కష్టే ఫలి - అచ్చంగా తెలుగు

 కష్టే ఫలి 

సి.హెచ్.ప్రతాప్ 




రామయ్య , సోమయ్య   చిన్ననాటి స్నేహితులు. కలిసి మెలిసి తిరుగుతూ ఎంతో అన్నోన్యంగా     పెరిగారు. ఒకేసారి ఇద్దరికి పెళ్ళిళ్ళు కూడా జరిగాయి. చివరకు తమ తండ్రుల నుండి వ్యవసాయ వృత్తి స్వీకరించారు. ఇద్దరివి పక్క పక్కల ఇళ్ళే కాక  పొలాలు కూడా పక్కనే వుండేవి. అయితే ఇద్దరి స్వభావాలలో ఎంతో తేడా వుండేది. రామయ్యది స్వతాహాగా కష్టపడే మనస్తత్వం. తండ్రి నుండి సంక్రమించిన రెండెకరాల పొలం, పది సెంట్ల జాగాలో కట్టిన చిన్న పెంకుటిల్లును జాగ్రత్తగా సంరక్షించుకోవడమే కాక  వచ్చే ఆదాయానికి తగ్గటుగానే ఖర్చుకు కూడా వుండేలా జాగ్రత్త పడేవాడు. ముఖ్యంగా   తాము పెంచుకుంటున్న ఎడ్ల జంటను ఎంతో బాగా సంరక్షించుకుంటుండేవాడు. సూర్యోదయానికి ముందే లేచి, ఎడ్లను శుభ్రంగా స్నానం చేయించి, చక్కగా అలంకారం చేసి, కడుపు నిండుగా కుడితి పెట్టేవాడు. తమ వ్యవసాయ వృత్తికి ముఖ్యమైనవి ఈ జత ఎడ్ళే  కాబట్టి వాటిని కంటికి రెప్పలా చూసుకునేవాడు. ఎప్పుడైనా వాటికి సుస్తీ చేస్తే, ఊళ్ళోని పశువైద్యుడికి వెంటనే చూపించి చికిత్స చేయించేవాడు. వాటిని పశువుల లా కాకుండా   తన ఇంట్లోని కుటుంబ సభ్యుల కింద భావించేవాడు.

ఇక సోమయ్య ది విరుద్ధమైన స్వభావం. చిన్నప్పటి నుండి తల్లిదండ్రుల గారాబం వలన చదువు సరిగ్గా అబ్బలేదు. ఏ పని పాటా చెయ్యకుండా తల్లిదండ్రులు సమకూర్చిన వాటితో హాయిగా,జల్సా చేసేవాడు. తండ్రి నుండి సంక్రమించిన వ్యవసాయ వృత్తిని కూడా శ్రద్ధతో చేసేవాడు కాదు. ఎప్పుడో ఎనిమిది గంటలకు బద్ధకంగా నిద్ర లేచి , సుష్టుగా భోజనం చేసి పొలానికి తన జత ఏడ్లను తోలుకెళ్ళే వాడు. వాటికి కూడా ఏ రకమైన సంరక్షణ వుండేది కాదు. సరైన వేళకు తిండి కూడా పెట్టకుండా, పైపెచ్చు వాటి చేత గొడ్డు చాకిరి చేయిస్తుండడంతో అవి బాగా శుష్కించిపోయినట్లు వుండేవి.

ఒక సమయంలో సోమయ్య   ఎడ్లకు బాగా జబ్బు చేసి కొద్దిపాటి పని కూడా చెయ్యలేకపోయాయి. ఆ ఉర్లోని పశువైద్యుడు వాటిని పరీక్షించి బలవర్ధక ఆహారం ఇచ్చి కనీసం మూడు నెలలపాటు విశ్రాంతి ఇస్తేనే గాని వాటికి పూర్వంలా అరోగ్యం గా వుండడం కష్టమని తేల్చి చెప్పేసాడు.

జీవచ్చవాల్లా తయారయిన ఆ ఏడ్లను ఊరికే కూర్చోబెట్టి మేపడం శుద్ధ దండగ అని సోమయ్య   వాటిని కబేళాకు అమ్మేసాడు. పట్నం లో అప్పుడే అమ్మకానికి వచ్చిన ఒక ట్త్రాక్టరును కొని తీసుకువచ్చి దానితో పొలం పనులు చేసుకోసాగాడు.
ఇంతకాలం యజమానికి ఎంతో విశ్వాసపాత్రంగా సేవ చేసిన ఆ ఎడ్లను కబేళాకు అమ్మేయ్యడం రామయ్యను ఎంతో బాధించింది. వెంటనే వెళ్ళి సోమయ్య   అమ్మినదానికి రెండింతలు ఇచ్చి తిరిగి ఆ రోగగ్రస్తపు ఎడ్లను కొని, ఇంటికి తీసుకువచ్చి తన జత ఎడ్లతో పాటు జాగ్రత్తగా చూసుకోసాగాడు. రామయ్య చేసిన ఈ పని చూసి సోమయ్య   అదంతా ఒట్టి చాదస్తం అని నవ్వుకున్నాడు.పైగా దమ్మిడీ ఉపయోగంలేని వాటిని దయ, కరుణ అంటూ పనికిరాని చాదస్తంతో పోషించడం అవివేకం అని మిత్రుడికి ఉపదేశం చేసాడు.

అయితే రామయ్య ఇవ్వన్నీ పట్టీంచుకోకుండా ఆ ఎడ్లకు మంచిగా వైద్యం చేయించి, వేళకు తిండి పెడుతుండడంతో రెండు నెలల్లోనే తిరిగి కోలుకొని, రామయ్యకు పొలం పనులలో సహాయపడసాగాయి.
 
ఆ సంవత్సరం మంచి వర్షాలు పడ్డాయి. రామయ్య చక్కని ప్రణాళికతో పొలం దున్ని, విత్తనాలను వేసి, పొలాన్ని చక్కగా సంరక్షించుకున్నాడు. పూర్తిగా సేంద్రీయ పద్దతులలో వ్యవసాయం చేసినందున రామయ్య పొలంలో బంగారం పండింది. నాణ్యత వున్న ఉత్పత్తులు కాబట్టి బజారులో మంచి ధర పలికి మంచి లాభాలు వచ్చాయి.

ఇక సోమయ్య కు ఏమీ కలిసిరాలేదు. ముందస్తు ప్రణాళిక అంటూ ఏమిలేకపోవడం వలన వ్యవసాయం అనుకున్నట్లుగా ఫలప్రదం కాలేదు. ట్రాక్టరుకు సరైన నిర్వహణ లేని కారణం గా మూలబడింది. రిపేరుకుఎంతో డబ్బు ఖర్చు చేయాల్సి వచ్చింది. అతడి నోటి దురుసు స్వభావం వలన ఆ ఊర్లో మిగితా రైతులెవ్వరూ సహాయం చేయడానికి ముందుకు రాలేదు. సమయానికి పొలం దున్నే పనులు పూర్తవక విత్తనాలు నాటే పని కూడా ఆలస్యమయ్యింది. పైగా పొలం పనులను జీతగాళ్ళపై వదిలేసి కుటుంబ సభ్యులతో పట్నంలో షికార్లకు తిరిగేవాడు.ఇక సరైన సంరక్షణ లేని కారణం గా పంటకు తెగులు సోకి పాడైపోయింది.

ఆ సంవత్సరం సోమయ్యకు పెట్టుబడి కూడా రావడం గగనమైపోయింది. అప్పులపాలవగా రామయ్యే తనకు వీలయినంతగా ధన సహాయం చేసి సొమయ్యను ఆదుకున్నాడు.

"అంతా నా దురదృష్టం.జాతక స్థితి బాగా లేకపోవడం వలనే ఉన్నదంతా ఊడ్చుకుపోయి అప్పులపాలయ్యాను." అంటూ తన అక్కసు అంతా రామయ్య దగ్గర వెళ్ళబోసుకున్నాడు సోమయ్య.

" ఇందులో అదృష్టం, దురదృష్టం ప్రసక్తి ఏముంది సోమయ్యా? జీవితం అంతా కర్మ సిద్ధాంతం మీదే నడుస్తుంది.ఎవరు చేసుకున్న కర్మలకు బాధ్యత వహించడం తో పాటు వాటి ఫలితాలను కూడా అనుభవించకతప్పదు.   మనం నాటిన విత్తనాల పంట మనమే తినాల్సి వస్తుంది.నువ్వు మొదటి నుండి కష్టపడడం అలవాటు చేసుకోలేదు.జీవితాన్ని చాలా సుళువుగా తీసుకున్నావు. ప్రతీదానిని లాభనష్టాల కోణం నుండి చూసి ఆఖరుకు నిన్నే నమ్ముకొని రాత్రి పగలు నీ కోసం తమ జీవితం త్యాగం చేసిన నీ ఎద్దులను కూడా మానవత్వం మరిచిపోయి కబేళాకు అమ్మేసావు. కష్టించి పనిచేసేవాడికి జీవితమే అదృష్టం రూపంలో మంచి ఫలితాలు ఇస్తుంది. నీ చర్యలకు ప్రతిచర్యలే కష్టాల రూపం లో తిరిగి నీ దగ్గరకు వచ్చాయి. ఇకనైనా నీ దృక్పధం మార్చుకో. కష్టపడి పనిచేస్తే అందుకు ప్రతిఫలం తప్పక నీకు అందుతుంది" అని హితబోధ చేసాడు రామయ్య.

స్నేహితుడి మాటలను బాగా ఒంటబట్టించుకుని ఆనాటినుండి కష్టపడుతూ జీవితంలో మంచి ఫలితాలను అందుకున్నాడు సోమయ్య.


***


No comments:

Post a Comment

Pages