గోదారమ్మ ఒడి - అచ్చంగా తెలుగు

 గోదారమ్మ ఒడి

భావరాజు పద్మిని


"గోపా... అరేయ్ గోపా... గోపాగారండోయ్, ఏడుండారూ? ఓపాలి పలకండా!" రాగానే కొడుకును వెతుక్కుంటూ పిలిచాడు వరదయ్య. 

"ఇంకేడుంటాడూ? పులసల్లే ఆ గోదాట్లోనే ఎదరీత్తా ఉంటాడు. అబ్బరంగా సంకనేసికెళ్లి ఈత నేర్పినారుగా! ఆడ్నుంచీ ఇంట్లో ఉంటే ఒట్టు! ఎల్లి ఏట్లో ఎత్తుక్కోండి, ఆయ్!" కసిరింది శివమ్మ.

"ఐబాబోయ్! అల్లా కసరబాకే శివా తల్లా! ఆడు నా కొడుకే, బంగారం! ఏదో గోదారంటే పాణం కూనకి, అంతే!"

"ఆ,ఆ... ఇట్టాగే సూత్తా ఉండు. రేపు బళ్లో మీ ఇల్లేడా అంటే గోదాట్లో అంతాడు, గోదారేడా అంటే మాఇంట్లో అంతాడు. కొంప కొల్లేరవడవంటే ఇదేనేమో! కొండాలమ్మ తల్లీ, ఈ బిడ్డను నువ్వే కాసుకోవాల!" అంటూ గుడి ఉండే దిక్కుకి తిరిగి మొక్కింది శివమ్మ. వరదయ్య కొడుకు కోసం గోదారొడ్డుకు బయల్దేరాడు.

మాధవాయపాలెంలోని బెస్త గూడెంలో, చుట్టూ పూలమొక్కలతో ఒబ్బిడిగా ఉండే చిన్నపాక ఆళ్లది. పడవ నడపటం, చేపలు ఏటాడ్డం వరదయ్యకు ఆధారం. బైటి పన్లన్నీ వరదయ్య సక్కబెడితే శివమ్మ ఇంటిని ఒబ్బిడిగా పెడతా, ఇరుగుపొరుగుకు తల్లో నాలుకలా ఉంటాది.

శివమ్మకు శాన్నాళ్లు పెళ్లికాకపోతే, 'పెళ్లయి బిడ్డపుడితే నీపేరెట్టుకుంటా సామీ!' అని ఆ పెళ్లిళ్ల రాజగోపాలసామికి మొక్కుకుంది.  ఆళ్లకున్న ఒక్కగానొక్క నలుసు రాజగోపాలయ్య. ముద్దుగా 'గోపా' అని పిల్సుకుంటాంటారు. 

అదేంటో తెల్వదు! పుట్టినప్పట్నుంచీ గోపా మనసంతా గోదారి మీదే! నడకొచ్చిన కొత్తల్లో అమ్మేదైనా పన్లో ఉంటే, సల్లగా తప్పుకుని, నెమ్మదిగా నడుచుకుంటా గోదారొడ్డుకెళ్లి కూర్చునేవోడు. అక్కడ ఆకాశంలో ఎగిరే పక్షుల్నీ, రాయంచల్లా తేలే పడవల్నీ, గాలికి కదిలే గోదారి అలల్నీ సూత్తా ఉంటే పొద్దెక్కినా తెల్సేది కాదు ఆడికి! గోపాకు మూడేళ్లుండగా ఓరోజు రాత్రయితే భలే ఇసిత్రం జరిగినాది. సరింగా బీగాలెయ్యకండా నిద్దరోయింది శివమ్మ.‌ ఎప్పుడు లేశాడో ఏమో,  తలుపుసందులోంచి దూరి, గోదారొడ్డు కెళ్లిపోయాడు గోపా. తెల్లారి లేచి గుండెలు బాదుకుంటూ, శివమ్మ బిడ్డకోసం ఎతుక్కుంటా ఎల్తే, గోదారొడ్డున పొర్లాడేమో, ఒళ్లంతా ఇసకంటించుకుని, అక్కడొక మెరక మీదన హాయిగా నిద్దరోతూ కనిపించాడు గోపా!

అప్పట్నించీ వాడి కుడికాలు ఇంటి వాసానికి కట్టీసి పన్జేసుకునేది శివమ్మ. మూడ్రోజులూర్కుని, నాల్గో రోజున కట్టిప్పుకుని, సబ్బుముక్కల్లే జారుకుని, గోదారొడ్డున మిగతా బెస్త పిల్లలతో ఆటలాడసాగాడు గోపా! 

గోపా ఇష్టవేవిటో తెల్సుకున్న వరదయ్య, రాత్రైతే కొడుకుని బుజానేసుకెళ్లి, పడవలో ఏ లంకకో తీసుకెల్లి, సుక్కలానేలా ఎల్లకిలా పడుకోబెట్టుకుని కతలు సెబుతా ఉంటే, ఒత్తిగిలిపోయి, గోదాట్లో ప్రతిబింబించే సుక్కల్ని, సందమామనీ సూత్తా నిదరోయేవాడు గోపా.‌ ఆ దాటున ఆడ్ని పడవలో ఏసుకుని ఇంటికి తెచ్చి పడుకోబెట్టేవాడు వరదయ్య. తండ్రీకొడుకుల మురిపెవెలాగున్నా బిడ్డ ఏమైపోతాడోనన్న బెంగతో విలవిల్లాడిపోయేది శివమ్మ. 

సూత్తాండగానే ఐదేళ్లొచ్చాయి గోపా కి. శివమ్మ గాబరా చూసిన వరదయ్యకి సివరాఖరికో ఉపాయం తట్టింది.‌ అసలు బిడ్డ ములిగిపోతాడనేగా శివమ్మ బెంగ! వోడికి ఈత నేర్పాల, ఈతలో తనకు తెల్సిన మెలకువలన్నీ నేర్పాల! సుడిగుండంలో పడితే బైటికెలా రావోలో నేర్పాల... పడవ నడపడం నేర్పాల... గోపా గాడ్ని గజీతగాడ్ని సెయ్యాల! అప్పుడేడికి బోయినా బెంగనేదు! కానీ పగలు బడికి బోతేనే సాయంకాలం ఈత, పడవ నేర్పుతానని ఆడికో షరతు పెట్టాడు వరదయ్య. ఈతకోసం దేనికైనా తయారన్నాడు గోపా! ఆడికి గోదాట్లో ఏముందో సూడాలనుంది, సేపల్తో కలిసి ఈదాలనుంది, అట్టడుగున అమ్మ ఒడిలా వెచ్చగా ఉండే గోదాట్లో ఒదగాలనుంది. అందుకే నాన్న మాటింటానంటూ తలూపాడు.

"సూడ్రా గోపా! ముందుగా మనం గోదారిని సదవాల! నీళ్ల వడి ఎటైపుందో సూస్కోవాల. కనుసూపు మేరలో సుడిగుండాలు అగుపడితే అటేపెళ్లరాదు. కానీ ఒక్కోసారి సుడిగుండాలు పైకి తెలవ్వు. ఎంత జార్తగా ఉన్నా అందులో పడాల్సిందే! గుర్తెట్టుకో సుడిగుండం కన్నా సావు బయం పెద్దది. ఆటిల్లో సిక్కుకునే సానా మంది, బయంతోనే సత్తారు. సుడిగుండంలో పడ్డప్పుడు ముందది, కాళ్లు లాగేత్తది, తర్వాత మడిసిని లాగేత్తది. అప్పుడు ఊపిరి బిగబట్టి, మౌనంగా అదెటు తీసికెల్తే అటుపోవాల! అలసిపోయినట్టుంటే కాసేపు పైకి తేలాల, మడిసి ఒంటికి తేలే సొబావముంటాది మర్సిపోకు! మౌనంగా, ధైర్నంగా ఉండి దాన్తోపాటు పొయ్యాకా, కాసేపటికి ఆ సుడిగుండం నీరసపడుద్ది! ఎక్కడ సుడిగుండం నీరసపడుద్దో సూసుకుని, ఆడ్నుంచీ లంబంగా తప్పుకుని, నెమ్మళంగా ఈదుకుంటా పైకి తేలి, మబ్బుల దిశ సూస్కోవాల! అవెటు బోతా ఉంటే అటు తీరముంటది! అటుకేసి ఈదుకుంటూ రావాల! అంతే!"తండ్రి సెప్పే కిటుకులన్నీ తెల్సుకున్న గోపా గజ ఈతగాడయ్యాడు. 

ఓసారో సాములోరు గోదారవతల జపం సేసుకుంటా ఉండేందుకొచ్చారు. ఆయనకు సేవలు చేసి, ఆయన నుంచి ఎట్టాగో జలస్థంభన విజ్జ నేర్చాడు గోపా! ఈ విజ్జొచ్చినోళ్లు మూడు గంటలు నీళ్లలో ఉన్నా ఏవీ కాదంట! ఇదికూడా నేర్సాకా ఆడికిక నీళ్లలో తిరుగు లేకండా పోయినాది. ఎక్కడైనా లాంచీలు, పడవలు మునిగిపోయినప్పుడు నర్సాపురంలో గజ ఈతగాడెవడంటే గోపా పేరే జెప్పేవోళ్లందరూ! పులస సేపల్ని ఎదురీది వేటాడి తెచ్చే పులస మొనగాడయ్యాడు కూడానూ. అదీగాక, చిన్నతనం నుంచే తెడ్డెయ్యడం నేర్చుకున్న గోపా మేటి పడవ్వోడయ్యాడు. కానీ ఎప్పుడూ ద్యాసంతా గోదారిమీదే ఉండడంతో ఐదోక్లాసు మించి ఆడికి చదువబ్బనేదు! ఈడొచ్చాకా ఆడికి సీతారాంపురానికి చెందిన రాధమ్మనిచ్చి పెళ్లిచేసారు. సిలకా గోరింకల్లా ఉన్న కొడుకూ కోడల్ని సూత్తా, ఒక్కగానొక్క మనవడైన గణేశుడి ముద్దూ ముచ్చటా సూత్తా, ఒకరితర్వాత ఒకరు తృప్తిగా కాలం చేసారు శివమ్మ, వరదయ్య.

గోపా తన కష్టంతో ఆ పాకని కూల్చి డాబా కట్టాడు‌. మారుతున్న కాలాన్ని బట్టి, కొడుక్కి ఏలోటూ రాకూడదని ఒక్కొక్కటిగా వస్తువులన్నీ అమిర్చాడు. కష్టపడి గణేశుని ఇంజినీర్ని చేసాడు. ఉన్న ఊళ్లోనే ఆడికి మాంచి ఉద్యోగమొచ్చింది. ఊరంతా గోపా అదృష్టాన్ని మెచ్చుకున్నారు. గణేశుకి పిల్లనిస్తామని ఎగబడ్డారు.

అయితే గణేశు అదే ఈదిలో, డిగ్రీ చదివి, ఇంట్లోనే ఉంటన్న పద్మ ను ప్రేమించానన్నాడు. కాళ్లాయేళ్లాపడి, పద్మ తల్లిదండ్రుల్ని ఒప్పించి, ఆళ్లిద్దరి పెళ్లీ జరిపించాడు గోపా. తమ బాధ్యత తీరిపోయిందని మురిసిపోయారు గోపా, రాధమ్మ.

అయితే పద్మది ఇచిత్రమైన సొభావం! 'పొట్లపాదుకు పొడగిట్టదు, కాకరపాదుకి కంపు గిట్టదని' ఏదో సామెతసెప్పినట్టు అత్తమామల పొడే గిట్టేది కాదు ఆమెకి! మొగుడున్నప్పుడు అత్తమామలను మన్నించినట్టు కనబడ్డా, లేనప్పుడు నోటికెంతమాటొస్తే అంత మాటనేసి, అస్తమానూ విసుర్లూ కసుర్లూ.‌ అవునుమరి! ఇప్పుడామె ఇంజినీరు భార్య! సేపలకంపు కొట్టుకుంటూ తిరిగే ఈ ఊరోళ్లు ఆమెకేం నచ్చుతారు?

పనిభారంతో ఊళ్లు తిరుగుతా ఉండే కొడుకుతో సెప్తే బాధపడతాడని, మరీ పడలేనప్పుడు ఓ గుప్పెడు బియ్యం, వంట దినుసులూ మూటగట్టుకుని, రేవు దాటి, ఏ లంకకో పోయి, ఇంతొండుకుని తిని, అక్కడే నిద్రోయి, ఏ మూడునాల్గు రోజులకో తిరిగొచ్చేవోళ్లు గోపా, రాధమ్మ. కొడుకడిగితే, "మీ నాన్న సంగతి తెల్సుగదరా నీకు? ఏదో గోదారొడ్డునుండాలని సరదా పడితే పోయ్యొచ్చినాము!" అని సర్ది సెప్పేది రాధమ్మ.

ఉన్నట్టుండి ఏదో మాయదారి జబ్బు చేసి, ఎంత ప్రయత్నించినా కోలుకోక కాలం చేసింది రాధమ్మ. అప్పట్నుంచీ మరీ ఒంటరివాడైపోయాడు గోపా! ఏదో పరాగ్గా ఉండీలేనట్టు ఉంటున్నా, కోడలి విసుర్లు మరీ ఎక్కువై మనసులో దిగాలుపడిపోయేవోడు. 

ఒకరోజు పులస సేపల్ని పట్టడానికి వేటకెళ్లి సాయంకాలానికి తిరిగొచ్చాడు గోపా! రాధమ్మ ఉండుంటే, పులసలతో వొచ్చిన తన మగడ్ని మొనగాడిలా సూసేది. పులసలతో గుమగుమలాడే పులుసు కాసి పోసీది! కానీ మావగోరి కోసం సూసీ సూసీ మాంచి విసురుమీదున్న కోడలు... "ఎందుకొచ్చిన బతుకూ? మాకు బారం, భూమికి బారం! ఆ గోదాట్లో దూకి చావరాదా? పీడా వదులుద్ది!" అని గిన్నెలు విసురుతా ఇంత గొంతేసుకుని, కసిరింది.

అంతే, కనీసం ఎంగిలి పడకుండా పడవ తీసుకుని, లంకల వైపెల్లిపోయి, గోదాట్లో కాళ్లెట్టుకుని కూర్సున్నాడు గోపా! ముందు రోజు నుంచీ భోరున వాన కురుస్తానే ఉంది. గోపా తన గోడును గోదారితో సెప్పుకోసాగాడు...

"గోదారి తల్లీ! అమ్మ బోయినా ఏడ్వలా, నాన్న బోయినా ఏడ్వలా, పెళ్లాం బోయినా ఏడ్వలా... ఎందుకంటే, నువ్వున్నావన్న ధైర్నం. పుట్టిన కాడ్నుంచీ నాలో పారే రక్తంలా నువ్వూ నా గుండెల్లో పారుతానే ఉన్నావు! కట్టంలో సుకంలో‌ తోడున్నావు. కానీ, తల్లీ! ఇంత బతుకు సూసిన నేను, ఇంత గనంగా బతికి, నా కొడుక్కి అన్నీ అమర్చిన నేను ఇప్పుడాడి పెళ్లానికి బరువైపోనాను, పీడైపోనాను. ఇన్నావా, నేను భూమికి బారాన్నంట! నేను సత్తేనే మంచిదంట. ఉండాలేక, వెళ్లాలేక రోజూ సత్తా బతుకుతా ఉన్నాను. ఇగ నా వొల్ల కాదమ్మా! నువ్వే ఏదో దారి చూపించాలి తల్లీ!" 

గోపా మనసులో ఇలా అనుకుంటా ఉండగానే వానల్తో పాటు  దూరంగా వరదనీరు ఉధృతంగా పారుతా అతనికేసి రాసాగింది. ఆ హోరు అతన్ని, ఆ లంకని ముంచెత్తేసేలా ఉంది. సూస్తుండగానే గోపా పడవ లంగరు తెగి, దూరంగా కొట్టుకుపోయినాది. ఆ పడవనే రెప్పెయ్యకండా సూత్తా ఉన్న గోపా మనసులో ఒక ఆలోచన మెరిసింది. వెంటనే ఒక నిర్ణయానికి వచ్చినోడిలా లేసి నుంచున్నాడు.

ఎవరికి తను బారమైనా గోదారి తల్లికి కాదు. ఈ తల్లి ఒడి అప్పుడు ఇప్పుడూ ఎప్పుడూ కూడా నన్నాదరిత్తానే ఉంది, సేదదీరుత్తానే ఉంది. ఇందులోనే కల్సిపోతాను, ఇందులోనే కరిగిపోతాను... 

అనుకుందే తడవుగా గోపా తన చేతులు చాచి, వరదగోదారికి తనను తాను అప్పగించుకున్నాడు. గజీతగాడు గోపా కి, జలస్ధంభన విజ్జ తెల్సిన గోపా కి, పులస మొనగాడు గోపా కి... ఎందుకో ఆ వేళ మాత్రం ఈదాలనిపించలేదు. తనకు ప్రాణమైన గోదారమ్మ ఒడిలో, ఆ వరద నీటిలోనే ఒదిగి, ఒరిగిపొయ్యాడు.

***

మా నర్సాపురం గోదాట్లో సుడిగుండాలు ఎక్కువని, మునిగినోడెవడూ తేలడనీ  అంతా అంటా ఉంటారు. 

కానీ... లంకల్లో మునిగిన గోపా,  అంతర్వేది అన్నాచెల్లెళ్ల గట్టు దగ్గర తేలాడు. కళ్ళు నులుముకుంటా గోదారమ్మనే చూడసాగాడు.

"అమ్మా! నువ్వూ అమ్మవేగదా! అందుకే పాణం పొయ్యటమే కాని తియ్యటం సేత గానేదేమో! గోదారి తల్లా, నీ బిడ్డకు, నీ ఒళ్లో మళ్ళీ జనమ నిచ్చావా? ఎందుకమ్మా?" అనడిగాడు. 

'విలువైన జీవితాన్ని నిర్వేదంలో అంతం చేసుకోకూడదు. మన జీవితం ఒకరికి పనికిరానిదిగా, బరువుగా, అనిపించినప్పుడు, వారికి దూరంగా వెళ్లిపోయి, వేరొకరికైనా పనికొచ్చేలా దాన్ని మలచుకోవాలి.' అని గోదారమ్మ గోపాతో మౌనంగా చెప్పినట్టయింది.

ఇదే సత్తెమన్నట్టు ఎదరున్న అంతర్వేది  లక్ష్మీ నృసింహస్వామి గుడిగంటలు లయబద్ధంగా మోగాయి.  చల్లగాలి వీస్తా ఉండగా ఓ తీర్మానం జేసుకున్నాడు గోపా!

"ఇక నుంచి నా జీవితాన్ని ఆ సామికే అంకితం చెయ్యాల. ఇరాగి లాగా సామి సేవలోనే ఉంటా, మిగతా కాలమంతా శాంతంగా గడిపాల. ఆయ్." 

ఒంటికంటిన ఇసుకను దులుపుకుంటూ లేచి, తన కళ్లు తెరిపించిన అమ్మ కాని అమ్మ, గోదారమ్మకు సాష్టాంగపడి, ముందుకు కదిలాడు గోపా.

***

No comments:

Post a Comment

Pages