స్థిర చిత్తుడు - అచ్చంగా తెలుగు

స్థిర చిత్తుడు

సి.హెచ్.ప్రతాప్భగవద్గీత 2 వ అధ్యాయం, 56 వ శ్లోకం:

దు:ఖేష్వనుద్విగ్నమనా: సుఖేఎషు విగతస్ఫృహ
వీతరాగభయక్రోధ: స్థితధీర్మునిరుచ్యతే

మూడు విధముల తాపముల యందు చలించని మనస్సు కలవాడు, సుఖము కలిగినప్పుడు ఉప్పొంగనివాడు, రాగము, భయము, క్రోధముల నుండి విడివడిన వాడు అయిన మానవుడిని స్థిరమైన మనస్సు గలవాడని చెప్పబడును.

మహాభారతం లోని వన పర్వంలో  "న చాసౌ యస్యమతం న భిన్నం"  అని చెప్పబడింది. అంటే ఒక స్థిరమైన నిర్ణయానికి రాకుండా మానసిక కల్పనలతో పలురీతుల మననం చేసేవాడే మునీశ్వరుడని చెప్పబడుతోంది. అయితే భగవద్గీతలోని పై శ్లోకంలో చెప్పబడిన స్థితధీర్ముని లక్షణాలు సామాన్య మునులకు భిన్నమైనది గా చెప్పబడింది. సర్వ విధాలైన మానసిక కల్పనలను కూడా త్యజించి భగవంతుడే సర్వస్వం అని భావించి సర్వస్య శరణాగతి చేసినవాడు. వానికి తను అనే స్ఫురణ లేశమాత్రమైనా వుండదు.అన్నివేళలా భగవంతుని స్మరించుకుంటూ ఆత్మ స్థితిలోనే నిమగ్నమై వుంటాడు. మూడు విధాలైన తాపాలు తాకిడి చేసినా ఎలాంటి కలత పొందడు. తన గత జన్మలోని పాపాలకు శిక్షానుభవించాల్సి ఉందన్న భావనతో ఆ తాపాలను సంతోషంగా ఆహ్వానించి అనుభవిస్తాడు. అందువలన కష్టాలు సైతం చిరునవ్వుతో ఆహ్వానిస్తాడు.భగవంతుని అనుగ్రహం వలన తనకు తాపాలు తక్కువ పరిణామంలో వచ్చాయన్న సంతృప్తి భావన అతని మనస్సులో ఎల్లప్పుడూ వుంటుంది. అదేవిధంగా సుఖములు, భోగములు కలిగినప్పుడు, భగవంతుని కరుణ వలనే అవి లభించాయని సదా భగవంతుని పట్ల కృతజ్ఞత కలిగి వుంటాడు. భగవంతుని పట్ల నిశ్చల భక్తి కలిగివుండడం కూడా పూర్వ జన్మ సుకృతం అని, అది భగవంతుని కృప వలనే కలుగుతుందని భావిస్తాడు. సంక్షిప్తంగా కష్టనష్టాలు, సుఖ దు:ఖాలు, సమస్యలు, భోగ భాగ్యాలు అన్నింటిలోనూ భగవద్  భక్తి చెక్కుచెదరకుండా వుండడమే స్థిత ధీర్ముని ప్రత్యేకత. అతనికి ధైర్యమే గొప్ప ఆభరణం. .

ఇంద్రియ భోగాలను అనుభవించడం అనే స్పృహ ఆసక్తి కాగా, వాటి పట్ల వైరాగ్య భావన పెంపొందించుకోవడం అనాసక్తి అంటారు. స్థిరమైన భగవద్ భక్తి గలవారు ఆయన సేవ కోసమే జీవితం అర్పించినందున ఆసక్తి, అనాసక్తి అనే ద్వందాలు అతనిని దరి చేరవు. తన ఆధ్యాత్మిక ప్రయత్నాలు సఫలమైనా,విఫలమైనా అతనికి ఒకలాగే అనిపిస్తుంది.కాబట్టి భగవంతుని భక్తి యందు స్థిరముగా నిలిచినవాడు జయాపజయాలు రెండింటి యందు సదా ధీరుడై స్థిర నిశ్చయంతో వుంటాడన్నది పై శ్లోకం అర్ధం. 

భూతకాలంలో జరిగినది, వర్తమాన కాలంలో జరుగుతున్నది, భవిష్యత్తులో జరిగేది అంతా భగవంతుని అనుగ్రహం వలనే జరుగుతోందని, అంతా మన అభ్యున్నతి కోసమేనన్న స్థిరమైన భావం (ప్రసాద భావం) ఆధ్యాత్మిక జీవితంలో విజయానికి పునాదిగా భగవద్గీత చెబుతొంది.


***


No comments:

Post a Comment

Pages