కరుణానిధివి గట్టుకో యేపుణ్యమైన - అచ్చంగా తెలుగు

కరుణానిధివి గట్టుకో యేపుణ్యమైన

Share This
  కరుణానిధివి గట్టుకో యేపుణ్యమైన  
(అన్నమయ్య కీర్తనకు వివరణ)

డా.తాడేపల్లి పతంజలి 


రేకు: 0352-03  సం: 04-305

పల్లవి: కరుణానిధివి గట్టుకో యేపుణ్యమైన

శరణాగత వజ్రపంజరుడవు నీవు

చ.1: మన్నించేనంటే నిన్ను మానిపేవా రెవ్వరు

పన్ని కోపగించితే నీపట్టుకెదు రెవ్వరు

చెన్నుమీర నీపెట్టుజెట్లే జీవులెల్లాను

వన్నెగా నీసొమ్ము నీవువలసినట్టు సేయి

చ.2: కాచేనంటే నిన్నుగాదనేవా రెవ్వరు

ఏచి యాజ్ఞవెట్టేనంటే యిదేలనేవా రెవ్వరు

లాచి పెంపుడుగుఱ్ఱలు లలినీజీవులెల్లాను

చేచేత నీదాసులను సేసినట్టుసేయి

చ.3: పరమిచ్చేనంటే నడ్డపడేవా రెవ్వరు

సరి నిహమిచ్చేనంటే సాధించేవా రెవ్వరు

సిరుల శ్రీవేంకటేశ చేతిలోవారము నీకు

హరి నీపాతవారమెట్టైనా దయసేయి

భావం

పల్లవి:

వేంకటేశా ! నువ్వు కరుణానిధివి. శరణమని నిన్ను కోరిన వారికి గట్టిరక్షణను ఇచ్చేవాడివి.

శరణమని నిన్ను కోరుతున్నాను.నా పై దయ చూపి పుణ్యం కట్టుకో!

చ.1:

నన్ను మన్నించానంటే నిన్ను మాన్పేవా రెవ్వరు? ( ఎవ్వరు లేరని భావం)

నాపై  కోపగించితే నీ పట్టుకు ఎదురు చెప్పేవారెవ్వరు?

ఒప్పుదలగా జీవులందరూ  కల్పవ ృక్షములే .

నీసొమ్మును  నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో.( భక్తులందరూ స్వామి సొమ్ములని కాపాడమని భావం)

చ.2:

రక్షిస్తానంటే  నిన్ను కాదనేవా రెవ్వరు?

విజ ృంభించి ఆజ్ఞ పెట్టానంటే ఇదేమిటి అనేవా రెవ్వరు?

ఆసక్తి కలిగిన ఈ జీవులందరూ వ్యాపించిన పెంపుడు శిశువులు .

చేచేత(స్వయంగా) నీదాసులను చేసినట్టుగా ఈ జీవులను చేయవలసినది.

చ.3:

స్వామీ ! నువ్వు మోక్షము ఇస్తానంటే అడ్డుపడేవా రెవరు?( ఎవ్వరు లేరని భావం)

సరిపోయేటట్లుగా  ఇహలోకసుఖము ఇస్తానంటే నిన్ను  సాధించేవారెవరు?

శ్రీవేంకటేశ! నీ చేతిలోనివారము.(అధీనమయిన వారము) హరి!  నీపాతవారము. ఎలాగయినా  దయచూపించు. 

***

No comments:

Post a Comment

Pages