స్వేచ్ఛ - అచ్చంగా తెలుగు
స్వేచ్ఛ-స్వచ్ఛత
-సుజాత.పి.వి.ఎల్ 




శాస్త్ర అంశం ఏదైనా, అది సముద్ర సమానం. అర్థం చేసుకున్నా, అధ్యయనం చేసినా మనిషి కొంతవరకే సాధించగలడు. సంపూర్ణ అభ్యాసానికి జీవిత కాలం సరిపోదు. అంతా కరతలామలకం అయిందని అనుకుంటాడు. తనను మించిన వాళ్లు లేరని మిడిసిపడతాడు. కొంతకాలానికి తాడి దన్నేవాడు ఉంటే, వాడి తలదన్నే వాడు ఉంటాడని తెలుసుకుని, ఆకాశ విహంగం చేసే కాళ్లను భూమిపై ఆనుస్తాడు. నెత్తి మీది కళ్లను ముఖానికి తెచ్చుకుంటాడు. మనిషి విజ్ఞానానికి మొదటి సవాలు ప్రకృతి. అనూహ్య ప్రతులున్న అద్భుత పుస్తకం అది. వీక్షించి, ఆలకించే మనసు ఉండాలే కాని అన్నీ వింతలు, విడ్డూరాలే. కళ్లు విప్పార్చుకుని చూస్తూ ఆశ్చర్యపోవడం తప్ప, అర్థం చేసుకోవడం అసాధ్యం. ప్రకృతి ముందు అందరూ పసి కూనలే. ఒడిలో చేర్చుకుని లాలించిందా కన్న తల్లి. కన్నెర్ర చేసిందా అపర కాళి. తల్లిని గౌరవించినట్టు ప్రకృతికి శుశ్రూష చేస్తేనే మానవ మనుగడ నల్లేరు మీద బండి నడక. లేదంటే ప్రళయ హేల.

మనిషి మనసులో ఎన్నో రకాల భావాలు నాటిన అంతర్యామి. సూది మొనంత స్వార్థమూ చేర్చాడు. ఎదుగుతున్న మనిషి దాన్ని చీమంత ఉంచుతాడా, ఏనుగంత చేసుకుంటాడా అన్నది అతని వ్యక్తిత్వానికే వదిలేశాడు. మానవుణ్ని బుద్ధిజీవిగా సృష్టించాడు గనక ఇందుగలడందులేడను..అంటూ ప్రకృతిలో అడుగడుగునా, అనువణువునా తన అస్తిత్వం ఉందని, దానిపట్ల జాగ్రత్త వహించవలసిన బాధ్యత మనిషిదేనని నర్మగర్బంగా చెప్పాడు. స్వార్థం వ్యక్తిగతం అయితే అది అతనికి మాత్రమే చెరుపు చేస్తుంది. సామాజికం అయితే సమాజం అతలాకుతలం అవుతుంది. దాని దుష్ప్రభావం ప్రకృతి మీద పడుతుంది. ఒకరు పాలిథీన్ సంచిలో సరుకులు తెచ్చుకుంటారు. బయట పడేసిన సంచిని ఆవు తిని జీర్ణంకాక సతమతం అవుతుంది. ఆవు బాధ అతను చూడలేక పోవచ్చు. జీవ హింసకు కారణం మాత్రం ఆ మనిషి. ఉద్యోగాలు కల్పించి పొట్టనింపే సంస్థ, వ్యర్థ పదార్థాలను కలుషిత నీరు, వాయువు రూపంలో వెలుపలికి వదులుతూ పరిసర ప్రాంతాలను విష తుల్యం చేస్తుంది. జీవ సమతుల్యతను దెబ్బ తీస్తుంది. తోటలో తోటమాలి రక్షణలో ఉన్న మొక్క చక్కని నిగారింపుతో పూలు, పళ్లతో మిసమిసలాడుతుంది. 

రోడ్డుని విభజిస్తూ ఏర్పరచిన స్థలంలో వేసిన మొక్క అటూ, ఇటూ తిరిగే వాహనాల కాలుష్యంతో ఉక్కిరి బిక్కిరవుతూ వాడిపోయి ఉంటుంది. ప్రకృతిలో జనించిన ప్రతి జీవికి స్వేచ్ఛగా, స్వచ్ఛమైన వతావరణంలో, ఆనందంగా జీవించే హక్కు ఉంటుంది. అది దైవ ప్రసాదితం. మనిషికి దాన్ని కాలరాసే అధికారం లేదు.

కాగితాల మీద కొన్ని హక్కులు రాసుకుని, మానవ సౌలభ్యం కోసం మాత్రమే వాటిని ఉపయోగించుకోవడం అసమంజసం. అమానుషం.

మనిషి ఎంత సాధించినా వానల కోసం రుతువుల మీద ఆధారపడాల్సిందే. ఎత్తైన కొండలుంటేనే మేఘాలను అడ్డుకుంటాయి, వానలు కురిపిస్తాయి. కీటకాలు ఉంటేనే మొక్కల అబివృద్ధి. చెట్లుంటేనే ప్రాణ వాయువును ఇచ్చి మనిషి గుండెను పదిలంగా ఉంచుతాయి. సర్వత్రా స్వచ్ఛత ఉంటేనే మనిషి పూర్ణాయుర్దాయుడు అవుతాడు.

ప్రకృతి అన్నీ స్వచ్ఛంగానే ఇచ్చింది. మనిషి స్వార్థం దాన్ని కలుషితం చేస్తోంది. నదులు, చెఱువులు ఉంటేనే మనుషుల దాహార్తి తీరుతుంది. కడుపు నిండుతుంది. అవి కలుషిత కాసారాలయితే కాపాడే దిక్కెవరు.

మానవుడికి తన స్వేచ్ఛ హరించే ఏ కార్యం జరిగినా, అన్యాయం అనిపించినా గొంతెత్తుతాడు. రోడ్డెక్కుతాడు. అనుకున్నది సాధిస్తాడు. చెట్లు, పుట్టలు, మూగ జీవులు తమకి అన్యాయం జరిగితే కదల్లేవు, అరచి గోల చేయలేవు. మౌనంగా భరిస్తాయి. మానవులు అడవులు నరికి, జీవుల కోసం ఎక్కడో కొంత స్థలం అభయారణ్యంగా కేటాయిస్తే, జంతువులు దాని తోటే సరిపుచ్చుకోవాలి. ఎప్పుడన్నా జంతువులు ఊర్లోకి వస్తే జనం గగ్గోలు పెడతారు. వాటిని పట్టి, బంధించి అడవిలో వదిలేదాకా కంటి మీదకు కునుకు తెచ్చుకోరు. పూర్వం ఋషుల ఆశ్రమ వాతావరణంలో మనుషులతో పాటు జంతువులు స్నేహపూర్వకంగా మసిలేవి. వాటిని రాటకి కట్టేయడం, బోనుల్లో బంధించడం ఏ పురాణాల్లోనూ చదవలేదు. రాను రాను మనిషి జంతువుకి దూరమయిపోయాడు. భారమయిపోయాడు.

ఈనాటి బాల్యానికి ఆర్థికంగా, సామాజికంగా ఉన్నతి ఎలా సాధించాలి అని కాకుండా ప్రకృతి పరిరక్షణ, జంతు సంరక్షణ గురించి, మానవీయ కోణంలో పాఠాలు చెబితే, రాబోయే తరాలు ప్రకృతిని, జీవ జంతుజాలాన్ని తమ కళ్లతో చూడ గలుగుతాయి. లేదంటే తెరపై కదిలే దృశ్యాలే మనోరంజకాలు అవుతాయి. కృత్రిమ వాతావరణంలో ప్రాణమున్న జీవిగా మనిషి ఒక్కడే మిగులుతాడు. 

***

No comments:

Post a Comment

Pages