'నను బ్రోవమని చెప్పవే ' కథ - అచ్చంగా తెలుగు

'నను బ్రోవమని చెప్పవే ' కథ

Share This

 నను బ్రోవమని చెప్పవే 

అక్కిరాజు శ్రీహరి 


శ్రీరమణీయహార యతసీ కుసుమాభశరీర, భక్త మం

దార, వికారదూర, పరతత్త్వవిహార త్రిలోక చేతనో

దార, దురంత పాతక వితాన విదూర, ఖరాది దైత్యకాం

తార కుఠార భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ

********

గోల్కొండ సమీపంలో మూసీ, ఈసీ  నదుల సంగమ తీరంలో ఓ సీతారాముల కోవెల. ఆ రోజు ఉదయం ఓ రెండుకుటుంబాలు గుళ్ళొ కొచ్చి వారగా ఓ మంటపంలో కూర్చున్నారు. పెళ్ళీడు కొచ్చిన ఓ అబ్బాయి,  ఓ అమ్మాయి వున్నట్లున్నారు. పెళ్ళిచూపులు కామోసు. ఇంతలో వారిలో పెద్దాయన అన్నాడు. 

' బాబూ, రామం. నువ్వు అమ్మాయి సీత ఏకాంతంలో ముచ్చటించుకోండి. ఆ పై సంగతి దైవేచ్ఛ. ' 

రామం , సీత కదిలి కొంచెం దూరంలో మెట్ల మీద కూర్చున్నారు.

ఒకరి గురించి ఒకరికి సమాచారం అంతా తెలిపారు. ఇక ఏమడగాలి? ఏం మాట్లాడుకోవాలి? ఇద్దరూ మౌనంగావుండిపోయారు కొంతసేపు.

ఆ మౌనాన్ని అంతం చేస్తూ రామం అడిగాడు.

'మీకు తెలుసా చాలా ఏళ్ళ క్రితం ఈ స్థలానికి సీతా రామ లక్ష్మణులు  వచ్చారట.'

' అలాగా! ఎప్పుడు ? ఎందుకు ? '

' అప్పుడు గోల్కొండను తానీషా పాలిస్తూవుండేవాడు. ఆ కాలంలో  పాల్వంచ పరగణాకు తహ్సిల్దారుగా కంచెర్ల గోపన్నఅనే అతను వుండేవాడు'

' అతనే రాములవారికి భద్రాచలం గుడి కట్టించిన రామదాసు కదా '

' అవును. రామ భక్తుడు. దమ్మక్క కట్టిన చిన్న గుడిని వైభవోపేతంగా అభివృద్ధి చేశాడు. అయితే అందుకు ప్రజలనుండిపన్నులు వసూలుచేసిన పైకం తానేషాకు కట్టకుండా గుడికి ఖర్చుపెట్టాడు. కోపగించిన  ప్రభువు గోపన్నను బందిఖానాలోవేశాడు. పన్నెండేళ్ళవస్తున్నది కఠిన శిక్ష అనుభవిస్తూ. అదిగో ఆ సమయంలోనే సీత రామ లక్ష్మణులు ఇక్కడకు వచ్చారు'

' వచ్చి , ఏం చేశారు ?'

' వినండి' అంటూ చెప్పసాగాడు రామం, ఏకాగ్రతతో వింటున్న సీతతో.

@@@@@@@@

'నను బ్రోవమని చెప్పవే 

సీతమ్మ తల్లీ నను బ్రోవమని చెప్పవే !'

'వింటున్నారా ? ఆర్తితో మొరెట్టుకుంటున్న ఆ అభాగ్యుడి వేదన ? ' అన్నది సీత.

' ఆ, వింటున్నా . నీతోనే విన్నవించుకుంటున్నాడు. అది వినే నన్ను   బయల్దేర తీసావుగా ' అన్నాడు మందహాసంతోరామచంద్రుడు.

'ననుబ్రోవమని చెప్పవే నారీశిరోమణి

జనకుని కూతుర జనని జానకమ్మ

అద్రిజవినుతుడు భద్రగిరీశుడు

నిద్రమేల్కొనువేళ నెలతరో బోధించి            

నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లీ !'

' ఇయం సీతా మమ సుతా అంటూ నీ జనకుడు నీ చేతిని నా చేతికి యిచ్చిన క్షణం గుర్తుందా ? '

' అంతకు కొన్ని ఘడియల ముందు, విల్లు నెత్తబోతూ తల పైకెత్తి నా   వైపు చూస్తూ ఆంగీకారమేనా అని మందహాసంతో నన్నడిగారు గుర్తుందా ?' 

' ఆ క్షణం కళ్ళతోనే కానీయండని నాకానతి నిచ్చావుగా , అదెలా మరుస్తాను జానకీ '

'రామా నీ ముద్దుమోము జూపు సుందర రామా 

నీ ముద్దుమోము జూపర రామా భద్రాచల ధామా తారకనామా 

ముక్కున ముత్య మింపుమీరగా చెక్కుటద్దము ముద్దుగుల్కగా 

చనుముక్కున పాలధారలొల్కగా ప్రేమ మిక్కుటమున వచ్చి 

మీ తల్లి కౌసల్య యక్కున జేర్చి నెలబాలు జూపినయట్టి రామా '

' మీ పసితనాన్ని ఎంత ముద్దుగా వర్ణిస్తున్నాడో చూడండి. మా అత్తగారిదే భాగ్యము' అంది సీత.

'గిరికొన్న ప్రేమ సుగ్రీవు బ్రోచితివి అల్లనాడు అట్లు 

సిరులియ్యకున్నను మీ కులగురువు వసిష్ఠుని తోడు 

రక్షించు దీనుని రామ రామ నీ రమణి తోడు '

' అలనాడు నీ జాడ తెలియక కొండ కోనలు తిరుగుతుంటే అదిగో ఆ సుగ్రీవునితో చెలిమి నాకు కొండంత ఆసరాఅయింది. గుర్తుచేస్తున్నాడు విన్నావా సీతా ?' అంటున్నాడు రాముడు.

'రామ చంద్రా నన్ను రక్షింపవదేమో నేనెరుగ 

భరతుని వలెను పాదుకలు పూజ చేయ నేర 

కోరి లక్ష్మణుని వలె కొలువగనేర 

ఓర్పుతో గుహుని వలెను వోడనడుప నేర 

నేర్పుతో నా వాలి వలె నిన్నెరుగ నేర 

అంగదుని వలె నే నడపము బట్టనేర 

సంగరమున సుగ్రీవునివలె సాధింపనేర 

గాలిపట్ట వలె నే తాలిమిగ మోయనేర 

బలిమితో హనుమంతుని వలె పాటు పడనేర 

లీలతో శబరి వలె లాలించి విందిడనేర 

మేలిమిగ సీతవలె మెప్పింపగనేర 

వీర జటాయువు వలె ప్రాణములియ్యనేర 

కరము నహల్యవలె కీర్తింపగ నేర 

రామచంద్రా నన్ను రక్షింపవదేమో నేనెరుగ '

' విన్నావా సీతా ! అంతా చూసినట్లే కళ్ళకు కట్టినట్లు వివరంగా చెబు తున్నాడు. అమ్మ కైక కోరిక తండ్రి యానతి కానలకెళుతున్నపుడు ప్రియ సోదరుడు లక్ష్మణుడు, నీవు తోడు రాగా పయనమయామే. సరయూ తీరంలో గుహుని ఆతిధ్యంమరవలేనిది.' అన్నాడు రాముడు.

' బంగరు జింక పై మోహంతో నేనడిగితే, దాని వెంట మీరెళ్ళారు, మీకోసం లక్ష్మణుడు. ఒంటరినైన నన్ను ఆ రావణుడు తీసుకు  వెళుతుంటే పక్షిరాజు జటాయువు ఎంత వీరత్వంతో ఎదిరించాడో. పాపం, నేలకొరిగాడు'

' మారీచుని చంపి తిరిగి వచ్చిన మాకు నీవేమై పోయావో తెలియలేదు. కొనవూపిరితో వున్న జటాయువే నీ అపహరణ సంగతి చెప్పాడు. నిన్ను వెదుకుతూ కిష్కింద చేరి, సుగ్రీవుని సహాయంతో , హనుమంతుని వల్ల నీ జాడ తెలిసింది'

'ఆనాడు అశోకవనంలో దిక్కుతోచని నాకు విభుని సమాచారం    అందించి నా ప్రాణాలు నిలబెట్టాడు చిరంజీవి హనుమ'

' ఎంతో మహానుభావుడవు నీవు 

ఎంతో చక్కని దేవుడవు ఎంతో 

వింతలు చేసితివీ లోకమందున 

కోతి మూకలనెల్ల గొలిపించినావు 

నీటిపై కొండల నిల్పించినావు 

లంకపై దండెత్తి లగ్గెక్కి నావు 

రావణ కుంభకర్ణుల ద్రుంచినావు 

పంకజాక్షి సీత పాలించినావు 

లంకేశు దివ్య పుష్పక మెక్కినావు 

పరగ నయోధ్యకు బరతెంచినావు 

పట్టాభిషక్తుడవై పాలించినావు 

ఎంతో మహానుభావుడవు నీవు '

'సేతువు కట్టి రావణాదుల సంహరించి అయోధ్య చేరి సకల పరివారంతో మీ పట్టాభిషేకం కనుల పండువగా జరిగింది. గతమంతా మళ్ళీ ఈ నాడు ఈ గోపన్న నోట వింటున్నాను' అంది సీత రాముని చూస్తూ .

'అప్పుడంత చేసావు సీత కోసం,మరి ఇప్పుడు నన్ను మరిచావేమిటని అడుగుతున్నాడు గోపన్న '

' ఇక్ష్వాకుల తిలక ఇకనైన పలుకవె రామచంద్రా 

నన్ను రక్షింపకున్నను రక్షకులెవరింక రామచంద్రా 

సీతమ్మకు చేయిస్తి చింతాకు పతకము రామచంద్రా 

ఆ పతకమునకు బట్టె మొహరీలు పదివేలు రామచంద్రా 

కలికితురాయి నీకు పొలుపుగ జేయిస్తి రామచంద్రా 

నీవు కులుకుచు దిరిగెద వెవరబ్బ సొమ్మని రామచంద్రా 

సర్కారు పైకము తృణముగ నెంచకు రామచంద్రా 

దెబ్బల కోర్వను యప్పు దీర్చుమయ్య రామచంద్రా '

' చూశావా, నా కలికి తురాయి , నీ చింతాకు పతకము సర్కారు వారి   పైకంతో చేయించాట్ట. నే నడిగానా కావాలని? '

' వేసుకొని తిరుగుతున్నారుగా మరి. అప్పు తీర్చమంటున్నాడే, ఏమంటారు ?'

'తానీషా గారు వచ్చి సరి తీర్పు చేసెదరు 

పన్నుల పైకము బంపి బందిఖానా వదిలించు 

ఎటుబోతివో రామ ఎటుబ్రోతువో '

' చూశావా . ప్రభువుకీయవలసిన పైకాన్ని మన కోసం ఖర్చు చేశాడు.  బందిఖానాలో పడ్డాడంటే పడడా?'

' అతను జగత్ప్రభువులకే కదా ఇచ్చింది. అతని తప్పేముంది?'

' ఆహ. అది ధర్మం కాదే. దానికి శిక్ష ననుభవించాల్సిందేగా ?'

' ధర్మ ప్రభువులు మీరు. ఆ సంగతి నాకు బాగా తెలుసు. ఇతను మీ  భక్తుడు, ఆ భక్తి పారవశ్యమే ఆ కర్మకు ప్రేరణ. దయతలచలేరా మీ   దాసుని ?'

'ఎక్కడి కర్మములడ్డుపడెనో యేమిసేయుదునో శ్రీరామా 

అక్కట నా కన్నుల నెప్పుడు హరి నిను జూతునో శ్రీరామా '

'విన్నావా,తనే చెబుతున్నాడు. పూర్వ జన్మ కర్మ ఫలాలు అనుభవింపక తప్పదు కదా! '

' ఏ కర్మకు ఫలితమో ఈ శిక్ష ?'

'గత జన్మలో చిన్నతనాన ఓ రామచిలుకను పట్టి పంజరంలో బంధించి ఆనందపడ్డాడు. ఒకటా రెండా పన్నెండు రోజులు. ఆ చిలుక రామ   రామ అని ఎంత మొరపెట్టినా వినిపించుకోలేదు. ఆ కర్మ ఫలమే   ఇతనికీ జన్మలో పన్నెండేళ్ళ బందిఖానా. అపుడు చెవినబడ్డ  రామ నామ ఫలితం ఈ జన్మలో రామ భక్తుడయాడు.  అయినా ఆ ప్రారబ్ధం తీరే   వరకు నేనుచేసేదేమీలేదు కదా.'

' తమ్ముడు నీవొక జంటను రామదాసుని రక్షించుటను 

సమ్మతి నుండు మా యింటను భద్రాచల వాస నీ బంటును '

' లక్ష్మణా, రామదాసు పిలుస్తున్నాడు, అతని విడుదలకు సమయమొచ్చింది. పద వెళదాం. '

' అన్నా , ఇవిగో ఆరు లక్షల వరహాలు. నీ పట్టాభిషేక ముద్ర , హనుమ ముద్రతో వున్నవి. ఇక నీ ఆనతి ' అన్నాడు లక్ష్మణుడు.

' సరే. ఆ తానేషాకు ఇవిచ్చి గోపన్నను బందిఖాన నుంచి విడిపిద్దాము.'

' మరి ఆ రామదాసును మీ దర్శనంతో కరుణిచేదెపుడో 'అన్నది సీత 

' మేం తిరిగి వచ్చాక , ఆ రామదాసు భద్రంగా భద్రాచలం చేరాక .'

' సంతోషం. ఈ నాటికి రామదాసు వేదన తీరుతోంది. శుభం'

@@@@@@@@@

గుడినుంచి మంగళం వినబడుతోంది .

రామ చంద్రాయ జనకరాజజా మనోహరాయ 

మామకాభీష్టదాయ మహిత మంగళం 

చారు మేఘ రూపాయ చందనాది చర్చితాయ 

హార కటక శోభితాయ భూరిమంగళం 

రామదాసాయ మృదుల హృదయ కమల నివాసాయ 

స్వామి భద్రగిరి వరాయ సర్వమంగళం ...

'బాబూ రామం, అమ్మా సీతా రండి. హారతిస్తున్నారు. వెళ్ళి దర్శనం   చేసుకొని వద్దాం ' అన్న పిలుపు విని ముచ్చటైనజంట  సీత, రామం లేచి దైవ దర్శనం చేసుకొని హారతి కళ్ళ కద్దుకొని మరొక్కసారి హనుమత్ లక్ష్మణ సమేత సీతారాములను చూస్తూ మనసులో ధ్యానించుకున్నారు. 

శ్రీరమ సీతగాగ నిజసేవక బృందము వీరవైష్ణవా

చార జవంబుగాగ విరజానది గౌతమిగా వికుంఠము

న్నారయభద్ర శైలశిఖరాగ్రముగాగ వసించు చేతనో

ద్ధారకుడైన విష్ణుడవు దాశరథీ కరుణాపయోనిధీ l


స్వస్తి !


No comments:

Post a Comment

Pages