భీమేశ శతకము - దేవరకొండ అనంతరావు - అచ్చంగా తెలుగు

భీమేశ శతకము - దేవరకొండ అనంతరావు

Share This
భీమేశ శతకము - దేవరకొండ అనంతరావు
వివరణ : దేవరకొండ సుబ్రహ్మణ్యం 




కవి పరిచయం:

భీమేశ శతకాన్ని రచించినది శ్రీకాకుళంకి చెందిన శ్రీ దేవరకొంద అనంతరావు. ఈశతకాన్ని 1935 నందు ప్రచురించారు. కనుక వీరి కాలం 20వ శతాబ్ధం ప్రధమ భాగంగా నిర్ణయించవచ్చును. ఈ భీమేశ శతకం వీరి ప్రథమ ప్రయత్నం. వీరు శతకాంతంలో

కం.  శ్రీవిశ్వకర్మ కులజుఁడ
దేవరకొండాన్వయుఁడను ధీనుతచరితా!
శ్రీవిశ్వభద్ర గోత్రుఁడఁ
బ్రోవుమనంతాఖ్యునన్ను భువి భీమేశా!

అని చెప్పుకొన్నారు. ఇంతకు మించి ఈకవి కాలాదులు కానీ, ఇతర రచనల గురించి గానీ ఎటువంటి సమాచారం దొరకలేదు.

శతక పరిచయం:

"భీమేశా" అనే మకుటం తో కంద రచింపబడిన ఈశతకం భక్తి రస ప్రధానమైనది. సరళమైన భాషలో శబ్ధచమత్కృతితో రచింపబడిన ఈ శతకంలో పరమేశ్వరుని లీలలుమనోహరంగా వర్ణింపబడ్డాయి. మహేశ్వరుని వివిధ నామాలు స్మరింపబడ్డాయి. కొందరి అభిప్రాయం ప్రకారం ఈ శతకం అనుదిన శివపారాయణకు అనుకూలం.
కొన్ని పద్యాలను చూద్దాము.

కం. శ్రీకర! యోసద్భక్త వ
శీకర! రిపు భీకర! సురశేఖర! హర! మో
క్షాకర! రజనీకరధర!
శ్రీకఱకంఠా! తలంతు భీమేశా!

కం. ఈశా! గౌరీశా! వి
శ్వేశా! రిపునాశ! యోమహేశా! పోషా!
యాశా పాశవినాశా!
నాశరహిత! దయగనుము నను భీమేశా!

కం. హర! శశిధర! హరిశర! భూ
ధరధర! గౌరీవర! వరదా పరమేశా!
సురవర! స్మరహర! సుగుణా
కర! గంగాధర! గురు శుభకర! భీమేశా!

కం. శంకర యందునొ భక్త వ
శంకర యని పిలతునో హర! శశిధర! గౌరీ
శంకర! మృత్యుభయంకర!
యోకారాకార యందునో భీమేశా!

కొన్నిపద్యాలు మన ప్రాచీన కావ్యాలలోని పద్యాలను అనుకరణలుగా అనిపిస్తాయి.

కం. పలికెడిది నీదునామము
పలికించెడివాఁడవీవు పలికఁగ పాపం
బులు దొలఁగునంట హర నీ
పలుకులు సుధలొలుకునఁట యభవ! భీమేశా!

కం. ఎవ్వాఁడు లోకపాలకుఁ
డెవ్వాఁడీశ్వరుఁడు నభవుఁడెవ్వడు శర్వుం
డెవ్వాఁడు భవ్యచరితుం
డెవ్వండౌ నీయవేలదే భీమేశా!

కం. నీవేమాతవు, జనకుఁడ
వీవే నాబంధుజనుఁడ వీవే, సర్వం
బీవే, లోకేశుండవు
గావే యో దీనరక్షకా భీమేశా!

హరిహర్లు ఒక్కటే అనే ఈ పద్యాలను చూదండి.

కం. హరిహరులననొక్కటియే
ధర మిమ్ముల బేధబుద్ధిఁదలచినవాఁడో
కరుణామయ కాలునికడ
కరగుట తద్యంబయౌనుగదె భీమేశా!

కం. కరివరదుండాహరికద
కరివరమును దీర్పవల్వఁగాఁగట్టితివీ
వరయఁగ గజచర్మంబిక
హరిహరులనవేఱదెట్టులగు భీమేశా!

కం. పన్నగములు నీభూషలు
పన్నగతల్పుండు హరియుఁ బాపవినాశా
యెన్నఁగ హరియన్నను హరుఁ
డన్నను భేదంబు లేదయా భీమేశా!

కం. కరికిమనికిపట్టు తిరుపతి
గిరి నీదగుయున్కి రజితగిరి యిర్వురికిన్
గిరులేనెలవులు భేదం
బరయము మీకెందుజూడనయ భీమేశా!

చక్కని సరళమైన భాషలో భక్తిరసము ఒలికే ఈశతకం అందరూ తప్పక చదవతగినది.
మీరూ చదవండి మీ మిత్రులచే చదివించండి

No comments:

Post a Comment

Pages