చక్రధారిశతకము - పింగళి వేంకటసుబ్రహ్మణ్యకవి - అచ్చంగా తెలుగు

చక్రధారిశతకము - పింగళి వేంకటసుబ్రహ్మణ్యకవి

Share This

చక్రధారిశతకము - పింగళి వేంకటసుబ్రహ్మణ్యకవి

పరిచయం: దేవరకొండ సుబ్రహ్మణ్యం 
కవి పరిచయం:
చక్రధారిశతక రచయిత పింగళి సుబ్రహ్మణ్యకవి గుంటూరు జిల్లా కంటెపూడి గ్రామ నివాసి. భారద్వాజ గోత్ర ఆపస్తంబసూత్ర, ఆరువేలనియోగి. వీరి తండ్రులు పింగళి మల్లయ్య గారు గొప్ప ఆధ్యాత్మిక గురువు. తల్లి కామాంబ. సుబ్రహ్మణ్యకవి కంటెపూడి గ్రామ కరణంగా పని చేసినారు. వీరు తమను మహాకవి పింగళి సూరన్న వంశముగా చెప్పికొనినారు. పరమభక్తులైన వీరు మూడు శతకాలను రచించినట్లుగా తెలుస్తున్నది. 1. చక్రధారి శతకము, 2, కేశవ శాతకము, 3. శంకరశతకము.
శతకాంతమున ఈకవి తనను గురించి ఇట్లు చెప్పికొనినాడు.

సీ. ధరణిభారద్వాజ వరమునిగోత్రుఁడ, నారువేల నియోగులందునొకడ
ప్రవిమల మయినయాపస్తంబసూత్రుడ, హరిభక్తినేప్రొద్దు నరయువాడ
కంటెపూడి శివారు కట్టవార్పురముల, కరణీకనిరతిమై గ్రాలినాడ
దాసజనావళి దాసుండనైచాల, కూర్మితో పెద్దల గొలుచువాడ

నరహరినినాత్మ నిరతంబు నమ్మినాడ
నన్యచింతలపై భ్రాంతి నడచినాడ
సన్నిధిని జేర్చికోవయ్య సన్నుతింతు
చక్రధారీశ్రిత మనోబ్జ చయవిహారి

తన తండ్రి గారి గురించి చెప్పిన పద్యం:

సీ. తొల్లిమల్లయకవి చల్లగాశ్రీశైల, మందునగూర్చుండి యటతపంబు
జేయునంతలో జెనటుల్ రోహిలాల్, కరవాలముచేత గాయమంత
నరుకుచున్ననుమది హరమహాదేవయం, చురునుతుల్ సల్పెడి తరితుపాకు
లెల్లబారులొనర్చి యేయమ్రోగకయుంట, చింతజేబోయిరి శీఘ్రగరిమ

పరమభక్తుండు సుగుణుండు భాసురుండు
సంతతానందభావుండు సాత్వికుండు
యిట్టిభక్తవరుండిల యెవరుగలరు
చక్రధారీశ్రిత మనోబ్జ చయవిహారి

ఈసంఘటన తరువాత ఈకవి తండ్రిగారు ఒక సీసమాలికను రచించినట్లు తెలుస్తున్నది.

శతకపరిచయం:

"చక్రధారీశ్రితమనోబ్జ చయవిహారి" అనే మకుటంతో అలరారే ఈశతకం భక్తి జ్ఞాన వైరాగ్య నీతిమార్గములు బోధిస్తూ సీసపద్యములలో రచింపబడినది. ఈశతకము 1. ప్రథమ భాగం (100 పద్యములు) 2. భగవత్గీతల ప్రకరణము (100 పద్యములు)గా విభజింపబడినది. కవి ఈశతకాన్ని ప్రాచీన కవుల వలనే భగవత్ ప్రార్థనతో ప్రారంభించి ప్రాచీన కవిలను నుతించినాడు. ఇప్పుడూ కొన్ని పద్యాలను చూద్దాం.

సీ. నిర్విఘ్నవృత్తికై నిజగజానను నెంతు, వరశబ్దములకై వాణిదలతు
ముద్దుపల్కులొసంగ ముక్కుతిమ్మన గొల్తు, నాంధ్రంబు రచియించు నల్లసాని
పెద్దనాహ్వయు కీర్తి పృధుభక్తివర్ణింతు, పోతాభిత్ధానుని ప్రీతిగాంతు
కాలిదాసునిపాద కంజాతంబులు నుతింతు, తిక్కనార్యుస్మరింతు మిక్కుటముగ

వసుధ శ్రీకంఠుసేవలు వదలకెపుడు
సత్కృతులొసంగవేయని సంతతమును
కోరి శతకంబొనర్చెద కొమరు మిగుల
చక్రధారీశ్రిత మనోబ్జచయవిహారి

ప్రథమ భాగమునందు కృష్ణలీలలు, రామకథలోని ముఖ్య ఘట్టాలే కాక అనేక నీతి, జ్ఞాన వైరాగ్యాలనుబోధించే పద్యాలను మనం చూడవచ్చు.

సీ. మునులభార్యలు దెచ్చుకొనిన యన్నముదిని, గోర్కెలుదీర్చిన గుణివినీవె
యతి ధైర్యమునజొచ్చి యా మడుగులోనున్న, కాళింగు ప్రాణముల్ గాచితీవె
విషము ధరించి బల్ మిషతోడ వచ్చిన, బూతకి జంపిన బుడుత వీవె
వినువీధి నేతెంచు ఘను తృణావర్తుని, బడగూల్చినట్టి బాలుడవునీవె

దీనతనువేడ బలిభార్య దిగులుమాన్పి
నురగలోకంబు జేర్చిన యొజ్జనీవె
వరగుణోద్ధామ నిస్తులవరదసీమ
చక్రధారీ శ్రితమనోబ్జ చయవిహారి

సీ. తాటక దునుమాడి మేటివిశ్వామిత్రు, తోదనే యరిగిన తోయజాక్ష
గౌతమపత్నికి ఘనశాపమునుబాపి, మిథిలాపురికినేగి విధికృతముగ
పూజలగొనియంత భూతేశువ్చాపంబు, విరచికీర్తినిగాంచి సరగద్రోవ
భార్గవుడెదురైన బాణంబుగొనివేగ, కరుణించియంపిన కంజనేత్ర

వరుస సాకేతపురికేగి పరమసాధ్వి
జానకినిగూడి సన్మౌని జనము బొగడ
పట్టభద్రుండ వైతివౌ పరమభద్ర
చక్రధారీ శ్రితమనోబ్జ చయవిహారి

సీ. విపినభూములనుండు వేదందముల కేల, సుందరమాలికా నందతతులు
వృక్షాగ్రఫలములు భక్షించుకపులకు, మణిహారములవేల మరియుదాల్ప
చీకువానికదేల షోకైనముకురంబు, కనుపించునే దాని గాంతియరయ
బధీరునకేటికి బల్మారుసత్కథల్, వినజాలునే వాని వీనులలర

మూకవానికి వేదంపు ముక్కలేల
షాండునకుకామినీభోగ సరసమేల
కుజనునకు కీర్తిఘనమేల కుతలమందు
చక్రధారీ శ్రితమనోబ్జ చయవిహారి

పైపద్యం అడిదము సూరకవి రామచంద్రశతకములోని పద్యానికి అనుకరణగా అనిప్స్తుంది. అలాగే ఈక్రింది పద్యం చదవగానే పోతనామాత్య భాగవతం దశమస్కంధంలోని పద్యం వెంటనే గుర్తుకి వస్తుంది.

సీ. వీడతే విజయుని తోడసరథిజేసి, పుడమినిప్పించిన పుణ్యమూర్తి
వీడతే చెరసాలలోడాగు నృపతుల, విడిపించి తెచ్చిన విక్రముండు
వీడటే కంసుని విదళించి తనతల్లి, దండ్రి సంకెళలూడ్చు ధార్మికుండు
వీడతే పాకారివిక్రమంబు నణంచి, పారిజాతముగొన్న పావనుండు

వీనిగననట్టి జన్మంబు వృధయగాదె
వీనికధలాలకించని వీనులేల
ననిస్మరించరె మును నిన్ను నతివలెల్ల
చక్రధారీశ్రిత మనోబ్జ చయవిహారి

అదే విధంగా ఈశతకంలో అనేక అధిక్షేప పద్యాలనుకూడా మనం చూడవచ్చు. ఈక్రింది పద్యం గమనించండి

సీ. హరినీకు పాన్పగునాదిశేషుడుసదా, గాలినేభక్షించి గడుపుచుండు
సర్వేశనీకుల సద్వాహనంబైన, పన్నగారిమెసవు పన్నగముల
బరువడి నీపుత్రుడ్రుసృష్టి యొనరించి, తరుగులేకుండడే ధనమునకును
నీకాంత శ్రీలక్ష్మి నిరతంబువరుసగా, దినపేరంటంబు దిరుగలేదె

నీదుమనమందు చరియించు నెరిజగంబు
నీకునేఖర్చు లేదయ్యె నిత్యమవని
నీవు భక్తులయిండ్లలో నిలతువెపుడు
చక్రధారీశ్రిత మనోబ్జ చయవిహారి

ఇప్పుడు భగవద్గీతా ప్రకరణములోని కొన్ని పద్యాలను చూద్దాం

సీ. చినిగినచేలముల్ పనికిరావనిమాని, క్రొత్తపటంబులు గొమరుమిగుల
నరులుధరించిన కరణి సమృగ్యతి, పరమాత్మ నీరీతి పాదుగాను
జీర్ణశరీరముల్ జెలువారవదలియు, క్రొత్తశరీరముల్ కూర్మితోడ
పొందుచుండునుగాదె పొలుపొంద జగమందు, సర్వేశ నినుజాల సంస్తుతింతు

నాత్మకును చావులేదెప్పు డరసిజూడ
తనువునకుగాని మరణంబు ధరణిదీని
నెమ్మినెరిగినవాడెపో నీతిపరుడు
చక్రధారీశ్రిత మనోబ్జ చయవిహారి

సీ. పుట్టినవారికి గిట్టుట యెపుడయిన, నిశ్చయంబౌగదా నిర్వికల్ప
చచ్చినవారికి జగతిలో జన్మంబు, తప్పక కలుగుగా దానవారి
సకల జీవంబులు స్థావరంబుల, నా దేహమందుండు నాత్మ య్ర్ప్పు
డును జంపబడడని ఘనముగా సద్బుధుల్, బరికింత్రు ధాత్రిని బద్మనాభ

యిద్ది తెలియక నరులు దుఃఖించుచుండ్రు
పామరులు దక్క తక్కిన ప్రాజ్ఞులెల్ల
వింతజేయుచునుంద్రు చిత్కళలను
చక్రధారీశ్రిత మనోబ్జ చయవిహారి

ఈవిధంగా భగవద్గీతలో అన్ని అధ్యాయాలలోని ముఖ్యమైన పద్యములను అనుసరించి చక్కగ సులువైన భషలో పామరులకు సైతం అర్థమయ్యె రీతిలో విడమరిచి చెప్పారు.

భక్తి, జ్ఞాన, వైరాగ్య, నీతి మార్గములు కలబోసి సులభమైన భాషలో మనకు లభిస్తున్న ఈశతకం అందరూ తప్పక చదవవలసినది.

మీరూ చదవండి. మీ మిత్రులచే చదివించండి.

***

No comments:

Post a Comment

Pages