అనసూయ ఆరాటం - 14 - అచ్చంగా తెలుగు

అనసూయ ఆరాటం - 14 

చెన్నూరి సుదర్శన్  


ఇద్దరు చాయె తాక్కుంట ములుగు సంగతులు మాట్లకోబట్టిండ్లు. రవీందర్ వాడకట్టోల్లందరిని యాదికి చేసుకుంట వాల్ల బాగోగులు అడుగబట్టిండు. అనసూయ సంగతి వచ్చెటాల్లకు సురేందర్ తల్కాయె దించుకున్నడు. బయటికి పోదామని ఇశార చేసిండు. రవీందర్ సమఝ్ చేసుకున్నడు. చాయె తాగిన కోపులు చిన్న మేజ మీద పెట్టి ఇద్దరు కలిసి వాకిట్లకచ్చిండ్లు. ఇంటి ముందలున్న యాపచెట్టు గద్దె మీద కూకున్నరు. 

“అన్నయ్యా.. ఆదిరెడ్డికి ఇక్కడ ఏదైనా పని సూయించు. పాపం వాల్ల బతుకులు ఆగమైనై” అంటాంటే సురేందర్  కండ్లల్ల నీళ్ళు తిరిగినై. 

“ఎమైంది తమ్ముడూ.. ఆదిరెడ్డి పదోది పాసైండని మా నాయ్నకు ఫోన్ చేత్తే చెప్పిండు. అన్నట్టు చెప్పుడు మర్చిపోయిన. మా ఇంట్ల సుత ఫోను పెట్టిచ్చిన” అన్కుంట కీసలకెల్లి తన విజిటింగ్ కారటు తీసిచ్చిండు. అందుల ఫోను నంబరు సుత ఉన్నది. సురేందర్‌కు ములుగు దుకాన్ల ఫోన్ ఉన్నట్టు తెల్సుగాని రవీందర్ ఇంట్ల ఉన్నట్టు తెల్వది.

కారటు తీసుకొని జేబుల పెట్టుకున్నడు సురేందర్. 

రవీందర్ నాయ్న, సమ్మయ్య వాల్లు అన్న మాటలు.. అనసూయ గుడిసెలుంటాన సంగతి.. ఆదిరెడ్డి సైకిల్ షాపుల నౌకరి సంగతి.. అంతా  కుల్లం కుల్లం చెప్పిండు.

రవీందర్ పానం కలి కలి అయ్యింది. ”తమ్ముడూ.. తప్పకుండా ఆదిరెడ్డికి ఏదైనా పనిప్పిత్త. అనసూయ అక్కకు టీ.బీ. ఉన్నాయనను కట్టుకొని తన బతుకు శాన అన్నాలం చేసుకున్నది. నువ్వు గుడిసె దొరింపు చేసుడు.. శాన మంచి పని. నేను సుత నావంతు సాయం చేత్త” అని మాటిచ్చిండు. 

ఇంతల వీపు మీద పుత్తకాల సంచులేసుకొని ఇద్దరు పొలగాండ్లు ఉర్కుంట వత్తాండు. వాల్లను సూసి దగ్గరికి రమ్మన్నడు రవీందర్. వాల్లు బిక్కు బిక్కుమనుకుంట వచ్చిండ్లు 

“గీనె ఎవరో తెలుసా..” అడిగిండు రవీందర్. పొలగాండ్లు పెదువులు ఎన్కకిర్సి తల్కాయెలు అడ్డంగా ఊపిండ్లు. “నా తమ్ముడు. మీరు బాబాయ్.. అని పిలవాలే.. “ అర్థమయ్యిందా అన్నట్టు అడిగిండు. 

పిలగాండ్లను సూడంగనే దగ్గరికి తీసుకున్నడు సురేందర్. “నీ పేరేంది నాన్నా..” అని పేమగ అడిగిండు.

“నా పేరు సుజయ్.. చెల్లె పేరు సుస్మిత” అంటూ కండ్లు బండి గీరల్లెక్క తిప్పుకుంట చెప్పిండు సుజయ్. సుజయ్, సుస్మిత బుగ్గల మీద ముద్దు పెట్టుకున్నడు సురేందర్. సుస్మిత ఎంబడే తన అరచెయ్యి తోని బుగ్గను తుడ్చుకుంది. ఇంతల ఇంట్లకెల్లి రజిత పిలుపు వినచ్చింది..పిల్లలను రమ్మని. పాయిరాల లెక్క ఇంట్లకురికిండ్లు పిల్లలు. 

“తమ్ముడూ.. నీ పిల్లల పేర్లు..” అడిగిండు రవీందర్.

“వినయ్, విమల. వినయ్‌ను బల్లె షరీకు చేసి కాని విమలకు ఇంకా టైమున్నది” 

“చాలా సంతోషం తమ్ముడూ.. నీకు లెక్చరర్ ఉద్యోగం రావడం.. హైద్రాబాదు రావడం.. అంతా మనం చేసే మంచి పనుల మీద మన తక్దీర్ రాత్తడు దేవుడు” 

“అన్నా.. ఆదిరెడ్డిని మాత్రం మరువకు”

“నువ్వు అంతగనం చెప్పాల్నా తమ్ముడూ..”  అన్కుంట లేచిండు వంట గావచ్చు తిందాంపా.. అన్నట్టు.

ఆ పూట ఇద్దరు కలిసి తినడం అదే మొదటి సారి. రజిత మొకంలో ఏమాత్రం సంబురంగ ఉన్నట్టు కనబడ్తలేదు. అన్న మన అన్న అయినా.. వదినె మన వదినె కాదు.. పరాయిదే.. అనుకున్నడు మన్సుల సురేందర్. 

బువ్వ తిని కూకట్‌పల్లికి తిరిగి బయల్దేరిండు. 

(సశేషం)


No comments:

Post a Comment

Pages