వంతుల జీ(వి)తం - అచ్చంగా తెలుగు

వంతుల జీ(వి)తం

Share This

వంతుల జీ(వి)తం

బట్టేపాటి జైదాస్


                    "ఇదెక్కడిన్యాయం సారూ..! పాతికేళ్ల సర్వీసున్న నాకు ప్రభుత్వమిచ్చే జీతంకన్నా మీరు చందాలేసుకుని అటెండరుకిచ్చే జీతమే ఎక్కువుంది. ఇక ఈ సుఖంలేని సర్కారీ కొలువు ఒరగబెట్టి నేను సంపాదించుడేముంది? సంసారాన్ని ఈదుడేముంది?ఆ'పేషీ'లో పైసలు పెడితేతప్ప మా 'ఫేసులు' చూసే వాళ్లుండరు. నా జీతం అక్కడికెళ్ళి రావడానిక్కూడా చాలకపోయే.ఇక నేనేం జేసుడు? నా బాధలెవరికి జెప్పుకోను? దీనికన్నా ఏ ప్రైవేటుజ్జోగమో జేస్కోడం నయమనిపిస్తోంది." 'పార్ట్ టైమ్ పద్దు' మాటలకు ప్రిన్సిపల్ గారి ఫేస్ లో రంగులు మారేయి.ఎక్కడైతేనేం తెలుగు రాష్ట్రాల్లోని ఓ ప్రభుత్వ జూనియర్ కాలేజి అది.'కట్టప్ప'గా పిలుచుకునే ఒకేషనల్ లెక్చరర్ 'కిష్టప్ప', 'పార్ట్ టైం పద్దు' అని ముద్దుగా పిలుచుకునే ల్యాబ్ అసిస్టెంట్ 'పద్మ' 'పార్ట్ టైం' గా పనిచేస్తున్నారక్కడ. ఎప్పట్నించి పన్జేస్తున్నారంటే గుక్కతిప్పుకోకుండా లెక్కపెట్టాల్సి వస్తుండడంతో ఆ కాలేజీకి ట్రాన్స్ ఫర్ల మీద వచ్చే,పోయే వాళ్లంతా 'ఆల్ టైం ఫుల్ పార్ట్ టైమర్స్'గా పిలుస్తుంటారు.ఏళ్ల తరబడి ఒకే ఊరు,జీ(వి)తం వారికి సొంతం.పేరుకు 'పార్ట్ టైం'అయినా చేసేవన్నీ 'ఫుల్ టైం' పనులే.వాళ్లకు రాని,వాళ్ళుచేయ(లే)ని పనంటూ లేదు.కాలేజిలో తెలియని విషయమంటూ లేదు.ఏ పని చెప్పినా కా(రా)దనరు.ప్రతి పనికీ 'పనికొస్తారు.' 'పద్దు' ఆఫీసులో రాయని పద్దంటూ లేదు.పనుల కోసం వేయని స్టెప్పంటూ లేదు.కడగని కప్పంటూ లేదు.ఆఫీస్ స్టాఫు,అటెండర్లు  లేకపోవడం వల్ల అన్నిటికీ వాళ్లే దిక్కయ్యారు.ఇద్దరూ ఉన్నత విద్యావంతులే.కానీ టైం బాగోలేక పార్ట్ టైమ్ పాలబడ్డారు. కనుచూపుమేరలో కానరాని 'క్రమబద్దీకరణ' కోసం 'కళ్ళు కాయలుకాసేలా' ఎదురుచూసి క'న్నీటికాసు'లొచ్చి ఆపరేషన్లయ్యాయే తప్ప వారి ఆశలు మాత్రం తీరలేదు. 'అరకొర జ్ఞానంతో 'అడ్డమైన పట్టాలు' తెచ్చుకుని సంపాదనే ధ్యేయంగా 'చదువు కొన్నోళ్లు' కూడా చక్కటి బోధకులుగా చలామణీ అయిపోతుంటే, కట్టప్పలాంటోళ్లు మాత్రం 'వంతుల జీ(వి)తం పంతుళ్లు'గానే మిగిలిపోయారు. జీతం కట్టప్పకు పదివేలు కాగా,పద్దుకు మూడువేలే. ఈ రోజుల్లో ఆ జీతంతో ఎలాబ్రతకాలో ఆ ప్రభుత్వానికే ఎరుక.ఇక 'వేతనాలు' 'వేదనలు' పెట్టకుండా వస్తే వారికి 'వేడుకే'. అవి ఏడాదిలో ఎప్పుడొస్తాయో ఎరిగినవాళ్లెవరూ లేరు.ఎప్పుడైనా రావచ్చు. రాకపోనూవచ్చు. అయినా ఇతర అవకాశాలన్నీ వదులుకొని, 'ఎప్పుటికైనా తమ'వంతు' రాకపోతుందా, రెగ్యులరై తామూ సంపాదించక పోతామా' అనే భ్రమతోనే బ్రతుకు నెట్టుకొచ్చేస్తున్నారు.అందుకే ప్రిన్సిపల్ గారికి నోటమాట పెగల్లేదు.అయినా ఏం మాట్లాడ గలడు? పాపం ఇప్పుడాయన పరిస్థితే అటెండర్ కన్నా ఘోరంగా ఉంటేను.అటెండర్ వెంకటేశం రిటైర్ కావడంతో కాలేజి తాళాలు తీయడం, క్లాస్ రూమ్స్ ఊడ్పించడం కూడా ప్రిన్సిపల్ పైనే పడ్డాయి. 'ఫీజుల్లేని ప్రభుత్వ ఉచిత విద్య పరోక్ష ఫలితమది. 'నిధులు అరకొరగా ఇస్తుండడంతో అత్యవసరాలే తీరక, తప్పనిసరి పరిస్థితుల్లో స్టాఫ్అంతా తలాకొంత వేసుకొని'నెలకు నాలుగువేలిచ్చి కుటుంబంతో కాలేజి ముందున్న కుటుంబరావును పనికి పెట్టుకోవాలనుకున్నారు.ఇప్పుడదే ఆమె ఆవేదనకు కారణం.వెంటనే అందుకొని కట్టప్ప "నీవన్నది నిజమే... ఇన్నేళ్లయినా ఎదుగుబొదుగూ లేదని యాతన పడుతున్నాం.కానీ మన సగం సర్వీసులో పాతిక భాగం కూడాలేని కాంట్రాక్టు వాళ్ళు ఇప్పటికే రెండు సార్లు జీతాలు పెంపు చేయించుకుని నలభైవేలదాకా తీసుకుంటున్నారు. మన కళ్లముందే ఇలా వచ్చి,అలాఎదిగి,         పై స్టేజీల కెళ్లిపోతున్నారు. అయినా మనమేమీ చేసుకోలేకపోతున్నాం గదా?" అన్నాడు నిస్సహాయంగా. అతని వేదన వెనుక దీర్ఘకాలంగా పడిన,పడుతోన్న పాట్లున్నాయి. 'బ్లడ్ బాయిల'య్యే బాధలున్నాయి. 'కాష్టం'లా కాలుతోన్న కష్టాలున్నాయి.ప్రభుత్వం కాంట్రాక్టు లెక్చరర్ల  వేతనాలుపెంచి,వేసవిలో పనిచేయని కాలానిక్కూడా జీతాలివ్వడమేగాక,ఉద్యోగ భద్రతతో సహా, ఆడిగినవన్నీ కల్పిస్తోంది.కానీ ఏళ్లతరబడి శ్రమదోపిడీకి గురవుతూ, దయనీయస్థితిలో వున్న 'పార్ట్ టైం'లెక్చరర్ల గురించి మాత్రం అసలు పట్టించుకోవడంలేదు. అదేమంటే వాళ్ళు ఫుల్ టైం,మీరు పార్ట్ టైం అంటోంది.దీనితో కాంట్రాక్ట్ వాళ్లు సీనియర్స్ ని లెక్కచేయకుండా,తమకిక తిరుగులేదన్నట్లు ప్రవర్తించడం కట్టప్ప కడుపుకోతకు కారకమవుతోంది. "అంతెందుకు నా స్టూడెంట్ లత 'రికార్డ్ అసిస్టెంట్' గా చేరి అంచెలంచెలుగా ఎదుగుతూ మన కాలేజీలోనే 'యుడిసి'గా చేరిందికదా! ఆమె నాన్ టీచింగ్ పదిశాతం రిజర్వేషన్ కోటాలో ఉంది.రేపోమాపో ఇక్కడే లెక్చరర్ గా ప్రమోట్ కావచ్చు.రెగ్యులర్ పోస్ట్ ఆమెదే గనక ప్రిన్సిపల్ గారు లీవ్ పెడితే నాకు 'ఇంచార్జ్ బాస్' కూడా ఆమే అవుతుంది. గురువుగా గర్వపడాలో,లేక ఉద్యోగిగా ఉడుక్కోవాలో తెలీని పరిస్థితి నాది.ఇప్పటికే కాంట్రాక్ట్ వాళ్ళలో చులకనైపోయాను.ఇక నాకు, నా పోస్టుకి విలువేముంది?" కట్టప్పలో 'నివురు గప్పిన నిస్సహాయత' నిప్పులా రాజుకుంటోంది.అదీ నిజమే'వాటా' ఇస్తే'కోటా'ను దాటించయినా ప్రమోషనిస్తామ'న్నా ఆమె ఒప్పుకోక ఆగింది గాని,లేకుంటే ఈ పాటికే గురువు గారి సరసన గాక, ఏకంగా 'శిరసు'నే చేరి పోయుండేది.ఇలాంటి విచిత్ర,విపరీత పరిస్ధితులకెన్నిటికో నిలయం విద్యాశాఖ.ఉద్యోగం చేస్తోన్న తండ్రో,భర్తో చనిపోతే, అప్పటిదాకా బయటి ప్రపంచం తెలీని డిపెండెంట్లు చదువులేకున్నా, 'చదువుకొని' ఏ 'జూనియర్ అసిస్టెంట్' గానో చేరిపోతారు.మూడు,నాలుగేళ్లు 'మమ' అనిపించి ' పిజీ పట్టాలు', అవి కూడా పోటీ తక్కువుండే సబ్జక్టుల్లోనే తెచ్చుకొని లెక్చరర్ గానో,లైబ్రేరియన్ గానో ప్రమోషన్ తెచ్చుకుంటారు.వీళ్లలో  కొందరు చక్కగా అన్నీ నేర్చుకొని బాధ్యతగా ఉంటున్నా,కొందరికి బాధ్యత గుర్తుచేసి,బాగుచేసే విధానాలు లేక  వాళ్ళుచెప్పే పాఠాలే ఓ ప్రహసనమవుతున్నాయి.కామర్స్ సబ్జక్ట్ అయితే పోటీతక్కువని పీజీ పట్టా తెచ్చుకున్న ఒకాయన,పాఠాలు రాక,మరో లెక్చరర్ తో చెప్పించుకున్నా అర్ధంగాక,చేతిమీద లెక్కలేసుకుని క్లాసు చెప్పడం ప్రిన్సిపాల్ గారెరుగుదురు. కనీసం జాతిభవిష్యత్తును నిర్ణయించే విద్యాశాఖలోనన్నా నిబంధనలు ఖచ్చితంగా పాటించకపోవడం వల్లే ఈ పరిస్థితి దాపురిస్తోంది.ఇక కొందరు లైబ్రేరియన్ లైతే  ఏకంగా ప్రభుత్వానికే అల్లుళ్ళలెక్కన అనుభవించడానికే పుట్టినట్టుంటారు. వేషభాషల్లో రాజకీయ నాయకుల్లా దర్జా వెలగబెడుతుంటారు. పగలంతా పనులు చూసుకొని, రెండుపూటలా 'బయోమె'ట్రిక్కు'లేసే వీళ్ళని ఆడిగినోడికి మిగిలేది అంతులేని అనుభవభారమే. 'గవర్నమెంటుకు సర్వెంట్లు'గా పని చేసేవాళ్ళు కొందరైతే,ఆ 'గవర్నమెంట్ నే సర్వెంట్ గా' వాడుకునేటోళ్లు మరికొందరు. కనుకనే ఒప్పందంపోళ్ళ పనులన్నీ చక చకా జరిగిపోయాయి. ఇవన్నీ ఇంత త్వరగా ఎలా సాధ్యమవుతున్నాయో పాతకాలపు ప్రిన్సిపల్ గారికి వీడని'మిస్టరీ'గానే వుంది.అదే అడిగేరు కట్టప్పని."ఇందులో అర్ధం కానిదేముంది సర్!  'ఒప్పందం' వాళ్ళు వేలల్లోఉన్నారు తలా ఓ పది వేలేసుకున్నా కోట్లలోనే వస్తాయి. వ్రేళ్ళమీదలెక్కపెట్టగలిగే మేమిచ్చేది ఏమూలకి? అందుకే అధిక ఆదాయమిచ్చేపనులు ఆలశ్యంలేకుండా ఆయిపోతున్నాయి.ఓ రకంగా వాళ్లను ఇలా తయారు చేసింది కూడా ఈ ఒప్పందపోళ్ళే.అడ్డమైన దానికల్లా 'అమ్యామ్యా' లిచ్చి  అనుమతులు తెచ్చుకోవడం వల్ల వాటికి అలవాటుపడ్డ వాళ్ళు 'మామూలుగా' ఇవ్వాల్సిన వాటినికూడా తొక్కిపెట్టి 'మామూలు' ఇచ్చాకే చేద్దామన్న ధోరణితో ప్రవర్తిస్తున్నారు.వీటికి అలవాటుపడ్డ మధ్యవర్తులే ప్రభుత్వాధినేతల్ని పక్కదారి పట్టిస్తూ మాలాంటి వారి జీవితాలతో అడుకుంటున్నారు.మా బాధల్ని నేరుగా ప్రభుత్వానికి చెప్పుకునే దారేలేకుండా పోయింది.ఇక రెగ్యులర్ లెక్చరర్ల క్కూడా 'రోదన' తప్పడం లేదు. 'నెత్తిన జుట్టంతా ఊడేలా సంవత్సరాల తరబడి చదివి సంపాదించుకున్న ఉద్యోగం, 'ఒప్పందం'చేసుకున్న వారి పుణ్యమాని సొంతూర్లో చేసే గతిలేకుండా పోయింద'ని నెత్తి, నోరూ బాదుకుంటూ  ఏ మారుమూలో పనిచేస్తుంటే వీళ్ళకి మాత్రం అయాచితంగా, అనాయాసంగానే ఉన్నూళ్ళోనే ఉద్యోగాలొచ్చి, అలవోకగా అన్నీ అమరిపోయాయి.ఉద్యోగ భద్రత వల్ల బాధ్యతలు లేకపోయినా వారి, జీ(వి)తాలు భద్రంగానే ఉండి,ఎవరికీ భయపడాల్సిన పని లేకుండా పోయింది. దాంతో ఎవరినీ లెక్కచేయకుండా ప్రవర్తిస్తున్నారు. ప్రపంచీకరణ పుణ్యమాని, ప్రపంచబ్యాంకు షరతులతో 'కాంట్రాక్టు సిస్టం' తెచ్చేక బాధ్యతలేని వారికే 'భవిష్యత్ బంగారం'లాగుంది.ఇక చదువు సంధ్యా లేకున్నా,కోట్లకొద్దీ ఆస్తులున్నా, రాజకీయ నేతలు ఆత్మ వంచన లేకుండా 'పింఛను' పొందుతున్నారు.కానీ ముప్పయ్యేళ్లు ఊడిగం చేసిన మాకు మాత్రం పైసా పెన్షన్ రాదు.ఓ గ్రాట్యుటి లేదు.కోర్టుకెళ్లి అనుకూలంగా తీర్పు తెచ్చుకున్నా, ఓ నెల హడావిడిచేసి వివరాలన్నీ తీసుకోవడం,ఆ తర్వాత అటకెక్కించడం, పదేపదే కోర్టులచుట్టూ తిరగలేక మేము మిన్నకుండి పోవడం పరిపాటే.'ఎంత ఏబ్రాసి పెళ్ళామైనా ఏదో ఒకనాడు 'పతి'మాట పాటించగలదేమో గాని కోర్టు మాట ప్రభుత్వం పాటించడం మాత్రం కల్ల'ని తేలిపోయింది.." 'కష్టాల కొలిమిలా కాలుతోన్న కట్టప్పను ఆపడం కష్టమని' అర్ధమై ఏం మాట్లాడలేక పోయారాయన.

 ***

        "కంగ్రాట్స్ కట్టప్పా! ఇన్నాళ్లకు మీ ప్రయత్నాలు  ఫలించబోతున్నాయి. ప్రభుత్వం ఓ నెలలోనే మీ పోస్టులను క్రమబద్దీకరిస్తామని లెటర్ పంపింది" అంటూ ప్రిన్సిపల్ గారిచ్చిన దాన్నిచూసి నమ్మలేక అనుమానంతో గట్టిగా తననోసారి గిల్లుకున్నాడు."మీ రాత బాగుంది. ప్రభుత్వం ఉద్యోగుల కోరికలన్నీ తీరుస్తోంది.'పీఆర్సీ' తోపాటు పదవీ విరమణ వయసు కూడా  పెంచుతామని 'ఎన్నికల హామీ' ఇచ్చింది.ఇక మీ 'జీ'వి'త' లక్ష్యాలు నెరవేరినట్టే" అంటూ అభినందించేరాయన. కానీ'జన్మానికో శివరాత్రి'లాంటి ఆ 'ముచ్చట'కూడా తీరకుండానే ముందస్తు ఎన్నికలొచ్చి సీట్లన్నీ అధికార పక్షం 'క్లీన్ స్వీప్' చేయడంతో ప్రతిపక్షం అడ్రస్ గల్లంతయింది.పాలక పక్షాన్ని ప్రశ్నించే దిక్కు లేకపోవడంతో 'అమలుకు ఐదేళ్ళ కాలముందం'టూ హామీలను అటకెక్కించింది.ఇలాంటి పరిస్థితుల్లో వచ్చిన ఓ 'తాఖీదు'ను మాటలురాని మౌనంతో కట్టప్ప చేతిలో పెట్టారు ప్రిన్సిపల్ గారు.దాన్ని చూసి కుప్పకూలిపోయాడు కట్టప్ప.పద్దు కన్నీళ్లాగక కళ్ళుతిరిగిపడి, కోమాలోకెళ్లిపోయింది.సర్వీసులో ఉన్నంతకాలం రెగ్యులరైజేషన్ గురించి తప్ప మరేమీ ఆలోచించలేదు వాళ్లు.ఆఖరుకు తమ వయసును గురించికూడా.తమ జీవితంలో అన్నీలేటేనని బాధపడుతుంటే,ఆ 'లే(లో)టు'ను భర్తీ చేయడానికన్నట్టు  వచ్చిన ఆ'జాబితా'ప్రకారం ఆ ఏడాదిలోనే 'రిటైర్' కాబోతున్నారిద్దరూ. ముప్పయ్యేళ్ళపాటు 'క్రమబద్ధంకాని సర్వీసు'తోనే కట్టప్పలా'క్రమబద్ధమైన విద్యాసేవ' చేసాడు.ఆదర్శాలకు పోయి తన ఒక్కగానొక్క కూతుర్ని కూడా పట్టుబట్టి ప్రభుత్వ కాలేజీలోనే చదివించాడు. తనింకా జీవితంలో స్థిరపడే స్థాయికి కూడా రాలేదు.ఈ కొరగాని కొలువుతో సంపాదించింది(?) కూడా 'క్రమబద్దీకరణపనుల'కే ఖర్చయి పోయింది.ఇకపై ఆ 'వంతుల జీతం'రాళ్లు కూడా రావు.దీనికన్నా ఏ కూలిపనో చేసుకున్నా ఈ పాటికి తను అంతో, ఇంతో సంపాదించుకోగలిగి ఉండేవాడు.తాను'బోధనే' 'ధనం'గా భావించడంతో ఎటూకాకుండా పోయాడు.ఇక తన కుటుంబం గతేంటి? బిడ్డ భవిష్యత్ ఎలా?' ముప్పయ్యేళ్ళ బాధలన్నీ ముప్పిరిగొనగా,కత్తితో కసికసిగా కనబడ్డవాళ్ళందరినీ నరికివేయాలన్నంతగా రగిలిపోయింది కట్టప్ప మనసు.తనది ఆరణ్యరోదనని తెలిసినా దిక్కులు పిక్కటిల్లేలా అరవానీ,కరవుదీరా కన్నీరుకార్చాలని ఉందతనికి.కానీ కరుణించే దిక్కెవరు?ఆదుకునే నాధులెవరు? తమ బ్రతుకులిలా బుగ్గిపాలు కావడానికి అసలు కారకులెవరు? 'సర్కారీకొలువుపై చావని ఆశతో, క్రమబద్దీకరణతో కష్టాలు కడతేరుతాయనే కోరికతో చేరి, చాలీచాలని సంపాదనతో సంసారాలీడ్చలేక,సర్వం సమర్పించుకున్నా 'స'క్రమబద్దీకరణ' కాక,చివరికి 'శూన్యం'గా మిగిలి మనుగడే మృగ్యమవుతున్న 'సర్కారీ సేవకుల' భవిష్యత్' కెవరిది బాధ్యత? సమాధానం చెప్పేవారే లేక,చేతిలోఉన్న కాగితాలకట్టను కిందపడేసి కసిదీరా కాలితో నలిపేసేడు.అది 'ప్రభుత్వాన్నే నమ్ముకున్న పార్టుటైమ్ వాళ్ళను నెల రోజుల్లోగా క్రమబద్దీకరించాల్సిందే'నంటూ ఓ పదేళ్ళకిందటే హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రతి.దాన్ని ఇస్తూ లాయర్ అన్నమాటలు గుర్తొచ్చాయి కట్టప్పకి.'ఇది చూసి రెగ్యులర్ అయిపోయినట్టు సంబరపడకండి.ప్రభుత్వాన్ని మెడలువంచి పనిచేయించడం ప్రభుత్వ పెద్దలకే తప్ప, మరెవరివల్లాకాదు.ఈ తీర్పును చూపించి పనయ్యేలా చూసుకోవడమే మనం చేయాల్సింది.'కానీ ఆ పనే ఇంకా జరుగుతూ...నే ఉంది తప్పకడతేరనేలేదు.సరిగ్గా అప్పుడే కట్టప్ప సమస్యల్ని కడవరకు చేరుస్తున్నట్టుగా, 'మరణ మృదంగం'లా మ్రోగిందతని చేతిలోని సెల్.బీటెక్ చదువుతూ,రోజూ సైకిల్ మీద కాలేజీకెళ్ళొచ్చే కట్టప్పకూతురు ఆరోజు  యాక్సిడెంట్ కు గురైందని,వెంటనే హాస్పిటల్ కు రమ్మంటూ చెప్పారెవరో.బెడ్ పై రక్తపు ముద్దలా వున్న తన బిడ్డను చూసి కట్టప్ప పెట్టిన కేక ఆస్పత్రి భవనమంతా ప్రతిధ్వనించింది.సైకిల్ ను వెనుక నుంచి ఆటో గుద్దడంతో బోర్లాపడి ఆమె ముఖమంతా ఛిద్రమైపోయింది.బిడ్డను ప్రాణానికి ప్రాణంగా చూసుకునే కట్టప్ప భార్య, అందమైన తన బిడ్డ ముఖాన్ని ఆ స్థితిలో చూసి తట్టుకోలేక స్పృహతప్పిపోయింది. కళ్ళు తెరిస్తే బిడ్డనెలా చూడాల్సొస్తుందోననే భయంతోనేమో, ఆమె కళ్ళు శాశ్వతంగా మూతబడి పోయాయి.అలా కష్టాలకు, కన్నీళ్లకు కాన రాకుండా కనుమరుగైపోయిందామె.బిడ్డకు సర్కారీ దవాఖానలో కూడా  సరైనవైద్యం చేయించలేక,భార్యను కూడా సగౌరవంగా సాగనంపలేని దీనస్థితిలో,నీరింకిన నయనాలతోను, ఏడ్వలేని దైన్యంతోను, శూన్యంలోకి చూస్తోన్న కట్టప్ప ఈ 'అ'వ్యవస్థ'ను మార్చేవారికోసం ఎదురు చూస్తున్నట్టున్నాడు. ఇవేవీ పట్టని  ప్రభుత్వం ఎవరి'వంతు'వచ్చిందనో కానీ, ఆ పైఏడాదే పదవీవిరమణ వయసు పెంపుతో కూడిన పీఆర్సీ ప్రకటించేసింది.కాంట్రాక్టు ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేస్తున్నట్టు కూడా ప్రకటించింది.అందులో కూడా అనవాయితీగా పార్ట్ టైం వాళ్ళకు 'మొండిచెయ్యి' చూపించేసింది.

 ( 30 ఏళ్ళ పాటు పార్ట్ టైంగానే చేసి ఏ ఆశలూ తీరకుండానే రిటైరైపోతున్న విద్యావంతుల హృదయవిదారకమైన బాధలు చూసి చలించి రాసిన కధకాని వ్యధ.)


No comments:

Post a Comment

Pages