నెత్తుటి పువ్వు - 41 - అచ్చంగా తెలుగు

 నెత్తుటి పువ్వు - 41 

మహీధర శేషారత్నం 


నా దారిన నేను బతుకుతుంటే ఏదో చేస్తానని చెప్పి నమ్మించి ఏంచేసావు? నా చావుకి నువ్వే కారణం అని అరుస్తున్నట్టుంది.


            కలత నిద్రలో పీడకలలు. తెల్లారినా లేవలేకపోయాడు. లక్ష్మి మెల్లిగా టీ తెచ్చి లేపింది. డ్యూటీ కెళ్ళాలా? లే ఎనిమిదయింది. ఊఁ! లేచాడు, టీ తాగి స్నానం చేసాడు. “టిఫిన్ తిను, ఇడ్లీ వేసాను.”            “పట్రా!” అమ్మయ్య మామూలుగా అయ్యాడా ఏమయిందో ప్రశాంతంగా ఉన్నప్పుడు అడగాలి అనుకుంది.టిఫిన్ తిని టీ తాగి కావాల్సినవన్నీ సర్దుకుని బయటికి వెళ్ళిపోయాడు. మధ్యాహ్నం పన్నెండయ్యేసరికి శంకరం ఇంటికి చేరుకున్నాడు. శంకరాన్ని కౌగిలించుకున్నాడు. సారీరా! శంకరం నువ్వు శంకరుడివే కాని నేనే నాగుని, కాలనాగుని. నీ మెడకి చుట్టుకున్నాను. వంటింట్లోకి వెళ్ళాడు. పార్వతి పసి దాన్ని ఒళ్ళోపడుకో బెట్టుకుని ఏడుస్తూ చిచ్చికొడుతోంది. నాగరాజు పార్వతి కాళ్ళు పట్టుకున్నాడు.


            “నన్ను క్షమించు, నేను చచ్చినా నా పాపని జాగ్రత్తగా చూసుకో, నా తప్పుకు పాపను శిక్షించకు, తల్లిలా ఆదరించు, నీ మీద నాకు నమ్మకం ఉంది.”


            “అయ్యో! అన్నయ్యగారు, లేవండి ఇదేమిటి? పాప నాకూతురే. నాకు మళ్ళీ పిల్లలు పుట్టినా నేను పాపను వదలను. సరేనా! “అనుకోకుండా అతనిని లేపి చేతిలో చెయ్యివేసింది.


            “చాలమ్మా! చాలు, నాకు నీ మీద నమ్మకం ఉంది.” కళ్ళ నిండుగా కూతుర్ని చూసుకున్నాడు. నిశ్చింతగా నిద్రపోతున్న పాపని ఎత్తుకుని లేపాలనిపించలేదు. బయటికి నడిచాడు నిశ్శబ్దంగా.


            శంకరం చేతిలో కవరుపెట్టాడు. గాఢంగా కౌగలించుకున్నాడు. నీ ఋణమెలా తీర్చుకోగలనురా! బై అంటూ బయటికి వెళ్ళిపోయాడు.


            శంకరం కవరుతీసి చూసాడు. లక్ష రూపాయల ఫిక్సిడ్ డిపాజిట్టు శంకరం పేరున వేసి నామినీగా పాప పేరు పెట్టాడు.


            “ఇదేమిటండీ! అంది పార్వతి.


            “బాగా షాక్ తిన్నాడు. కాలమే అన్నిటినీ మారుస్తుందిలే పార్వతీ! పాప జాగ్రత్త. పై తరగతి వాళ్ళు నిస్సంకోచంగా విడిపోతారు కలుస్తారు. పెళ్ళిళ్ళు చేసుకుంటారు. విడాకులిస్తారు, కొంతమంది పేదవాళ్ళకు పూట గడవడమే సమస్య కాబట్టి అవసరాలే తప్ప ఆలోచనలే ఉండవు. మానసిక సంఘర్షణ కల రాజులాంటి వాళ్ళే నలిగిపోతారు.” నిట్టూర్చాడు.


            పార్వతి అనునయంగా శంకరం భుజం మీద చెయ్యివేసింది. “పాప పేరు మనోజ, వాడే పెట్టాడు.” “అలాగా! ఎప్పుడు? “ఎఫ్.డి.లో నామినీలో రాసాడు, అంటే అదే పెట్టమని అర్థం.” “పుస్తకాలు బాగా చదువుతాడా?”


            “పుస్తకాలు చదువుతాడు, జీవితాలు చదువుతాడు, సరేలే! నాలుగు రోజులు కదిలించకుండా ఉంటే వాడే సర్దుకుంటాడు.


            శంకరం లోపలికి నడిచాడు, వెంటే పార్వతి... కాని శంకరం అంచనా తప్పింది. మర్నాడు పేపర్లో వార్త. కానిస్టేబుల్ నాగరాజు తుపాకీ పేలి దుర్మరణం. శంకరం దిమ్మెరపోయాడు, నాగరాజే స్టేషన్ కి పరిగెట్టాడు. అంతా గుంపుగా ఉన్నారు. ఎస్.ఐ. బాధగా అన్నాడు చూశావా నీ ఫ్రెండ్ ఏంచేసాడో!


            కావాలనే చేసాడు, కాని ప్రమాదంగా రాద్దాం. కుటుంబానికి సపోర్టవుతుంది. చిన్నగా అన్నాడు. డిపార్ట్ మెంటు వాళ్ళు కాబట్టి అంతా పూనుకుని లక్ష్మికి రావలసినవన్నీ జాగ్రత్తగా వచ్చేట్టు చేసి డెత్ సర్టిఫికెట్ చేతిలో పెట్టారు. లక్ష్మి పిచ్చిదానిలా అయిపోయింది. ఏదో జరిగింది తనకు చెప్పట్లేదు.


... మీ అన్న నీడ పడనీయకు... ఏదో అనుమానం మనసులో మెలిగింది. “ఏమయిందిరా!” అడిగింది అన్నను, “నాకేం తెలుసు.” బింకంగా అన్నాడు. “ఏదో నువ్వే చేశావు? నాకు నీ మీదే అనుమానం” గట్టిగా అరిచింది. “వదిలెయ్యమ్మ! ఏం జరిగిందో డిపార్ట్ మెంటు చూసుకుంటుంది, వదిలెయ్.... అన్నాడు శంకరం అనునయంగా.


            “నేను నాలుగు రోజులుండనా లక్ష్మి దగ్గర” అడిగింది పార్వతి. నువ్వుంటే పాప ఎలా పార్వతీ! చూసి వస్తూండు నేను పాపను చూసుకుంటాను. “అమ్మా! లక్ష్మి! నువ్వు వచ్చెయ్, ఇల్లు ఖాళీచేసి, మన ఊరు వెళ్ళిపోదాం అన్నాడు సత్యం. “నేను రాను, మీరు వెళ్ళండి.” అక్కణ్ణుంచి నిర్లిప్తంగా వెళ్ళిపోయింది లక్ష్మి,


            అక్కడే ఉన్న శంకరం మనసులో బాధపడ్డాడు. వీడు కుటుంబం గురించి ఆలోచించకుండా ఇంత భయంకరమైన నిర్ణయం ఎలా తీసుకున్నాడు. సత్యం వెళ్ళిపోయాక లక్ష్మి పిల్లల్ని తీసుకుని శంకరం దగ్గరకు వచ్చింది.


            పార్వతీ! నేను పిల్లల్ని అనాధల్ని చేసి చచ్చి పోలేను ఆయనలా! ఎందుకు చేసాడో నాకు తెలియదు, ఇప్పుడు తెలుసుకోవాలని లేదు. తను మా అన్న నీడ పడనియ్యద్దన్నాడు. నేను పడనియ్యను. నాకు పసుపు కుంకాలుగా వచ్చిన ఎకరం పొలం, రాజు పిత్రార్జితం అయిన ఆ పాత ఇల్లు, పొలం అమ్మి నాకు, నా పిల్లలకు నిలువ నీడ ఉండేలా ఏర్పాటు చెయ్యండి. ఆ పెన్షను.. ఇల్లు... ఎలాగో పిల్లలను పెంచుకుంటాను. అన్నయ్యా! ఇక్కణ్ణుంచి నువ్వే నాకు అన్నగారనుకుంటా. ఎందుకంటే రాజుకి నువ్వంటే ప్రాణం, నమ్మకం, నాకూ అంతే నమ్మకం.”


            కాగితాలన్నీ శంకరం చేతిలో పెట్టి వెళ్ళిపోయింది శంకరం బాధగా ఆకాశం కేసి చూసాడు, రాజు ఎక్కడో ఉండి గమనిస్తూనే ఉంటాడని అతని నమ్మకం.


            కథ మారింది. కాని కొనసాగుతూనే ఉంటుంది. కామాలే కాని, ఫుల్ స్టాపులుండవు దీనికి.


            సుమారు నెలరోజుల తరువాత ఎస్.పి. త్రిపాఠి తన ఆఫీసు రూంలో కూర్చుని కాన్ఫిడెన్షియల్ అని ప్రత్యేకంగా వచ్చిన పోస్టు చూసుకుంటున్నాడు. అందులో చాలా వరకు తరువాత కాలంలో సాల్వ్ అయిపోయిన కేసులే. చివరగా ఒక కవరు తీసాడు చాలా లావుగా, బరువుగా ఉంది. ఇంత బరువుందేమిటి? అనుకుంటూ ఓపెన్ చేసాడు. ఏవో జిరాక్సు కాపీలు, చేతివ్రాత కాగితాలు పైన ఒక కవరింగు లెటరు. ఆసక్తిగా చూసాడు. అది అక్కడక్కడ ఇంగ్లీషు, తెలుగు కలగలుపుగా ఉంది. ఓపికగా చదివాడు.


“సార్! నమస్తే. ఇది మన జిల్లా బోర్డరులో ఉన్న ఊరికి సంబంధించిన వివరాలు సార్! అక్కడ సత్యం అనేవాడు ఒక క్రిమినల్. చిన్న చిన్న రాజకీయ నాయకులకు చెంచాగిరీ చేస్తూ ప్రభుత్వ స్థలాలు, పోరంబోకు భూములు తన పేర పట్టా పుట్టించుకుని హస్తగతం చేసుకుంటాడు. నేను ఈ విషయంలో ఇదివరకు కూడా స్థానిక పోలీస్ స్టేషన్ దృష్టిలోకి తీసుకువెళ్ళాను. కాని అది వర్కవుట్ కాలేదు. అంగన్ వాడీ కార్యకర్త సత్యవేణి వీడి వేధింపులు భరించలేక సూసైడ్ చేసుకుంది. వీడు హత్య చెయ్యలేదు. చచ్చేంత వరకు తన వేధింపులు సాగించాడు. ఆ అమ్మాయి వీడి లైంగిక వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది. నేను భూములకు సంబంధించిన కొన్ని పట్టా కాగితాలు, స్టాంపు పేపర్ల ఫొటోస్టాటులు మీకు పంపుతున్నాను. మీరు సిన్సియర్ ఆఫీసరని మీకు పంపుతున్నాను సర్!


            నాగరాజు తన వివరాలు కూడా దాపరికం లేకుండా పనిచేసే స్టేషను, ఊరు, పేరు అన్నీ రాయడంతో త్రిపాఠి ఆలోచనలో పడ్డాడు. అన్ని డిపార్టుమెంటులలో మంచివాళ్ళు, చెడ్డవాళ్ళు ఉన్నట్లే తమ డిపార్ట్ మెంట్లో కూడా ఉన్నారు. ఫైలు తను పర్సనల్గా ఎంక్వైరీ చేయించే కేసుల తాలూకా సొరుగులో పడేసి లాక్ చేస్తాడు.


            పి.ఎ.ని. పిలిచాడు, నాగరాజు స్టేషన్ వివరాలు కనుక్కున్నాడు. అతని మరణం గుర్తుచేసుకున్నాడు.


            “ఏమిటయ్యా! ఇది. కనీసం తుపాకీ క్లీన్ చేసుకోవడం, లోడ్ చేసుకోవడం కూడా రానివాళ్ళు మన డిపార్టుమెంటులో ఇంతమంది ఉన్నారు? కనీసం ఏడెనిమిది నెలలలో ఒకసారి ఇలాంటి వార్తలు పేపర్లలో చూస్తూనే ఉంటాం. ఎలాంటి వాడితను? ఆసక్తిగా అడిగాడు.


            “ఎస్ సర్! నేను ఆ స్టేషన్ ఎస్.ఐ.ని అడిగి వివరాలు సంపాదిస్తాను అన్నాడు పి.ఎ.


              అతనికి తెలుసు, ఎస్.పి. త్రిపాఠి మామూలుగా అడిగినట్టున్నా అది ఆర్డరే. కొన్నాళ్ళు టైమిచ్చి విషయం అడుగుతాడు. అడిగినట్టు ఉండదు. గుర్తుచేసినట్టు, గుర్తుచేసుకున్నట్టు ఉంటుంది. కాని నిజానికి అప్పటికి ఆ విషయసేకరణ పూర్తయిపోవాలి. మెత్తని కత్తి, మృదువుగా మాట్లాడుతూనే కావలసిన విషయం రాబట్టుకుంటాడు. “సరే! వెళ్ళు” అని అతనిని పంపించేసి తనరోజువారీ డ్యూటీలో పడ్డాడు. త్రిపాఠి మనసు, మెదడు గదులు గదులుగా ఉంటుంది. ఒక్కొక్క అంశాన్ని ఒక్కొక్క గదిలో నిక్షిప్తం చేస్తాడు. అవకాశాన్నిబట్టి బయటికి తీస్తాడు. సిన్సియర్, సీనియర్, స్ట్రిక్టు ఆఫీసరు. ఫ్యామిలీ మొత్తం ఢిల్లీలోనే ఉంటుంది. ఎప్పుడైనా పెళ్ళాం బిడ్డలు వస్తారు. నాలుగురోజులుండి వెళ్ళిపోతారు. ఆ నాలుగు రోజులు మాత్రం అతను డ్యూటీ అవర్స్ మాత్రమే చేస్తాడు. మిగతా రోజులలో అతను ఇరవై నాలుగు గంటలూ డ్యూటీలోనే ఉన్నట్టు ఉంటాడు. జిల్లాలోని ప్రతి స్టేషన్ డేటా అతని పర్సనల్ కంప్యూటర్ లో నిక్షిప్తమై ఉంటుంది. ఆ విషయం చాలామంది కానిస్టేబుళ్ళకి తెలియదు.


            ఒకసారి ఎలక్షన్ డ్యూటీలో తాగి తూలుతూ నడుస్తూ, బూతులు మాట్లాడుతున్న సి.ఐ. ని పట్టుకున్నాడు. అది నొటోరియస్ ఏరియా, హత్యలు, బూత్ కాప్చరింగులు ఎక్కువ. త్రిపాఠి సడన్ విజిటికి వెళ్ళేసరికి ఇది సీను. కిటికీలలో నుంచి ఈ దృశ్యాన్ని చూస్తున్న పి.వో.లు., ఏ.పి.వో.లు కంగారుగా ఎక్కడి వాళ్ళక్కడ సర్దుకున్నారు. పాలకపక్షం వాళ్ళు మాత్రం పారిపోయారు. ప్రతిపక్షం గల్లీ నాయకులు ఎంజాయ్ చేస్తూ అక్కడే నిలబడి వాళ్ళూ దొరికిపోయారు.


            అంతా వీడియో షూట్ చేయించి, జిల్లా మొత్తం సర్క్యులేట్ చేయించాడు. దాంతో బెదిరి జనం అంతా గోల లేకుండా గమ్మునున్నారు. అతని పర్యవేక్షణలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. అతను ప్రతి ఊళ్ళోనూ కొంతమందిని వెదికి పట్టుకుని తనకు కావలసిన విషయసేకరణ చేసుకుంటాడు. అదే సమయంలో ఆఫీషియల్గా తన క్రింద ఆఫీసర్లు ఇచ్చిన సమాచారాన్ని పోల్చిచూసి విశ్లేషించుకుంటాడు. ఇదంతా పైకి తెలియకుండానే జరిగిపోతుంది. త్రిపాఠి వచ్చాక చాలామంది ఎస్.ఐ.లు, సి.ఐ.లు, కానిస్టేబుళ్ళు వర్క్ విషయంలో, రికార్డులు మెయిన్ టెయిన్ చేయడంలో జాగ్రత్తపడ్డారు. అయితే త్రిపాఠి నోటిమాటగానే స్ట్రిక్టు వార్నింగు ఇస్తాడు. అతని గొంతు వింటేనే డిపార్టుమెంటు వణుకుతుంది. అయితే పేపర్ పై పెట్టి వాళ్ళ కెరీర్, కుటుంబ జీవితాలు నాశనమయ్యేదాకా తీసుకురాడు. ఏమీ చెయ్యడుకాని ఏం చేస్తాడో అనే వణుకు పుట్టించి ఒళ్ళు దగ్గరపెట్టుకు పనిచేసేలా చూస్తాడు.


            రక్తపు మడుగులో ఉన్న సరోజ శవాన్ని చూసి నాగరాజు రగిలిపోయాడు. వణికిపోయాడు. తప్పు చేసారు. తప్పు దిద్దుకునే ప్రయత్నము చేసారు. అన్ని లుచ్ఛాపనులు చేసే నా కొడుకు తన తప్పులు కిందేసుకు కూర్చొని అభం శుభం తెలియని ఆడపిల్లని క్రూరంగా హత్య చేసాడా! వీణ్ణి వదలకూడదు. వీడికి శిక్షపడాలి. ఐతే సరోజకి మచ్చ రాకూడదు. అలా రగిలిపోతున్న సమయంలో వాడు తమ ఇంట్లో దాచిపెట్టుకున్న కాగితాలు గుర్తుకు వచ్చాయి.


            బావా! మేము ఊరెడుతున్నాం. కొన్ని డాక్యుమెంట్లు భద్రతకోసం మీ ఇంట్లో పెట్టుకుంటాం. వచ్చాక తీసుకుంటాం అన్నాడు. నాగరాజు ఆ విషయం పెద్దగా పట్టించుకోకుండానే కవర్లో పెట్టి బట్టల బీరువాలో పెట్టు. నేనూ, లక్ష్మీగా ఎవరూ తియ్యరు” అన్నాడు. ఆ తరువాత ఆవిషయమే మర్చిపోయాడు.


ఆ విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఆరాత్రి లక్ష్మి పడుకున్నాక అన్నీతీసి జాగ్రత్తగా చదివాడు. సరోజను చంపిన పాపానికి వీణ్ణి వదలకూడదు అని నిర్ణయించుకున్నాడు. అన్నీ ఫొటో స్టాటులు తీయించాడు. ఒరిజినల్స్ బ్యాంకులాకర్లో భద్రపరిచాడు. నేను చచ్చినా నిన్ను వదలను అంటూ బావమరిదికి లేఖరాసి తనువు చాలించాడు లక్ష్మీ! నన్ను క్షమించు, నువ్వు పిల్లలు అన్యాయమైపోతున్నారు. నాకు తెలుసు లక్ష్మీ నేను నీకు తీవ్రమైన అన్యాయమే చేస్తున్నాను. పిల్లలు జాగ్రత్త. కాని జీవించి క్షణ క్షణం నరకయాతన పడలేను అని మనసులోనే పదే పదే లక్ష్మిని క్షమాపణ వేడుకున్నాడు. సరోజని తీసుకువచ్చేటప్పుడు ఏ ఉద్దేశమూ లేని నాగరాజు జీవితం ఈ మూడు నాలుగేళ్ళలో ఎన్నో మలుపులు తిరిగి ముగిసిపోయింది.


            ఒకరోజు సత్యం హఠాత్తుగా వచ్చాడు. వచ్చినవాడు సరాసరి బెడ్రూంలోకి వెళ్ళి చెల్లెలి బట్టల బీరువా అంతా కలగాపులగం చేసి బట్టలు మంచంమీద పడేసి వెదకడం మొదలుపెట్టాడు. వంటింట్లో ఏదోపనిలో ఉన్న లక్ష్మి ఏమిటో అలికిడి అనుకుంటూ ఎవరూ అంటూ బయటికి వచ్చింది. వెనక నుండి సత్యాన్ని ఎవరెవరు? అంటూ గట్టిగా పట్టుకుంది. వెనుదిరిగిన సత్యాన్నిచూసి “నువ్వా?” అంటూ వదిలేసింది.


            “ఏమిటిదంతా? ఏం వెతుకుతున్నావ్? ఒక్కమాట చెప్పకుండానే ఏమిటివన్నీ తీసి చిందరవందర చేసి పడేసావు?” అంది కోపంగా.


            సత్యం కాస్త తగ్గాడు. ఏం లేదమ్మా! బావగారికి కొన్ని కాగితాలు దాచి పెట్టమని ఇచ్చాను. అవి తీసుకెళ్తామని..


“ఐతే ఇదా పద్దతి? నాకు చెప్పనక్కర్లేదా? నన్ను అడగకర్లేదా? జులుము చేసినట్టు ఇదేమిటి?” అంది మరింత కోపంగా.


            “అబ్బే! నువ్వు వంటింట్లో పనిలో ఉన్నావుగా” అని తేల్చేయ్యబోయాడు.


            “ఎవరో చూడకుండానే అలికిడికి పచ్చడిబండ పట్టుకొచ్చి బుర్ర బద్దలుకొట్టేదాన్ని. ఇప్పుడే వంటింట్లోకి వెళ్ళాను. అసలే దిక్కూ దివాణం లేనిదాన్ని'... మరింత రెచ్చిపోయింది. “సారీ! అమ్మా! అందుకే మనింటికి వచెయ్యమన్నాను” .... సర్దిచెప్పబోయాడు.


            అమ్మా! లక్ష్మీ! బావగారు నీకేమైనా కాగితాలు ఇచ్చారా? నేను ఇచ్చికూడా చాలాకాలమైంది. గొంతు మృదువుగా మార్చి అడిగాడు.


            “నాకేమీ ఇయ్యలేదు, చూడలేదు. ఆయన ఏమి దాచినా అడుగు పొరుగులో పెడతారు. చూడు” అంటూ వెళ్ళిపోయింది వంటింట్లోకి.


              సత్యం అమ్మయ్య అనుకుంటూ అడుగు పొరుగు లాగాడు. అర అంతా ఖాళీ.... షాకయ్యాడు. గబగబా వంటింట్లోకి వెళ్ళాడు. “లక్ష్మీ అడుగు సొరుగులో ఏంలేవు. నీకేమీ ఇవ్వలేదా?”


            “ఏమిటి అంత కంగారు? ఏమున్నాయందులో, అసలు నువ్వు ఏమిచ్చావో, ఎప్పుడొచ్చావో కూడా నాకు తెలియదు.” లక్ష్మి తలెత్తి సత్యం ముఖంలోకి చూస్తూ అంది.


            సత్యం తత్తరపాటుగా చూసాడు.


            “సర్లే! మనింట్లోనే ఎక్కడో పెట్టిమర్చిపోయుంటాను. వస్తానమ్మా! ఇంటికెళ్తున్నా ఏదయినా అవసరముంటే చెప్పు.” అంటూ హడావుడిగా వెళ్ళిపోయాడు.


            వీధి తలుపు తెరిచి ఉంచకూడదెప్పుడూ! వీడు కాబట్టి సరిపోయింది అనుకుంటూ తలుపులు వేసేసుకుంది. వంట పూర్తి చేసుకుని బుజ్జిగాడ్గ స్కూలు నుండి తీసుకురావాలి అనుకుంది.


            సత్యం శంకరం పనిచేసే స్టేషన్ కి వెళ్ళాడు. సత్యాన్ని చూస్తూనే సరోజ గుర్తుకువచ్చి శంకరం రక్తం మరిగిపోయింది.


            “ఏం కావాలి?” అనడిగాడు కటువుగా.


            “మా బావగారు మీదగ్గరేమైనా కాగితాలు దాచారా?” అనడిగాడు. “కాగితాలేమిటి? దాచడమేమిటి?” మరింత సీరియస్గా అన్నాడు శంకరం.


            “అబ్బే! నేను మా పొలం దస్తావేజులు, పట్టాభూమి పాస్ పుస్తకాలు దాచిపెట్టమని ఆయన చేతికి ఇచ్చాను. మీకు ఇచ్చేరేమోనని...” నసిగాడు.


            “నా కెందుకు ఇస్తాడు? మీ చెల్లెలికిచ్చాడేమో! కనుక్కో” కసిరినట్టని లోపలికెళ్ళిపోయాడు. శంకరం కోపం, మాటతీరుబట్టి శంకరానికి ఇవ్వలేదని నమ్మకం ఏర్పడింది సత్యానికి.


            ఎక్కడపెట్టి ఉంటాడు? ఆలోచన తోచలేదు. సరే అవసరం వచ్చినప్పుడు చూద్దాంలే అనుకుంటూ తన ఊరు వెళ్ళిపోయాడు.


            ఆర్.డి.ఓ. ఆఫీసు నుండి నోటీసు వచ్చింది. భూమి లేకుండా పట్టాదారు పుస్తకం ఎలా వచ్చిందని? దాని వెనకాలే లోను తీసుకున్నందుకు బ్యాంకు నోటీసు.


            ఈలోగా పుండు మీద కారం చల్లినట్టు, సత్యవేణి ఆత్మహత్య కేసు తిరిగి ఓపెన్ చేస్తున్నట్టు కోర్టుకు రావాలని కోర్టు నోటీసు...


            సత్యం కంగారుపడిపోయాడు. ఇన్నాళ్ళు పిల్ల జమిందారులా తిరిగి ఒకేసారి ఇన్ని చిక్కులు చుట్టుముట్టాయేమిటి? అనుకున్నాడు. తను నమ్ముకున్న నాయకుడు దగ్గరకు పరిగెత్తాడు. | “మనలాంటి వాళ్ళకు ఇలాంటివి మామూలే ఏముంది? జరగనీ! ఎలా వచ్చాయో అలాగే గాలికి కొట్టుకుపోతాయి” అన్నాడు మామూలుగా తీసుకుంటూ.


            “అదికాదు సార్! మీరు కొంచెం విషయం తెలుసుకుని నన్ను బయటపడెయ్యాలి” అన్నాడు బతిమాలుతూ పెళ్ళున నవ్వాడాయన.


            “బయటపడెయ్యడానికి నువ్వింకా లోపల పడలేదు గదయ్యా బాబూ! ముందు లోపల పడు. తర్వాత బయటపడెయ్యడం గురించి ఆలోచిద్దాం” అన్నాడు అదేదో గొప్ప జోకన్నట్టు.


            సత్యానికి మండిపోయింది, కాని తన కోపమే తన శత్రువు అనుకుంటూ లోపల్లోపలే పళ్ళు నూరుకున్నాడు.


            సత్యవేణి తల్లిదండ్రులను కలుసుకున్నాడు. వాళ్ళని బెదిరించాడు, బ్రతిమాలాడు. డబ్బు ఎరచూపాడు, పాతిక, యాభై.... అంటూ లక్షవరకు ఆశచూపాడు. లక్ష రూపాయలకు బేరం కుదిరింది.


తల్లి తన చేత్తో స్వయంగా తీసుకుంది, తండ్రి తల్లిని అసహ్యంతో, అసహనంతో చూసాడు, సత్యం వెళ్ళేదాకా ఆగి తుపుక్కున రోడ్డుమీద ఊసాడు.


            “సిగ్గులేని ముఖందానా! చచ్చింది నీ కూతురే! పాపిష్టి దానా! నువ్వు తల్లివటే!” తల్లి ఒక వెర్రి నవ్వు నవ్వి డబ్బు భద్రపరచింది విడదీసి రెండు మూడుచోట్ల... తనకు మాత్రమే తెలిసేచోట. జిల్లా స్థాయి మేజిస్ట్రేట్ సమక్షంలో కోర్టు సత్యాన్ని ప్రశ్నించింది. సత్యవేణి తల్లిదండ్రులొచ్చారు.


            తల్లి ఏడుస్తూ “ఈయనవల్లే నా కూతురు చచ్చిపోయింది బాబూ! పడక సుఖం గురించి వేధించాడు. అది ఎవరినో ప్రేమించి పెళ్ళి చేసుకోవాలనుకుంది. ఈ వేధింపులు భరించలేక ఊరేసుకు చచ్చిపోయింది బాబూ!


            తన పేరు బయటకు రాకుండా ఉండడానికి యాభైవేలు ఇస్తానని బేరం పెట్టాడు బాబూ! కన్న పేగు బిడ్డ మరణానికి వెలకట్టుద్దా బాబూ! నేనెలా డబ్బు తీసుకుంటాను? శిక్ష ఎయ్యండి బాబూ! చంపలేదు. కాని చచ్చేదాకా వెంటబడి తరిమాడు. నేను డబ్బు తీసుకోలేదు. కాని ఇలా చెప్పానని నాకేదైనా అపకారం తలెడతాడేమో బాబూ! వీడి దరిద్రపు గుంపు ఒకటి ఉందయ్యా! నాకు ఇంకా బిడ్డలున్నారు. ఇంకొక ఆడకూతురు కూడా ఉంది” అంది భోరున ఏడుస్తూ,


            సత్యాన్ని రిమాండులోకి తీసుకున్నారు. అమ్మ ముసలినక్కా డబ్బు దొబ్బి... ఇలా చెపుతావా? నీ అంతు చూస్తానే” అంటూ రెచ్చిపోయాడు. “చూసారా! బాబూ! నాకు ఈయన్ని చూస్తే భయమేస్తోంది బాబూ! మీ ఎదురుగానే ఎలా అంటున్నాడో.... భయం భయంగా అంది. గవర్నమెంటు ప్లీడరు సత్యం మీద బైండోవరు కేసు కూడా పెట్టాడు.


            భూకబ్జా, బ్యాంకు చీటింగ్, లైంగిక వేధింపుల క్రింద ఒకేసారి మూడు కేసులు బుక్ అయ్యాయి. కోర్టు వాయిదాలమీద వాయిదాలు వేస్తూనే ఉంది. సత్యానికి బెయిల్ రాలేదు. వదినగారు బిక్కుబిక్కుమంటూ ఒక్కత్తే ఉండలేక లక్ష్మి దగ్గర కొచ్చింది. సత్యం నమ్ముకున్న ఫోటానాయకులెవరూ ఈ పనికిమాలిన వాడికోసం మన చేతులకు మట్టి ఎందుకు రాసుకోవాలని నిశ్శబ్దమైపోయారు.


            భర్త పోయిన దుఃఖంలో ఉన్న లక్ష్మి ఈ విషయాలేవీ తెలుసుకోలేదు. ఇప్పుడు వదినగారు చెబుతుంటే ఏదో లీలగా అర్థమవుతున్నట్లుంది. నాగరాజు మరణానికి సత్యానికి ఎక్కడో సంబంధం ఉందనిపిస్తోంది.


            అదే మాట చూసిపోవడానికి వచ్చిన పార్వతిని అడిగింది. “ఏమో! లక్ష్మీ! నాకిలాంటి విషయాలు తెలియవు. నాకు మీ అన్నయ్య చెప్పరుకూడా!” అనేసింది.


            పార్వతి చేతిలోని పాపను చూసి మురిసిపోయింది. “బొద్దుగా, ముద్దుగా బాగుంది పార్వతీ! నా దుఃఖంలో నేనుండి గమనించనే లేదు. ఎవరి పాప?” అంది “తెలుసున్న వాళ్ళ అమ్మాయి. తల్లి పురిటిలో చచ్చిపోయింది. తండ్రి చిన్న వయసు, మళ్ళీ పెళ్ళి చేసుకుంటే పాప పరిస్థితి ఎలా ఉంటుందో” అని మేము దత్తత తీసుకున్నాం. తెలుసున్నవాళ్ళు. సమస్య లేదని...


            అదీ కాక పిల్లల్ని పెంచుకుంటే పిల్లలు పుడతారంటారు కదా! కాని మీకు ఇప్పుడిదే కంటి వెలుగు. ఒక్కమాటలో చెప్పాలంటే మా పిల్ల ఇదే అనుకో!” అంది మురిసిపోతూ.


            లక్ష్మి తన రెండో కొడుకుకు రాజేష్ అని పెట్టుకుంది. వాడికిప్పుడు ఆరు నెలలు వచ్చాయి. ఒక్కొక్కరోజు లక్ష్మికి రాత్రి నిద్రపట్టదు. నాలుగేళ్ళ బుజ్జిగాడు, ఆరు నెలల పసివాడు.


            రాజు తన మనసును పూర్తిగా తనతో పంచుకోలేదా? తన మీద నమ్మకం లేదా? ఊరందరి గురించి ఆలోచించే రాజు తన గురించి, కన్న పిల్లల గురించి ఆలోచించలేదా? నిజంగా అది ప్రమాదమేనా? ఏదో గాలివాటానికి కొన్ని మాటలు చెవిలో పడ్డాయనిపించింది. ఏదో మనసులో మెదులుతోంది.


            ఇది పనికాదు ఏదో దారి ఏర్పరచుకోవాలి. తన టెన్త్ క్లాసు సర్టిఫికెట్టుకి ఏం ఉద్యోగాలు వస్తాయి. శంకరం అన్నాడు పోలీసు డిపార్టుమెంటులో ఏదో చిన్న ఉద్యోగం దొరక్కపోదని, తన మొగుడే చెయ్యలేకపోయాడు. ఆ డిపార్టుమెంటులో తానెలా చేయగలుగుతుంది.

***

No comments:

Post a Comment

Pages