ఆత్మనివేదన భక్తి ప్రాశస్థ్యం - అచ్చంగా తెలుగు

ఆత్మనివేదన భక్తి ప్రాశస్థ్యం

Share This

ఆత్మనివేదన భక్తి ప్రాశస్థ్యం

 సి.హెచ్.ప్రతాప్
శ్లోకం : 

శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాద సేవనం
అర్చనం వందనం దాస్యం
సఖ్యమాత్మ నివేదనం ||

భగవంతుడిని చేరుకునేందుకు ఒక్కొక్కరు ఒక్కో విధానాన్ని అనుసరిస్తారు. ఈ భక్తిని తొమ్మిది రకాలుగా వుంటుందని భాగవతం ప్రబోధిస్తోంది. అవి శ్రవణం', 'కీర్తనం', 'స్మరణం', 'పాదసేవనం', 'అర్చనం', ' వందనం', 'దాస్యం', 'సఖ్యం', 'ఆత్మనివేదనం' .వీటిలో ఏ ఒక్క మార్గాన్ని అనుసరించినా ఆ భక్తుడి జీవితం ధన్యం అవుతుందని భాగవతం స్పష్టంగా చెబుతోంది.వీటన్నిటిలో ముఖ్యమైనది ఆత్మనివేదన భక్తి మార్గం. మనోవాక్కాయ కర్మలతో భగవంతుడికి తనను తాను అర్పించుకోవడం ఆత్మనివేదన భక్తి. బలి చక్రవర్తి ఇందుకు ఉదాహరణ. వచ్చినదెవరో తెలిసినప్పటికీ ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు తనని తాను అర్పించుకుని ఆత్మనివేదనం చేసుకున్నాడు బలిచక్రవర్తి. ఈ మార్గం అతి గుహ్యమైనది మరియు ఆచరణ కష్టతరమైనది.భక్తి మార్గము లో గట్టి పట్టుదల ఉండాలి , దృఢమైన సంకల్పం చేసుకోవాలి అప్పుడే సామాన్య సాధకుడు కార్య సాధకుడవుతాడు.మీరాబాయి గోదాదేవి, బలిచక్రవర్తి, సక్కుబాయి వంటి భక్తులు ఆత్మనివేదన ద్వారానే మోక్షాన్ని పొందారు.

భగవత్ సేవకు పూర్తిగా అంకితమైన సాధకుడు మరియు భగవంతుని నామమే తన ఉచ్ఛ్వాస నిశ్వాసాలు భావించి సాధకుని యొక్క హృదయం పూర్తిగా శుద్ధి చెందుతుంది మరియు అతను శాశ్వతమైన బ్రహ్మను పొందుతాడు. భక్తుడు తనతో సహా భగవంతునికి శరీరం, మనస్సు మరియు ఆత్మ తో సహా తన సమస్తాన్ని సమర్పిస్తాడు.  అతను తన కోసం ఏమీ ఉంచుకోడు. అతను తన స్వయాన్ని కూడా కోల్పోతాడు. అతనికి వ్యక్తిగత మరియు స్వతంత్ర ఉనికి లేదు.

ఈ భక్తి మార్గంలో సుఖం మరియు దుఃఖం, ఆనందం మరియు బాధ వంటి ద్వందాలను , భక్తుడు భగవంతుడు పంపిన బహుమతి గా భావిస్తాడు మరియు వాటికి తనను తాను జోడించుకోడు. వీటన్నిటినీ సమానంగా స్వీకరిస్తునే కఠోర సాధన అనంతరం సాధకుడు చివరకు ద్వందాతీత స్థితికి చేరుకుంటాడు. ఆధ్యాత్మిక సాధనలో ఇది చాలా కీలకమైన ఘట్టం. అతను తనను తాను దేవుని కీలుబొమ్మగా మరియు దేవుని చేతిలో ఒక సాధనంగా భావిస్తాడు. చేసేది, చేయించేది, ఇచ్చేది, పుచ్చుకునేది అంతా భగవంతుదేనన్న స్థిర నిశ్చయానికి వస్తాడు.సూక్ష్మంగా చెప్పాలంటే ఆత్మనివేదన మనగా భగవంతుడు తప్ప అన్యులెవరూ లేరని శరణాగతి కోరడం. భక్తి మార్గాలన్నింటికన్నా ఆత్మనివేదన మోక్షమార్గానికి సులభమైన మార్గం- అని ఆధ్యాత్మిక వేత్తల అభిప్రాయం. 

***

No comments:

Post a Comment

Pages