స్వామి! వేంకటరమణ - యేమిపరాకయ్య - అచ్చంగా తెలుగు

స్వామి! వేంకటరమణ - యేమిపరాకయ్య

Share This
 స్వామి! వేంకటరమణ - యేమిపరాకయ్య  
డా.తాడేపల్లి పతంజలి 


తాళ్లపాక అన్నమాచార్య  సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల వ్రాతప్రతి పుట: 19 సంకీర్తన: 16
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 272

స్వామి! వేంకటరమణ - యేమిపరాకయ్య
నామనవి యాలించి - నను నేలవయ్య ॥పల్లవి॥

నీవే నా తల్లివి - నీవే నా తండ్రివి
నీవె నాపాలిపె - న్నిధాన మనుచు
నేవేళ నామదిలో - నెంతైన నమ్మితే
భావించి కరుణతో - బ్రోవరా వేమయ్య ॥స్వామి!॥

ఎందరను రక్షింప - వెంత సెలవుసేయ
వందులో నేను నీ - కవుదునా బరువు
కందర్పగురుఁడ నను - కావవే యిందరిలో
సందడిని మరచేవు - స్వామీ అదేమయ్య ॥స్వామి!॥

నిన్ను నమ్మినవాని - కన్నడ జేసితే
అన్యు లెవరైన నను - నాదరింతురటయ్య
నన్నేలు కృపతోడ - నాపాలి వెంకటరమణ
నిన్ను నమ్మితి నేను - నీవాఁడ నయ్య ॥స్వామి


పల్లవి 
  నా యజమానివైన వేంకటేశ్వరా! - నా విన్నపాన్ని పట్టించుకోకుండా ఇదేమి పరధ్యానమయ్యా!?  నా విజ్ఞప్తిని మన్నించి ఈ కష్టాల నుంచి నన్ను ఉద్ధరించి సుఖంగా పరిపాలించవయ్యా!

1.నీవే నా తల్లివి. - నీవే నా తండ్రివి.నీవె నాపాలి టి గొప్ప నిధి వని నా మనస్సులో ఎన్నో విధాలుగా నిన్నే నమ్ముకున్నాను రా! నన్ను  కాపాడదగిన వ్యక్తిగా భావించి దయతో  రక్షించడానికి రావేమయ్యా!?( రమ్మని విజ్ఞప్తి)

2.ఎందరినో రక్షించడానికి నీ సమయాన్ని ఖర్చు పెడుతుంటావ్ !నీ సేవకుల్ని పంపిస్తుంటావ్! అందులో ఈ చిన్నపాటి వాడిని నేను నీకు బరువయ్యానా? (బరువు కానని విజ్ఞప్తి)ఓ మన్మథుని తండ్రీ!ఇంతమంది భక్తుల సందడిలో నన్ను మర్చిపోతున్నావు .(మరువవద్దని కాపాడమని కవి యొక్క విజ్ఞప్తి.)

3.నిన్ను నమ్మిన నన్ను నువ్వే ఉపేక్ష చేస్తే ఇంకా వేరే ఎవరైనా నన్ను ఆదరిస్తారా?( ఆదరించాలని నువ్వే కాపాడాలని భావము )- నన్ను దయతో చక్కగా రక్షిస్తూ నా యజమానిలా నన్ను నువ్వు పాలించు. నా పాలిటికీ ఉన్న ఒకే ఒక్క దిక్కువి నువ్వే. వేంకటరమణా!నేను నీ వాడిని. (అన్యధాశరణం నాస్తి భావనలో ఉన్నవాడిని కనుక తప్పనిసరిగా తనను రక్షించి కాపాడాలని కవి యొక్క మాటల్లోని భావము. ).

ధన్యవాదములు.
 
డా.తాడేపల్లి పతంజలి
9866691587

No comments:

Post a Comment

Pages