కొత్త టీచర్ - అచ్చంగా తెలుగు

                                                                           కొత్త టీచర్

G.S.S.కళ్యాణి


"పిల్లలూ! ఈవిడ పేరు సరళ. రేపటినుండీ నా స్థానంలో సరళ మీ క్లాసుకు వస్తారు. అంటే, ఈవిడే మీ కొత్త టీచర్!", చిరునవ్వుతో మూడో తరగతి పిల్లలకు సరళను పరిచయం చేసింది జయ.

ఎప్పుడూ హుషారుగా కేరింతలు కొడుతూ ఉండే ఆ తరగతిలోని పిల్లలందరూ సరళ, జయల వంక మౌనంగా చూస్తున్నారు. వారి మోహంలో దిగులు కొట్టొచ్చినట్టు కనపడుతోంది.

ఆ పిల్లలమధ్య కూర్చుని ఉన్న ప్రణతి బుంగమూతి పెట్టుకుని, అమాయకత్వం నిండిన పెద్ద పెద్ద కళ్ళతో సరళ వంక కొరకొరా చూస్తూ, 'నాకీ కొత్త టీచర్ వద్దు!', అని మనసులో అనుకుంది.

అంతలో చందు అనే పిల్లవాడు లేచి నిలబడి, " జయా టీచర్! మీరు మమ్మల్ని వదిలి వెళ్ళడానికి ఏమాత్రం వీల్లేదు. ఇక్కడే ఉండిపోండి. ప్లీజ్!!", అంటూ ఏడవటం మొదలుపెట్టాడు.

జయ సమాధానం ఇచ్చేలోపు ఆ తరగతి గదిలోని పిల్లలంతా బిగ్గరగా ఏడుస్తూ, "మీరు మమ్మల్ని విడిచి వెళ్లొద్దు జయా టీచర్! ప్లీజ్!!", అన్నారు ముక్త కంఠంతో.

"పిల్లలూ! మీ ప్రేమను నేను అర్ధం చేసుకోగలను. నిజం చెప్పాలంటే నాక్కూడా మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్లిపోవాలని లేదు! మీ అంత బుద్ధిమంతులైన పిల్లలు మళ్ళీ నాకు దొరకడం కష్టం! కానీ, నన్నేం చెయ్యమంటారు?? వెళ్లక తప్పని పరిస్థితి నాది! మీరంతా కొత్త టీచర్ దగ్గర కూడా మంచి పిల్లలని పేరు తెచ్చుకుని బాగా చదువుకోవాలి! సరేనా?", అంటూ పిల్లల మధ్యలోకి వెళ్లి నిలబడింది జయ.

ప్రణతి, చందులతో సహా పిల్లలందరూ జయ చుట్టూ చేరి ఆమెను గట్టిగా వాటేసుకున్నారు. జయ కూడా వారిని ఆప్యాయంగా దగ్గరకు తీసుకుంది. పిల్లల కళ్ళల్లో కన్నీళ్లను చూస్తున్న జయకు దుఃఖం ఆగలేదు!

ఆమె వారిని ముద్దాడుతూ, "వెళ్ళొస్తాను పిల్లలూ! జాగ్రత్త!", అంటూ వెళ్ళిపోయింది.

పిల్లలు ఏడుస్తూ, బిక్క మొహాలతో జయకు వీడ్కోలు చెప్పి ఎవరిళ్ళకు వారు వెళ్లిపోయారు.

దిగులుతో ఇంటికి చేరిన ప్రణతిని దగ్గరకు తీసుకుని ,"ఏమిటి బంగారం? ఎందుకలా ఉన్నావ్? ఏమిటీ విషయం? స్కూల్లో ఎవరైనా నిన్ను ఏమైనా అన్నారా??", అని ప్రణతిని బుజ్జగిస్తూ అడిగింది ప్రణతి తల్లి సుకన్య.

“అమ్మా! ఇవాళ మా జయా టీచర్ స్కూల్ వదిలిపెట్టి ఎక్కడికో వెళ్లిపోయారు. రేపటినుండీ ఆవిడ బదులు సరళ అని ఎవరో కొత్త టీచర్ వస్తారట. నాకు ఆవిడ అస్సలు నచ్చలేదు! అసలు మా జయా టీచర్ కి మేమెవ్వరం ఇష్టం లేదనుకుంటా! అందుకే వెళ్లిపోయారు", అని ఏడుస్తూ చెప్పింది ప్రణతి.

సుకన్య ప్రణతిని ఊరుకోపెడుతూ, "తప్పమ్మా! అలా అనకూడదు. మీ జయా టీచర్ చాలా మంచివారు! ఆవిడకు వేరే ఊరికి బదిలీ అయ్యిందట. అందుకే వెళ్లిపోతున్నారు. అంతేగానీ మీరంటే ఇష్టం లేక కాదు! మీ కొత్త టీచర్ కూడా జయా టీచర్ అంత మంచావిడ అని నేను విన్నాను! ఏడవకు. చక్కగా బట్టలు మార్చుకుని వస్తే ఫలహారం పెడతాను. తిందువుగాని", అంది.

సరేనంటూ ప్రణతి తన గదిలోకి వెళ్ళిపోయింది. ఆ మర్నాడు, ప్రణతి బడికి వెళ్లనని మారాం చేసింది. సుకన్య ప్రణతిని చాలాసేపు బతిమలాడి ఎట్టకేలకు కాస్త ఆలస్యంగా బడికి పంపగలిగింది. అయిష్టంగా బడికి వెళ్లిన ప్రణతి, నేరుగా తన తరగతి గదిలోకి వెళ్లి కూర్చుంది. కొద్దిసేపటి తర్వాత, బడి మైదానంలో దైవప్రార్ధనను పూర్తి చేసిన ప్రణతి తోటి విద్యార్థులు, వరుసలో వచ్చి ప్రణతి ఉన్న గదిలో కూర్చున్నారు.

వారితోపాటు, "హాయ్ పిల్లలూ!", అని నవ్వుతూ వచ్చింది సరళ.

పిల్లలందరూ సరళకు బదులివ్వకుండా నిశ్శబ్దంగా కూర్చుని ఉన్నారు. సరళ పాఠం చెప్పటం మొదలుపెట్టింది. ఆ గదిలోని ప్రతి విద్యార్ధీ సరళను జయతో పోల్చి చూసుకుంటున్నారు. సరళ పాఠం చెప్పటం పూర్తయ్యింది. ప్రణతి తప్ప మిగతా పిల్లలందరూ సరళ పాఠం చెబుతున్న తీరుకి కొంచెం అలవాటుపడ్డారు.

ప్రణతి మాత్రం, 'మా జయ టీచర్ అంత బాగా చెప్పట్లేదు ఈ సరళ టీచర్!', అని మనసులో అనుకుంది.

మూడు నెలలు గడిచిపోయి క్వార్టర్లీ పరీక్షలొచ్చాయ్.

పిల్లలను బాగా చదివేలా ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో, "పిల్లలూ! వచ్చే పరీక్షల్లో ఎవరికైతే ఎక్కువ మార్కులొస్తాయో వాళ్లకి నేనొక మంచి బహుమతిని ఇస్తాను!", అని పిల్లలతో చెప్పింది సరళ.

ఆ మాట నిజంగానే కొద్దిమంది పిల్లల్లో బాగా చదివి ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలనే కోరికను కలిగించింది. పరీక్షలు మొదలయ్యాయి. ప్రణతికి సరళ నచ్చకపోవడంతో సరళ చెప్పిన పాఠాలేవీ శ్రద్ధగా వినలేదు. దాంతో పరీక్షలు సరిగ్గా రాయలేకపోయింది ప్రణతి. పరీక్షలైపోయాక ఫలితాలు వచ్చాయి. గౌరీ అనే పాపకు అందరిలోకీ ఎక్కువ మార్కులు రాగా ప్రణతికి అందరికంటే తక్కువ మార్కులొచ్చాయి! సరళ, తను చెప్పిన విధంగా గౌరీకి ఒక ఖరీదైన పెన్నుని బహుమతిగా ఇచ్చింది.

బంగారు రంగులో ధగధగా మెరుస్తున్న ఆ పెన్నును చూసి ప్రణతి తోటి విద్యార్థులంతా గౌరీ చుట్టూ చేరి, "అబ్బ!! ఈ పెన్ను ఎంత బాగుందో! భలే అందంగా ఉంది! ఇంత ఖరీదైన పెన్నును మేము ఎప్పుడూ చూడలేదు!", అని అన్నారు.

అప్పుడు చందు, "మళ్ళీ మూడు నెలలలో పరీక్షలొస్తున్నాయి కదా! ఈసారి నేను బాగా చదివి అందరికన్నా ఎక్కువ మార్కులు తెచ్చుకుంటాను. అప్పుడు టీచర్ నాక్కూడా ఇలాంటి పెన్నుని బహుమతిగా ఇస్తారు!", అన్నాడు హుషారుగా.

"చందూ! నీకు ఆ అవకాశం ఇవ్వనుగా! ఈసారి పెన్ను నాదే. చూస్తూ ఉండు!", అంటూ గబగబా తన పుస్తకం తెరిచి చదవటం మొదలుపెట్టేసింది పద్మ అనే మరో విద్యార్థిని.

ప్రణతికి కూడా ఆ పెన్ను విపరీతంగా నచ్చేసింది!

‘ఆ పెన్ను నాకు దక్కాలంటే బాగా చదవటం ఒక్కటే మార్గం. కానీ, నేను బాగా చదివితే సరళా టీచర్ మాట నేను విన్నట్లవుతుంది! అప్పుడు నాకు సరళా టీచర్ ఇష్టమనీ, జయా టీచర్ ని నేను మర్చిపోయాననీ అందరూ అనుకునే అవకాశం ఉంది. కాబట్టి పెన్ను కోసం నేను వేరే ఏదైనా మార్గం చూడాలి!', అని అనుకుంటూ ఇల్లు చేరింది ప్రణతి.   

ఆ రోజు సాయంత్రం ప్రణతి తండ్రి సుశీల్ ఇంటికి రాగానే, "నాన్నా! నాకు ఒక ఖరీదైన పెన్ను కావాలి. అది నువ్వు ఈ రోజే నాకు కొనిపెట్టాలి!", అని పట్టుబట్టింది ప్రణతి.

"ప్రణతీ! నువ్వు అడుగుతున్న పెన్నును నీకు తప్పకుండా కొనిపెడతాను. అయితే ఒక షరతు. వచ్చే రెండు వారాల్లో నువ్వు ప్రతిరోజూ ఒక గంటసేపు నాతో కూర్చుని నీ పాఠాలు చదవాలి. నీకు అర్ధంకాని విషయాలు ఉంటే అవి నేను నీకు వివరించి అర్థమయ్యేటట్లు చెప్తాను. ఈ రెండు వారాలు నువ్వు నేను చెప్పినట్లు చేస్తే, అప్పుడు నీకు నేను ఆ పెన్నును కొనిపెడతాను", అన్నాడు సుశీల్.

తండ్రి మాట కాదనలేక సుశీల్ అడిగినదానికి సరేనంది ప్రణతి. సుశీల్ ప్రతిరోజూ ప్రణతి చేత పాఠాలు చదివించడం ప్రారంభించాడు. కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడంలో ఉన్న ఆనందాన్ని తెలుసుకుంది ప్రణతి. దాంతో ప్రణతికి బడిలో సరళ చెబుతున్న పాఠాలు కూడా ఆసక్తిగా అనిపించసాగాయి. చూస్తూండగా రెండు వారాలు గడిచిపోయాయి! 

"ప్రణతీ! పెన్ను కొనుక్కోవడానికి వెడదాం రా!", అంటూ ప్రణతిని ఒక పెద్ద స్టేషనరీ షాపుకి తీసుకెళ్లాడు సుశీల్.

అక్కడ రకరకాల పెన్నులు వరుసగా పెట్టి ఉన్నాయి. వాటిలో అత్యంత చవకైనవి, అత్యంత ఖరీదైనవి కూడా ఉన్నాయి.

"నీకు కావలసిన పెన్ను ఎంచుకో!", అన్నాడు సుశీల్.

అన్ని అందమైన పెన్నుల్లో ఏ పెన్ను కొనుక్కోవాలో  ఓ పట్టాన తేల్చుకోలేకపోయింది ప్రణతి. షాపులో పెన్నులను చూస్తూ నడుస్తున్న ప్రణతికి కొద్ది దూరంలో ఒక బాబు ఏడుస్తూ కనిపించాడు. ఆ బాబు చెయ్యి పట్టుకుని సరళ నిలబడి ఉంది! సరళను చూసిన ప్రణతి ఉలిక్కిపడి చటుక్కున తన పక్కనే ఉన్న ఒక పుస్తకాల అర వెనుక దాక్కుని సరళవంక భయంగా చూడసాగింది.

అప్పుడు ప్రణతికి ఆ బాబు, "అమ్మా! నాకు ఆ బంగారు రంగు పెన్ను ఎలాగైనా కావాలి. మనం మూడు నెలల క్రితం ఇలాంటి పెన్ను కొన్నప్పుడు, ఈసారి నాకు కూడా అలాంటి పెన్నొకటి కొనిపెడతానని మాట ఇచ్చావు కదా? మరి ఇప్పుడు కుదరదని ఎందుకంటున్నావ్?", అని ఏడుపు గొంతుతో అంటూ ఉండటం వినిపించింది.

అందుకు సరళ ఆ బాబుతో, "బాబూ విఠల్! నీకు అంత ఖరీదైన పెన్ను కొనిపెట్టగలిగే స్థోమత నాకు లేదు. నేను ఎక్కువ జీతం వస్తుందన్న ఉద్దేశంతో ఆ ప్రైవేటు పాఠశాలలో టీచరుగా చేరానని నీకు తెలుసు కదా! మరి నేను నా ఉద్యోగానికి న్యాయం చెయ్యాలంటే నా దగ్గర చదువుతున్న పిల్లలకు మంచి చదువుతోపాటు మంచి మార్కులు వచ్చేలా చూడాలి. చదువు విషయంలో వాళ్ళను ప్రోత్సహించాలంటే వాళ్ళు పడిన కష్టాన్ని గుర్తిస్తూ నేను వారికి ఏదైనా బహుమతిని ఇవ్వాలి. నాకున్నదాంట్లో నేను ఇవ్వగలిగే మంచి బహుమతులు ఈ పెన్నులే. మీ నాన్నగారి ఆరోగ్యం బాగుండి, ఆయన ఏదైనా ఉద్యోగం చేస్తూ ఉండి ఉంటే నేను నువ్వడిగినవన్నీ కొనిపెట్టగలిగి ఉండేదాన్ని. నిన్ను ఏ లోటూ లేకుండా పెంచగలిగేదాన్ని. అర్ధం చేసుకోరా నాన్నా!", అంటూ తన చీర కొంగుతో కన్నీళ్లను అద్దుకుంది.

సరళ మాటలు విన్న ప్రణతికి సరళ పరిస్థితి పూర్తిగా అర్ధమైంది.

"సరే అమ్మా! పెన్నుకోసం నేను ఇంకొన్ని రోజులు ఆగుతానులే!", అన్నాడు విఠల్ సరళను కౌగిలించుకుంటూ.

"నా చిట్టి తండ్రి ఎప్పుడూ నా మాట కాదనడు! ఒక్కొక్కప్పుడు పక్కవారి అవసరం కోసమో లేక వారిని సంతోషపరచడం కోసమో మనకు ఇష్టమైనది వదులుకోవలసి వస్తుంది. చూడటానికి ఈ పని కష్టంగానే అనిపించినా, ఆ త్యాగంవల్ల అవతలివారికి కలుగుతున్న ప్రయోజనం కానీ లేక వారు పొందుతున్న ఆనందం కానీ ఒక్కసారి గమనించినట్లయితే, ఇష్టమైనదాన్ని వదులుతున్నామన్న బాధ మనకు ఉండదు! సరికదా, నిస్వార్ధంగా చేసిన అటువంటి పనులవల్ల మనకు అంతులేని సంతృప్తి, ఆత్మానందం వంటివి కలుగుతాయి. అటువంటి మంచి మనస్తత్వం నువ్వు అలవరచుకుంటే, నలుగురికీ ఉపకారం చెయ్యగలుగుతావు. నలుగురిలో మంచిపేరు తెచ్చుకోగలుగుతావు!", అంటూ విఠల్ ను ఆప్యాయంగా ముద్దు పెట్టుకుంది సరళ.

ఈ సంఘటన, సరళపై ప్రణతికున్న అభిప్రాయంలో ఒక మంచి మార్పును తీసుకుని వచ్చింది.

"నాన్నా! నాకు పెన్ను వద్దులే!", అని సుశీల్ కి చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్లి కారులో కూర్చుంది ప్రణతి.

కూతురు ప్రవర్తనను చూసి ఆశ్చర్యపోతూ ఇంటికి చేరుకున్నాడు సుశీల్. మళ్ళీ పరీక్షలొచ్చాయి. ఈసారి ఎంతో శ్రద్ధతో చదివిన ప్రణతి పరీక్షలు బాగా రాసి అందరికన్నా ఎక్కువ మార్కులు తెచ్చుకుంది. సరళ ప్రణతిని మెచ్చుకుంటూ ఖరీదైన బంగారు రంగు పెన్నును ప్రణతికి బహుమతిగా ఇచ్చింది. ప్రణతి ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. బడి అయిపోగానే ప్రణతిని ఇంటికి తీసుకెళ్లడానికి వచ్చిన సుశీల్ కు తన బహుమతిని మురిసిపోతూ చూపించింది ప్రణతి.

"నా బంగారుతల్లికి అభినందనలు!!", అంటూ ప్రణతిని కౌగలించుకున్నాడు సుశీల్.

అంతలో ప్రణతికి బడిలోకి వెడుతూ విఠల్ కనిపించాడు. 

ప్రణతి ఒక్క క్షణం ఆలోచించి, "విఠల్! ఒక్క నిమిషం ఆగు!", అంటూ సుశీల్ చెయ్యి పట్టుకుని విఠల్ వద్దకు వెళ్ళింది. ఏమిటని అడిగాడు విఠల్.

"విఠల్! నిన్న నీ పుట్టినరోజని సరళా టీచర్ చెప్పారు. ఇదిగో! ఇది నేను నీకిస్తున్న పుట్టినరోజు కానుక. తీసుకో!", అంటూ తన చేతిలోని బంగారు రంగు పెన్నును విఠల్ చేతిలో సంతోషంగా పెట్టింది ప్రణతి. విఠల్ ముఖం ఆనందంతో వెలిగిపోయింది.

"ప్రణతీ! అది నీకు నేనిచ్చిన బహుమతి కదా! వాడికెందుకిస్తున్నావు?", ఆశ్చర్యంగా అడిగింది అప్పుడే అక్కడికొచ్చిన సరళ.

"టీచర్! నేను విఠల్ కి ఈ పెన్నుని పుట్టినరోజు కానుకగా ఇవ్వాలని ముందే అనుకున్నాను. రాబోయే పరీక్షల్లో కూడా నేను అందరికన్నా ఎక్కువ మార్కులు సంపాదించి మరొక పెన్నుని మీనుండీ బహుమతిగా తీసుకుంటాను. ఆ నమ్మకం నాకుంది టీచర్! మరి నేను వెళ్ళొస్తానూ!", అని నవ్వుతూ సరళకు సమాధానం చెప్పి, సుశీల్ తో ఇల్లు చేరుకుంది ప్రణతి.

ప్రణతి చేసిన మంచి పని గురించి సుశీల్ గర్వంగా సుకన్యకు చెప్పాడు.

సుకన్య సంతోషంతో ప్రణతిని ముద్దాడి, "నా బంగారు తల్లి! నీకు ఇంత మంచి ఆలోచన ఎవరిచ్చారూ?", అని అడిగింది.

"ఒకరి సంతోషం కోసం మనకున్నదాన్ని ఇవ్వగలగాలన్న విషయం మా కొత్త టీచర్ నేర్పించారమ్మా! నువ్వు చెప్పినట్లు మా సరళా టీచర్ కూడా జయా టీచర్ అంత మంచివారు!!", అంటూ సుకన్యకు బదులిచ్చింది ప్రణతి ఉత్సాహంగా.

 

*****

No comments:

Post a Comment

Pages