శ్రీ శిరిడీ సాయి దివ్య జ్ఞానామృతం - అచ్చంగా తెలుగు

శ్రీ శిరిడీ సాయి దివ్య జ్ఞానామృతం

Share This

 శ్రీ శిరిడీ సాయి దివ్య జ్ఞానామృతం 

 సి.హెచ్.ప్రతాప్




 
శ్రీ సాయినాధులు ఒక అద్భుతమైన, అపూర్వమైన వ్యక్తిత్వం గల దివ్య పురుషులు. అంతవరకూ తనను పూజించకపోయినా సరే, కష్టాలు కలిగినప్పుడు ఆయననె సేవించి, దర్శించి, పరిశుద్ధమైన మనసుతో వేడుకుంటే చాలు తక్షణం వారి చింతనలను, సమస్యలను, కష్టాలను తీర్చే వారు. ఆయన తన జీవిత కాలం లోనే కాదు ఇప్పుడు కూడా ఏనాడూ తన భక్తులకు నిరాశ మిగిల్చి వుండలెదు. భక్తులు కోరుకున్నవి తక్షణం తీరేవి. అయితే అందుకు కావల్సింది భక్తి శ్రద్ధలు, నిష్ట, ఆయనపై అపారమైన నమ్మకం మాత్రమే.

మహారాష్ట్ర హార్ధా గ్రామం లో నివసించే దత్తో పంతు రమారమి పదిహేను సంవత్సరాలనుండి కడుపు నొప్పితో బాధపడుతున్నాడు.పేరెన్నిక గల వైద్యులందరినీ సంప్రదించి ఎన్నో వేల రూపాయలు ఖర్చు పెట్టి ఎన్నో రకాల మందులను వాడాడు గాని అవి అతనికి ఏ మాత్రం ఫలితం ఇవ్వలేదు. అసలు సదరు డాక్టర్లందరూ ఏ కారణం చేత ఈ కడుపు నొప్పి వస్తొందో కూడా కనుక్కోలేక పోయారు. విసిగి వేసారిన దత్తోపంతు చివరగా శ్రీ సాయినాధుని కీర్తి ప్రతిష్టలు, శక్తి సామర్ధ్యాల గురించి విని ఒక ప్రయత్నం చేద్దామని నిర్ణయించుకొని శిరిడీ వచ్చి శ్రీ సాయికి పాదాభివందనం చేసి గత 15 సం || లుగా తనను బాధిస్తున్న ఈ కడుపు నొప్పిని తగ్గించమని కన్నీరు మున్నీరుగా ప్రార్ధించాడు. శ్రీ సాయి అతనిపై తన కరుణామృత చూపులను ప్రసరించి ఊదీ ప్రసాదాలను ఇచ్చి తధాస్తు అని దీవించారు. అంతే ! ఆ క్షణం నుండి అతనికి కడుపు నొప్పి తగ్గిపోయింది. అంతే కాదు శ్రీ సాయి అనుగ్రహ ఫలం వలన అతను జీవితం లో మరి ఆ కడుపు నొప్పితో బాధపడలేదు. ఒక చూపుతో అతి దుర్లభమైన వ్యాధిని తగ్గించి వేసినందుకు కృతజ్ఞతతో , భక్తి భావంతో నాటి నుండి దత్తో పంతు శ్రీ సాయికి భక్తుడైనాడు.

అంతే కాక శ్రీ సాయినాధునికి ముఖ్య భక్తుడైన కాకా మహాజని యొక్క అన్నగారైన గంగాధర పంతు అనేక సంవత్సరాలు కడుపు నొప్పితో బాధ పడ్దాడు.దత్తో పంతు వలే ఆయన ఎందరో వైద్యుల చుట్టూ ప్రదిక్షణలు చేసాడు.ఎన్నో వేల రూపాయలను మందుల కోసం ఖర్చు పెట్టాడు కాని ఫలితం దక్కలేదు. కాకా మహాజని సలహాపై శిరిడీ వచ్చి శ్రీ సాయి కాళ్ళపై పడి తన కడుపు నొప్పిని తగ్గించమని ప్రార్ధించాడు.శ్రీ సాయి దయతో కడుపుపై తన వరద హస్తమును వుంచి " అల్లా అచ్చా కరేగా" అని ఆశీర్వదించారు. అంతే ! నాటితో అతని కడుపు నొప్పి పూర్తిగా తగ్గిపోవడమే కాక జీవితం లో మరెన్నడూ అది పునరావృతం కాలేదు.

శ్రీ సాయినాధుంకి అతి శ్రేష్టమైన భక్తులలో అగ్రగామి అయిన శ్యామా ( మాధవరావు దేశ్ పాండే) ఒక సంధర్భం లో మూలవ్యాధితో బాధపడ్దాడు. తనను దర్శించిన శ్యామాను ఆశీర్వదించి సోనాముఖి కషాయాన్ని తయారు చెసి శ్రీ సాయి శ్యామాకు ఇచ్చి త్రాగమన్నారు. వెంటనే ఆ వ్యాధి తగ్గిపోయింది.రెండు సంవత్సరాల తర్వాత మళ్ళి ఆ వ్యాధి తిరగతోడింది. బాబా తనకు ఇంతకు ముందు ఇచ్చిన విరుగుడును జ్ఞాపకం చేసుకొని బజారుకు వెళ్ళి సోనాముఖి కషాయం తెచ్చుకొని మళ్లీ శ్యామా సేవించాడు. అంతే ! వ్యాధి అధికమైపోయి శ్యామా పరిస్థితి దుర్భరమైపోయింది. వెంటనే మశీదుకు వెళ్ళి శ్రీ సాయిని శరణు వేడగా శ్రీ సాయి ఆశీర్వాద ఫలం వలన ఆ వ్యాధి తగ్గిపోయింది. ఈ సంఘటన ద్వారా " సద్గురువును శరణు వేడాక ఇక తన సమస్త చింతనలను, బాధలు, కష్టాలు, కన్నీళ్ళు, భారమంతటినీ సద్గురువు పాదాల వద్ద నుంచి తనను రక్షించమని హృదయపూర్వకం గా ప్రార్ధించాలి అంతే తప్ప ఇందులో తన స్వంత బుద్ధిని వుపయోగించి తర్క, వితర్కాలకు పాల్పడరాదని" శ్యామా అనుభవపూర్వకం గా తెలుసుకున్నాడు.


సర్వం శ్రీ సాయినాధ పాదారవిందార్పణ మస్తు
లోకాస్సమస్తా సుఖినోభవంతు
సర్వే జన: సుఖినోభవంతు

No comments:

Post a Comment

Pages