ఆయ్! మాది నర్సాపురవండి! - అచ్చంగా తెలుగు

ఆయ్! మాది నర్సాపురవండి!

Share This
ఆయ్! మాది నర్సాపురవండి!
భావరాజు పద్మినీ ప్రియదర్శిని 


మాది నర్సాపురఁవండి! ఆయ్!
నర్సాపురవంటే వశిష్ట గోదారేనండి! అలాటప్పుడు మా ఊరి కబుర్లు చెప్పమంటే గోదారితోటే మొదలెట్టాలి గదండీ! ఆయ్! 

పదండి, అల్లక్కడ గోదారి గట్టు దాకా ఎల్లి ఊరు చూసొద్దారి! 

ఎదర దౌలేస్రం(ధవళేశ్వరం) దగ్గర మా గోదారి ఏడుపాయలగా చీలుద్దండి. ఆ ఏడుపాయలకు సప్తర్షుల పేర్లెట్టీసారండి, ఆయ్! అయితే ఇసయం ఏటంటే, ఈ ఏడుపాయల్లో మనకౌపించీవి గౌతమి, వశిష్ఠ రెండేననీ, గౌతమి యానాం పక్కకు పారి‌సముద్రంలో కల్సిపోతే, వశిష్ఠ ఇటుకేసొచ్చిందని సెప్తారండీ!

అసలూ పొద్దు పొడవగానే సూడాలండి మా గోదారి అందాలు, ఆయ్! పడవల రేవు దరికి అడుగెడితే... ఒడ్డునున్న పెద్ద రావిచెట్టు కిందున్న బెంచీమీద కూర్చుని గోదారిని మౌనంగా చూస్తా ఉంటే, అప్పుడు తెలుస్తాదండీ సొరగవంఁటే ఏటో! చెవులకింపుగా రావాకుల సప్పుళ్లూ, ఎదరుంగ సఖినేటిపల్లి కొబ్బరితోటల్లోంచి సూర్యోదయం, అల్లనల్లన చుట్టే చల్లగాలి, పక్కనే పంటిమీద రేవు దాటడానికి పోగయ్యే జనం, అందర్నీ పలకరిస్తున్నట్లు గలగలా పారే గోదారి! 

మంచు కప్పిన గోదారిదో అందం... 
నీరెండకు మెరిసే గోదారిదో అందం... 
పున్నమిలో మునకేసే గోదారిదో అందం... 
రెల్లుగడ్డి మొదళ్లతో సయ్యాటలాడే గోదారిదో అందం... 
వానలో సరిగంగ తానాలు చేసే గోదారిదో అందం... 
ఎండిన గోదారిదో అందం...
కొత్తనీరు పారే బురద గోదారిదో అందం... గట్టుదాటే వరద గోదారిదో అందం... 
ఎన్ని చెప్పినా మా గోదారి గోదారంతే! 
అందుకే మేవింత సెలాగ్గా ఉండేదీ, ఈ చాయలో పెరిగిన కొబ్బరిబొండాల నీళ్లంత తియ్యగా ఉండేదీనూ!
ఎన్నని సెప్పేదీ... ఏటని సెప్పేదండీ బాబూ!

ఒకప్పటి నర్సాపురం డచ్, ఫ్రెంచ్, బ్రిటిషోరి కాలంలో ఒక రేవు పట్టణంగా, టేకుకలప, బట్టల ఎగుమతికీ, ఓడల తయారీకీనీ, కేంద్రంగా ఎలిగిపోయినాదండి. ఈ పడవల రేవునే ముందర మాధవాయపాలెం రేవొనే వారంట! అమరేశ్వర స్వామి గుడి ఎదర ఉండడం వల్ల పుష్కరాలప్పుడు 'అమరేశ్వర ఘాట్‌' అని కూడా అంటారండీ, ఆయ్!

ఆగండాగండి, 'వలంధర రేవు' అన్నాను కదా, ముందీ పేరెనక కత సెప్పాల. ఈస్టిండియా కంపెనీవోల్లొచ్చే ముందటే అంటే, 1626 లోనే డచ్ వోళ్లు మా నర్సాపురవొఁచ్చి వశిష్ట గోదారి మీద పడవల్రేవు కట్టీసారండి. ఇక్కడుండే వోళ్లందరికీ పడవల తయారీలో సిచ్చణిచ్చీసి, ఈ రేవుకి 'హాలాండ్ వార్ఫ్' అని పేరెట్టీసారండి. మరి అందరికీ నోరు తిరగదు కదండీ! ఆయ్! హోలాండోళ్లు అంటానికి బదులు 'వలందులు' అనీసీ, ఆళ్లు తిరిగే రేవుని 'వలందుల రేవు' అనీసి జాయిగా పిల్చేటోరండి. అదే నింపాదిగా 'వలంధర రేవు' అయిందండాయ్!

వలంధర రేవు ఒహటే కాదండీ, లలితమ్మ గుడుండటం వల్ల ఈ రేవుని పుష్కరాలొప్పుడు 'లలితాంబ ఘాట్' అని కూడా అంటారండి. 
ఇక్కడ బెస్త వాళ్లని 'అగ్నికుల క్షత్రియులు' అంటా గౌరవిస్తారండి.  

 గ్రామదేవత కొండాలమ్మ గుడి ఒడ్డున ఉన్న  'కొండాలమ్మ ఘాట్' ముచ్చటగా మా గోదారికి మూడో రేవు! ముక్యంగా మా గ్రామదేవత కొండాలమ్మ తల్లి గురించి కొంత సెప్పాలండోయ్.

ఒకసారి వరద గోదారి ఉరవళ్ళు పరవళ్ళుగా ప్రవహిస్తోందండా! వరదతో పాటు ఓ యిగ్రహం కొట్టుకొచ్చిందండి. అదీ కొయ్యదండీ! 'ఇది భద్రాచలం నుండి వరదలో కొట్టుకొచ్చింది. మన నరసాపురానికి వచ్చి ఆగింది, కాబట్టి మనం ఇక్కడే గుడి కట్టాలి.' అని తేల్చేసారండి ఊరిపెద్దలు. ఆ ప్రగారంగా గోదావరి ఒడ్డునే సిన్న గుడి కట్టి, పూజిస్తుంటే... కోరిన కోరికలు తీరి, రోగాలు తగ్గించి, ఆ తల్లి సూపిన మహిమకు అందరికీ కొండాలమ్మ తల్లి మీద బాగా గురి కుదిరిందండి. 97 లో వచ్చిన వరదల్లో, ఆ సిన్న గుడి దెబ్బతినటంతో, ప్రస్తుతం వెనుకే పెద్ద గుడి కట్టి, విగ్రహాన్ని అందులోకి మార్చారండి, ఆయ్!

గోదారి గట్టుమీద గొప్పగొప్పోళ్ల ఇగ్రహాలెట్టీసి  గౌరవించుకునే దొడ్డ మనసు మాదండీ! అంతర్వేది దేవాలయ నిర్మాత కొపనాతి కృష్ణమ్మ ఇగ్రహం, అల్లూరి సాంస్కృతిక కేంద్రం, బాపు గారి ఇగ్రహం, బాపు కళాక్షేత్రం పేరుతో ఈమద్దెనే కట్టిన బాపు-రవఁణల ఓపెన్ ఎంపీ థియేటర్ ని కూడా ఇందుకు నిదర్శనాలండీ. ఎన్టీఆర్-వసిష్ట వంతెన, రేవులో గోదారి తల్లి ఇగ్రహం, అమరవీరుల స్తంభం, ఉందా లేదా అనిపించే వసిష్టుని ఇగ్రహం, ఎనకగా అగుపించే డచ్చోరి భవనం, మూగమనసులు సినిమా తీసిన ఇల్లూ, ఇయ్యన్నీ మా గత వైభవానికి అద్దం పడతాయండి!

దేవాలయాల ఇసయంలో కూడా మేము నెంబర్ వన్నేనండి. ఈ ఇసయం చెప్పే పుప్పాల రవఁణప్ప నాయుడు గోరు కట్టించిన మూడొందలేళ్ల నాటి ఎంబరుమన్నార్ కోవెల, పెళ్లిళ్ల గుడిగా పేరొందిన రాజగోపాలసామి గుడి, వందేళ్ల నుంచి వీవర్స్ కమిటీ వోల్లు పది రోజులు సంక్రాంతి తీర్ధం జరిపే వనువులమ్మ గుడి, లలితా ఘాట్ దగ్గర్లో ఉన్న యర్రమిల్లి వారి వీధిలో ఉండే శ్రీలక్ష్మీనృసింహ ఆంజనేయస్వామి వారిగుడి, మహాలక్ష్మి గుడి, వల్లలమ్మ గుడి, లక్ష్మణుడు ప్రతిష్ఠ చేసినట్లుగా సెప్పే లచ్చేశ్వరం(లక్ష్మణేశ్వరం), ఇది సూడగానే సూసి తీరాలని చెప్పే శివదేవుని సిక్కాల, దిగమర్రు, ఇలా ఎన్నో ఉన్నాయండి.

ఒక్క గుళ్లకే కాదండీ నర్సాపురవంటే ఇప్పుడుగాదండి, అప్పుడెప్పట్నుంచో అన్ని మతాలవోళ్లూ కమలాలు, కలువపూవుల్లా కలగలిసి ఉండే కాసారం లాటిదండి. హిందూ, ముస్లిం, క్రైస్తవ సోదరుల ఆలయాలు, ప్రార్ధనా మందిరాలు ఈదిఈదికీ కలిసే ఉంటాయండీ, ఆయ్! ఇక్కడ రుస్తుంబాదా, క్రిస్టియన్ పేటల్లో క్రిస్టియన్లు, పంజాసెంటర్ లో ముస్లింలు, రాయ్ పేట, జోస్యుల వారి వీధి, ఇందిరా కాలనీలాటి వోటిలో హిందువులు, ఎప్పట్నుంచో కలిసుంటన్నారండి. పంజా సెంటర్లో ముస్లిం బిర్యాని, వలంధర రేవులో పిడతకింద పప్పు, నర్సాపురం స్పెషల్ మసాలా బజ్జీ, తీర్ధాల సమయంలో పెట్టే జీళ్లు కజ్జూరాలు, బళ్లమీదమ్మే కొబ్బరి పూలు, అసలప్పటికప్పుడు కొట్టిన పనసపొట్టుతో జేసిన పనసపొట్టుకూరా తిని తీరాలండీ బాబూ! అక్కడక్కడా రకరకాల చట్నీలతో సిన్న ఓటళ్లలో దొరికే టిఫిన్ల రుసి మాగొప్ప గుంటాదండోయ్! వానలు మొదలైనప్పుడు మాత్రవే దొరికే పులస చేపలకు మంచి గిరాకీ ఉంటాదండీ. అయితే ఇవంత తేలిగ్గా వల్లో పడవండి, ఏటికెదురీదే రకం గదండి, గొప్ప తిప్పలెట్టేస్తాయండి! 

చదువుల ఇసయం అసల చెప్పక్కరలేదండోయ్! ఎనకటి నుంచి నర్సాపురవే బెస్టు! 1852 లో నాటి సబ్ కలెక్టర్ శ్రీ జి.ఎన్.టేలర్, మెకలే దొర సదువులు సెప్పడానికి ఎట్టీసిన టేలర్ హేస్కూలు, 1949లో శ్రీ యఱ్ఱమిల్లి నారాయణ మూర్తి గోరు కట్టీసిన వై.యన్. కాలేజి, పద్మశ్రీ అవార్డందుకున్న అద్దేపల్లి సర్విచెట్టి గారు స్థాపించిన భగవంతం బంగార్రెడ్డి వుమెన్స్ కాలీజీ,  1850 దరిదాపుల్లో సిన్నగా మొదలిట్టి, ఉన్నత పాఠశాలగా మారిన మిషనైస్కూలు, ఇలాగెన్నో ఉన్నాయండా. కోర్టు ఈదిలో వంద సంవత్సరాల పైబడిన చరిత్ర గల న్యాయస్థానాలు, సబ్ జైలు, మిస్సమ్మ ఆసుపత్రీ అని పిలిచే మిషనాసుపత్రీ, సీతారాంపురంలో ఎంతోమందికి జీవనోపాధినిచ్చే లేస్ పార్కూ(లేసుల ఇంటర్నేషనల్‌ ఎక్పోర్ట్) ఉన్నాయండీ. అంతెందుకండీ? ఉత్తరాన పాలకొల్లు నుంచీ ఊళ్లోకొచ్చీప్పుడున్న కిరసనాయిలు పంతులు గోరి పెట్రోల్ బంక్ నుంచి దక్షిణాన వై.ఎన్.కాలేజీ గ్రౌండ్ దాకా, తూర్పున ఉన్న స్టీమర్ రోడ్డు నుంచి పడమట సీతారాంపురం దాకా, అటుపైన పేరుపాలెం బీచ్ దాకా ఎక్కడజూసినా మా ఊళ్లో వైబవమే వైబొవమండీ!

సివరగా ఓమాట! 
ఆలీడేలంటా ఏవేవో ఊల్లెల్లొత్తారు గానీండి, మా నర్సాపురవేవీ ఆటికి తక్కువగాదండీ! కోనసీమకి ముఖద్వారం లాటిదండి మా ఊరు, పచ్చదనానికి పంటిలాటిదండీ, ఆయ్!

 ఈమాటు ఇటేపొచ్చి చూడండి, మీకే తెలుత్తాది. ఇప్పుడు నర్సాపురంగా మారిన మా నృసింహపురం, లేదా నరసింహపురం, లాప్పోతే అభినవభూతపురి గోప్పేటో!
 
****

No comments:

Post a Comment

Pages