అత్తగారి కళ్ళద్దాలు - అచ్చంగా తెలుగు

 అత్తగారి కళ్ళద్దాలు

- శ్యాంప్రసాద్ రెడ్డి కోర్శిపాటి


“కళ్ళు మసకలుగా ఉండాయ్. నేను కళ్ళు చూపించుకోవాల నాయనా. డాక్టర్ దగ్గర చూపించుకుని కళ్ళద్దాలు తీసుకోవాల. డాక్టర్ దగ్గరికి ఎప్పుడు దీసకపోతావా?" మా అత్తగారు ఈమధ్య అప్పుడప్పుడూ అడుగుతూ ఉన్నారు. సరే ఒకరోజు తీరిక చేసుకుని మేము రెగ్యులర్ గా చూపించుకునే ఓ కంటి డాక్టర్ దగ్గరకు ఆమెను ఆటోలో తీసుకెళ్ళాను. నాకు తెలిసి నెల్లూరులో ఉన్న కంటి డాక్టర్లలో ఆయన అనుభవజ్ఞుడు, కమర్షియల్ కాదు కూడా. అందుకే నేను, మా ఆవిడ, మా అమ్మ రెగ్యులర్ గా అక్కడే చూపించుకుంటాం. మధ్యలో మా చిన్నబ్బాయికి ప్రాబ్లం వస్తే కూడా ఆయనే ట్రీట్ చేశారు.

డాక్టర్ దగ్గరకు వెళ్ళగానే ముందుగా రిసెప్షన్ లో ఓ 300 కన్సల్టేషన్ తీసుకున్నారు. లోపలికెళ్ళాక ఆయన మా అత్త గారిని క్షుణ్ణంగా పరిపరివిధాల పరీక్షించారు. అనేక లెన్సులు పెట్టి "ఇప్పుడెలా కనిపిస్తోంది? ఇప్పుడెలా కనిపిస్తోంది?" అంటూ ప్రశ్నించారు. ఆమె "ఇది మసకగా ఉంది, ఇదసలు కనిపించడం లేదు" అంటూ.... ఒక దగ్గర "ఆ... ఇప్పుడు బాగా కనిపిస్తా ఉంది నాయనా" అంది. డాక్టర్ గారు వెంటనే "అయితే నీకు అద్దాలు అవసరం లేదమ్మా. నీకు బాగానే కనిపిస్తా ఉంది. అంతగా కావాలంటే కంట్లో మందు రాసిస్తా. తీసుకుని వాడు. ఏదైనా ప్రాబ్లం ఉంటే క్లియర్ అయిపోతుంది." అన్నారు. డాక్టర్ సమాధానానికి మా అత్తగారి అసంతృప్తి ఆమె ముఖంలో స్పష్టంగా కనిపిస్తోంది. " అదేందయ్యా నేను కళ్ళు సదరంగా కనిపీక అద్దాలు తీసుకుందామని వస్తే నువ్విట్ట జెప్తుండావా?" అంటూ తన అసంతృప్తిని మాటల్లో కూడా వెళ్లగక్కింది. డాక్టర్ నా వైపు నిస్సహాయంగా చూశారు. నేనే ఆమెకు చిన్నగా నచ్చజెప్పి బయట కూర్చోబెట్టి డాక్టర్ దగ్గరికి వచ్చాను. "సార్ ఆమె కళ్ళు కనిపించడం లేదంటోంది. మీరేమో ఆమెకు ప్రాబ్లమే లేదంటున్నారు. నాకేం అర్థం కావటం లేద్సార్..." అన్నాను ఆయనతో నాకున్న పూర్వ పరిచయం కొద్దీ. ఆయన తన ఎదురుగా ఉన్న కుర్చీలో నన్ను కూర్చోమన్నట్టుగా సైగ చేశారు. ఆయన పక్కనే అంతకుముందు మా అత్తగారికి టెస్ట్ చేసిన లెన్స్ వరుసగా ఉన్నాయి. చివరిగా మా అత్తగారు బాగా కనిపిస్తోంది అని చెప్పిన లెన్సు, ఆ పరీక్షించే కళ్ళద్దాల వంటి పరికరంలోనే ఉన్నాయి. అవి రెండూ చేతిలోకి తీసుకుని నాకు చూపిస్తూ "ఇదిగో ఆ పెద్దావిడ బాగా కనిపిస్తున్నాయన్నది ఈ లెన్స్ పెట్టినప్పుడే కదా?" అని నన్ను ప్రశ్నించారు. నేను అవునన్నట్టు తలూపాను. ఆయన ఒక లెన్స్ నా చేతికిచ్చారు. చేతిలో ఉన్న మరో లెన్స్ రంధ్రంలో వేలు పెట్టారు. "నీ చేతిలో ఉన్నది కూడా ఇలాంటిదే ఓ సారి చూడు..." అన్నారు. నేను కూడా ఆయన పెట్టినట్టే ఆ లెన్స్ రంధ్రంలో వేలు పెట్టాను. ఆశ్చర్యం నా వేలు కూడా ఆ రంధ్రంలో ఇటు నుంచి అటు దూరిపోయింది. అంటే ఆ లెన్స్ కి అసలు అద్దమే లేదన్నమాట. ఏ అద్దమూ లేని ఖాళీ రంధ్రంలోంచి మా అత్త గారికి బహు చక్కగా కనిపిస్తోందన్నమాట. అంటే సమస్య లేదనేగా? వస్తున్న నవ్వుని బలవంతంగా ఆపుకుని డాక్టర్ గదిలోంచి బయటపడ్డాను. నేను బయటకు వచ్చేటప్పటికి " అద్దాలు తీసుకుందామని వస్తే నీకసలు అవసరమే లేదంటాడేందయ్యా ఈ డాక్టరా? ఈనేం డాక్టరా?" అంటోంది మా అత్తగారు. ఆమెకెలాగో నచ్చజెప్పి ఆటో ఎక్కించుకుని ఇంటికి బయల్దేరాను. "అయినా ఈడేం డాక్టరయ్యా.... భలే డాక్టర్ దగ్గరకి తీసుకొచ్చావా.... అనాసరంగా 300 తీసుకున్నాడా " అంటూ దారి పొడుగూతా తిడుతూనే ఉంది. "ఇలాంటి పేషెంట్లని పరీక్షించటం డాక్టర్లకే పరీక్ష." అనిపించింది నాకు. మొత్తానికి ఇప్పటికీ... కళ్ళద్దాలు పెట్టుకోవాలనే మా అత్తగారి కోరిక తీరనేలేదు.

***

No comments:

Post a Comment

Pages