చలువకు వేడికి సరికి సరి - అచ్చంగా తెలుగు

చలువకు వేడికి సరికి సరి

Share This

 చలువకు వేడికి సరికి సరి

(అన్నమయ్య కీర్తనకు వివరణ)

డా.తాడేపల్లి పతంజలి 


రేకు: 0336-06  సం: 04-213చలువకు వేడికి సరికి సరి

కలదిక హరి నీ కరుణే మాకు


.1: కాయము గలిగిన గలుగు దోడనే

పాయపుమదములు పైపైనే

రోయదు తనుగని రుచులే వెదకును

యేయెడ హరి నిను నెరుగుట యెపుడో


.2: కడుపు నిండితే ఘనమై నిండును

బడి బంచేంద్రియపదిలములు

విడువ వాసలును వెలయు బంధములు

కడగని మోక్షము గైకొనుటెపుడో


.3: పెక్కులు చదివిన పెనగుదోడనే

తెక్కుల పలు సందేహములు

యెక్కువ శ్రీవేంకటేశ నీవె మా-

నిక్కపు వేల్పవు నీచిత్త మికను


భావం

పల్లవి:

హరీ ఈలోకంలో ఒకదానికొకటి సరిపోతుంది.

కాని దేనికి సరిపోలని నీ కరుణే మాకు దొరికిందిమేము ఎంతోఅదృష్టవంతులం.

.1:

శరీరము కలిగిన వెంటనే క్రమంగా యౌవనము ప్రవేశిస్తుంది

ఇక ఆ యవ్వనపు మదాలు పైపైకి దూకి విజృంభిస్తాయి.

ఈ మలమూత్రాల దేహాన్ని చూసి ఆ యౌవనము రోయదు.

ఆ మురుగుగుంటల దేహంలో  రుచులే వెదకుతుంది.

హరీ ఈ కోర్కెలను దాటి   నిను ఎరుగుట ఎపుడో!?

.2:

కడుపు నిండితే చాలు.

అది గొప్పగా భావించి ఇంద్రియాలు (జ్ఞానకర్మేంద్రియాలు) నిర్భయంగా సిగ్గు లేకుండా వేరే తృప్తిని పొందటానికి ప్రయత్నిస్తాయి.

ఆశలు నన్ను విడువవుఅందువల్ల బంధములు పుడుతుంటాయి.

చివరకు మోక్షము గ్రహించుట ఎపుడో !

.3:

అనేకము చదివిన వెంటనే  ఒకదానికొకటి పెనగుతూ ఉబ్బుతూ చాలా సందేహాలు వస్తాయి.

శ్రీవేంకటేశనీవే మా నిజమైన దేవుడవు.

ఆసందేహాలు తీర్చే విషయంలోమోక్షానుగ్రహంలో  నీ చిత్తం. ( నీ ఇష్టమని భావం)

విశేషాలు

పంచేంద్రియాలు

ఐదు కర్మేంద్రియాలు : వాక్కుపాణిపాదంపాయువుఉపస్థలు.

ఐదు జ్ఞానేంద్రియాలు : చర్మముకన్నుచెవినాలుకముక్కు.

***

No comments:

Post a Comment

Pages