చంద్రమణి కోట రహస్యం (అనువాద నవల) - 20 - అచ్చంగా తెలుగు

చంద్రమణి కోట రహస్యం (అనువాద నవల) - 20

Share This

చంద్రమణి కోట రహస్యం (అనువాద నవల) - 20

అనువాదం : గొర్తి వేంకట సోమనాథ శాస్త్రి (సోమసుధ)
ఆంగ్ల మూలం : The moonstone castle mistery 
నవలా రచయిత : Carolyn Keene
 



(అమీ ద్వారా జోడీ ఆరంస్డ్రాంగ్ గురించి తెలుసుకున్న ముగ్గురు అమ్మాయిలు ఆమెను చూడటానికి వెళ్తారు. వారికి జోడీ తల్లి ఆమెను తాము దత్తత తీసుకున్నామని, మూడేళ్ళ వయసులో తనను ఎవరో అనాధ శరణాలయం దగ్గర వదిలిపెట్టినట్లు విన్నామని చెబుతుంది. పియానో పైన జోడీ ఫొటోని చూస్తారు.  తన చిన్నతనం ఫొటోలు అటక మూద ఉన్నాయని ఆమె తల్లి చెబుతుంది.  అక్కడ నుండి ఆసుపత్రికి చేరుకున్న ముగ్గురికి వీలర్ని ఎవరో కిడ్నాప్ చేసినట్లు తెలిసింది.  తరువాత.....)
@@@@@@@@౧

 తక్షణం వాళ్ళంతా నాన్సీని చుట్టుముట్టి ప్రశ్నలతో ముంచెత్తారు.   
 అసలేమి జరిగిందో తనకేమీ తెలియదని ఆమె చెప్పింది.  "గతరాత్రి అతనికి పడవ ప్రమాదం జరిగినప్పుడు నేను మిస్టర్ వీలర్ తోనే ఉన్నాను."

  "అతని ప్రాణాన్ని కాపాడిన అమ్మాయివి నువ్వేనా?" డాక్టర్లలో ఒకడు అడిగాడు.

  నాన్సీ బుగ్గలు ఎరుపెక్కాయి.  "అక్కడ నిలబడ్డ నా స్నేహితురాలు, నేను కాపాడాం" అంటూ బెస్ తో పాటు ముందుకు రమ్మని జార్జ్ కి చేతితో సైగ చేసింది.  

  వీలర్ ఆసుపత్రినుంచి మాయమయ్యాడని వాళ్ళు కూడా విని చకితులయ్యారు.

నర్సుల్లో ఒకామె వివరంగా చెప్పింది, "ఇదంతా విజిటింగ్ హవర్స్ ప్రారంభమయ్యే ముందే జరిగిపోయింది" అందామె. "మిస్టర్ వీలర్ ఉన్న మూడవ అంతస్తులోనే బాగా జబ్బు పడిన  రోగి ఉంది.  విధుల్లో ఉన్న నర్సులంతా కొంతసేపు అక్కడ ఆ మహిళ గదిలోనే ఉన్నారు.  అంచెలంచెలుగా అసలు కథ మాకు తెలిసింది.  ఆసుపత్రి పనివాడి దుస్తుల్లో ఉన్న ఒక మగవాడు, నర్సు వేషంలో ఉన్న ఒక స్త్రీ లోపలకు వచ్చారు.  మిస్టర్ వీలర్ని శస్త్రచికిత్సకు తీసుకెళ్ళే శకటం పైన ఉంచి, లిఫ్టులో  గ్రౌండ్ ఫ్లోరుకి చేర్చారు.  అక్కడ వారు అతన్ని చక్రాల కుర్చీలోకి మార్చి, ఆ పైన కారులో తీసుకెళ్ళి ఉండాలి."

  "ఎంత దారుణం!" బెస్ ఆశ్చర్యపోయింది.  

  "అతను కేకలు పెట్టడం కానీ, ప్రతిఘటించటం కానీ చేయలేదా?" నాన్సీ ప్రశ్నించింది.

  "మిస్టర్ వీలర్ అర్ధ స్పృహలో మాత్రమే ఉన్నాడు"  నర్సు బదులిచ్చింది.  "మేమతన్ని ఒంటరిగా వదిలేసినప్పుడు పక్క మీదనుంచి పొర్లి పడిపోకుండా  రక్షణ కోసం, అతనికి యిరుపక్కలా మంచంపై సైడ్ గార్డులను ఉంచాం."

  ఒక పోలీసు నాన్సీని, ఆమె స్నేహితురాళ్ళను అపహర్తలెవరై(కిడ్నాపర్లు) ఉంటారో ఒక క్లూ యిమ్మని అడిగాడు.  

  "నాకు తెలియదు" అని నాన్సీ బదులిచ్చింది.  "మేము ఈ పట్టణానికి కొత్త.  సెలవుల్లో విహారయాత్రకని వచ్చి లాంగ్ వ్యూ మోటెల్లో ఉంటున్నాం.  గతరాత్రి మేము వెళ్ళిన ఒక పార్టీకి మిస్టర్ వీలర్ కూడా హాజరయ్యారు.  పార్టీ అయ్యాక నన్ను, జార్జ్ ని తన పడవలో బయటకు తీసుకెళ్ళారు."

   "ఆ ప్రయాణం దారుణమైన ప్రమాదంతో ముగిసింది" జార్జ్ జోడించింది.  

  వీలర్ సంరక్షణ కోసం నియోగింపబడిన నర్సుల్లో ఎవరితోనైనా తాను మాట్లాడటానికి అనుమతి కోరింది నాన్సీ.  అతని సంరక్షణను చూసుకొన్న వారిలో ఒక నర్సు మాత్రమే ప్రస్తుతానికి అందుబాటులో ఉందని, మూడవ అంతస్తుని చూసుకొనే ఆమె పేరు స్ట్రాఫ్ అని ఆమెకు చెప్పారు.  కానీ నాన్సీ ఆమె వద్దకు వెళ్ళి  మాట్లాడుదామని ఆహ్వానించింది.  

   ఆ నర్సు దయాహృదయం గల మధ్య వయస్కురాలు. ఈ కిడ్నాప్ వ్యవహారానికి తాను చాలా భయపడిపోయానని, అసలా పని ఎలా జరిగిందో కూడా తనకు అర్ధం కావటం లేదని ఆమె చెప్పింది.  "మేమంతా అనుకొన్నదాని కన్నా ఎక్కువసేపు ఆ రోగిష్టి మహిళ దగ్గర ఉండిపోయామనుకొంటాను."

  "త్వరలోనే అధికారులు అతని ఆచూకీ తెలుసుకొంటారని నేను ఆశిస్తున్నాను" అంది నాన్సీ.  "మిస్టర్ వీలర్ నాకు అంత బాగా తెలియదు.  తనకి పరిచయం ఉన్న వ్యక్తిని చూపించటానికి నన్ను నది అవతలకి తీసుకెళ్తున్నారు.  ఆ వ్యక్తి పేరేమిటో నాకు తెలియదు,  కానీ అతని గురించి తెలుసుకోవాలని నాకు ఆసక్తి ఉంది.  మిస్టర్ వీలర్ మగతలో ఉన్నప్పుడు ఎప్పుడైనా మాట్లాడారా?" 

  "ఓ! అవును.  ఆయన చాలా విషయాలు గొణిగారు" మిసెస్ స్ట్రాఫ్ బదులిచ్చింది.  "చాలా విషయాలు నాకు అర్ధం కాలేదు.  కానీ మీరు తెలుసుకోవాలనుకొన్న వ్యక్తి పేరు కావచ్చు, పదే పదే వల్లించేవారు.  అది పీటర్ జుడ్.  నేను అతని గురించి ఎప్పుడూ వినలేదు. "  

   "ఆ వ్యక్తి అతనే అయి ఉండొచ్చు" అంది నాన్సీ.  సమాచారం యిచ్చినందుకు ఆ మహిళకు ధన్యవాదాలు చెప్పింది.  

  తరువాత అమ్మాయిలు ఆసుపత్రిని విడిచిపెట్టారు.  తిరిగి వాళ్ళు మరొకసారి రోడ్డు మీదకు రాగానే, నాన్సీ నవ్వింది.

  "పీటర్ జుడ్ ఎవరో మిసెస్ హేంస్టెడ్ కి తెలుసునని పందెం!" అంది నాన్సీ. 

  బెస్, జార్జ్ ముసిముసి నవ్వులు నవ్వారు.  అమ్మాయిలంతా బ్రాస్ కెటిల్ వైపు తిరిగారు.

"మనం పెందరాళే భోజనం చేద్దాం" నాన్సీ వ్యాఖ్యానించింది.  "మనం మొదట  మిసెస్ హేంస్టెడ్ ని కలుద్దాం.  గుర్తుంచుకోండి.  మీరు నన్ను ఐరిన్ అని పిలవాలి."

  "ఓహ్! అవును కదా!" అంది బెస్.  "మాకు దారి చూపించు ఐరిన్ ఇంబ్రక్!" 

  ముగ్గురు స్నేహితులు టీ రూం ద్వారం గుండా లోనికి నడిచారు.  ఎప్పటిలాగే, మిసెస్ హేంస్టెడ్ ఊగుడు కుర్చీలో కూర్చుని ఉంది.   ఆమె మెడ చుట్టూ సన్నని బట్టతో అల్లిన కాలరు గల అదే నలుపు రంగు దుస్తులేసుకొంది.  అమ్మాయిలను చూసిన వెంటనే ముడతలు పడిన ఆమె ముఖం చిరునవ్వుతో విప్పారింది.  అలవాటైన ఉచ్ఛస్వరంలో "నాన్సీ డ్రూ, గూఢచారి, ఎలా ఉన్నారు?" అని అడిగింది. 

@@@@@@@@@@@@

కానీ ఈసారి నాన్సీ ప్రయత్నం సఫలం కాలేదు. . .మిసెస్ హేంస్టెడ్ కుశలప్రశ్న ఆమెకు బాగా దిగ్భ్రమ కల్గించింది.  
    
   "అంటే మీరు నన్ను కనిపెట్టారు" ఒక్క క్షణం తరువాత నాన్సీ అంది.  "మీకెవరు చెప్పారు?"  

  ముసలామె మెల్లిగా తలాడించింది.  "నాకు తెలియదు.  ఈరోజు టపాలో అనామకుడెవడో వ్రాసిన చీటి వచ్చింది."

    తను కట్టుకొన్న బట్టలోని జేబులోంచి మడత పెట్టిన కాగితాన్ని మిసెస్ హేంస్టెడ్ బయటకు లాగింది.  దాన్ని ఆమె నాన్సీ చేతికిచ్చింది.  దానిపై ముద్రించబడిన సందేశాన్ని చదవటానికి జార్జ్, బెస్ ఆమె దగ్గరకు వచ్చారు.  ఆ సందేశం చిన్నగాను, విషయం సూటిగాను ఉంది : "మోసపోవద్దు.  తన పేరు ఇరేన్ ఇన్స్బ్రక్ అని చెప్పుకొంటున్న అమ్మాయి అసలు పేరు నాన్సీ డ్రూ.  ఆమె ఒక గూఢచారి.  ఆమెతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి, లేదంటే సమస్యల్లో యిరుక్కొంటారు."  

  బెస్ ఊపిరిని ఎగబీల్చింది.  "ఈ అనామక ఉత్తరాలు వ్రాసేవాళ్ళను నేను ద్వేషిస్తాను.  దీన్ని వ్రాసిన వ్యక్తి బహిరంగంగా మీ దగ్గరకు వచ్చి మీతో ఎందుకు చెప్పకూడదు?" 

  మిసెస్ హేంస్టెడ్ కి కోపం తన్నుకొచ్చింది.  "నాకెలా తెలుస్తుంది?" అరుస్తున్నట్లుగా అడిగింది.    

  నాన్సీకి ఒక విషయం ఖచ్చితమనిపించింది. . . .ఇకపై నాన్సీతో మాట్లాడకుండా మిసెస్ హేంస్టెడ్ ని భయపెట్టాలన్న ప్రగాఢమైన లక్ష్యంతోనే అతనెవడో ఈ చీటిని పంపాడు.  "కానీ దీనిలో అతను విజయవంతమయ్యే అవకాశం లేదు" అని నాన్సీ దృఢమైన సంకల్పంతో తనలో అనుకొంది.  

   ఆమె నిట్టూర్చి పైకి యిలా చెప్పింది "సరె, మిసెస్ హేంస్టెడ్! ఇప్పుడు,నా ఊహ ప్రకారం, నా గుర్తింపు తెలిపే ఈ రహస్యాన్ని మీరు మిస్టర్ సీమన్ కి తెలియజేస్తారా?"

వెంటనే వృద్ధురాలు జవాబివ్వలేదు.  బహుశా ఆమెను హెచ్చరిస్తూ వచ్చిన చీటీకి కొద్దిగా భయం పట్టుకొన్నట్లుంది.  ఇకపై అమ్మాయిలు యింకా ఏదైనా తెలుసుకోవాలంటే, మిసెస్ హేంస్టెడ్ తో కొద్దిగా బేరసారాలు ఆడాలని నాన్సీ నిర్ణయించుకొంది.  

  "ఈ ఉదయం నేనిప్పుడే మీ పట్టణంలో ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగిందని తెలుసుకొన్నాను" నవ్వుతూ చెప్పిందామె.  

  వెంటనే ముసలామె ఆశగా ముందుకు వంగింది.  "అదేమిటి?" అని ఆసక్తిగా అడిగింది.  

  "ఓహ్! నేను కూడా రహస్యాలను దాచగలను" అంటూ యువ గూఢచారి నవ్వింది.  

  శ్రీమతి హేంస్టెడ్ ముఖాన్ని చిట్లిస్తూ, ఊగే కుర్చీలో కొన్ని సెకన్లపాటు కోపంతో ముందుకు, వెనక్కు ఊగింది.  చివరకు ఆమె ఆగింది.  

  "అంటే మీరు నేను ఎవరన్నది కనిపెట్టారన్నమాట!" నాన్సీ పెద్ద గొంతుతో అడిగింది.  

   "మిస్టర్ సీమన్ కి ఈ విషయం చెబుతానో, లేదో నాకు తెలియదు" సూటిగా చెప్పిందామె.  "అతని గురించి మరింత తెలుసుకోవటానికి నువ్వు యిష్టపడతావని అనుకొంటున్నాను.  సరె! ఇంతవరకు చెప్పిన దాని కన్నా ఎక్కువ నీతో చెప్పలేను.  అతను చాలా సంవత్సరాలుగా యిక్కడకు వస్తున్నాడు.  వచ్చినప్పుడల్లా నా దగ్గర ఆగి, స్థానిక వార్తల గురించి నాతో మాట్లాడుతాడు.  అతను ఊర్లు తిరిగే వర్తకుడని నేను గుర్తించాను."  

 అతను డీప్ రివర్ చిరునామా కలవాడన్న వాస్తవాన్ని నాన్సీ బయటపెట్టలేదు.  ఎందుకంటే, మిసెస్ హేంస్టెడ్ ఆలోచన ప్రకారం అతను పొరుగూరినుంచి వస్తూంటాడు.  డ్రైవర్ లైసెన్సు తీసుకొన్నప్పుడు సీమన్ దొంగ చిరునామా యిచ్చాడని నాన్సీకి రూఢిగా తెలుసు.  మిసెస్ హేంస్టెడ్ కి హెచ్చరిక చీటీని అతనే వ్రాసాడా?  నాన్సీ చకితురాలైంది.

(సశేషం)

No comments:

Post a Comment

Pages