాటాలో ఉంటున్న రామారావు కనిపించాడు. 'ఏమండోయ్, రామారావుగారూ! గుడ్ మార్నింగ్. ఏమిటీ? బ్రెక్ ఫాస్ట్ చెయ్యడానికి వచ్చారా?' అని పలకరించాడు.

'గుడమార్నింగ్ ఆనందరావు గారూ! ఇవాళ ఆదివారం కదా! అందుకని సరదాగా హోటల్లో టిఫిన్ చేద్దామని వచ్చాను. మీరు టిఫిన్ చెయ్యడం అయిందా?'

ఆనందరావు అన్నాడు, 'అయిందండీ. ఇదుగో, ఇంటికి పార్సెల్ కూడా తీసుకుని వెళ్తున్నాను. పదండి, బయట సిగరెట్టు కాల్చుకుందాం.'

రామారావు అన్నాడు, 'బిల్లు కట్టలేదండీ. ఇతను చిల్లర లేదని నిలబెట్టాడు. పరవాలేదు. మీరు వెళ్ళండి.'

ఆనందరావు అడిగాడు, 'మీ బిల్లు ఎంత అయింది?'

రామారావు అన్నాడు, 'ముఫ్ఫై రూపాయలండి.'

ఆనందరావు 'నేనిచ్చేస్తాను లెండి.' అంటూ అతడి బిల్లు కూడా తనే చెల్లించేసాడు.

రామారావు మొహమాటంగా, 'థాంక్స్ ఆనందరావుగారూ. ఇంటికెళ్ళగానే ఇచ్చేస్తాను.' అన్నాడు.

ఆనందరావు, 'అయ్యో, దానికేముందండి.' అంటూ బయటికి దారి తీసాడు. ఇద్దరూ సిగరెట్లు కాల్చుకున్నాక, ఆనందరావు స్కూటరెక్కి ఇంటికి వచ్చేసాడు. వచ్చేసాడన్న మాటే గాని మనసంతా చికాకై పోయింది.

'తనకసలు బుధ్ధి లేదు. హోటల్లో రామారావు బిల్లు తనెందుకు చెల్లించాలి? చెల్లించాడు సరే, ఆయన ఇంటికెళ్ళగానే ఇచ్చేస్తానండి అంటే పెద్ద పోటుగాడిలా 'అయ్యో, దానికేముందండి?' అనడం ఎందుకు?' ఇంక ఆయన ఆ ముఫ్ఫై రూపాయలకి ఎగనామం పెట్టేస్తాడో ఏమిటో?’ ఆనందరావు ఆ రోజంతా బాధ పడుతూనే ఉన్నాడు.

వారంరోజులయింది. రామారావు ముఫ్ఫయి రూపాయల మాటే ఎత్తటల్లేదు. ఆనందరావులో అసంతృప్తి పెరిగిపోతోంది. మంజరితో విషయం మొత్తం చెప్పి, రామారావు భార్య సత్యవతిని అడిగి ఆ ముఫ్ఫయిరూపాయలు తీసుకురమ్మని చెప్పాడు.

మంజరికి మొహమాటం వేసింది. మర్నాడు పాల అతను రాగానే, మంజరి పక్కింటికెళ్ళి, 'వదినా! పాల అబ్బాయి జీతానికొచ్చాడు. ముఫ్ఫయి రూపాయలు తక్కువయ్యాయి. నీ దగ్గరుంటే సద్దు వదినా.' అని అడిగింది.

సత్యవతి, 'అయ్యో, దానికేముంది వదినా?' అంటూ లోపల్నించి ముఫ్ఫయి రూపాయలు తీసుకువచ్చి ఇచ్చింది.

సత్యవతి మంజరికి ముఫ్ఫయిరూపాయలైతే ఇచ్చింది కానీ, అప్పటి నించీ ఆవిడకి మనసు మనసులో లేదు. వారం రోజులైనా మంజరి ఆ ముఫ్ఫయి రూపాయలు తిరిగి ఇవ్వలేదు ఒక మంచిరోజున వెళ్ళి మంజరిని తిన్నగా అడిగేసింది. 'వదినా! ఏమనుకోకు. నువ్వు మర్చిపోయినట్లున్నావు. అందుకని గుర్తు చేస్తున్నాను. పాల అతనికి ఇవ్వాలని నువ్వు నాదగ్గర వారం క్రితం ముఫ్ఫయి రూపాయలు తీసుకున్నావు. ఇవాళ కొంచెం అవసరం వచ్చింది. ఆ ముఫ్ఫయిరూపాయలు ఇచ్చేస్తావా?'

మంజరి అంది, 'అయ్యో, వదినా. జరిగిందేమిటంటే మీ ఆయన పదిహేను రోజుల క్రితం హోటల్లో చిల్లర లేక మా ఆయన దగ్గిర ముఫ్ఫయి రూపాయలు తీసుకున్నారు. తిరిగి ఇవ్వడం మర్చిపోయారు. అందుకని నన్ను అడిగి తీసుకోమంటే, మరీ అలా అడిగితే బాగుండదేమో అని నేనే పాలవాడికి అని చెప్పి, నీ దగ్గర ముఫ్ఫయి రూపాయలు తీసుకున్నాను వదినా. ఏమనుకోకు. దానికీ దీనికీ సరిపోయింది. .'

సత్యవతి ఇంటికెళ్ళగానే మొగుడి మీద విరుచుకు పడింది. 'మీకసలు బుధ్ధుందా ఆనందరావు గారి దగ్గర ముఫ్ఫయిరూపాయలు హోటల్లో తీసుకుని తిరిగి ఇవ్వలేదుట కదా? ఆయన భార్య తిన్నగా అడిగి తీసుకోలేక మొహమాటానికి పోయి, పాలవాడికివ్వాలి అంటూ నా దగ్గిర ముఫ్ఫయి రూపాయలు వారం క్రితం తీసుకుంది. తిరిగి ఇవ్వకపోయేసరికి ఇవాళ నేనే వెళ్ళి అడిగేసాను. ఆవిడ, మీరు ముఫ్ఫైరూపాయలు తీసుకుని తిరిగి ఇవ్వకుండా ఎగ్గొట్టారని చెప్పేసరికి సిగ్గుతో చచ్చిపోయాను.'

రామారావు కోపంగా అన్నాడు, 'నేను ఆయనకి ఏమీ బాకీ లేను. అయినా బాకీ ఉంటే ఆయనే తిన్నగా నా దగ్గిరకి వచ్చి అడగాలి కాని, ఇల్లా పెళ్ళాన్ని రాయబారం పంపిస్తాడా?'

సత్యవతి తెల్లబోతూ అంది, 'బాకీ లేరా? మరి హోటల్లో వాళ్ళాయన దగ్గిర ముఫ్ఫయి రూపాయలు తీసుకున్నారని చెప్పిందే? అబధ్ధమాడిందా?'

రామారావు, కోపంగా అన్నాడు. ‘అంతకుముందు ఆయనే నాకు ముప్పయి రూపాయలు బాకీ ఉన్నాడు. అందుకని నేను చెల్లు పెట్టేసుకున్నాను. ఉండు, ఇప్పుడే వెళ్ళి అడిగేస్తాను.' అంటూ దిగ్గున లేచాడు.

సత్యవతి కంగారుగా అంది, 'ఉండండి. మీకసలే ఉద్రేకం ఎక్కువ. నేను కూడా చీర మార్చుకుని వస్తాను.' అంటూ లోపలికెళ్ళి చీర మార్చుకుని వచ్చింది.

ఇద్దరూ కలిసి ఆనందరావు ఇంటికి వెళ్ళారు. వీళ్ళని చూడగానే దంపతులిద్దరూ లేచి ఆనందంగా 'రండి, రండి.' అంటూ ఆహ్వానించారు.

సత్యవతి అంది, 'అయ్యో, మీరేదో సినిమా చూస్తున్నట్లున్నారు. మిమ్మల్ని డిస్టర్బ్ చెయ్యం. మరోసారి వస్తాం లెండి.' అంది.

ఆనందరావు అన్నాడు, 'డిస్టర్బ్ చెయ్యడమా, పాడా? ఈ భయంకరమైన తెలుగు సినిమా చూడకుండా మీరొచ్చి మమ్మల్ని రక్షించారు. రండి, రండి. ఏమే, కాఫీ తీసుకురావే.' అన్నాడు.

రామారావు, సత్యవతి లోపలికి వచ్చి కూర్చున్నారు. మంజరి కాఫీ చెయ్యడానికి లోపలికెళ్ళింది. సనత్కుమార్ టి.వి. వాల్యూమ్ బాగా తగ్గించి సినిమా చూసుకుంటున్నాడు.

అందరూ కాఫీలు తాగడం అయింది. అప్పుడు రామారావు మొహమాటంగా విషయం కదిపాడు. 'ఆనందరావు గారూ, ఒక విషయం చెబుతాను. మీరేమీ ఫీల్ అవకూడదు సుమా!

ఆనందరావు అన్నాడు. 'మనిద్దరం ఒక తల్లి బిడ్డలలాంటి వాళ్ళం రామారావు గారూ. ఎప్పుడూ కలిసే ఉందాం. ఉండాలి కూడా. ఏం ఫరవాలేదు. నిర్మొహమాటంగా విషయమేమిటో చెప్పండి.'

రామారావు అన్నాడు, 'ఏం లేదు, హోటల్లో మీదగ్గర నేను తీసుకున్న ముఫ్ఫయిరూపాయల గురించి.'

ఆనందరావు గబుక్కున అన్నాడు, 'అయ్యో, ఆ డబ్బు నేను తిరిగి అడిగానని మీరేమీ అనుకోవద్దు. ఎందుకంటే డబ్బు దగ్గిరే ఎటువంటి స్నేహాలైనా చెడిపోతాయి. అందుకని మన మధ్య డబ్బు సంబంధాలు లేనంతవరకు మన మధ్య స్నేహం నిలబడి ఉంటుందన్న ఉద్దేశ్యంతో నేను మా ఆవిడను పంపి మీ ఆవిడ దగ్గర ముఫ్ఫై రూపాయలు తీసుకుని రమ్మన్నాను. ఐతే మా ఆవిడ తిన్నగా అడిగితే బాగుండదేమో అని మొహమాటపడి పాలవాడికి అని చెప్పి తీసుకు వచ్చింది.'


రామారావు అన్నాడు. 'అక్కడే కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చినట్లుంది ఆనందరావు గారూ. ఆవిడ తిన్నగా అడిగేస్తే బాగుండేది. పాలవాడికి అని తీసుకునేసరికి మా ఆవిడ అప్పుగా అనుకుంది.'

'అయ్యో, ఫరవాలేదండి. ఇంక ఆ విషయం మర్చిపోండి.' అన్నాడు ఆనందరావు.

రామారావు అన్నాడు, 'కాదండి. విషయం ఇంతటితో అవలేదండి. నేను మీదగ్గిర ముఫ్ఫయి రూపాయలు తీసుకున్నాను గాని, అది బాకీ కింద కాదండి. మీరు నాకు లోగడ ముఫ్ఫయి రూపాయలు బాకీ ఉన్నారు. దానికీ, మీరు హోటల్లో ఇచ్చినదానికీ చెల్లు కదా అని నేను ఊరుకున్నాను.'

ఆనందరావు తెల్లబోతూ అన్నాడు, 'నేను మీకు బాకీ ఉన్నానా? అదేమిటండి? అసలు నేను ఎవరి దగ్గరన్నా ఒక్క రూపాయి తీసుకున్నా అది తిరిగి ఇచ్చేసేటంత వరకూ నాకు నిద్రపట్టదు. అటువంటిది, నేను మీకు బాకీ ఉండటమేమిటండీ?'

'ఆనందరావుగారూ! గుర్తుకు తెచ్చుకోండి. మూడు నెలల క్రితం నేను సిటీబస్సులో కూర్చుని ఉండగా మీరు సిటీబస్సెక్కారు. కూర్చోడానికి జాగా లేక గుమ్మందగ్గిరే నిలబడి నన్ను చూసి చెయ్యి ఊపారు. ఇంతలో కండక్టరు టిక్కట్టు ఇవ్వడానికి వస్తే, మీ టిక్కట్టు కూడా నేనే ముఫ్ఫయి రూపాయలిచ్చి తీసుకున్నాను. ఆ టిక్కట్లు మీకు చూపించి, మీ టిక్కట్టు నేను తీసేసుకున్నాను అని సైగ చేసాను. మీరు వంగి సలాము చేస్తూ థాంక్స్ అన్నట్లుగా సైగ చేసారు. గుర్తుందా?'

'అవునండి. బాగా గుర్తుంది.'

రామారావు అన్నాడు, 'కాని తర్వాత మీరు నాకు ఆ ముఫ్ఫయి రూపాయలు ఇవ్వలేదండి. అందుకే హోటల్లో మీరు చెల్లించిన ముఫ్ఫయిరూపాయలకి పాతబాకీ చెల్లు కదా అని నేను ఊరుకున్నాను.'

ఆనందరావు కోపంగా అన్నాడు, 'అదేమిటండి రామారావు గారూ? నేను ఇవ్వకపోవడం ఏమిటి? ఆరోజు ఇంటికి రాగానే మీ ముఫ్ఫయిరూపాయలు మీకు పంపేసానే?'

రామారావు నెమ్మదిగా అన్నాడు, 'క్షమించండి, మీరు మర్చిపోయి ఉంటారు. ఆ ముఫ్ఫయిరూపాయలు నాకు అందలేదు. ఎవరికిచ్చి పంపారో గుర్తుకు తెచ్చుకోండి.'

ఆనందరావు కొడుకు కేసి తిరిగి కోపంగా అరిచాడు, 'ఒరేయ్ సనత్కుమార్! ఆ రోజున నేను లోపలికి స్నానానికి వెళ్తూ, నా జేబులోంచి ముఫ్ఫయి రూపాయలు తీసుకుని రామారావు అంకుల్ కిచ్చెయ్యమని నీతో చెప్పాను కదురా? ఇవ్వలేదా?'

సనత్కుమార్ బిక్కమొహం వేసి అన్నాడు, 'ఇవ్వలేదు నాన్నా. నీ చొక్కా వంకీకి లేదు. నువ్వు స్నానం చేసి వచ్చాక నీతో చెబుదామనుకున్నాను. తర్వాత మర్చిపోయాను.'

సత్యవతి అంది, 'ఆ రోజు మీ చొక్కా మాసిపోయిందని, అప్పుడే చాకలి వస్తే మీ జేబులో ఉన్న పర్సు టేబుల్ మీద ఉంచి, ఆ చొక్కా చాకలికి వేసేసానండి.'

ఆనందరావు బాధగా అన్నాడు, 'ఎంతపని చేసావురా? డబ్బు దగ్గిర మతిమరుపు గాని, నిర్లక్ష్యం గాని ఉండకూడదురా. నీ వల్ల ఎన్ని తప్పులు జరిగి, ఎన్ని రకాలుగా మేము ఒకళ్ళనొకళ్ళు అపార్థాలు చేసుకున్నామో చూసావా? ఇలాగే మనుష్యుల మధ్య ఉన్న సంబంధాలు చెడిపోయి, చివరికి వాళ్ళు గర్భశత్రువులుగా మిగిలిపోతారు.'

రామారావు పరిస్థితిని తేలిక పరిచేటందుకు ప్రయత్నిస్తూ అన్నాడు. 'లైట్ తీసుకోండి ఆనందరావుగారూ. జస్ట్ కామెడీ ఆఫ్ ఎర్రర్స్! అంతే. జరిగినదంతా మనమంతా మర్చిపోదాం. మనం ఎప్పటికీ స్నేహితులుమే. స్నేహితులుగానే ఉండిపోదాం.'

ఆనందరావు జేబులోంచి ముప్పయి రూపాయలు తీసి రామారావుకి ఇచ్చేస్తూ అన్నాడు, 'ఇకనుంచీ అందరూ గుర్తు పెట్టుకోండి. పది రూపాయిలు కానివ్వండి, వందరూపాయలు కానివ్వండి, లావాదేవీల దగ్గర నిర్మొహమాటంగా ఉండాలి. పది రూపాయలు ఎవరికన్నా ఇస్తే నిర్మొహమాటంగా తిరిగి వసూలు చేసుకోవాలి. అలాగే ఎవరి నుంచన్నా పది రూపాయలు తీసుకున్నా ఖచ్చితంగా తిరిగి ఇచ్చెయ్యాలి. అంతేకాదు. ఒకవేళ మూడవ మనిషి ద్వారా చెల్లించినట్లైతే మళ్ళీ తిరిగి డబ్బు ఇచ్చిన వ్యక్తి దగ్గరకు వెళ్ళి, బాకీ తీరిపోయినట్లు ఋజువు పర్చుకోవాలి.'

మిగిలిన అందరూ ఏకకంఠంతో అన్నారు, 'అవునండి. మీరన్నది అక్షరాల నిజం.'

అందరి మనసులూ తేలికపడ్డాయి.

***

No comments:

Post a Comment

Pages